Saturday, August 27, 2016

రాజనీతి శాస్త్ర ప్రాథమిక పారిభాషిక పదకోశ నిర్మాణం: కార్యశాల విశేషాలు

 కమీషన్ ఫర్ సైంటఫిక్ & టెక్నికల్ టెర్మినాలజీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆంగ్ల, హిందీ, తెలుగు భాషల్లో ‘‘రాజనీతి శాస్త్ర ప్రాథమిక పారిభాషిక పదకోశ నిర్మాణం’’ గురించి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ది: 22 ఆగస్టు 2016 నుండి 26 ఆగస్టు 2016 వరకు కార్యశాల (వర్క్ షాప్ ) జరిగింది. డా.షహజాద్  అహ్మద్ అన్సారి (Dr. Shahzad Ahmad Ansari)డా.నవీద్  జమాల్ (Dr. Naveed Jamal)పర్యవేక్షణ వహించిన ఈ కార్య శాలకు డా.సయ్యద్ నజీవుల్లా సమన్వయకర్తగా వ్యవహరించారు.

విషయ నిపుణులుగా   ఈ కార్యశాలలో పాల్గొన్న ప్రతినిథులు.  ఆచార్య ఈశ్వరయ్య (హైదరాబాదు విశ్వవిద్యాలయం), డా. చందా రాములు,  డా. సయ్యద్  నజీవుల్లా (మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం), డా.ఇ.వెంకటేశు,  (హైదరాబాదు విశ్వవిద్యాలయం), డా. ఆకుమర్తి నాగేశ్వరరావు (మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం ), డా.వి.వసుంధరాదేవి ( మహిళా కళాశాల, నిజామాబాద్), డా.పల్లవి కాబ్డే (డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం), డా.చలమల్ల వెంకటేశ్వర్లు (ఉస్మానియా విశ్వవిద్యాలయం), కె.సీతామహాలక్ష్మి (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం), డా.భాస్కర్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట, నల్గొండ), డా.వి.ఎమ్.రాజశేఖర్ ( యన్. టి.ఆర్ . ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వాల్మీకిపురం, చిత్తూరు), డా.దార్ల వెంకటేశ్వరరావు (హైదరాబాదు విశ్వవిద్యాలయం) 
ఒక సాంకేతిక పదాన్ని ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్మించవలసి ఉంటుందో ఈ కార్యశాలలో గమనించాను. రాజనీతి, ప్రభుత్వ పాలనా శాస్త్రాలతో పాటు తెలుగు భాష మీద కూడా మంచి పట్టు ఉన్న వీరంతా చక్కని పదకోశాన్ని తయారుచేయడానికి విస్తృతమైన చర్చలు చేసిన తర్వాతనే ఆ పారిభాషిక పదాన్ని అంగీకరించేవారు. కొన్ని పదాలకు ఆంగ్ల పారిభాషిక పదాలనే యథాతధంగా ఉంచడం బాగుంటుందన్నారు. రాయాల్సిన పదాన్ని కంప్యూటర్ తెరపై చూపించి దాన్ని ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఎలా ప్రయోగిస్తున్నారో ప్రకటిస్తారు. తర్వాత దాన్ని తెలుగులో ఎలా ప్రయోగించాలో దానికి అనుగుణంగా పదాన్ని రూపొందిస్తారు. ఒక పదం వెనుక ఉండే భావన, సిద్ధాంతం, ప్రయోగం మొదలైన వన్నీ చర్చించిన తర్వాతనే ఆ పదాన్ని అంగీకరిస్తారు. ఈ ఐదు రోజుల కార్యశాలలో సుమారు పదహారు వందల పదాల వరకు  తయారు చేశారు. రాజనీతి, ప్రభుత్వ పాలనా శాస్త్రాల్లో సుమారు నాలుగువేల పదాల వరకూ వాడుకలో ఉన్నాయి. మిగతా పదాలను కూడా త్వరలోనే తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కార్యశాలలో ఇప్పటికే వాడుకలో ఉన్న పదాలను, నిఘంటువుల్లోని పదాలను, తెలుగు అకాడమి తయారు చేసిన పదకోశాలను, పత్రికల కోసం తయారు చేసిన పదకోశాలను, నిఘంటువులను కూడా సునిశితంగా పరిశీలించి మాత్రమే ఈ పదకోశాన్ని తయారు చేస్తున్నారు. 

కంప్యూటర్ తెరపై పదాల్ని ప్రదర్శించి, చర్చించిన తర్వాత పదకోశాన్ని తయారుచేస్తున్న సభ్యులు


వైస్ ఛాన్సలర్ తదితరులతో కార్యశాలలో పాల్గొన్న విషయ నిపుణులు, తదితరులు  

 ఈ కార్యశాలలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర శాఖాధ్యక్షుడు డా.అఫ్రోజ్ ఆలమ్ ప్రారంభ, ముగింపు సమావేశాల్లో పాల్గొన్నారు. సభను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య షకీల్ అహ్మద్ ప్రారంభించగా,  వైస్ ఛాన్సలర్ ఆచార్య మహ్మద్ అస్సలామ్ పర్వేజ్ ముగింపు సమావేశంలో పాల్గొని రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. వీరితో పాటు ఈ సమావేశాల్లో  ఎస్ ఎ అండ్ ఎస్ ఎస్ డీన్ ఆచార్య షహీదా, డా.షబ్ననా పర్హీన్ తదితరులు పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో కార్యశాలలో పాల్గొన్నవారందరికీ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.

సర్టిఫికెట్ స్వీకరిస్తున్న డా. దార్ల వెంకటేశ్వరరావు


No comments: