"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

29 July, 2016

సాహిత్యంలో పునర్మూల్యాంకనానికి దార్లు వేస్తున్న ‘దార్ల’ సాహిత్యం

(నేటినిజం పత్రిక వారు ప్రతి గురువారం ‘సాహితీకెరటాలు’ పేరుతో ఒక సాహిత్య అనుబంధాన్ని ప్రచురిస్తున్నారు. ఆ రోజు మొదటి పుట తప్ప మిగతా పుటలన్నీ సాహిత్యమే ప్రచురిస్తుంటారు. ఈ పత్రికలో ‘కదిలించే కలాలు’ పేరుతో ప్రసిద్ధ కవి, విమర్శకుడు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు శీర్శికను ధారావాహికంగా రాస్తున్నారు. ఈ వారం (21 జూలై 2016 ) నాగురించి రాశారు. నాగురించి నాలుగు మంచి మాటలు రాసిన కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డిగారికీ, ఈ వ్యాసాన్ని ప్రచురించిన నేటినిజం పత్రికాయాజమాన్యానికి, మరీ ముఖ్యంగా ఎడిటర్ బైసాదేవదాసు గార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ పత్రిక సౌజన్యంతో నా బ్లాగులో దాన్ని పునర్ముద్రిస్తున్నాను....దార్ల)  
 సామాజిక బాధ్యతను తలకెత్తుకొని కాలం రంగుల వలయాల్లో కొన్నిశతాబ్దాలు నలుపు వర్ణంలోకి నెట్టబడి నిస్సాయంగా జారిపోతున్న అంటరాని వర్ణంగా భావించబడుతున్నబడుగు బలహీన వర్గాల మీద, దళిత వర్గాల మీద దృష్టిసారిస్తూ అగ్నినేత్రమై మండి, వజ్ర సంకల్పంతో రక్త స్పర్శతో కవిత్వమై ప్రవహిస్తున్న కవి విమర్శకులు దార్ల వెంకటేశ్వరరావు. అడుగడుగునా అసమానతలు, అవమానాలు, తిరస్మృతులు, ఆకృతికి నోచుకోని అవగాహనలు, ఆలోచనలు, శ్రమను దోచేసే పన్నాగాలు అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలనే ఆకాంక్షల దారి వెతుకుంటూ దార్ల చేత కవిత్వం రాయిస్తూంది.

ఈ సమాజం జాతి కుల మత వివక్షతతోనే ఉంది. ఒక మనిషి మరో మనిషి మీద నిష్కారణంగా దాడి చేస్తూనే ఉన్నాడు. ఆధిపత్యాన్ని వెలగబెడుతూనే ఉన్నాడు. ఉన్మాద పు కులాహంకారాన్ని కూడా తెచ్చుకోవడం కూటికి లేనోడి మీద విరుసుకపడుతూ సాటి మనిషిని ఓ పురుగులా విదిళించివేస్తూ ఆధిపత్యాన్ని వెలగబెట్టడం. మనిషిలో వారసత్వంగా వస్తున్న ‘మ్యానియా’ కావచ్చు. ఈ సందర్భాలను అవగాహన చేసుకున్న కవి ఆలోచన భరితుడై అంటాడు
 "నాకు తెలీదు
 అమ్మ గర్భంలోనైనా అవమానాలకి దూరంగా ఉన్నానో లేదో!" అని. ఒక నిస్సహాయుడైన దళితుని మానసిక స్థితి ఎల్లా వుంటుందో
"ఒక మౌనం మాట్లాడి మనసుని దహించేస్తుంటే
మరోమౌనం ఘనీభవించి నన్నో అనిశ్చిత లోయలోకి తోసేస్తుంది
నా శరీరంలో నాది కాని ప్రాణం చేసే స్వారీకి
ఇంకెంత కాలమిలా జలసిపోవాలి’ అంటూ తనలో తాను మదనపడతాడు కవి. ఈ సమస్య ఈనాడు ఆన్నివర్గాల్లో కులాల్లో, మతాల్లో ఏర్పడుతుంది.
సమాజం అందరి మీద వారికి తెలియని భావజాలం దాడిచేస్తూంది. బలవంతంగా దాని భావ తీవ్రతను మోహిస్తుంది. గానుగెద్దును చేసి తిప్పతుంది. గంగిరెద్దును చేసి ఆడిస్తుంది. ఇది ఒకరి సమస్య కాదు. మానవ సమాజానికి పట్టిన ఆధిపత్యపు అహంకారపు, పెట్టుబడిదారీ వ్యవస్థ గూటిలో పిగిలి సమాజంలో దావానలంగా విస్తరించిన, విస్తరిస్తున్న మాయాజాలం. స్వార్థపూరిత యాంత్రిక భావజాలం. భోగాన్ని విలాసాన్ని సుఖాన్ని దుఃఖాన్ని యాంత్రికమయం చేసిన మాయలో చిక్కొకొనని మేధావి వర్గం లేదంటే అతిశయోక్తికాదు. నిరంతర ఆన్వేషకుడైన దార్లవారు పై విషయాలను అనుభవపూర్వకంగా గ్రహించాడు గనుకే
"జీవితం ఒక నమూనా పాత్ర!
నేనూ ఒక నమూనానయ్యాను
నాపాత్ర ప్రోషణలోనూ
రాగ ద్వేషాల కతీతుణ్ణి కాలేకపోయాను
 నేనిప్పుడు క్షణ కాలపు ఆసహనాన్ని
క్షణ కాలపు జ్ఞాపకాన్ని
లిప్త కాల స్వప్నాన్ని’’ అంటారు.
దార్ల వారు మంచి సాహిత్య విమర్శకులు. వీరి సాహిత్య విమర్శ ఎక్కువగా దళిత సాహిత్యాన్ని ‘పునర్మూల్యాంకనం’ చేస్తున్నదే. "ఆధునిక కవిత్వాన్ని కేవలం సంప్రదాయ ఆలంకారక సూత్రాలతో అన్వయం చేసుకుంటే సరిపోదు. లోక రీతిని, నీతిని, మారుతున్న విధానాలతో కొత్త కొత్త సమన్వయాలను చేయాల్సివుంటుంది" అంటారు. దళితుల్లో కూడా మాల-మాదిగలు తమ ప్రత్యేక ఆస్తిత్వం కోసం పోరాడుతున్నారు. మాదిగ సాహిత్యం ఇప్పుడు మైనారిటీసాహిత్యమైంది. తెలుగు సాహిత్యంలో మాలలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. దళిత సాహిత్యం పేరుతో సాగుతున్న మాలల ఆధిపత్య ధోరణిగా భావించబడుతుంది. దళితుల్లో ఉన్న "రెల్లి’’ తెగలాంటి ఎన్నో ఉపజాతులు కనిపిస్తాయి. వారిని పట్టించుకునే నాధుడే లేడు. "దళిత వర్గాల్లోనూ వర్గీకరణ ఉద్యమాలు బలీయం కాబోతాయి" అంటారు దార్లవారు. మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, మావోలను ఆడ్డం పెట్టుకుని బతుకుతున్న ఆధిపత్య వర్గాల లాగా, అంబేడ్కర్ ని, జ్యోతిరావు బాపూలే, సావిత్రీబాయి ఫూలేను, జగజ్జీవన రామ్, జాషువా, నెల్సన్ మండేలా, కానీరామ్ లను అడ్డం పెట్టుకొని దళిత వర్గాల్లోని ఆధిపత్య మనస్తత్వం గల నాయకులు ఏ విధంగా వార్ని అడ్డుపెట్టుకుని తమ నాయకత్వాన్ని చెలాయించ చూస్తున్నారనే సత్యాన్ని గమనించాల్సివుంది.
సమాజంలో అహర్నిశలు రేకెత్తుతున్న సహజ పరిణామాలను, సాహిత్య పరిణామాలను, జాగ్రత్తగా అధ్యయనం చేస్తు సాహిత్య విమర్శ పరిణామాన్ని ఆకళింపు చేసుకుంటూ, దళిత బహుజన దృక్పథంతో సమాజాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ స్పష్టమైన అభిప్రాయాలతో కలం కదుపుతున్నకవి, విమర్శకులు దార్ల వెంకటేశ్వరరావు. అధ్యయనశీలిగా, ఉద్యమ నేపథ్యమున్న విద్యావేత్తగా, ఆధునికతలో మునిగి దళిత సాహిత్యంలో తేలి ఒక దిశా నిర్దేశాన్ని అన్వేషిస్తున్న సాహితీ కృషీవలునిగా దార్లవారిని భావించవచ్చును. వర్తమాన సాహిత్యాన్ని ఒడిసి పట్టుకుని దాన్ని అవగాహన చేసుకుంటూ సాహిత్య విమర్శకు నూతన దార్లు వేస్తున్న దార్లవారు ఆభినందనీయులు. డా. దార్ల వెంకటేశ్వరరావు 1973 సెప్టెంబరు 5వ తేదీన తూర్పు గోదావరి జిల్లా చెయ్యేరు ఆగ్రహారంలో దార్ల లంకయ్య-పెదనాగమ్మ దంపతులకు జన్మించారు. సెంట్రల్ యూనివవర్శిటీలో ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి., తెలుగులో చేశారు. వీరి పి.జి.డిప్లోమా ఇన్ లింగ్విస్టిక్స్, సంస్కృతంలో డిప్లొమా, ఎం.ఏ., సోషియాలజీ  వంటి మరెన్నోడిగ్రీలు సంపాదించారు. సెంట్రల్ యూనివర్సిటిలోనే అసోసియేట్ ప్రొఫెసర్ గా  పని చేస్తున్నారు.
వీరు వివిధ విశ్వవిద్యాలయాల్లో జరిగిన జాతీయ సదస్సుల్లో పాల్గొని సుమారు 54 పరిశోధనా పత్రాలను సమర్పించారు. వీరు అనేక దళిత సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు.
వీరి రచనలు 1.దళిత తాత్త్వికుడు, 2. సృజనాత్మక రచనలు చేయడం ఎలా? 3. సాహితీ సులోచనం, 4. ఒక మాదిగస్మృతి-నాగప్పగారి సుందర్రాజు పరిచయం, 5. దళితసాహిత్యం-మాదిగదృక్పథం, 6.వీచిక 7.పునర్మూల్యాంకనం, 8. బహుజన సాహిత్య దృక్పథం, 9. సాహితీ మూర్తులు-స్ఫూర్తులు ప్రచురించారు. వీరి కవితా సంపుటి "నెమలి కన్నులు" రెండు ముద్రణలు పొందింది. వీరి సాహిత్య కృషికి గుర్తింపుగా 1. డా.బి.ఆర్. అంబేడ్కర్ పురస్కారం, 2. తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం, 3. రాష్ట్రస్థాయి సభల్లో పాల్గొని భారతీయ సాహిత్య పరిషత్ ప్రధమ బహుమతి బహూకరణ జరిగింది. దార్ల  వెంకటేశ్వరరావు సతీమణి డా.మంజుశ్రీ. ఈమె తెలుగు అధ్యాపకురాలుగా చేస్తుంది. వీరి సంతానాన్నిగూర్చి ప్రశ్నించినప్పుడు దార్లవారి మాట నాకు ఆత్మీయతా స్ఫర్శగా అనిపించింది. "మాకు పిల్లలు లేరు. నా విద్యార్థులంతా నా బిడ్డలే" అంటారు. నిస్వార్థ దృక్పథంతో సాహిత్యం సాహిత్య విమర్శ చేస్తున్న దార్ల వారి కలం నుండి మరెంతో సాహిత్యం వెలువడాలని ఆశిస్తూ, అభినందిస్తున్నాను.










-కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
మొబైల్ ఫోన్: 9948774243

No comments: