"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

31 మే, 2016

డాబా మామ్మగారు (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో...) కథ

(కాలేజీ మ్యాగజైన్ లో కవిత్వంతో ప్రారంభమైన నా సృజనాత్మక రచనా వ్యాసంగం, తర్వాత కాలంలో కథలు రాయడం వరకు వెళ్ళింది. చాలా కథలు రాసినా నా పేరుతో ప్రచురించుకోవడానికిష్టపడేవాణ్ణి కాదు. కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన తర్వాత నాపాత కథల్లో ఒకదాన్ని తీసి ఆంధ్రజ్యోతివారికి పంపాను. అది 07-09-2000 వతేదీన అచ్చయ్యింది. ఆ కథను మా విద్యార్థి బడిగె ఉమేశ్ సేకరించి నాకిచ్చాడు. దాన్ని ఈ బ్లాగు ద్వారా అందిస్తున్నాను. ... దార్ల )
-డా. దార్ల వెంకటేశ్వరరావు 
రెండు రోజుల్లో పరీక్ష ఫీజు కట్టాలి. ఇంట్లో అడుగుదామంటే నెల నెలా బస్సు పాస్ కు. పుస్తకాలకు, చేతి ఖర్చులకూ ఇస్తూనే వున్నారు. ఒంట్లో బావుండక పోయినా, మందులు కూడా వేసుకోకుండానే కూలీ కెళ్ళి, ఆ వచ్చిన డబ్బులతోనే ఇంట్లో గడుపుతూ నన్నూ, తమ్ముణ్ణి, చెల్లినీ, అన్నయ్యనూ చదివిస్తోంది అమ్మ.
తాను చదువుకోలేకపోయింది. తన పిల్లలైనా చదువు కోవాలనుకుందేమో! చదువుకుంటానంటే ఎంత కష్టపడి అయినా సంపాదించి తెచ్చిస్తుంది. ఇంట్లో కష్టాలన్నీ తెలిసి కూడా డబ్బులు కావాలని అడిగితే బావుంటుందా...?
అమ్మ రాత్రిళ్ళు నులక మంచానికి కాళ్ళను బరబరా రాసుకునేది. ఎందుకని అడిగితే... ఏం లేదురా... కాళ్ళు నీట్లోనే వుండటం వల్ల ఒరిసిపోయాయి. అందుకని దురదపెడుతుందిఅని చెప్పేది.
‘ఏదైనా సూపు (అయింట్ మెంట్)  తెమ్మంటావా అమ్మా? అని అడిగేవాణ్ణి. కానీ తెమ్మనేది కాదు.
          ఈ మాత్రం దానికెందుకురా... గుంటకల్వరాకు నలిపేసి, దాని రసం రాసేసుకుంటే అదే తగ్గిపోతుంది అనేది అమ్మ.
          చేల గట్టుల్లో కెళ్ళి వెతుక్కొస్తే... ఆ గుంట కలవరాకు రసమే రాసేసుకునేది. మళ్ళీ పొద్దున్నే పన్లోకి వెళ్తూలాంతరు మసి రాసేసుకుని వెళ్ళిపోయేది. ఇన్ని అవస్థల్ని పడుతున్న అమ్మను చూస్తూ కూడా మళ్ళీ డబ్బులిమ్మని ఎలా అడగాలి? అని ఆలోచిస్తుండగా తళుక్కున ఓ మెరుపు మెరిచింది. రేపు ఎలాగూ ఆదివారమే కాబట్టి పనికెళితే సరి అని అనుకున్నాను.
          కానీ, నేను కాలేజిలో చేరిన తరువాత, పనుంటే రమ్మని అంతకు ముందు పిలిచే రైతులు గానీ, కొత్తవాళ్ళు గానీ ఎవ్వరూ పనికి పిలవడం లేదు. చిన్నప్పటి నుంచీ వ్యవసాయ పనులు, ఇంటి దగ్గర చేసే పనులు, కొబ్బరి చెట్లకు వేళ్ళు కొట్టి, చెట్లకు పెంట పొయ్యడం, దడులు కట్టడం వంటి పనులెన్నింటినో నేర్చుకున్నాను. అంతేకాకుండా సిమెంట్, గ్రావెల్ కలపడం, ఇటుకలు అందించడం, మట్టి తట్టలు మొయ్యడం, బెడ్డ పని చేయడం వంటివి కూడా చేసేవాణ్ణి. అప్పుడప్పుడు అవసరమైతే పద్దులు కూడా నేనే రాసేవాడ్ని. రైతుల్ని ఎప్పుడూ తిరగేసి మాట్లాడే వాడ్ని కాదు. ఎందుచేతనో పదో తరగతి వరకూ బాగానే పనులకు పిలిచే వారు.  ఇంటర్లో చేరిన తరువాత పనికి పిలవడం మానేశారు. పైగా నన్ను ఆ రైతులంతా అదోలా చూస్తుండేవారు. దాంతో చేతుల్లో డబ్బులు మసలడం లేదు. వెంటనే డాబా మామ్మగారుగుర్తుకొచ్చారు. మా ఊర్లో చాలా మందికి  తాటాకిళ్ళు , పెంకుటిళ్ళు తప్ప డాబాలు ఎక్కువగా వుండేవి కావు. ఎవరైనా డాబా కట్టుకుంటే డాబా ఇల్లు వుంది చూడు. రోడ్డు మూల్లో... అదేరా కాంతామణి గారిల్లుఅని చెబుతుండేవారు. కాంతామణి గారనే అసలు పేరు వున్నా తరువాత తరువాత ఆమెను అందరూ డాబా మామ్మగారుగానే పిలవడం వల్ల అదే ఆమె పేరయిపోయింది. కాంతామణిఅంటే ఎవరూ చెప్పకపోయినా డాబా మామ్మగారుఅంటే మాత్రం మా ఊర్లో ఇప్పటికీ ఇట్టే చెప్పేస్తారు.
          మొదట్లో డాబా మామ్మగారు అంటే కోప్పడే వారు. గానీ, తరువాత కాంతామణి గారు కూడా ఆ పేరుకే అలవాటు పడిపోయారు ‘డాబామామ్మగారు’ అని ఎవరు పిలిచినా ఏమనేవారు కాదు. వెంటనే జవాబిచ్చే వారు కూడా. ఆ డాబామామ్మగారే ఇప్పుడు నాకు ఆపద్భంధువులా తోచారు. కానీ, మా ఊరి వాళ్లందరూ ఆమెనొక గయ్యాళి అంటారు. ఒంటరిగానే ఆ డాబాలో వుంటుంది. ఇష్టమైతే వండుకుంటుంది. లేదంటే అలాగే పడుకుంటుంది. భర్త సుబ్బారావు గారు వయసులో వుండగానే చనిపోయారట. పిల్లలూ చిన్నప్పటి నుంచీ పరాయి ఊళ్ళలో చదువుకోవడం, ఉద్యోగాలు వచ్చి, పెళ్ళిళ్ళు చేసుకుని హైదరాబాద్ లో స్థిరపడిపోవడంతో ఒంటరితనాన్ని అలవాటు చేసుకోక తప్పలేదు. పక్కన రేడియో పెట్టుకునో, లేసులు అల్లుకుంటూనో, మొక్కలకు నీళ్ళు పోస్తూనో గడిపేసేవారామె. రేడియోలో మంచి పాట వినిపించినప్పుడు ఏ సినిమాలోది మామ్మగారు?’ అని ఎప్పుడన్నా అడిగితే...ఏమోరా సరీగ్గా వినలేదుఅనేవారు. కానీ, రేడియో వింటున్నట్లే అనిపించేది చూసేవాళ్ళకు!
          ఆమెకున్న పొలమంత అమ్మేసి తిండి గింజలకు మాత్రం ఓ ఎకరం భూమి మిగిల్చుకొని, డబ్బంతా బ్యాంక్ లో ఆమె పేరుతోనే వేసేసి, పిల్లలంతా హైదరాబాద్ వెళ్ళి పోయారు. కావాల్సినవన్నీ నెలకో, ఆరు నెలలకూ ఓ సారి వచ్చి ఇచ్చి పోతుండేవాళ్ళు. పోనీ, ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చేసో, అమ్మేసో పిల్లల దగ్గరకే వెళ్ళి పోవచ్చు కదా అని ఆమెకి సలహా ఇవ్వడానికి మాత్రం ఎవ్వరికీ ధైర్యం చాలేది కాదు!
          ఒకవేళ  ఎవరన్నా అలా సలహా చెప్పినా ‘‘పట్నమంటే నాకు పరమ అసహ్యం. ఇరుకిళ్ళలో వుండాలి. నిల్వ కూరగాయలు తినాలి. నీళ్ళు ఎప్పుడొస్తాయో తెలీదు. ఆ రణగొణ ధ్వనులు.. అబ్బో వాటి కంటే కూడా ఈ ఊర్లోనే బాగుంది. కావల్సినన్ని నీళ్ళు... మంచినీళ్ళు, స్వచ్ఛమైన. అప్పుడే తీయించుకున్న పాలు, కొబ్బరి బోండాలూ తాగొచ్చు. ఎండాకాలంలో చల్లని, తియ్యని తాటి ముంజలు తినొచ్చు. తోటల్లో ఏదొక పండు తింటూ చల్లగాల్లో ఆనందంగా గడిపెయ్యచ్చు. మన తోటల్లోనే  పండిన కూరగాయలు తినొచ్చు. మన చేలోనే పండిన బియ్యాన్ని వండుకోవచ్చు. అన్నింటికీ మించి ప్రశాంతమైన వాతావరణం... అయినా పట్నం పోవాల్సిన ఖర్మ నాకేం పట్టింది? పాపం ఏదో ఉద్యోగం చెయ్యాలి. కాబట్టి, వాళ్ళకి తప్పదు కాబట్టి పట్నంలో చాలా మంది వుండాల్సి వస్తోంది. అన్నీ వుండి నాకెందుకు  పట్నం బతుకు?’’ అని గ్రామీణ వాతావరణం, పల్లె సౌందర్యం గురించి గంటసేపైనా వర్ణించి, ఒప్పించి, తన వాదనే కరెక్ట్ అనిపించే వాగ్ధాటి గల వ్యక్తి ఆ మామ్మగారు. అందుకేనేమో ఆమెను పట్నం వెళ్ళిపో వచ్చు కదా! అనే ఉచిత సలహాలివ్వడానికి భయపడుతుంటారంతా.
          దీనికి తోడు ఎప్పడో చిన్నప్పుడు ఎవరో ఏదో కాంతామణి గారిని ఏదో అన్నారనీ, దానికి వాళ్ళన్నయ్యలను తీసుకొచ్చి ఊరంతా భయపడేటట్లు చేసిందట. ఇప్పడా ఊరు వదిలి వెళ్తే... భయపడి పారిపోయిందని నలుగురు నవ్వుకుంటారనీ, చెవులు గిల్లుకుంటారనీ చివరి క్షణం వరకూ ఈ ఊర్లోనే వుంటానని శపథం కూడా చేసిందట. అలా మా ఊరికీ ఆమెకూ ఓ అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది.
          అదేంటో గానీ, ఆమె అంటే అందరూ భయపడతారు. భయపడితే భయపడ్డారు... పోనీ, ఆమె ధర్మగుణం గురించి చాటింపు కూడా వేస్తుంటారు. చాలా సార్లు డాబామామ్మగారికి పనిలో కెళ్ళినప్పుడు నేనూ  ఆ ధర్మగుణాన్ని గమనించాను కూడా. పనిలోకెళ్తే పొద్దున్నే టిఫిన్, టి కాఫీ ఏదోకటి ఇవ్వాలి. మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల తరువాత టీ ఇవ్వాలి. ఇది ఊళ్ళల్లో పనుల్లోకి వెళ్ళే కూలీలకు ఎవరికైనా చేయాల్సిన మర్యాదలు. ఇలాగే ఇవ్వడం పల్లె రివాజు కూడా.
          కానీ, డాబామామ్మగారు అలా చెయ్యరు. కావాల్సివస్తే టిఫిన్, టీ ఖర్చులకు అదనంగా మరో రెండు రూపాయిలు ఇస్తారు. అంతే గానీ, అవన్నీ టైమ్ ప్రకారం సిద్ధం చేసివ్వాలంటే ఆమెకు తెగ చిరాకు. అవన్నీ చెయ్యడానికి తానేమైనా పనిమనిషినా అంటుంది మరి.
          పనిలోకి వెళ్ళినప్పుడు అదనంగా డబ్బులివ్వడం కన్నా కూలీల ఆకలిని గమనించి, ఆ సమయంలో ఏదైనా పెడితే ఎంతో సంతోషంచి, రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు కూలీలు. మళ్ళీ పనికి రమ్మన్నా వెంటనే రావడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. కానీ, ఇవన్నీ డాబామామ్మగారికి ఇష్టం వుండేది కాదు. పనిలోకి రమ్మనమని, ఊళ్ళో ఎవరైనా కనిపిస్తే కబురు పంపి చెబుతుంది. గానీ, వచ్చిన తరువాత దగ్గరే వుండి కఠినంగా పని చేయించుకునే అలవాటు మాత్రం ఆమెకు లేదు. ‘ఆమె దగ్గర కూలీ డబ్బులను తీసుకుంటున్నాం కాబట్టి, కనీసం ఆ మాత్రమైనా పని చెయ్యడం మన ధర్మం. లేకపోతే దేవుడు కూడా హర్షించడు’  అనుకుని పనికెళ్ళిన కూలీలే ఆలోచించి చేస్తారు. చాలా సార్లు డాబామామ్మగారి పనికెళ్ళిన నేను ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాను.
          మామ్మగారికి మనసులో ఏమనిపిస్తుందో ఏమోగానీ, ఒక్కోసారి పని చేసే దగ్గరికి ఏదోకటి పట్టుకొచ్చి పెట్టే వారు.
         సమయానికి తెచ్చారు మామ్మగారు. భలే ఆకలేస్తున్నప్పుడు బాగా పెట్టారండీ’’ అని అంటే...
          ‘‘నిజంగా ఆకలేస్తుందా?’’ అని అడిగి మళ్ళీ ఇంట్లోకెళ్ళి ఇంకొకటి ఏదైనా తెచ్చి పెట్టేవారు. అలాంటప్పుడు ఆమెను చూసి నాకున్న అనుమానాలన్నీ ఆమెనే అడిగెసే వాడ్ని.
          ‘‘మామ్మగారూ! మీరింత మంచి వాళ్ళు కదా! డబ్బులు కూడా పని చేసిన సాయంకాలానికే ఇచ్చేస్తారు. మరి మీకెందుకు కూలోళ్లు రారు?’’ అనేసి ఆమె ముఖంలోకి చూస్తూ పని చేసేవాడ్ని.
          ఆమె ముఖంలో ఎన్ని భావాలో... ఆనందంతో నిండిపోయే భావాలు. అంత వయసులోనూ ఒంటరితనం నిండిపోయిన భావాలు. ఏవేవో నాకు కనిపించేవి. ఒక నిట్టూర్పు విడిచేసి...                              ‘‘ ఏముందిరా... కూలీ డబ్బులకు నాలుగు సార్లు తిప్పుకుంటే... నాఇంటికెవరొకరొస్తుంటారు. పని చేయించుకుని సాయంత్రానికే డబ్బులిచ్చేస్తే నా మొహం ఎందుకు చూస్తార్రా! అని తెగ బాధపడిపోయే వారు.
‘‘పోన్లెండి మామ్మగారు. మీకేదన్నా పని వుంటే నాకు మాత్రం కబురు పంపండి. శనివారం, ఆదివారం... శెలవు రోజుల్లో వచ్చి చేసేస్తాను. నాతో పాటు ఇంకా కావాలంటే పనిచేసే వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా వున్నారు’’ అనే వాడ్ని.
‘‘అలాగేలేరా... మా పిల్లలే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వెంత కాలం చేస్తావురా... అయినా నీకు ఖాళీగా వున్నప్పుడు కన్పిస్తుండు. ఏదన్నా పనుంటే చెబుతాను’’ అనేవారు.
అంతలోనే చెట్టు మీద నుంచి కిలకిల వినిపించే పక్షుల ధ్వనులను వింటూ... పైకి చూపించి గూళ్ళో వున్న పిల్లలకు ఎక్కడ నుంచో ఆహారాన్ని సంపాదించి తెచ్చి పిల్లల నోట్లో నోరు పెట్టి అందించే పక్షులను తృప్తిగా చూస్తూ తెగ సంతోషపడిపోయినా... అంతలోనే ఏదో విషాదం ఆమె మొహంలో తాండవించేది. కొంతసేపు అలాగే చూసీ చూసి మళ్ళీ డాబాలోకి వెళ్ళిపోయేవారు.
అదంతా గుర్తొచ్చి, నన్నెవరూ పనిలోకి పిలవకపోయినా ఫరవాలేదనుకుని, డాబా మామ్మగారే ఏదోక పని చెబుతారనే నమ్మకంతో, రేపు పరీక్ష ఫీజు కట్టేసే మార్గం దొరికేసిందనే సంతోషంతో ఆ రాత్రికి నిద్రపోయాను.
మర్నాడు పొద్దున్నే డాబా మామ్మగారింటికి వెళ్ళాను.
‘‘ మామ్మగారూ... మామ్మగారూ’’ అని చాలా సార్లు తలుపు కొట్టి పిలిస్తే గానీ లోనుంచి మాట వినిపించలేదు.
‘‘ఎవరూ... నూతిలో గొంతులా వినిపిస్తోంది మామ్మగారి గొంతు.
‘‘నేనండీ మామ్మగారు... వెంకటేశుల్ని’’ అన్నాను.
‘‘నువ్వంటరా... వస్తున్నానుండు’’ అంటూ బయటికొచ్చారు.
‘‘ఏంటిరా వెంకటేశులు... చాన్నాళ్ళకు కనిపించావు. ఏంచేస్తున్నావు? నల్లపూసవై పోయావు’’
‘‘ఏం లేదు మామ్మగారూ! కాలేజీలో చేరాను... ఇంటర్మీ డియేట్ లో!’’
‘‘మంచిపని చేశావురా! మా రాంబాబు ఏం చేస్తున్నాడో ఏమో! ఈ మధ్య ఉత్తరం ముక్కు కూడా రాయలేదు’’
గుమ్మంలో మామ్మగారు, మెట్టు కింద నేనూ... సంభాషణ కొనసాగిపోతోంది. మామ్మగారి మాటల్లో ఆత్మీయత ఏమాత్రం తగ్గలేదు. కానీ, కళ్ళల్లో మాత్రం ఏదో నిరాశ ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఏదొకటి మాట్లాడి, సంభాషణ ఇంకొంచెం సేపు కొనసాగించి, ‘రేపు పన్లోకి రారాఅని పెంచుకోవాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నాను.
‘‘నీరసంగా వున్నారేంటీ మామ్మగారు... టిఫిన్ చేశారా?’’ అన్నాను.
‘‘ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను చూస్తానేమోనని నాకు కనిపించనీయకుండా ప్రయత్నిస్తూనే... ‘‘పైకి రారా... అరుగు మీదకురా’’ అని పిలిచింది.
అరుగు మీదకు వెళితే...ఏమీ మాట్లాడకుండా అలాగే నన్నే చూస్తూ నిలబడిపోయింది. ఏమీ మాట్లాడటం లేదు. నేను అలాగే చూసేటప్పటికి... ‘‘ఏం పని మీదొచ్చావురా... చెప్పు?’’ అనడిగింది.
‘‘ఏం లేదు మామ్మగారు... మిమ్మల్ని ఓసారి చూసిపోదామని...’’ అని నీళ్ళు నమిలాను. కానీ, మనసులో పనే మైనా వుంటే చెప్తారనిఅని చెప్పాలని వుంది గానీ, చెప్పలేకపోయాను.
‘‘ఏంటోరా... చూసిపోయే వాళ్ళే తప్ప, నా దగ్గర వుండే వాళ్ళే లేరురా! నేనా ఈ ఊరొదిలి వాళ్ళదగ్గరకు వెళ్ళలేను’’ అన్నారామె.  ఏం సమాధానం చెప్పాలో నాకర్థం కాలేదు. చూస్తూండగానే మామ్మగారికి గట్టిగా దగ్గు... ఇంకా ఎక్కువైపోయి వెక్కిళ్లు వచ్చేశాయి.
గబగబా ఇంట్లోకెళ్ళి గ్లాసుతో మంచి నీళ్ళు పట్టు కొచ్చి... ‘‘తాగండి  మామ్మగారు... పొరమాలింది. మీ గురించెవరో గుర్తు చేసుకుంటున్నారుఅంటూ చేతికిచ్చాను. గబగబా తాగి అలాగే కూర్చొన్నారు అరుగు మీదే చతికిలపడి! ఎప్పుడూ రాచఠీవీగా కుర్చీ మీదో, కనీసం పీట మీదనో కూర్చొనేడాబామామ్మగారు... ఈసారి నాతో పాటే కింద కూర్చొన్నారు. ఆయాసం తీర్చుకుంటూ నావైపే చూస్తున్నారు. ‘‘ఏమైంది మామ్మగారు! మందులేమైనా వాడుతున్నారా? ’’ అనడిగాను.
‘‘ఔనురా వెంకటేశులూ! అదిగో ఆ టేబుల్ మీద చీటివుంది. డాక్టరు గారొచ్చి మందులు రాశారు. కానీ, తెచ్చే వాళ్ళే లేర్రా’’ అంది. మామ్మగార్ని చూస్తే జాలేసింది. నాకళ్ళ కేసి చూస్తూ... నా మంచి ఏం సమాధానం వస్తుందో అన్నట్లుగా చూడసాగిందామె.
‘‘నేను తేస్తానులే మామ్మగారూ...’’ అన్నాను గానీ, ‘డబ్బులివ్వండిఅని అడగలేకపోయాను. కాసేపు అలాగే నిలబడ్డాను. గమనించారు. కాబోలు... చేయి అందిస్తే నెమ్మదిగా వెళ్ళి సొరుగులోంచి డబ్బులు తీసిచ్చారు.
సుమారు మూడు కీలోమీటర్లు వెళ్తే గానీ, మెడికల్ షాపు రాదు. గబగబా పరుగులాంటి నడకతో వెళ్ళి మళ్ళీ అలాంటి నడకతోనే తిరిగి వచ్చాను మామ్మగారు ముసలివారైపోయారు. ఎంత ఆస్తి వుంటే మాత్రం, ఎంత మంది పిల్లలుంటే మాత్రం ఉపయోగం ఏమిటి? సమయానికి అందనంత దూరంలోఉన్నారు. ఏదైనా జబ్బు చేస్తే మామ్మగార్ని చూసేదెవరు? అనుకుంటూ మందులు పట్టుకొచ్చేశాను.
మామ్మగారు ఇంటి దగ్గర చాలా హుషారుగా కనిపించారు. బహుశా పిల్లలో, మనవళ్ళో వచ్చారేమోననుకున్నాను. సమయానికి దేవుడే వర్తమానం పంపించి రప్పించాడేమోననుకుని సంతోషపడుతూనే... ‘‘ఇదిగో మామ్మగారు బిళ్ళలు... వేసుకోండి’’ అంటూ ఇంట్లోకి గమనించాను. ఎవ్వరూ లేరు. కానీ, మామ్మగారు చాలా ఆనందంగా వున్నారు.
మందులు వేసుకోకుండానే ‘‘కాళ్ళూ చేతులు కడుక్కుని రారా.. అన్నం తిందువు గానీ,’’ అని అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను. ‘‘అదేంటి మామ్మగారు..మీ ఒంట్లో బాగోలేదు. బిళ్ళలేసుకోలేదు. అన్నమెవరు వండారు... ముందు మందులేసు కోండి’’ అని మళ్ళీ చెప్పాను.
‘‘మందులు తరువాత వేసుకుంటాను  గానీ... నువ్వు ముందు రారా అన్నం తిందువు గానీ,’’ అంటుంటే... ఆమె ప్రవర్తనకు ఆశ్చర్య పోవడం తప్ప నేనేమీ అనలేకపోయాను. కాస్సేపటికి తేరుకుని... ‘‘నేను అన్నం తినే వచ్చాను. మామ్మగారు...’’ అని అంటున్నా ఊరుకో లేదామె. 
అరటాకు వేసి, దగ్గరే కూర్చొని అన్నం వడ్డించించారు. కన్నీళ్ళొచ్చాయి నాకు. మామ్మగారి దగ్గరే వాళ్ళ పిల్లలు కూడా వుండి వుండే ఎంత బావుణ్ణు అనుకున్నాను. తింటూనే ఆలోచనల్లోకి వెళ్ళి పోయాను... ఈ అన్నం కోసం కాదు కదా నేనొచ్చింది! రేపు పరీక్ష ఫీజు కట్టాలి. పనేమైనా వుంటే చెప్పమనీ, తరువాత కూలీ డబ్బులు తీసుకుని వెళ్ళి పరీక్ష ఫీజు కట్టేద్దామనీ అనుకుంటే... ఇలాగయిందేంటీ? మౌనంగా తింటున్నట్లే అనిపిస్తుంది చూసేవాళ్ళకు. కానీ, నా ఆలోచనల గందరగోళం ఎవరికి తెలుస్తుంది?
తినడం పూర్తియింది. ఇంకేం చేయాలి? పని లేదు. వెళ్ళిపోవాలి. మామ్మగారికి ఒంట్లో బాగోలేదు. ఈ సమయంలో ఏదైనా పనుంటే చెప్పండిని అడగడం కూడా భావ్యం కాదనుకున్నాను. మళ్ళీ ఇంకోసారి మామ్మగారు మందులేసుకోండిఅని చెప్పేసి ఇంటికొచ్చేద్దామనే నిర్ణయాన్ని కొచ్చేశాను.
అంతలోనే మామ్మగారు వచ్చి ‘‘ఏమనుకోక పోతే ఓ పని చేసి పెట్టాలిరా!’’ అంది.
‘‘చెప్పండి మామ్మగారు’’ అన్నాను ఇంకేం మాట్లాడకుండా.
‘‘ఇంట్లో చాన్నాళ్ళ నుంచి బూజు పట్టేసి వుంది. గోడలకు వేలాడుతున్న ఫోటోలు కూడా దుమ్ము కొట్టుకుని వున్నాయి. బూజంతా దులిపేయాలిరా. ఫోటోలను శభ్రం చేసి ఏదైనా సంచీలో పెట్టేయాలిరా!’’ అని చేస్తానో లేదో అన్నట్లు చూస్తున్నారు.
‘‘ఏమనుకోకపోతేఅన్నారు గానీ, డబ్బులిస్తానని అనదేదు. ఇంత క్రితమే సంతృప్తిగా అన్నం పెట్టారు. చెయ్యనంటే బావుండదు. అందుకే వెంటనే ‘‘అయ్.. అలాగే నండీ’’ అని పనిలోకి దిగాను. ఒక్కో ఫోటో తీసేస్తుంటే అడక్కపోయినా మామ్మగారే వాళ్ళ గురించి చెబుతూ సంచిలో పెట్టసాగారు. వాళ్ళిప్పుడు సంపాదనలో పడిపోయారనీ, కావలిస్తే డబ్బులను పంపిస్తున్నారు గానీ, వచ్చి చూసిపోదామని అనుకోవడం లేదనీ తెగ బాధపడిపోయారు.
మధ్యాహ్నం అయ్యింది. టిఫీన్, టీ తయారు చేసి తీసుకొచ్చారు. ‘‘ఇందాకే కదా మామ్మగారు తిన్నాను. అదింకా అరగనే లేదు. మళ్ళీ ఇప్పుడేం తింటానండీ’’ అన్నప్పటికీ తినే దాకా ఊరుకోలేదు. కానీ, నాలో మాత్రం ఒకటే ఆలోచన. ఈ రోజు ఎవరికైనా పనిలోకి వెళ్ళి వుంటే రేపు కట్టాల్సిన పరీక్ష ఫీజు డబ్బులు వచ్చేవి కదా! అనుకుంటున్నా మనసులో మాత్రం ఎవరూ దగ్గర లేని మామ్మగారికి సాయం చేస్తున్నానే తృప్తిమాత్రం కలుగుతోంది. మామ్మగారు చెప్పిన ఈ మాత్రం  పనీ చెయ్యకుండా వెళ్ళబుద్ధి కాలేదు. ఫోటోలన్నీ గోనె సంచిలో పెట్టి బయట వంట గదిలో అటక మీద పెట్టాను. అంతలో ఆకాశంలో మబ్బులు పట్టేస్తుంటే... డాబా మీద ఎండబెట్టిన కొబ్బరికుడకలు తడిసిపోతాయనీ, వాటిని కిందకు దించమన్నారు. పైనుంచి నేను మూట కట్టి తాడుతో కిందకు అందిస్తుంటే నిచ్చెన మీద నుంచి మామ్మగారు అందుకుని కిందపెట్టేశారు. అప్పటీకే మూడు గంటలయింది.
ఇంకా పనేమైనా వుంటే చెప్పండని అడగలేదు. ఇంటికెళ్ళి పోతే రేపు కాలేజీకి బట్టలైనా ఉతుక్కోవచ్చుఅనుకుని ‘‘వెళ్ళొస్తాను మామ్మగారు’’ అన్నాను.
‘‘వుండరా వెళుదువు గానీ,’’ అని లోపలికెళ్ళి రెండు ఎర్ర కాగితం నోట్లు అంటే నలభై రూపాయలు పట్టుకొచ్చి..‘‘ఇవిగోరా! నీకేదైనా అవసరమైతే కాలేజీలో ఖర్చు పెట్టుకో... కానీ, ఒక మాట! నీకు ఖాళీ దొరికినప్పుడల్లా మా ఇంటికొచ్చి ఏదైనా వుంటే తినిపోతుండు. ఊరికినే కాదులే.. మా ఇంటికొచ్చినందుకు డబ్బులిస్తుంటానులే! నిన్ను చూస్తుంటే మా రాంబాబును చూస్తున్నట్లు వుంటుందిరా! ’’ అంటున్న డాబా మామ్మగారి మాటలకు ఏం సమధానం చెప్పాలో నాకర్థం కాలేదు. కానీ, నా కళ్ళలో ఉబికిన కన్నీళ్ళు ఆమె కళ్ళల్లో పొంగే ఆవేదన తరంగాలు... ఆనందనురాగాలను చాలా సేపు చూస్తూ వుండిపోయింది మౌనం!    

(ఆంధ్రజ్యోతి నవీన07-09-2000)

        

కామెంట్‌లు లేవు: