Wednesday, May 18, 2016

అనాథల మానసిక సంఘర్షణే ‘మాతృక’ నాటిక

రావినూతల ప్రేమకిషోర్ రాసిన ‘మాతృక’ నాటికను నిన్న (17 మే 2016) రాత్రి 9 గంటలకు బిహెచ్ యిఎల్ కమ్యూనిటీ హాలులో  ప్రదర్శించారు. దీన్ని సరిగ్గా గతేడాది ఇదే తారీఖున (17.05.2015)  నంది నాటక పరిషత్ వారు ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ నాటిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు.  దీనికి ఎం. భజరప్ప 
నాటికలో  తల్లి నిర్మలాదేవి మరలా అనాథాశ్రమానికి వెళ్ళి సేవచేయాలనుకున్నదృశ్యం
దర్శకత్వం వహించారు. సురభి కళాకారిణి ప్రభావతీదేవి ‘నిర్మలాదేవి’ పాత్రలో జీవించారు. అనాథ అయిన నిర్మలాదేవి  ఒక అనాథాశ్రమంలో పెరుగుతుంది.  తాను వివాహం చేసుకోకుండా అనాథాశ్రమం నుండి  ఒక బాలుడిని తెచ్చుకొని పెంచి పెద్ద చేస్తుంది. ఆ యువకుడు (సుజన్)  ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ విషయాన్ని తల్లికి చెప్తాడు. కానీ, తల్లి  ఆ ప్రేమవివాహం జరుగుతుందో లేదోనని సందేహిస్తుంది.  ఈ లోగా ఒక ధనవంతుడైన యువకుడు (మోహన్) నిర్మలాదేవి అందాన్ని చూసి  ఆమెను అనుభవించాలనుకుంటాడు. కానీ, ఆమె లొంగదు. పెళ్ళి చేసుకుంటానంటాడు. తాను పెళ్ళి చేసుకోనని, తన కొడుకుని పెంచుకుంటూ బతకాలని భావిస్తున్నట్లు చెప్తుంది. ఎలాగైనా ఆమెను తనదానిగా చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తాడా ధనవంతుడైన యువకుడు. కానీ ఆమె లొంగదు. ఈ లోగా నిర్మలాదేవి కొడుకు తాను ప్రేమించిన యువతి తండ్రి (బేస్ రఘురామ్)ని   ఇంటికి తీసుకొస్తాడు. అతడు సమాజంలో గౌరవప్రదంగా జీవించే  ఒక అగ్ర కులానికి చెందిన ధనవంతుడు. నిర్మలాదేవి దగ్గరకొచ్చి ఆమె పూర్వాపరాలను తెలుసుకోవాలనుకుంటాడు. కానీ, తాను అనాథనని చెప్తుందామె. కొడుకేమో తన తండ్రి నాయుడు కులానికి చెందిన వానిగా చెప్తాడు. తల్లి దానికి అంగీకరించదు. అదంతా నిజం కాదంటుంది. అనాథలంతా చేరిన ఈ కుటుంబంలో తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి ఇష్టపడకపోగా, మరలా తన కుమార్తె దగ్గరకొచ్చిన ఆ యువకుణ్ణి కొట్టించి పంపేస్తాడు. తన కులమేమిటో, తన తండ్రెవరో తెలియని ఆ సుజన్ మానసిక సంఘర్షణకు లోనవుతాడు. ఏలోటూ తెలియకుండా పెరిగిన ఆ యువకుడు తెలుగు పత్రిక చదవడానికి కూడా ఇష్టపడని మనస్తత్వం కలిగినవాడు. తన తల్లిని మరొకరు అమ్మ అని పిలిస్తే కూడా సహించలేక తన ఇంట్లో పనిమనిషిని కూడా కొడతాడు. తన తల్లి ప్రేమ తనకే చెందాలని తపిస్తుంటాడు. తల్లేమో తన పుట్టిన రోజుని కూడా రెండువందల మంది అనాథబిడ్డలతో కలిసి పుట్టినరోజు చేసిన సంఘటనల్నే గుర్తుచేసుకుంటుంటాడు.
నిర్మలాదేవిని వివాహం చేసుకుంటానని అడుగుతున్న ధనవంతుడైన యువకుడు మోహన్ 
 ఈలోగా ధనవంతుడైన యువకుడు నిర్మలాదేవిని పెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమై, చివరికి ఆమె కుమారుడిని కూడా దత్తత తీసుకుంటానని, అలాగైన తనని పెళ్ళిచేసుకోమంటాడు మోహన్. దానికీ ఆమె అంగీకరించదు. ఒకరోజు సుజన్ ఇంట్లోలేని సమయంలో మరలా ఆ మోహన్, నిర్మలాదేవిని పెళ్ళిచేసుకోమని, తనకీ కొన్ని ఆదర్శాలున్నాయనీ, అందుకే ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని వివరిస్తున్న సమయంలో కొడుకు సుజన్ ఇంటకొస్తాడు. వాళ్ళిద్దరినీ ఇంట్లో చూసి అపార్థం చేసుకుంటాడు. ఆ విషయాన్ని తల్లి  దాస్తుందనుకొని ఆమెను నిందిస్తాడు. తన సర్టిఫికెట్స్ లో తండ్రి పేరు స్వామి నాయుడు అని ఉన్నా, తన తండ్రిని ఏనాడూ చూపించకుండా తన తల్లి నాటకమాడుతుందని మాట తూలనాడతాడు. జరిగిన సంఘటనకు, తన కొడుకే తనని అనుమానించినందుకు తల్లి నిర్మలాదేవి మరలా అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది. నిర్మలాదేవి గతమంతా తెలిసిన ముసలాయన (బాబాయి) ఇంటికొచ్చి ఆ కొడుక్కి వివరిస్తాడు. నిజానికి నిర్మలాదేవి పెళ్ళి చేసుకోలేదనీ, ఒక అనాథపిల్లాడ్ని పెంచుకొని, అతనే సర్వస్వంగా పవిత్రంగా జీవించాలనుకుందనీ తెలిసి సుజన్  కుమలిపోతాడు.
నాటిక అంతా అనాథల జీవిత సంఘర్షణలెలా ఉంటాయో అద్భుతంగా చిత్రించింది. ధనవంతుడైన యువకుడు తొలుత నిర్మలాదేవిని అనుభవించడానికే ప్రయత్నించినా, ఆమె జీవితం అంతా తెలిసిన ఆ యువకుడు ఆదర్శయువకుడిగా మారిన వైనాన్ని మూర్తి చక్కగా పోషించాడు. కేవలం కొన్ని పాత్రలతోనే లోతైన సామాజిక సమస్యను ప్రతిభావంతంగా చిత్రించాడు రచయిత రావినూతల ప్రేమకిషోర్.  పాత్రధారులంతా చాలా బాగా చేసారు. బేస్ రఘురామ్ పాత్ర పోషించిన రామకృష్ణారావు తన నెల్లూరు యాసతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ పాత్ర ఉన్నంతసేపూ ప్రేక్షకుల్లో నవ్వులు విరుస్తూనే, అనాథల జీవితాల గురించి అతని మాటలు బాణాల్లా గుచ్చుకునేలా చేస్తాయి. కుటుంబానికి మూలాలెంత అవసరమో, అవి లేనివాళ్ళెంత సంఘర్షణకు గురవుతూ,  ఎలాంటి ప్రశ్నలనెదురుకోవాలో ఆలోచనలో పడేస్తుందా పాత్ర. ధనవంతుడైన మోహన్ పాత్రను మూర్తి బాగా పోషించాడు. పాత్రపోషణలో క్రమపరిణామాన్ని బాగా కనపరిచాడు. కొడుకుగా వేసిన మంజునాథ్ యువకుడిగా ఉండాల్సిన అన్ని లక్షణాల్ని అవగతం చేసుకున్నాడు. అనుభవశాలిగా కనిపించే బాబాయిగా రామశర్మ పొందికగా నటించారు. ఇంటిలో పనివాడు వాసు పాత్రలో అశోక్ తగిన న్యాయాన్ని చేశాడు. 
  బిహెచ్ యి ఎల్ కమ్యూనిటీ హాలు అంతా జనంతో నిండిపోయారు. నాటిక అయ్యేంతవరకు జనం కదల్లేదు. నాటిక ఆలోచనాత్మకంగా ఉంది.
నాటిక రాయడంలో రచయిత మొదటి నుండీ చివరిదాకా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సంభాషణలు తెలుపుతున్నాయి. నాటిక ప్రారంభంలో కొడుకు సుజన్ తల్లితో మాట్లాడుతూ తనతో బయటకొస్తే అమ్మ అనుకోవడం లేదనీ, అక్కలా కనిపిస్తుందని అంటున్నారనీ అంటాడు. ఆ సంభాషణ తర్వాత నాటికకు జీవాన్నిచ్చింది. మోహన్ మరోసారి నిర్మలాదేవి ఇంటికొచ్చి పెళ్ళిచేసుకోమని బ్రతిమలాడే సందర్భంలో కొడుకు సుజన్ చూస్తాడు. తన తల్లి చాటుమాటు పనుల కోసమే అంత అందంగా తయారవుతుందనీ, అందుకేవయసు మీదపడకుండా చూసుకుంటుందనే భావనతో సుజన్ మాట్లాడతాడు. ఇదొక చక్కని రచనా నైపుణ్యం. అలాగే తల్లి తన కొడుకు అనాథ అనుకోకుండా ఏలోటూ లేకుండా పెంచినా, తన తండ్రెవరో చెప్పమని నిలదీస్తాడు. పైగా సుజన్ కి అనాథలంటే చిరాకు. చిత్రంగా చివరకు తాను కూడా అనాథే అని తెలిసేసన్నివేశం చాలా బాగుంది.
ఈ కథ రాయడానికి ప్రేరణేమిటని రచయిత రావినూతల ప్రేమకిషోర్ ని అడిగితే, వాస్తవ సంఘటనే కథకు మూలమని చెప్పారు. తాను హైదరాబాదు ఎస్.ఎస్.సి.బోర్డులో ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు ఒకామె విశాఖపట్టణం నుండి తన కొడుకు టెన్త్ క్లాసు సర్టిఫికెట్ లో పొరపాటుగా పడిన పేరుని సరిచేయించుకోవడానికి వచ్చిందట. నిజానికి ఆమెకీ, ఆమెకున్న ఇద్దరు కొడుకులకూ వయసులో పెద్దతేడా లేనట్లనిపించి, ఆవిషయాన్నే అడిగితే తానొక అనాథనని చెప్పిందట.  తాను నిజంగానే ఇద్దరు పిల్లల్ని పెంచుకుంది. ఆమెను ఒకాయన పెళ్ళిచేసుకుంటానంటే, ఆ తెలిసీ తెలియని వయసులో పెళ్ళిచేసుకున్నా, మళ్ళీ అనాథను కోడలిగా గౌరవించక నిరాదరించారట. అప్పుడు మరలా అనాథాశ్రమానికి చేరుకుందట. ఈ వాస్తవిక జీవితాన్ని కొన్ని మలుపులతో మార్పులు చేసి ‘మాతృక‘ నాటిక రాశానని రచయిత నాకు వివరించారు. 

1 comment:

R BALIREDDY said...

natikanu hrudayaniki hattukunelaa vivarincharu guruvugaru,
nijanga natika coosina anuboothi kaligindi.