బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర కార్యదక్షుడు, కులరహిత సమాజం కోసం పాటుపడుతున్న నిరంతర కృషీవలుడు డా॥టి.వి. నారాయణ. కుల నిర్మూలనే ధ్యేయంగా వేదాలు, ఉపనిషత్తులు ఔపోసన పట్టారు. వాటి అంతరార్థాలను వివరిస్తూ పదుల సంఖ్యలో పుస్తకాలు రాశారు. విద్య ఆవశ్యకతను గుర్తించిన వారిగా విద్యావేత్తగానే కాదు, విద్యా కార్యకర్తగానూ ఆయన అసామాన్యులు.
వారు తెలంగాణ పోరాట యోధురాలు, మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ టి.ఎస్.సదాలక్ష్మి భర్త. తొంభై ఏళ్ల ఈ వృద్ధతేజం ఆర్యసమాజ్ కార్యకర్తగా, ఆదర్శ ఉపాధ్యాయుడిగా, కవిగా సుపరిచితులు. దళిత చైతన్యం అంతగా లేని రోజుల్లో ఆనాటి సమకాలీన పరిస్థితుల మేరకు దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డారు. నేటి ఉద్యమాలతో పోల్చుకుంటే ఆయన సేవలు చిన్నవిగా అనిపించొచ్చు. కానీ, ఎలాంటి అస్తిత్వ ఉద్యమాలు లేని రోజుల్లో భాగ్యరెడ్డి వర్మ, ఆర్యసమాజ్ వంటి సంస్థలతో ప్రభావితమై టి.వి.నారాయణ చేసిన కృషి అసాధారణమైంది. సమాజానికి వారు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయనను గౌరవించింది. ఈ సందర్భంగా బతుకమ్మ వారితో చేసిన ఆత్మీయ సంభాషణలోంచి కొన్ని అనుభవాలు... వారి మాటల్లోనే ...
మా అమ్మానాన్నలు తక్కళ్ళపల్లి వెంకయ్య, నర్సమ్మలు. నేను జూలై 1925లో బొల్లారంలో జన్మించాను. నా ప్రాథమిక విద్యాభ్యాసం బొల్లారం రెసిడెంట్ స్కూల్లో జరిగింది. మా తండ్రి వెంకయ్య ఆర్య సమాజ్ అభిమాని. దాంతో చిన్నప్పటి నుంచే ఆర్య సమాజ్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుణ్ణయ్యాను. ఆర్య సమాజ్ మందిరం మా ఇంటి పక్కనే ఉండటంతో వారి కార్యక్రమాలు దగ్గరగా చూసే అవకాశం నాకు కలిగింది. అందరూ సమానులే. వేదాలను అభ్యసించి ఎవరైనా బ్రాహ్మణత్వం పొందవచ్చు. కులంతో పనిలేదు, గుణంతో పని అన్న మాటలు నన్ను ప్రభావితం చేశాయి. ఆర్యసమాజ విద్వాంసులు సోమదేవశాస్త్రి వద్ద అద్యయనం చేశాను. మా నాన్నకు ఆ రోజుల్లో మంచి గౌరవం ఉండేది. తనని అందరూ గౌరవించేవారు. నిజాయితీగా పనిచేసేవారు. మాదిగ కులంలో చెప్పులు కుట్టే వాళ్ళలో కూడా రకాలుంటారు. చెప్పులు కుట్టే వాళ్ళు కొందరైతే షూమేకర్‌గా మరికొంత మంది పనిచేసేది. మా నాన్న షూమేకర్‌గా పనిచేస్తుండే.
నేను చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాణ్ని. అదే నన్ను సదాలక్ష్మితో ప్రేమలో పడేలా చేసింది. నేను లెక్కలు బాగా చేసేవాడిని. 10వ తరగతిలో ఉన్నప్పుడు నాకు వందకు వంద మార్కులు వచ్చాయి. అప్పట్లో హైదరాబాద్ నిజాం కాలేజ్‌లో సీట్లు ఉన్నత వర్గాల పిల్లలకే వచ్చేవి. నా లాంటి వాడికి అదొక కలగానే ఉండేది. నేను మెరిట్‌లో పాస్ అవడంతో ప్రిన్సిపాల్ ఆశ్చర్యపోయి కాలేజ్‌లో సీటిచ్చాడు. అక్కడ బి.ఎ. చేశాను. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ఇంటికి నేను పెద్దవాడిని కావడంతో ఇంటి బాధ్యతలు నేనే చూసుకోవాల్సి వచ్చింది. దాంతో బొల్లారంలో స్కూల్లో టీచర్‌గా చేరాను. పదేండ్ల తర్వాత హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు గెజిటెట్ ఆఫీసర్‌గా తీసుకున్నారు. వివిధ జిల్లాల్లో పనిచేశాను. క్రమశిక్షణతో కూడిన విద్య నందించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాను. 1954లో హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పనిచేశాను. (ఇప్పటి డీఈవోలాగా), బోర్డ్‌ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా ఉద్యోగం నిర్వహిస్తూనే రచనా వ్యాసంగం కొనసాగించాను.
1974లో సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా చేశాను. అదే కాలేజ్‌లో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ లెక్చరర్‌గా చేశారు. ఆయన నన్ను తన రోల్ మోడల్ అని చెప్పేవాడు. ప్లాటినమ్ జూబ్లీ సావనీర్‌లో రాశాడు కూడా. విద్యార్థుల అభ్యున్నతి కోసం నా పరిధిలో ఎంతో చేశాను.
మీకు ఇక్కడ ఓ విషయం చెప్పాలి. అది నేను వరంగల్ జిల్లాలో పని చేస్తున్నప్పటి సంగతి. ఓ బీసీ విద్యార్థి చదువుకునేందుకు డబ్బుల్లేక ప్రభుత్వ లైబ్రరీలో పనిచేసేవాడు. తల్లి పెళ్లినాటి చీర కుదువ పెట్టి ఫీజు కట్టి చదువుతున్న విషయం నాకు తెలిసింది. అతణ్ని మా ఇంట్లోనే ఉంచుకొని విద్యాబుద్ధులు చెప్పించాను. అప్పటికి ఎస్సీ హాస్టల్స్ మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వంతో మాట్లాడి ఎస్సీ హాస్టల్లో సీటు ఇప్పించాను. తర్వాత బీసీ హాస్టల్లో చేర్పించాను. ఆ తర్వాత అదే విద్యార్థి అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు చదివి రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాడు. అతనే మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య. ఆయనొక్కడే కాదు, మాజీ డీజీపి పేర్వారం రాములు, ఎస్వీ సత్యనారాయణ వంటి వారు కూడా నా శిష్యులే.
ఆ రోజుల్లోనే పీడితుల కోసం పోరాడాను. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెళ్ళేవాడిని. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున ఉద్యమించాను. ఆ సంస్థకు ఆరు సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సభ్యుడిగా పనిచేశాను. 23 జిల్లాల్లో పర్యటించి దళితుల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశాను. జస్టిస్ పున్నయ్యతో కలిసి దళితులపై జరుగుతున్న దాడులు, వివక్షను నిర్మూలించడంలో విస్తృతంగా అధ్యయనం చేశాం. ఆ అధ్యయనం ఫలితంగా దళితుల చట్టాలు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
దళితుల్లో మాల, మాదిగల మధ్య వ్యత్యాసం ఉంది. బీసీల్లో ఎబిసిలు ఉన్నట్లు ఎస్సీ వర్గీకరణ జరగాలని సదాలక్ష్మి మంత్రిగా ఉన్నప్పుడే తనకి చెప్పడంతో ఆమె ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న ఎమ్మార్పిఎస్ ఉద్యమం కూడా మా ఇంట్లోనే పురుడు పోసుకుంది. సదాలక్ష్మి చైతన్యానికి ఆకర్షితులైన మంద కృష్ణ మీరు పెద్దవారు తిరగలేరు. మీ నినాదాన్ని నేను తీసుకెళతాను అంటే తను ఒప్పుకుంది. అలా ఇప్పటి తరానికి తెలియంది చాలా ఉంది. మేం చేయవలసింది చేశాం. సామాజిక న్యాయం కోసం ఇద్దరం పాటుపడ్డాం.
నాకిప్పుడు తొంబై ఏండ్లు. ఈ వయసులో కూడా అసమానతలు లేని సమాజం కోసం నాకు చేతనైన రీతిలో పోరాడుతున్నాను. ఎవరికి వారు తమ పరిధిలో తాము చేయవలసింది చేస్తే చాలా మేలు జరుగుతుందంటాను.
పద్మశ్రీ వరించిందని కాదు, నా సందేశం ఎప్పుడూ ఒక్కటే. ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకు నేను ఒకటే చెబుతాను. పని... పని... పని...! పని చేస్తేనే ఫలితం ఉంటుంది. రిజర్వేషన్లు సరే. వాటిపైనే దృష్టి పెట్ట్టొద్దు. వాటితోనే ఎదుగుతాం అని ఎప్పటికీ అనుకోవద్దు. మన ప్రతిభకు పదును పెట్టుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలి. ఎదగాలి. సమాజానికి మేలు చేయాలి. అందుకే పని చేయాలె... పిల్లల్లారా...మనస్ఫూర్తిగా పని చేయండి.
టిఎస్ సదాలక్ష్మితో నాది ప్రేమ వివాహం. అభిప్రాయ భేదాలతో మేం విడిపోయామన్నది నిజం కాదు. కలిసే ఉన్నాం. కుటుంబ పరంగా తప్ప సిద్ధాంత పరంగా మేం ఎప్పుడూ ఘర్షణ పడలేదు. తను మంత్రిగా పనిచేస్తున్న కాలంలో కూడా మా మధ్య విభేదాలు లేవు. సిద్ధాంత పరంగా పీడిత కులాలు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం ఏకతాటిపై నడిచి పనిచేశాం. అంతెందుకు, 1952లో స్వామి రామానంద తీర్థ నన్ను ఎంపీగా పోటీ చేయమంటే కుటుంబ పరిస్థితుల వల్ల ఒప్పుకోలేదు. అప్పుడు సదాలక్ష్మిని పోటీ చేయమని నేనే సూచించాను. కరీంనగర్ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల కూడా సదాలక్ష్మి ఎంతో నిబద్ధతో పనిచేసేది. తన నిజాయితీని గురించి మీకో ఉదాహరణ చెప్పాలి. 1969 ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి. ఉద్యమకారుల కోసం ఆమె నాకు ఓ సంచిలో జొన్నపిండి పోసి వారికి ఇచ్చిరమ్మంది. నేను ఇచ్చాను. మూడు రోజుల తర్వాత పోలీస్ కంట్రోల్ రూం, మంత్రుల ఇండ్లపై ఉద్యమకారులు బాంబులు వేశారు. నేను తనతో ఉద్యమం హింసాత్మకంగా మారుతోందని చెప్పాను. అదేంటి మీరే కదా...సంచిలో బాంబులు తీసుకెళ్ళి ఇచ్చి హింసాత్మకం అంటే ఎలా? అంది. నాకు నవ్వొచ్చింది. మరి, నాకేదైనా ప్రమాదం జరిగేతే ఎలా? అని అడిగాను. అంటే తనంది, నాకు మీ మీద ప్రేమ చాలా ఉంది. కానీ, అంతకన్నా తెలంగాణపై ఎక్కువ ఉంది అని చెప్పింది. అలా ఆమె తెలంగాణ కోసం నిక్కచ్చిగా నిలబడింది. తెలంగాణ ప్రజాసమితికి చైర్మన్‌గా కూడా సమర్థవంతంగా పనిచేసింది.
ఇంటర్వ్యూ: పుట్ట అశోక్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి