(తెలుగు వెలుగు కార్యక్రమంలో నా తో జరిపిన సంభాషణను ది15
నవంబరు 2015 తేది నాడు ఆంధ్రప్రదేశ్ ఈటివి ఛానల్ లో 11. 30 గంటలకు ప్రసారం చేశారు. ఆ విశేషాలను మా విద్యార్థి
బడిగె ఉమేశ్ కొంతవరకు లిఖితరూపంలోకి మార్చే ప్రయత్నం చేశాడు. దాన్ని పాఠకుల సౌకర్యార్థం
అందిస్తున్నాను. దార్ల )
ప్రజల భాషకు పట్టం కట్టినప్పుడే ప్రజాస్వామ్యం
వర్థిల్లుతుంది. ఈ దృష్టితోనే ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లోను తెలుగుకు పెద్దపీట
వేయాలని భావిస్తోంది. సరైన భాషా విధానాన్ని రూపకల్పన చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని
ఆలోచిస్తోంది. కొత్త రాష్ర్టంలో మాతృభాషకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వాలో ఓ సాహిత్య
వేత్త మాటల్లో విందాం.
1.ఈటీవీ :
మీరు కవి, విమర్శకులు, ఎన్నో విలువైన పుస్తకాలు ప్రచురించారు. మీ సాహిత్య ప్రస్థానాన్ని మా ప్రేక్షకులకు వివరిస్తారా?
మీరు కవి, విమర్శకులు, ఎన్నో విలువైన పుస్తకాలు ప్రచురించారు. మీ సాహిత్య ప్రస్థానాన్ని మా ప్రేక్షకులకు వివరిస్తారా?
దార్ల వెంకటేశ్వరరావు : తూర్పుగోదావరి
జిల్లా కోనసీమలోని మారుమూల ఒక గ్రామం చేయ్యేరు అగ్రహారంలో నేను జన్మించాను. మా
కుటుంబంలో తొలి తరం విద్యావంతుడిని నేను. అలా గురువుల ప్రోత్సాహంతో హైదరాబాదు
సెంట్రల్ యూనివర్సిటీలో ఎం. ఏ, చదివి, ఇక్కడే ఎం. ఫిల్, చేసి, ఇక్కడే పిహెచ్.డి.
చేసి, ఇక్కడే అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం అసోసియేట్
ప్రొఫెసర్ గా ఉన్నాను. నా జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను నేను కవిత్వంగా రాశాను. దాన్ని
సాధారణీకరించి కవిత్వంగా రాశాను. మా జీవితానికి సంబంధించినటువంటి వస్తువునే కవిత్వ
వస్తువుగా మార్చుకున్నాను. నా సాహిత్య వస్తువులో సమకాలీన సమాజం అనిపిస్తుంది. తర్వాత
‘వీచిక’ అనే విమర్శ ఒక విమర్శ గ్రంథాన్ని రాశాను. ‘బహుజన సాహిత్య
దృక్పథం’, ‘పునర్మూల్యాంకనం’, ‘సాహితీ మూర్తులు స్ఫూర్తులు’
మొదలైన పదమూడు విమర్శ పుస్తకాలను రాశాను.
ముఖ్యంగా ఆరుద్ర మీదా పిహెచ్. డి. పరిశోధన చేశాను. యస్. టి జ్ఞానా నంద
కవి గారి ‘‘ఆమ్రపాలి’’ మీదా
పరిశోధన చేశాను. ఈ ‘‘ఆమ్రపాలి’’ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం.
అందుచేత నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడడానికి గురువులు ఎంతో కారణం.
2. ఈటీవీ : మీరు దళిత కవిత్వంలోని
సౌందర్యం గురించి పుస్తకం రాశారు. మరి దళిత కవిత్వం భాష విషయంలో తీసుకొచ్చిన కొత్త మార్పులు ఏమిటి ?
దార్ల వెంకటేశ్వరరావు : మన తెలుగు
సాహిత్యాన్ని పరిశీలించినట్లైతే, మనం ఒక
ప్రధానమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి భాషని పాఠ్య గ్రంథాల్లో చూశాం.
కవిత్వంలో చూశాం. పరిశోధనలో చూశాం. విమర్శలో చూశాం. అటువంటి భాషలో దళిత సాహిత్యం
ఒక మౌలికమైనటువంటి మార్పుని తీసుకొచ్చింది. అది భాషాభివృద్ధికి తోడ్పడింది. దళిత
కవులు మూడు తరాలుగా భాషని మనకు అభివృద్ధి పథంలో నడిపించారు. తొలితరం దళితులు పద్య
కవిత్వాన్ని రాసి, దాన్లో విజ్ఞాపన పద్ధతిలో రాశారు. కాబట్టి అక్కడ పెద్దగా మార్పేమి
కనిపించదు. రెండో తరం వచ్చేసరికి దళిత కవుల్లో ఒక ఆవేశం కట్టలు తెంచుకొని
ప్రవహించింది. ఆ ఆవేశంలో వచ్చినటువంటి మార్పు ఆ దశలో మనం గుర్తించ గలుగుతాం. మూడో
తరంలో దళిత కవిత్వం వ్యవస్థీకృతమైంది. నిజమైనటువంటి సౌందర్యం ప్రతీకల్తోటి,
భావచిత్రాలతోటి తమ పలుకుబడులతో ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నటువంటి భాషకి ఏమాత్రం తీసుకోకుండా
కొత్త కొత్త పదజాలాన్నీ దళిత సాహిత్యంలో తీసుకొచ్చి భాషాభివృద్ధికి దళిత కవులు ఎంతగానో
తోడ్పడ్డారు.
3. ఈటీవీ : మీరు కేంద్రీయ
విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. తెలుగు భాషాభివృద్ధిలో విశ్వవిద్యాలయాల
పాత్ర నేడు ఎలా ఉందంటారు?
దార్ల వెంకటేశ్వరరావు : నేను హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో
చేరిన తర్వాత చూసినట్లైతే కనుక, ఇక్కడ పాఠ్య ప్రణాళికల్లో కొంత స్వేచ్ఛ ఉంటుంది- ఇతర
విశ్వవిద్యాలయాలతో పోల్చినప్పుడు. ఆ
విధంగా ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో చాలా వరకు భాషాభివృద్ధికి కావాల్సినటువంటి కేవలం
పద్య కవిత్వమే కాకుండా, వచన కవిత్వాన్ని, వచన రచనల్ని పాఠ్యాంశాల్లో పెట్టడం వలన
మనం భాషాభివృద్ధికి దోహద పడే అంశాల్ని పాఠ్యాంశాలుగా చేరుస్తున్నాం. ఒకప్పుడు
కేవలం పద్య కవిత్వంలో మాత్రమే, పద్యాన్నీ మాత్రమే ప్రధానంగా చేసి పాఠ్యాంశాలుండే ఈ
క్రమాన్ని సార్వత్రిక విశ్వవిద్యాలయం పాఠ్య ప్రణాలికల్లో వచన రచనలతో పరిపుష్టం
చేసింది. తర్వాత జానపద సాహిత్యాన్ని మిగతా విశ్వవిద్యాలయాలు పెట్టినప్పటికీ కూడా,
మనకు వచన రచనల్ని పాఠ్యాంశాల్ని చేర్చడం ద్వారా భాషాభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది.
ఈ విషయంలో మనం కాకతీయ విశ్వవిద్యాలయంలో, యోగి వేమన విశ్వవిద్యాలయం వారి
పాఠ్యప్రణాలికలు చాలా బాగున్నాయి. వారు కథలకీ, నవలకీ, ప్రాంతీయ సాహిత్యానికీ చాలా
ప్రాధాన్యతను ఇస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ప్రాంతీయ సాహిత్యం నుండి జీవనాన్ని
ఎప్పుడైతే చూశామో అప్పుడు భాషాభివృద్ధి చాలా విస్త్రృతంగా జరుగుతుంది. ఆ విధంగా
విశ్వవిద్యాలయాల పాత్ర నిత్య నూతను కోణంలో పాఠ్యప్రణాలికలను రూపొందించుకోవాల్సిన
అవసరం ఉంది.
4. ఈటీవీ : మాతృభాషలోనే
ప్రాథమిక విద్యాభ్యాసం ఉండాలని భాషాశాస్త్రవేత్తలు మేధావులు చెప్తున్నారు. కానీ
ప్రాథమిక స్థాయినుంచే ఆంగ్ల విద్యావిధానం విస్తరిస్తున్న నేటి రోజుల్లో తెలుగు
భాషను ఎలా కాపాడుకోవాలంటారు?
దార్ల
వెంకటేశ్వరరావు : మనకున్నటువంటిది
త్రిభాషాసూత్రం. ఈ త్రిభాషావిధానంలో మాతృభాష, దాంతో పాటు హిందీ, ఆంగ్లం అనేవి
కొన్ని తరగతులు వచ్చిన తర్వాత మొదలవుతాయి. కానీ... ప్రస్తుత తరుణంలో ప్రాథమిక
స్థాయినుండే ఆంగ్లాన్నీ బలవంతంగా మన మీద రుద్దుతున్నటువంటి విద్యావ్యవస్థ
ఇప్పుడిప్పుడే బలంగా మన విద్యాలయాల్లో ప్రవేశిస్తుంది. ప్రతి పౌరుడూ స్థానిక సమస్యలకంటే కూడా ప్రపంచ పౌరుడిగా
మారాలని అని ఆలోచిస్తున్నట్టుగా బయటికి కనిపిస్తుంది. కానీ అది స్థానికమైనటువంటి
అంశాల్ని, స్థానిక సంస్కృతిని, స్థానిక ప్రజల యొక్క సమస్యల్నీ అవగాహన చేసుకోకుండా అది నిర్వీర్యం చేస్తుంది. అందుచేత మనం చిన్ననాటి నుండే చిన్నచిన్న పద్యాలు, చిన్న చిన్న శతకపద్యాలు, చిన్న చిన్న పొడుపు
కథలు, సామెతలు, కథలు ఇటువంటివన్నీ కూడా పిల్లలకు నేర్పడం ద్వారా మనం భాషని
కాపాడుకోవచ్చు. దాంతో మాతృభాషను ప్రాథమిక స్థాయిలో అక్కడ ఉన్నా, లేకపోయినా
తెలుగు భాషను నేర్పవచ్చు; దాని ద్వారా తెలుగు సాహిత్యాన్నీ కాపాడుకోవచ్చు.
ఈటీవీ : యువతలో ‘ఆంగ్లాన్ని చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి’ అన్న
భావన ఉంది. మరి తెలుగు భాషపై యువతలో అభిమానం కలిగించడానికి ఏమి చేయాలంటారు?
దార్ల
వెంకటేశ్వరరావు: యువతీ యువకులకు
భాష పట్ల అభిమానం పెరగాలంటే ఆర్ధిక ప్రయోజనాలు కూడా భాషతో ముడిపడి ఉండాలి. ‘మనం
చదువుకున్నటువంటి భాషవలన మనకి ఉపాధి లభిస్తుంది’ అనే భరోసా యువతలో కలగాలి. అది
కలిగించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు
తీసుకోవాలి. ఒక రాష్ర్టంలో ప్రధానమైనటువంటి
భాష తెలుగైనప్పుడు, ఆ రాష్ట్రంలో, ఆ జిల్లాలో, ఆ మండలాల్లో వివిధ విషయాల గురించి
తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేని వ్యవస్థని మనం కలిగి ఉన్నప్పుడు, మనం
తెలుగు చదువుకుంటే ఏమోస్తుందనే భయం సహజంగానే కలుగుతుంది. అందుకే ఈ భయాన్ని పోగొట్టాలంటే
కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. (ఎడిటింగ్ అయిన విషయాలు... సామాన్య ప్రజలకు కూడా జీవోలను,
న్యాయస్థానాల్లో తీర్పులను, పోలీసు స్టేషనులో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్)లను
తెలుగులోనే అందించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సచివాలయంలో తెలుగులోనే ప్రజల సమస్యల
గురించి చర్చించాలి. వాటికి తెలుగులోనే ఉత్తర్వ్యులివ్వాలి. తెలుగు భాష పేరుతో
కృత్రికమమైన అనువాదాల్ని ఇవ్వకుండా, ప్రజల భాషలో ఉత్తర్వులు వచ్చేలా చూడాలి.
అన్యభాషా పదాలను తొలిదశలో అవసరమైనంత మేరకు స్వీకరించినా తప్పులేదు.) శాస్త్ర
సాంకేతిక రంగాల్లో కూడా మనం తెలుగును బోధించే ఒక విషయాన్ని కంపల్సరీ చేస్తే
బాగుంటుంది. అప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు పెరిగాయో
అప్పుడు విద్యార్థులు తెలుగు చదువుకోవడాకి ముందుకు వస్తారు.
ఈటీవీ : ప్రపంచీకరణ విస్తరిస్తున్న నేటి తరుణంలో స్థానిక
భాషలు, సంస్కృతులు పరిరక్షణలో ప్రజలు, ప్రభుత్వాలు బాధ్యత ఎంతవరకు ఉందంటారు. ?
దార్ల
వెంకటేశ్వరరావు: తెలుగు భాష
బ్రతకడం అనేది తెలుగు జీవన విధానం బతకడం. తెలుగు జీవన విధానం బ్రతకడం అంటే తెలుగు
సంస్కృతిని మనం పరిరక్షించుకోవటం. ఒకప్పుడు కేవలం కొన్నివర్గాల వారి భాష నిఘంటువుల
ఎక్కింది. ఇప్పుడు అన్ని వృత్తుల వారి భాష కూడా నిఘంటువులోనికి రావాల్సిన అవసరం
ఉంది. ఎప్పుడైతే అన్ని వృత్తులు యొక్క భాషా పదజాలాన్నీ మనం సేకరించామో అప్పుడు భాష
సంపద్వంతమైతుంది. ‘మన తెలుగు భాష ఇంత గొప్పదా’ అనేది మనకు తెలుస్తుంది. తర్వాత
వ్యవహారకోశాలను తయారు చేయాలి. ఇప్పుడు పలుకుబడులు, జాతీయాలు ఉన్నాయి. ఏ పలుకుబడులు
ఏ సందర్భంలో వాడతారు. ఏ సందర్భంతో మన కావ్యాల్లో ప్రయోగించారు. ఏ సందర్భాల్లో
కథల్లో ప్రయోగించారు. ఏ సందర్భంలో కవితల్లో ప్రయోగించారు.... నవలల్లో
ప్రయోగించారు.. అనే వాటికి సోదాహరణంగా మనం
వ్యవహారకోశాల్ని తయారు చేయాలి. అప్పుడు స్థానిక భాష యొక్క సంస్కృతి ప్రపంచానికి
తెలుస్తుంది. ప్రపంచీకరణలో ఉన్న ఒక లక్షణం
ఏమిటంటే స్థానికంగా జరిగిన ఒక చిన్న విషయాన్ని ప్రపంచానికి వెంటనే, వేగవంతంగా ప్రపంచానికి
తెలిసిపోతుంది. ఉదాహరణకి మనకు కంప్యూటర్ వాడుకలోకి వచ్చింది. దానిలో తెలుగు భాషను
వాడుకోగలుగుతున్నాం. అలాగే అంతర్జాలం
వాడుకలోకి వచ్చింది. సోషల్ మీడియాకి దాన్ని విస్తృతంగా ఉపయోగించుకోగలగాలి. వీటి
ద్వారా సెకెన్స్ లో, నిమిషాల్లో
ప్రపంచానికి మనం మన భాషనీ, మన కళల్నీ మనం ప్రపంచానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా
స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. వీటి ద్వారా కూడా మనం భాషనీ, సంస్కృతినీ, మన జీవన
విధానాన్ని అంతటినీ వేగవంతంగా మన తెలుగు భాషలోనే తెలియజేయవచ్చు. ఆ విధంగా
స్థానికతను విశ్వజనీనత వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు. అలా చేసినప్పుడు ప్రపంచీకరణ
పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మన స్థానిక భాషలకేమీ నష్టం పెద్దగా వాటిల్లదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి