"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

18 March, 2016

మానవ సంబంధాల పునర్నిర్మాణానికి స్వాగతం (కత్తి పద్మారావు పుస్తకానికి రాసిన ముందుమాట)


                                  -డాదార్ల వెంకటేశ్వరరావు,
అసోసియేట్‌ ప్రొఫెసరు, తెలుగుశాఖ,
స్కూల్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌,
హైదరాబాద్‌ -500 046
దళిత సాహిత్య, సామాజిక ఉద్యమాలలో పరిచయం అక్కర లేని నాయకుడు డా కత్తి పద్మా రావు గారు. సంస్కృతాంధ్ర సాహిత్యాలలో లోతైనా అవగాహన ఉన్న సాహితీ వేత్త పద్మా రావు గారు. డా బి. ఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని తెలుగు నేలపై నాలుగు వైపుల వ్యాపింపజేసిన ఉద్యమకారుడు. జ్యోతి బాపులే, పెరియార్ రామస్వామి నాయకర్ భావాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో పద్మా రావుగారి పాత్ర అనిర్వచనీయం. అంబేద్కర్ సాధించిన హక్కులను ప్రసరించిన భావాలను సామాన్యులకు కూడా తమ రచనల ద్వారా తీసుకొచ్చిన పరిశోధకుడు పద్మారావు గారు.
డాకత్తి పద్మారావు గారి ప్రసంగం ఒక జలపాతం ఉంటుంది. పరిశోధన శాస్త్రీయంగా ఉంటుంది. ఈయన కవిత్వం మట్టి పరిమళాల్ని అందిస్తున్నట్లుంది. ఈ మధ్య ఈయన కవిత్వాన్ని విస్తృతంగా రాస్తున్నారు. దీనిలో భాగంగా ‘‘ఈ యుగం మాది’’ పేరుతో ఒక కవితా సంపుటిని ప్రచురిస్తూ, నా అభిప్రాయాన్ని  రాయమన్నారు. అలా నన్ను అడగడం ఆయన నన్ను గౌరవించడంగా భావిస్తున్నాను.
దళితులంతా వ్యవస్థీకృతమై, ఒకే కంఠంగా కవి రూపంలో ‘‘ఈ యుగం మాది’’ అని ఆత్మ గౌరవంతో ప్రకటిస్తున్న దానికి ప్రతీకగా ఈ కవితల్ని చెప్పుకోవచ్చు. ఆదిమ సమాజం నుండి నేటి ఆధునిక సమాజం వరకు భూమికోసం పోరాటం జరుగుతూనే ఉంది. మత్స్య న్యాయం భూమిని వశం చేసుకుంటుంది. భూమిని నమ్ముకొన్న వాడికంటే, అమ్ముకున్న వాడే జీవన సంఘర్షణతో మిగులుతున్నాడు. చాలామంది నీతికి, న్యాయానికి వక్ర భాష్యాలు చెప్తున్నారు. పునర్నిర్మాణం పేరుతో ప్రపంచీకరణను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. మానవ సంబంధాల కంటే వ్యాపార సంబంధాలే ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. దీన్ని కవి ‘‘భూమిని తవ్వుతున్న వాడికి/ రంగు రాళ్లు దొరుకుతున్నాయి/భూమిని నమ్ముకున్నవాడికి/అస్థికలు మిగులుతున్నాయి/ అప్పు ఒక్కటే/ఇప్పుడు దేశాభివృద్ధి సూత్రం ’’ అని ప్రపంచీకరణ ప్రభావ పాలనను, వాటి తీరు తెన్నులను వ్యంగ్యంగా తూర్పార పడుతున్నాడు కవి. ఈ స్థితిలో దేశ పునర్నిర్మాణంలో కూడా మానవ సంబంధాల పునర్నిర్మాణమే ముఖ్యమని ప్రబోధిస్తూ ‘ప్రేమ, కరుణ ఒక్కటే/ మనిషిని పునర్నిర్మిస్తాయి/ అదే నిజమైన పునర్నిర్మాణం.’  అని ప్రబోధించిన కవితతో ‘ఈ యుగం మాది’  కవితా సంపుటి ప్రారంభమవుతుంది.
మానవ సంబంధాల పునర్నిర్మాణంలో సామాజికీకరణ (socialization) ప్రక్రియ ముఖ్యమైంది. అది కుటుంబంలో మొదలవ్వాలి, మాతృభాషతో అంకురించాలి. భాష ఒక చైతన్య వాహిని. పర భాషలో ఎంత ప్రావీణ్యం ఉన్నా ఏదేశ ప్రజలకైనా ఆ దేశ స్థానిక భాషలే శక్తివంతమైన భావవాహిక సాధనాలు. ఆ సాధనాల్ని అందుకునేది తల్లి ద్వారానే మొదలవ్వాలి. అప్పుడే ప్రజల్లో నిజమైన చైతన్యం విల్లవిరుస్తుంది. లేక పోతే ప్రజలకు అర్థం కాని భాషల్లో చట్టాలు వచ్చి, సామాన్య ప్రజల్ని అయోమయంలో పడేస్తాయి. అందువల్ల మాతృ భాషలో మాట్లాడటం, విద్యాభ్యాసం కొన సాగించటం, చట్టాలు ఆ మాతృ భాషలోనే వెలువడటం మొదలైన పనులు జరగాలి. అలాంటప్పుడే ఆ సమాజం నిజంగా చైతన్యవంతమవుతుంది. అందుకే కవి ‘ప్రతి తల్లి భాష శాస్ర్తవేత్త/ బిడ్డకు నేర్పేటప్పుడు తల్లి భాష  సజీవమవుతుంది/ తల్లిది కొత్త భాష/ ప్రతి ముళ్ల దారిని పూల దారి చేస్తుంది/ ఆ  సౌగంధ్య  పరిమళం నన్ను నడిపిస్తుంది.’ అని భాష గొప్పతనాన్ని చెప్తూనే మాతృభాష మనిషిని పునరుజ్జీవింపజేస్తుందంటాడు కవి. ఈ కవితను లక్ష్యార్థంలో చూసినప్పుడు ప్రేమాను రాగాలు వెల్లివిరిసే మానవుణ్ణి ప్రభవవింప జేసే శక్తి ఆధునిక భాషలోనే ఉందని, అది మమతానుబంధాల భాషగా అర్థం చేసుకోవాలి. అందుకనే కవి ‘సహచర్యంలోని భాష/మనిషిని ప్రజ్వలితం చేస్తుంది/ సమకాలీనమైంది/ప్రతీది రాగ బంధమైతే ఎన్ని సముజ్వల కాంతులు/ ఉజ్వలించాలన్న మనిషికి సచేతనంలోనే సాధ్యం.  అనడం ద్వారా నిరంతర మమ తాను బంధాల సృజనాత్మక అభివ్యక్తులు కవిత్వ శక్తిగా జాతిని ఉత్తేజితం చేయాలంటాడు కవి.
పద్మా రావు గారు చాలా కవితల్లో తాత్వికాంశాలను భావ చిత్రాలుగా అందిస్తారు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని వర్ణింస్తున్నట్లే ఉంటారు కానీ, వాటి ద్వారా తాత్త్విక అర్థాన్ని మన ముందుంచుతారు. ‘కడలి సుడులు సుడులుగా/ తిరుగుతున్నప్పుడు/ మనం కన్నార్పకుండా  చూస్తాం/ అందులో అలజడి ఉంది/ అనేక ప్రకృతిలో తీవ్రతలు/ మనల్ని ప్రకంపనలకు గురిచేస్తాయి’  ఇది సముద్రం ఒడ్డునున్న ప్రతి ఒక్కరికీ కనిపించే దృశ్యమే. కానీ, ఆ కడలి సుడి అలజడిని, ప్రకృతిని కవి తన హృదయ స్పందనతో వర్ణించటం గొప్ప భావ చిత్రం. దాని కీలకాంశాన్ని తర్వాత వర్ణిస్తాడు కవి. ‘మంచు కరుగుతున్నట్టు/ కనిపిస్తూ వుంటుంది/ దాని అంతరంగం ఇనుముకంటే కఠినమైనది’’ ఇలా వర్ణించుకుంటూ                            ‘‘ మనసులో నుండి వచ్చే ఒక నవ్వు/ చెట్టు పూసినంత పరిమళంగా ఉంటుంది/దాని అంతరంగం /ఇనుముకంటే కఠినమైంది/ ఇనుమును పరికరం చేయడానికి/ఒక కొలిమి కావాల్సి వుంటుంది’’ ఎక్కువ మంది ప్రతి స్పందించాల్సినంత స్పందించరు/ ప్రతి స్పందన యాదృచ్ఛికం/ స్పందన హృదయ గతమైంది’’ అంటాడు కవి.
కవి ప్రకృతిలోని అంశాలను అంటే కడలి, సుడులు వంటి మూర్త పదార్థాలను అమూర్తమైన వస్తువులతో కవిత్వీకరించాడు. కవి  స్పందన కడలి స్పందన లాంటిది. మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ, అది అందరికీ కనిపించదు. ఇలా ప్రకృతిలోని అనేక అంశాలను ఇంద్రియానుభూతితో మనకి తాత్వికంగా రుచి చూపిస్తాడు కవి. చివరికి అంటాడు ‘ప్రక్తలందరు మాటల్ని సంక్షిప్తంగా పలికారు/కవులంతా విస్తృతంగా పలికారు/ మాటలన్నీ మారుతూ వస్తున్నాయి/ భావం మారడం లేదు/తడి, అలజడి/ అవ్వక్తమైనవే అయినా / అనంత జీవన స్రవంతికి ఈ సంఘర్షణే ఆయువు’ అనడం కవిత్వాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళడమే. నిరంతరసంఘర్షణే ఈ ప్రపంచమంతా ఇంతసుందరంగా ఉండడానికి కారణం. అదొక చైతన్యం. ఆ ఆచైతన్యాన్ని అందుకోవాలనీ, ప్రతి మనిషీ నిత్యచైతన్యశీలాన్ని కలిగుండాలంటాడు. ప్రకృతినే దీనికి ఉదాహరణగా చూపిస్తాడు. ప్రకృతి ఒక్కక్షణం ఆగిపోతే ఏమవుతుందో ఆలోచించండి. అన్నీ స్తంభించిపోతాయి. వాటి పని అవి చేసుకుంటూనే పోతున్నాయి. అలా మానవుడు కూడా నిత్య ప్రవాహినిలా మారాలంటాడుకవి.  ఇదంతా ప్రకృతి నుండి పండిన తాత్వికార్థం. పద్మా రావు గారి కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక తాత్త్విక లోకంలో విహరించాలి. తాత్త్విక లోకంలో వివహరిస్తూ, సమాజచైతన్యాన్ని నింపే తాత్త్వికమైన కవిత్వం అవుతాడు. అందుకనే ఈయన విడివిడిగా రాసిన కవితాఖండికలన్నీ ఒక మహా అర్థాన్ని స్ఫురించే కావ్యాల్లా  ఉంటాయి. కాకపోతే వాటిని దేని వెనుక ఏది ఉండాలో జాగ్రత్తగా అమర్చుకోగలగాలి. అప్పుడు ఇవి కవిత ఖండికలు కావని, తాత్త్విక కావ్యంలోని బాగాలేనని అర్థమవుతుంది.
మార్పు అంటే ఏమిటని తనను తాను ప్రశ్నించుకోవాలి. అదే చేశాడీకవి ‘విజేతలంతా దీర్ఘయాత్రికులే’’ కవితలో. బుద్ధుడు తన విద్యను జ్ఞానంగా మార్చాడు. కనకనే, కరుణ, హింసల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలిగి, వాటన్నింటినీ జయించగలిగి, తర్క,మీమాంసలకంటే ఆచరణాత్మకమైన ప్రేమముఖ్యమని చాటగలిగాడు. అదే విద్య. అదే జ్ఙానం. ‘‘ఈ తొలకరిలో /విత్తుమీద కురిసిన వర్షం /ఒక ప్రభవానికి మూలమైతే/ భావోజ్జ్వనం కూడా మార్పుకి సంకేతమే’’ అని భావించాలంటాడు కవి. అయితే ఆ మార్పు తాత్కాలిక, వ్యక్తిగత ప్రయోజనాలతో కూడిందా? శాశ్వతమైన, వ్యవస్థీకృత ప్రయోజనాలను ఆశించిందా అనేదీ ముఖ్యమే. అందుకే అంటాడు కవి ‘‘పిడికెడు అన్నం కోసమే అయితే/నాలుగు అడుగులు వేస్తేచాలు/ పిడికెడు ప్రేమకోసమే అయితే/ఎక్కవలసింది హిమాలయాలే’’ నని ప్రకటిస్తాడు. అలా చేసినవాడే ఒక బుద్ధుడు. అలా చేసినవాడే సోక్రటీసు. వీళ్ళంతా విజేతలు. విజేతలు అలిసిపోకూడదంటూ‘‘ ప్రతి సంఘర్షణ ఒక ప్రకంపనం/ ప్రతి ప్రయాణం ఒక అనుభూతే’’ అని ప్రవచించడంలో గొప్ప తాత్త్విక స్ఫూర్తి ఉంది.
 తను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించడం కోసం అంబేద్కర్ చూపుడు వేలు ఒక చుక్కానిలా దారి చూపిస్తుందని చెబుతూ సమాజంలో అంతరాంతరాల్లో దాగిన ఆత్మీయతను మానవులందరికి పంచటానికి ప్రేమను, కరుణను అందించాల్సిన అవసరాన్ని ప్రబోధిస్తాడు కవి. అందుకే ‘ఒక దీక్ష ఒక తపన ధర్మావేశంలో చూపుడు వేలు చుక్కాని వైపే నా ప్రయాణం’ అని తన లక్ష్యాన్ని కవిత్వం ద్వారా ప్రకటిస్తాడు కవి.
కవి సమాజంలో జరుగుతున్న అనేక అన్యాయాలకు స్పందించాడు. ఆ స్పందన వ్యక్తిగతంగా కాకుండా ఒక అభ్యుదయవాదిగా, ఒక ఆత్మగౌరవనినాదంగా సామాజికీకరణలో భాగంగా కవిత్వమై స్పందించాడు. ఒక వైపు ముంచుకొస్తున్న ప్రపంచీకరణ, దాని దుష్ఫలితాలను గుర్తిస్తూనే వాటిని దీటుగా ఎదుర్కొనటానికి కావాల్సిన ఆలోచనలను అందించే ఒక యోధుడుగా మానవుడు మారాలంటాడు కవి. భిన్న వైరుధ్యాలు ఉన్న సమాజంలో జీవిస్తూ, ఆ సమాజాన్ని అర్థం చేసుకోవటానికి సమకాలీన సమాజాన్ని దర్శించాలి. అప్పుడు మాత్రమే ఆ సమాజంతో నిత్య చైతన్యవంతమైన మనిషి ‘ఈ యుగం నాది’ అంటాడు. అతడు చైతన్యవంతంగా లేకపోతే ఒక పలాయన వాదిగా మిగిలి పోతాడు. అలా మిగలిపోవడానికి ఇష్టం లేని వాళ్ళంతా స్పందించాలి. అలాంటి వాళ్ళే ఈ యుగం నాదంటారు. ఆ భాగాల్ని తాత్త్వికార్థంలో అందించిన  డా కత్తి పద్మారావు గారు అందరికి అర్థమవుతారని నేను అనుకోను. అలా చాలా వరకు అర్ధం కాని వారిలో నేను ఒకణ్ణి కూడా కావచ్చు. అయితే, కత్తి పద్మారావుగారి కవిత్వాన్ని నాకు అర్థమైనంతవరకు నా అభిప్రాయాలను చెప్పడానికి ప్రయత్నించాను.


హైదరాబాదు,                                                                                         డాదార్ల వెంకటేశ్వరరావు,

18 మార్చి 2016.

No comments: