"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

05 ఫిబ్రవరి, 2016

సహన అసహన భావనలు - చారిత్రక సామాజిక సాంస్కృతిక పరిణామాలు - ప్రభావాలు (Concept Paper)

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
Indian Council of Social Science Research
(ICSSR)
సహకారంతో నిర్వహిస్తున్న జాతీయసదస్సు

సహన అసహన భావనలు  - చారిత్రక సామాజిక సాంస్కృతిక పరిణామాలు - ప్రభావాలు
2016,ఫిబ్రవరి 13&14
మామిడిపూడి వెంకట రంగయ్య హాల్, ఆంధ్ర మహిళాసభ కాంపస్
ఓయు ఎంట్రన్స్ గేట్, హైదరాబాద్

    భారతదేశ తొలి రాష్ట్రపతి తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్  సహనమే సంస్కృతి అన్నాడు. భిన్నజాతులు మతాలూ కులాలూ, ప్రాంతాలూ, వర్గాలూ ఉన్న అసమసమాజంలో వైరుధ్యాలకూ సంఘర్షణలకూ ఉన్న అవకాశాలను గుర్తించబట్టే ఆయన సంస్కృతి జీవలక్షణం సహనమని చెప్పగలిగాడు. భిన్నత్వాల మధ్య భిన్న సమూహాల మధ్య భిన్న అభిప్రాయాల పట్ల సహనం ప్రజాస్వామిక విలువ. అయితే సహనం గాడిద లక్షణం అనేవాళ్ళు కూడా ఉన్నారు. అసమానతల పట్ల అన్యాయాల పట్ల దుర్మార్గం పట్ల సహనం అంటే నేర వ్యవస్థకు మౌన ఆమోదం అన్న మాట. అది వివేకం గల పౌరుల లక్షణం కాదు. వాటి పట్ల తప్పనిసరిగా అసహనమే ఉండాలి. అసహనం ప్రజాస్వామిక విలువ రూపం తీసుకున్నపుడు అద్భుతమైన సామాజిక పరివర్తనకి కారణమౌతుంది.
   అయితే ఇప్పుడు అసహనం వెనుక ఉన్నవి స్వార్ధపూరిత ప్రయోజనాలు, అధికారం ,అహంకారం తప్ప  మరొకటి కావు. ప్రజాస్వామిక మూలం, ముఖం లేని ఇటువంటి అసహనం పట్ల అప్రమత్తం కావలసిందే. అందుకోసమే  జాతీయ సమైక్యతా భావనను ఒక రాజకీయ వ్యూహంగా ప్రచారంలోకి తెచ్చాడు భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.  
దేశాన్నిఅభివృద్ధి పథంలో పరుగులు పెట్టించే వ్యూహాలు, విదేశీ పెట్టుబడులకు ఆహ్వానాలు పోటాపోటీలుగా  ఒకవైపు సాగుతుండగా అదే సమయంలో దేశీయంగా స్త్రీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు ఏదో ఒక రూపంలో అణచివేతకు గురి అవుతున్నారు . స్త్రీల స్వేఛ్చ పట్ల, సామాజిక రంగాల్లో భాగస్వామ్యం పట్ల అసహనం అన్నది వారి వస్త్రధారణా రీతులను నిర్దేశించడంగా, కదలికలను నియంత్రించడంగా మాత్రమే కాక అత్యంత హీన స్థాయిలో అత్యాచార రూపాన్నికూడా తీసుకుంటున్నది. దళితులు,రాజ్యాంగబద్ధమైన అవకాశాలను ఉపయోగించుకుంటూ సామాజిక ఆర్ధిక రాజకీయ రంగాల్లోకి చొచ్చుకుని రావడం కంటగింపైన వర్గాలు దళితులపై భౌతిక దాడులకూ, దళిత స్త్రీలపై అత్యాచారాలకూ హత్యాకాండలకూ తెగబడుతున్నాయి. ముస్లింమతం పట్ల మెజార్టీ మతస్తుల అసహనం, భారతదేశ పౌరసత్వానికి వారిని పరాయీకరించి చూడటంగా, అవహేళన చేయడంగా కనిపిస్తూనే ఉంది. దళితుల ముస్లిముల ఆహారసంస్కృతి పట్ల హిందూ సమాజపు అసహనం, జంతువులకి పవిత్రతనీ  గౌరవాన్ని ఆపాదించటంతో ఆగక, మనిషిని జంతువుకన్నా హీనంగా పరిగణించి ప్రాణాలను తీయడానికి కూడా తెగబడే స్థితిని కల్పించింది.
ఈ రకమైన సామాజిక, మత అసమానతలనూ, మౌడ్యాలనూ ప్రశ్నించి హేతుబద్ధమైన చర్చలను లేవనెత్తినవారు మూకుమ్మడి దాడులకూ, హత్యాకాండలకూ బలవుతున్నారు. లౌకిక ప్రజాస్వామిక విలువలకు భంగకరంగా ఉన్న ఈ విధమైన సందర్భాలూ సంఘటనల పట్ల  దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఏకకాలంలో భిన్నరాష్ట్రాల నుంచి రచయితలూ కళాకారులూ శాస్త్రవేత్తలూ జర్నలిస్టులూ మేధావులూ తమ నిరసనను తీవ్రస్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డుల వాపస్ వంటి కొత్తరూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. పౌరసమాజపు ఆలోచనలను సామాజిక మానవ సంబంధాలను సాహిత్యకారుల సృజనశీలతను ప్రభావితం చేస్తున్న ఈ సమస్య పైన శాస్త్రీయమైన చర్చ జరగాలని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక భావిస్తోంది. ప్రరవే, తన  మూడో మహాసభ సందర్భాన్ని పురస్కరించుకుని 2016, ఫిబ్రవరి 13,14, తేదీలలో సహన అసహన భావనలు  -  చారిత్రిక సామాజిక,సాంస్కృతిక,పరిణామాలు ప్రభావాలు అనే అంశంపై జాతీయసదస్సును నిర్వహించాలని తలపెట్టింది.  

సదస్సు లక్ష్యాలు  :
సహన అసహన భావనలను సామాజిక చారిత్రక కోణం నుంచి చర్చించడం
సామాజిక రాజకీయ మానవ సంబంధాల్లో, సంస్కృతిలో  సహనం పాత్రను చర్చించడం.
అసహన స్వరూప స్వభావాలను గుర్తించడం, కారణాలను చర్చించడం.
సహన, అసహన సంస్కృతులలో ప్రజాస్వామిక విలువలను  అభివృద్ధి చేసే మార్గాలను ఆవిష్కరించడం. 
సహన అసహన సంస్కృతీ ముఖాలు  సాహిత్య కళారూపాలలో ప్రతిఫలించిన తీరును  గుర్తించడం, విశ్లేషించడం

సదస్సు ప్రయోజనం : సామాజిక సంక్షోభాలకు కారణాలు వెతకడం, సమాజాన్ని మరింత మానవీయం చేయడం కోసం మార్గాలను సూచించడం సాహిత్య సామాజిక అధ్యయనాల ముఖ్యలక్షణం. సహన అసహన భావనలు  - చారిత్రక  సామాజిక సాంస్కృతిక  పరిణామాలు -ప్రభావాలు ’  అనే అంశంపై నిర్వహించబోయే ఈ సదస్సు దానిని సాధించడానికి అవసరమైన అర్ధవంతమైన సంభాషణకు వేదికగా పనిచేస్తుంది. లౌకిక ప్రజాస్వామిక విలువల ఆచరణకి అవసరమైన రాజ్యాంగ నైతికతను అభివృద్ధి పరుస్తుంది.
మాయాకృష్ణారావు, జి.హరగోపాల్, రమామెల్కోటే, వకుళాభరణం రామకృష్ణ, కె.రామచంద్రమూర్తి, పివోడబ్ల్యూ సంధ్య, ప్రొ: కృష్ణారావు, ఆర్టిస్ట్ మోహన్, తోట జ్యోతిరాణి, ఎన్. శంకర్, బ్రిగేడియర్ గణేషన్, ఏఎం ఖాన్ యజ్డాని, కె.సునీతారాణి, దార్ల వెంకటేశ్వరరావు, పి. విక్టర్ విజయ్ కుమార్, పుట్ల హేమలత, కాత్యాయని విద్మహే, కె.ఎన్.మల్లీశ్వరి, విష్ణుప్రియ, కోటే విజయభాను, పి.రాజ్యలక్ష్మి, మందరపు హైమవతి, నల్లూరి రుక్మిణి, అనిశెట్టి రజిత, వి.శాంతిప్రబోధ, భండారు విజయ, రత్నమాల, మెర్సి మార్గరెట్, శీలా సుభద్రాదేవి, కె.వి.రామలక్ష్మి, గీతాంజలి, కె.సుభాషిణి, కవిని, తాయమ్మ కరుణ, పద్దం అనసూయ, పి.అమరజ్యోతి, కల్లూరి శ్యామల, కొలిపాక శోభారాణి, నీలాదేవి, షహనాజ్, మొదలైనవారు పాల్గొంటున్నారు.
రెండురోజులు జరిగే ఈ జాతీయసదస్సులో ప్రారంభ సమావేశం, ముగింపు సమావేశం కాక విషయచర్చకై  మూడు సమావేశాలు, పుస్తకావిష్కరణలూ ఉంటాయి.
‘జీవితం – సహనం, అసహనం’ అనే అంశంపై కవి సమ్మేళనం ఉంటుంది.
 వర్తమాన కల్లోలంతో సంభాషణ చేద్దాం రండి.
అందరికీ ఆహ్వానం
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక



కామెంట్‌లు లేవు: