Wednesday, January 13, 2016

‘నెమలికన్నులు’తో అస్తిత్వానంతర కవిత్వంలోకి డా. దార్ల -డా. కృష్ణ కదిరె

అస్తిత్వానంతర కవిత్వంలోకి డా. దార్ల
మిత్రుడు దార్ల వెంకటేశ్వరరావు‘నెమలికన్నులు’ పేరుతో తనఖాతాలోకి మరోకావ్యాన్ని చేర్చారు. సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదులో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దార్ల అదే యూనివర్సిటీలో తన ఉన్నత విద్యనంతా పూర్తి చేశారు. విగతదేహి నాగప్పగారి సుందర్రాజు బృందంతో కలిసి విద్యార్థి దశ నుండీ సాహిత్య, సామాజిక ఉద్యమాల్లో దార్ల పాల్గొన్నారు. దళిత తాత్త్వికుడిగా పేరుపొందిన దార్ల, పరిశోధన రంగంలోనూ విశేషంగా కృషిచేశారు. ఇటీవలే బహుజన సాహిత్య దృక్పథాన్ని ఒకపుస్తక రూపంలో గొప్పగా అందించారు. సహృదయుడు, సాత్వికుడు, సూక్ష్మపరిశీలనా దృష్టి గల దార్ల లోకాన్ని నెమలికన్నులతో ఎక్సరేతీస్తూ ఈ కవితా సంపుటి రూపంలో అనుభూతుల ఐక్యతా సమ్మేళనాల రిపోర్టుని అందిస్తున్నాడు. తన దర్జాకు, తన గౌరవానికీ కారకులైన తన తల్లిదండ్రులతో పాటు, తాను పుట్టి పెరిగిన సమాజాన్నీ అమితంగా ప్రేమించే మంచి స్నేహితుడు నాకు లభించడం నాకెంతగానో గర్వంగా ఉంది.
హృదయం కరిగిపోయే కవితాపంక్తులు దార్ల కవిత్వంలో అలవోకగా వచ్చిచేరిపోతాయి. ఆలోచన, భయం, విస్మయం కలగలిసిన ఈ కవితాపంక్తులు గమనించండి.
‘‘నాకు తెలీదు
అమ్మ గర్భంలోనైనా
అవమానానికి దూరంగా ఉన్నానో లేదో’’  ఈ మాటలు చదువుతున్నప్పుడు జీవితంలో అనుభవించిన అవమానాల తీవ్రత కళ్ళముందు కదలాడింది. కొద్దిసేపు స్తంభించిపోయాను. తల్లిగర్భంలో ఉండగానే అవమానాలు పురుడుపోసుకునే దేశంలో పుట్టానా అనిపించింది. లోకంమీద పుట్టిన తర్వాత మనిషి తెలుసుకోవాలనుకోవడంతోనే జీవితం ప్రారంభమవుతుంది.కడుపు నింపుకోవడానికి తల్లి స్తనాన్ని వెతుక్కోవడం, జన్మనిచ్చిన స్త్రీని ఏమని పిలవాలో తెలుసుకోవడం/నేర్చుకోవడం ఇలాంటివెన్నో.అలాగే విద్య నేర్చుకోవడం కూడా.కానీ, అది కొందరికి ఇక్కడ నిషిద్ధం! కొన్ని చోట్లకి ప్రవేశమే ఉండదు. అది గుడి, బడి కావడమే దుర్మార్గం. కొన్నివేల సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బిసి, ప్రజల్లో చదువుపట్ల తపన ఎలా గూడుకట్టుకుపోయిందో  ఈ కవి సరళాత్మక, కవితాత్మక పంక్తులు తెలియజేస్తున్నాయి.
‘‘ఏదైనా మాయో మంత్రమో,
యంత్రమోవుంటే బావుణ్ణు
తొందరగా గ్రంథాలయంలోని
పుస్తకాలన్నీ ఔపోసన పట్టేసేవాణ్ణి!’’ ఈ గాఢమైన తృష్ణ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా తీరింది. ఇప్పుడు దార్ల విద్యావేత్త, పండితుడు. అన్నింటికీ మించి ఒక బాధితుడు. అందుకే ఆకలి జయించి పండితుడైతే కన్నతలి, ఆ నేలా పులకించక మానతాయా? కనుకనే ‘‘మాడ్చుకుని తిన్న ఆకలి/మా అమ్మ పాదాలపై పడి ఏడుస్తుందిప్పుడు’’ అంటున్నాడు కవి. డా. అంబేడ్కర్, ఫూలే ఇదే కోరుకున్నారు. తన తండ్రి కష్టం, తన తాత ( అంబేడ్కర్) శ్రమ ఫలించింది.  తన కుటుంబంలో ఆనాడు తిష్టవేసి కూర్చొన్న వేదనను ‘‘ ఆ చీకట్లో అర్జునుడు /అన్నం ముద్ద సరిగ్గా తిన్నాడో లేదో గానీ/ కాళరాత్రుల్లోనూ మానాన్న వేసే గునపం పోట్లకి/పెరుగుగడ్డలా విరిగిపడే మట్టిబెడ్డల’’ బరువును దించేశాడు. కథ సుఖాంతం కాలేదు. తల్లి తండ్రుల తీరని తీరని  రుణం కొంత చిర్నవ్వు చిలకరించినా తాను పుట్టి పెరిగిన సమాజం కోసం ఆలోచించినప్పుడే బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి రుణం తీరుతుంది. ఆయనిచ్చిన చైతన్యంతో డా.దార్ల ‘‘ ఎన్నిసార్లు చంపుతావంటూ /దేవుణ్ణే కాలర్ పట్టుకొని’ అడుగుతున్నాడు. మతం ముసుగులో జాతులు విధ్వంసాన్ని చూపుడువేలుతో ప్రశ్నిస్తున్నాడు. ‘‘వంశపారంపర్యంగా దళిత కుటుంబాలవాళ్ళే /దేవుడి పెళ్ళాలుగా’’ మారాల్సిన దుస్థితి సమాజంలో నెలకొనడాన్ని దుర్మార్గమని గొంతువిప్పి, పిడికిలి బిగించి హెచ్చరిస్తున్నాడు. ధైర్యం కేవలం పిరికితనాన్నే కాదు; పీడనను కూడా పారద్రోలుతుంది. అది విద్యవల్ల అబ్బుతుంది. అది అంబేడ్కర్, ఫూలే, పెరియార్, కాన్సీరామ్ లకు పుష్కలంగా ఉంది. అదే ఆనవాలు దార్లలోను కనిపిస్తుంది సహజంగానే!
డా.దార్ల వెంకటేశ్వరరావు అస్తిత్వానంతర కవి. విప్లవం తర్వాత జరిగే పరిణామాలు మరో విప్లవాన్కి దారితీస్తాయి. విప్లవంలో ఎన్నో విప్లవాలు పుట్టాల్సి ఉంటుంది. సమాజం తుది రూపుదిద్దుకొనేవరకు ప్రారంభవిప్లవం నుండి విజయోత్సవ పలుకుల వరకు ఎన్నోదశలు ఉంటాయి. పరిపూర్త విప్లవం ఇంకా చరిత్ర అనుభవంలోని రాని విషయం. ఈ దరిమిలా పరిశీలిస్తే అస్తిత్వంలో పుట్టి, నిర్మాణంలో పాత్రధారిగా డా.దార్ల దర్శనమిస్తాడు. బహుజన సాహిత్య దృక్పథం దీనిలో భాగమే. కవితాసౌందర్యం కేవలం బ్రాహ్మణసాహిత్యంలో ఉంటుందన్న అబద్దపు ప్రచారాన్కి డా.దార్ల అడ్డుకట్టవేశాడీ కవిత్వంలో. చూడండి నావైపు ‘‘పొద్దున్నే భుజాన్నెక్కుతున్న సూర్యుడు /రైలు దిగినప్పుడు వెన్నెలవుతాడు’’ అంటాడు. సూర్యుడు చంద్రుడు కావడమేంటి? అదే ఈస్తటిక్స్. పొద్దస్తమానూ పోరాటాలు, ఆరాటాలతో గడిపినా సాయంత్రం కలిసిమెలిసి ఉన్నదాంతోనే సుఖసంతోషాలతో గడిపే ఎస్సీ,ఎస్టీ, బిసి కులాల జీవన సౌందర్యమంతా దీనిలోఒక చక్కని భావచిత్రంలా అందించాడు కవి. పొద్దస్తమానం పనిచేసిన శ్రామికురాలు సాయంత్రం ఆ ‘గాయాల చేతుల్తోనే కారం పచ్చడి నూరుతున్న తల్లి  వదనంలో ’’ నిజమైన ఈస్తటిక్స్ ని చూడమంటున్నాడు. ‘సింహదరహాసనమయ్యే కుక్కపిల్ల’, ‘సూర్యకిరణ స్నానం’ వంటి వాక్యాలు ఈ కవితాసంపుటిలో కోకొల్లలు. ‘‘నాపుట్టుమచ్చమాత్రం/నాకు రక్షణ కవచమేన’’నడంలో కవితాత్మకతను చూడండి. ‘పుస్తకమై పుట్టాలనే కోరిక’లో ఎంత సౌందర్యం ఉందో తరతరాలుగా అక్షరాలకు దూరమైన వారి వేదన తెలసినప్పుడు ‘ఆహా!’ అనకుండా ఉండగలమా? సామాజిక రుగ్మతలు, మూఢవిశ్వాసాలు, కులాధిపత్యాలను ఎదుర్కోవడానికి చారిత్రకంగా జరుగుతున్న యుద్ధంలో ఒరిగిపోయిన వీరుల సమాధులు అడిగే ప్రశ్నల భాషను పరిష్కరించడానికి ఈ కవి చేసే ప్రయత్నం కొత్తభాషనూ పుట్టించొచ్చేమో!  ఎంతైనా ఒక తెలివైన మాదిగోణ్ణుండి ఒక బహుజన శిల్పకారుడిగా మారిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వైయక్తికత నుండి వ్యవస్థీకృతంవైపు పయనించడంలోనే బహజన హితాయం, బహుజన సుఖాయ అనేది సార్థకం కానుంది. దార్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలతో... సబ్బమంగళం!!

-
డా. కృష్ణ కదిరె, మొబల్ : 09505251975 

1 comment:

Techwaves4U said...

ఫేస్బుక్ గ్రూప్ : https://www.facebook.com/groups/telugubloggeradda

తెలుగు బ్లాగర్ కోసం చేయబడిన " బ్లాగర్ అడ్డా " మన తెలుగు బ్లాగర్ అందరిని ఒకదగ్గర చేసే ప్రయత్నం .. ఈ గ్రూప్ లో జాయిన్ మీరు బాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం ... ఈ గ్రూప్ లో బ్లాగు రాసేవారికి సలహాలు , సూచనలు , బ్లాగు ని అందం గా తయారు చేసుకోవడానికి సలహాలు , సూచనలు ... ఉత్తమ బ్లాగు ని ఎంపిక చేయడం ... అన్ని విషయాలు ఈ గ్రూప్ లో చర్చించుకొందాం ... మీ స్నేహితులకు బ్లాగు ఉన్నా ... ఈ గ్రూప్ లో వారి పేరు మరియు బ్లాగు లింక్ వేయడం మరిచిపోవద్దు ...

https://www.facebook.com/groups/telugubloggeradda