Sunday, December 13, 2015

పైడి తెరేష్ బాబు పాతికేళ్ళ దళితకవిత్వం


-డా. దార్ల వెంకటేశ్వరరావు,
అసోసియేటు ప్రొఫెసర్, తెలుగు శాఖ,
 హైదరాబాదు-500046, ఫోను: 9989628049
ఇ-మెయిల్ : vrdarla@gmail.com


తెలుగు దళిత సాహిత్యంతో విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకొన్న కవి, కథకుడు పైడితెరేష్ బాబు. జీవనభృతికోసం తొలిదశలో రకరకాల ప్రక్రియల్లో, వివిధ వస్తువుల్ని తీసుకొని సాహిత్యాన్ని రాసినప్పటికీ తెలుగుసాహిత్యంలో దళిత సాహిత్యం ఒక ఉద్యమరూపంలోకి రావడానికి కృషిచేసిన రచయితల్లో పైడితెరేష్ బాబుని ఒకరిగా విమర్శకులు గుర్తించక తప్పదు. ఈయన సాహిత్య పరిణామాన్ని నాలుగు దశలుగా వర్గీకరించుకునే అవకాశం అందుకుంటున్నాను.
పైడితెరేష్ బాబు తొలిదశలో క్రైస్తవ సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల జీవనభృతికోసం సాహిత్యాన్ని ‘పైడి శ్రీ’ గా రాసిన దశగా దాన్ని వ్యాఖ్యానించవచ్చు. ఆ తర్వాత ఆకాశవాణిలో ఉద్యోగిగా మారినప్పటికీ ‘విధి’లో భాగంగా ‘విధి’, ‘సంఘర్షణ’ వంటి సీరియల్స్ కొన్ని రాసినప్పటికీ అవి ఆయన ‘సాహిత్యదృక్పథాన్ని’ పట్టిచ్చే అంశాలుగా భావించనవసరం లేదేమో. అయినా వాటినీ పరిశీలించాల్సి ఉంటుంది. కానీ, సాధారణంగా ప్రతి కవీ తన దృక్పథాన్ని కవిత్వం, కథ, విమర్శ వంటి ప్రక్రియల్లో ప్రముఖంగా వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తాడు.  అందువల్ల కవి లేదా రచయిత దృక్పథాన్ని వాటిని అన్నింటి ద్వారా గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. అలాగే అన్నింటికంటే ముఖ్యంగా ఆ కవి జీవన వాస్తవికతను పట్టుకోవడం వల్ల దృక్పథం బహిర్గతమవుతుంది.
 పైడితెరేష్ బాబు ‘అల్పపీడనం’ (1996) కవితా సంపుటిలో తొలిసారిగా ఆయన సాహిత్య సమగ్ర స్వరూపం కనిపిస్తుంది. అంతకుముందు ‘నిశాని’ (1995) కవుల్లో ఆయన కూడా ఒకరు. ‘నిశాని’ పేరుతో రాసిన కవిత కూడా ఆయనదే. అది సాహిత్యంలో తెచ్చిన సంచలనం సామాన్యమైంది కాదు. చలపతి, విజయవర్ధనరావులకు ఉరిశిక్ష ప్రకటించినప్పుడు 
‘‘దోసిలి చాపిన పేదరికాన్ని
దోషిని చేసిన నేల ఇది
మెతుకుబాకుతో చీలని ఆకలి
చావై ముసిరిన వైనమిది
 ఉరికంబం ధ్వజస్తంభం
రాజ్యమేలుతుంటే
అన్నలూ తమ్ముళ్లూ
అడవినేలుతున్నరా’’ (ఒకేకూత-రెండు పొద్దులు, ఈనాటి ఏకలవ్య, డిసెంబరు, 1996) అని తెరేష్ బాబు న్యాయాన్ని ప్రశ్నిస్తూ కవిత్వం రాశాడు.
అభివృద్ధిచెందిన దేశాలు, చెందని దేశాలు, రెండింటికీ మధ్య నున్న దేశాలను మొదటి, రెండు, మూడో ప్రపంచాలని అంటున్నా ‘నాలుగోప్రపంచం’ అనేదొకటి స్వేచ్ఛకు ప్రతీకగా మారిన ఒక భావన. ప్రాచీన, ఆధునిక సమాజాల్లో వస్తున్న రాజ్యవ్యవస్థకు సంబంధించిన నూతన ఆలోచనావిధానం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఒకే సంస్కృతి, ఒకేదేశం, ఒకేజాతి వంటివన్నీ ప్రశ్నార్థకమౌతున్నాయి. కొన్ని ఆధిపత్య సంస్కృతులు పెత్తనాన్ని చెలాయించేదశకు ప్రపంచీకరణ చాలా వరకు దోహదం చేస్తోంది.  భారతదేశంలో దళితుల జీవితం ఈ నాలుగో ప్రపంచానికి చెందినదే అవుతుంది. గుర్తింపుపొందని, అస్తిత్వం కోసం జరుగుతున్నపోరాటలన్నీ దీనికిందికే వస్తాయి. దీన్ని ఫోకస్ చేస్తూ పైడితెరేష్ బాబు ప్రచురించిన కవితాసంపుటి ‘నాలుగోప్రపంచం’(2010). 
‘‘ఇన్నాళ్ళూ మూడో ప్రపంచం గంపకింద కప్పెట్టిన
నాలుగో ప్రపంచమిది
ఇదొక గాయాల జల్లెడ
కుళ్లి కుళ్లి కునారిల్లడం దీనినైజం
కావచ్చు
దీనికీ నిర్దిష్ట సామాజిక భూగోళం వుంది’’ అని దీని స్వరూపాన్ని పరిచయం చేశాడు. దీని స్వభావాన్ని వివరిస్తూ ఇలా వర్ణించాడు కవి.
‘‘ఒకే గాట కట్టేసి వుంచిన ప్రవాహ సమూహం
పాయలుగా చీలడం ఇప్పటికి నేర్పుతుంది
విడిపోవడం తప్పు అనే నీతి వాక్యాన్ని
బోర్డుమీంచి చెరిపేస్తూ వుంది
ఉలికిపాటెందుకు
విడిపోవడం అంటే విముక్తమై విస్తృతం కావడం
విడి విడి విడి విడి పోవడమంటే
ఎవరి భవిష్యత్తుకు వాళ్లు జవాబుదారీ కావడం
ఎంతగా విడిపోయినా ఉమ్మడి పాదు చెక్కుచెదరదు
గంపగుత్త ఉనికి కింద
గాలిని పోగేసినంత మటుకు చాలు
నిద్రను నిట్టనిలువునా నరుకుతున్న సైనికులకు ఆహ్వానం
కొత్తనీటి ఆనవాళ్లను పసిగట్టడమే
అసలైన ప్రవాహ స్పృహ’’ (నాలుగో ప్రపంచం, 5 అక్టోబరు 1997, ఆంధ్రజ్యోతి)
పైడితెరేష్ బాబు ప్రాంతీయదృక్పథాన్ని పట్టిచ్చే అంశంగా నిలబెట్టిన కవితగా చెప్పొచ్చు. దీని తర్వాతనే తెలంగాణ ప్రత్యేకరాష్ట్రాన్ని సమర్థిస్తూ సీమాంధ్రకవుల తెలంగానంగా వెలువడిన ‘కావడికుండలు’’కవితాసంపుటిని తీసుకొస్తూ అదేపేరుతోరాసిన కవితలో ‘‘ నాలుగు శతాబ్దుల బానిసత్వం సాక్షిగా/నాలుగు దశాబ్దుల వలసతత్వం సాక్షిగా’’ సాగుతున్న కుట్రదారుడి వ్యూహరచనను, తాత్వికభేదాన్ని అవగాహన చేసుకోవాలని ప్రబోధిస్తూనే 
‘ కుట్రదారుడి భుజాల మీంచి
ఉన్నపళంగా దూకడమే ఇప్పుడు ఉద్యమం
కలిపివుంచే కావడిబద్దను బలోపేతం చేద్దాం
కుండల్లా విడిపోదాం
కావడిలా కలిసుందాం’’( కావడికుండలు, 11సెప్టెంబరు 2010) అని కవిత్వమై పలికాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్ధతు ప్రకటించాడు. అలాంటి పైడి తెరేష్ బాబు తొలిదశలో వర్గీకరణ పట్ల వ్యతిరేకదృక్పథాన్ని ప్రకటించాడు. దళితులకు సమానావకాశాలు రావాలని ఆకాంక్షిస్తూ కవిత్వం రాసిన వాళ్ళను కూడా తీవ్రంగా నిరసిస్తూ ఒకప్పుడు ఇలా కవిత్వం రాశాడు. 
‘‘ ఓ నా ఘనత వహించిన నల్లహంసా
నీ నాలుక మీద ఒక ఉచ్చబిందువును కళాత్మకంగా నిలబెడుతున్నాను
దాన్ని చప్పరించి అది మాలదో మాదిగదో తేల్చగలవా’’ (అల్పపీడనం, 1996 పుట: 37) 
ఇలా తీవ్రస్థాయిలో ఎస్సీవర్గీకరణను వ్యతిరేకిస్తూ కవిత్వం రాసిన కవి ‘ నాలుగో ప్రపంచం’’ కవితాసంపుటిలో  ‘అనివార్య సందర్భం’’ పేరుతో 
‘‘కూడు ఉడికినప్పుడల్లా యాభైతొమ్మిదిసార్లు చీల్చబడుతుంది/
ఇది రాజ్యాంగ నిర్ణయం’’ (పుట: 87-88) అని ఒప్పుకుంటూ కవిత రాశాడు. 
‘‘వడివడిగా ఒక పిడుగుల జడిగా
దూసుకొస్తుంది దండోరా
మాదిగన్న పూరించిన గొంతుక
విజయపతాకం ఎత్తకమానదు’’ (నాలుగోప్రపంచం, పుట: 32) అని మాదిగలు చేసే దళితవర్గీకరణ ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా సమర్థించి ఆహ్వానించాడు. 1995లో మద్దూరి నగేష్‌ బాబుకాజావరదయ్యలతోపాటు తెరేష్‌ బాబు.
కవిత్వంలో, సాహిత్యంలో ప్రయోగాలు చేస్తూ తెరీష్ బాబు ‘నేను - నా వింతల మారి ప్రపంచమూ’ పేరుతో దృశ్యీకరణను  విజువల్‌ లాంగ్‌ పోయెమ్‌ను విడుదల చేశాడు.

గజల్స్ రాయడమే కాకుండా, చక్కగా పాడతాడు. గజల్స్ లో దళిత పలుకుబడిని అందించిన ప్రయోగ వాదిగా కనిపిస్తాడు. 1996లో ‘హిందూ మహాసముద్రం’ దీర్ఘకవితను తనసొంతగొంతుతో ఆడియో క్యాసెట్ గా ప్రచురించాడు. దాన్నే మరలా 2010లో ‘హిందూ మహాసముద్రం’ పేరుతో పుస్తకరూపంలో ప్రచురించాడు.
పైడితెరేష్ బాబు దళిత భాషకు ఒక డిక్షన్ ఉండదంటాడు. భాషను సంస్కృతీకరించి వాడినప్పుడు కనిపించని బూతు, జీవితంలో అంతర్భాగమై ప్రవహిస్తున్న పలుకుబడిగా మారినప్పుడు అది బూతెలా అవుతుందనేది అతని వాదన. సందర్భోచితంగా ప్రయోగించనప్పుడు కొన్ని శబ్దాలు బూతులుగానే అర్థమవుతాయి. ఆవేశానికీ, ఆక్రోశానికీ తేడా తెలియకపోతే కూడా ‘బూతు’ అనేమాటకు పెడర్థాలు తప్పవు. దళితసాహిత్యంలో కొన్నిమాటల్ని అర్థం చేసుకోవడంలో దళిత జీవనవాస్తవికత అవగాహన కావాలి. అప్పుడు అది బూతు అవుతుందో కాదో తెలుస్తుంది. దీన్ని కవిత్వం ద్వారా వివరించేప్రయత్నం తెరేష్ బాబులో కనిపిస్తుంది.
సహజమై సమకాలీనమైన భాషను తన కవిత్వంలో అందించేటప్పుడు అది సంస్కృతమా, ఆంగ్లమా అనేది కవి పెద్దగా పట్టించుకోడు. అందువల్ల అటువంటి భాష శక్తివంతంగా ప్రజల్లోకి వెళుతుంది. పైడితెరేష్ బాబు కవిత్వంలో కూడా కనిపించే సంస్కృత పదభూయిష్టమైన శైలి అలా సహజమై ఉరికి పడిందేమోననిపిస్తుంది. దీనికి తోడు ఆయనకు సంస్కృతాంధ్రసాహిత్యాన్ని బాగా చదివే అలవాటు ఉండటం కూడా అలాంటి శైలికి కారణమై ఉంటుందనుకుంటున్నాను.Lecture on “Paidi Tereshbabu’s Twenty Five Years Poetry’’ Conducted by Bahujana Keratalu, Basheerabagh, Hyderabad on 10th November 2010.
No comments: