(‘తెలంగాణ బహుజనం’ మాసపత్రిక ఆవిష్కరణ సభ ది 3 అక్టోబరు 2015న షోయబ్ హాలు,
సుందరయ్య విజ్ఞాన భవనం, బాగ్ లింగం పల్లి, హైదరాబాదులో జరిగింది. ఈ సభను తెలంగాణ
బహుజనం’ మాసపత్రిక సంపాదకులు డప్పోల్ల రమేశ్, వర్కింగ్ ఎడిటర్ మాతంగి చిరంజీవి,
వారి బృందం ఆధ్వర్యంలో ‘తెలంగాణం బహుజన సాంస్కృతిక వేదిక, బహుజన ఉద్యోగుల వేదిక
వారు సంయుక్తంగా నిర్వహించారు. సభలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ
ఉపాధ్యక్షులు, పద్మశ్రీ అవార్డీ ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య కంచ ఐలయ్య, ఆచార్య
జయధీర్ తిరుమలరావు, గోగుశ్యామల, డా.జి.వి.రత్నాకర్, డా. పసునూరి రవీందర్, డా.ఆరూరి
సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సభకు కెంపుల రాజు అధ్యక్షత వహించారు. ఈ సభలో నేను
( డా.దార్ల వెంకటేశ్వరరావు) మాట్లాడిన కొన్ని అంశాలను ఇక్కడ అందిస్తున్నాను....
దార్ల )
***
తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కణ సభలో డా.దార్ల వెంకటేశ్వరరావు
తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కణ సభలో మాట్లాడుతున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కణ సభలో కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా. పసునూరి రవీందర్ ని అభినందిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కణ సభలో పాల్గొన్న కవులు, రచయితలు, ప్రజలు
‘‘మిత్రులారా...ముందుగా
తెలంగాణ బహుజనం మాసపత్రిక తీసుకొస్తున్న పత్రిక సంపాదకులు డప్పోల్ల రమేశ్ కీ,
వర్కింగ్ ఎడిటర్ మాతంగి చిరంజీవికి, సంపాదకవర్గానికి, దీన్ని ఇలా తీసుకురావడానికి
వెన్నుదన్నుగా నిలిచిన టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ బహుజనం’ మాసపత్రిక అంబేద్కరిజాన్ని
ప్రజల్లోకి తీసుకెళ్లి, చైతన్యం చేయాలనే లక్ష్యంతో కొనసాగుతుందని సంపాదకీయం నుండి
దీనిలో ప్రచురించిన ప్రతి వ్యాసం, కథ, కవిత, ఇంటర్వ్యూ మొదలైనవన్నీ
తెలియజేస్తున్నాయనుకుంటున్నాను. నాకంటే ముందు మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ రెండు
మంచి సూచనలు చేశారు. పత్రికను ఎవరికోసం నిర్వహిస్తున్నామనేది ముందుగా నిర్ణయించుకోవాలన్నారు.
బహుజన కార్యకర్తల కోసం లేదా బహుజన ప్రజలకోసం ఎవరికోసం నిర్వహిస్తున్నారో ఆ స్పష్టత
ఉండాలన్నారు. తెలంగాణ బహుజనం మాసపత్రిక శ్రీనివాస్ గారు సూచించిన రెండు అంశాల్నీ
మిళితం చేసి ముందుకొస్తోంది. కేవలం మేధావులకోసమో, కార్యకర్తల కోసమో ఈ పత్రికను
నిర్వహిస్తే సరిపోదనుకుంటున్నారనిపిస్తుంది. బహుశా కార్యకర్తలు, మేధావులకు కూడా
ఆలోచనలను అందించే వ్యాసాలు దీనిలో ఉన్నాయి. కాన్షీరామ్ గారి వ్యాసాన్ని దీనిలో
ప్రచురించారు. అది అంబేద్కరిజాన్ని ఆచరించాల్సిన మార్గాల్ని వివరించేవ్యాసం. దీని
ద్వారా తమ పత్రిక లక్ష్యాన్ని ముందుగానే నిర్దేశించుకున్నారనిపిస్తుంది.
ప్రజాస్వామికంగా
బహుజనులు రాజ్యాధికారానికి తమ విలువైన ఓటుని శక్తివంతంగా వినియోగించుకోవడమెలాగో
తెలిపే మార్గదర్శనం ఈ పత్రికలో కనిపిస్తోంది. దీనితో పాటు చరిత్రలో తాము
భాగస్వాములైనప్పటికీ బహుజనులెలా చరిత్రలో
విస్మరింపబడుతున్నారో దాన్ని గుర్తించి, చరిత్రపునర్నిర్మాణాన్ని చేసుకోవాల్సిన
లక్ష్యం కూడా తమపై ఉందనే సూచనతోనే నేమో గోగుశ్యామల గారి వ్యాసం దీనిలో
ప్రచురించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత జరగాల్సిన పనుల్లో
చరిత్ర నిర్మాణం ఒకటి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డానికి కారణమైన వాళ్ళు అత్యధికులు
బహుజనులే. కానీ చరిత్రలో వీళ్ళను మినహాయించే కుట్రలు జరగొచ్చు. అందువల్ల ఆ
ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నవారి గురించి ఈ పత్రికలో గోగు శ్యామల వ్యాసం
సవివరంగా తెలుపుతుంది. చరిత్ర పునర్నిర్మాణంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం
విద్యార్థులు, దానిలో మరలా మహిళల కోణం నుండి ఈ వ్యాసం వచ్చింది.
ఈ ‘తెలంగాణ బహుజనం’ మాసపత్రికలో డా. పసునూరి
రవీందర్ కథ ఒకటి ప్రచురించారు. ఈ కథ మూడు అంశాల్ని మనముందుంచుతూ ప్రజల్ని
చైతన్యపరుస్తుంది. ఒకటి, తెలంగాణా రాజ్యం అదే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన
తర్వాత బహుజనుల పాత్ర ఎలా ఉండాలనే కోణం. దీనితో పాటు రెండవది, తెలంగాణాలో బహుజనులు
మార్క్సిజాన్ని పాటించాలా? అంబేద్కరిజాన్ని ఆచరించాలా? అనే దాన్ని సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా
చక్కని మాండలికాన్ని కూడా ఉపయోగిస్తూ కథను రాశాడు. మూడోది, అవుటాఫ్ కవరేజ్ ఏరియా
కథల్లో పట్టణాలు, నగరాల్లో కనిపించీ, కనిపించనట్లండే అస్పృశ్యతను మన కళ్ళకు
చూపించిన రవీందర్, మనం పట్టణాలు, నగరాలకు వచ్చినా మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి
చేయాల్సిన కర్తవ్యాన్ని ప్రబోధించేలా కథను చక్కగా రాశాడు. ఒక కుటుంబంలో ఇద్దరు
అన్నదమ్ములుంటే, ఒకడు కొంచెం చదువుకొని, తల్లిదండ్రుల్ని, కుటుంబాన్నీ, గ్రామాన్నీ
వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. మరొకడు, చిన్నకొడుకు చదువుకొని, ఉస్మానియా
విశ్వవిద్యాలయం వంటి ఉన్నత విద్యాసంస్థలో చదువుకొని మళ్ళీ తన గ్రామానికి వస్తాడు.
అడవుల్లోకి వెళ్ళిపోయిన పెద్దకొడుకు గాంధీ ఆసుపత్రిలో శవంగా మారితే, చదువుకున్న
చిన్నకొడుకు అంబేద్కరిజాన్ని అర్థం చేసుకొని గ్రామంలోని ప్రజల్ని చైతన్యం
చేస్తాడు. ఈ కథా నేపథ్యంలో ‘‘సోములు సార్ ’’ మార్క్సిజాన్ని బోధిస్తూ
పల్లెపల్లెల్లో ఉన్న మాదిగ, మాల బహుజనుల్ని ‘‘చైతన్యం’’ చేసి అడవుల్లోకి
పంపిస్తుంటాడు. తన పిల్లల్ని మాత్రం అమెరికాలో ఉన్నత చదువులు చదివిస్తాడు.
కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కారులో గ్రామానికి వస్తాడు. తన మాటల గారడీ ద్వారా
పల్లెల్లో వాళ్ళని మళ్లీ మెస్మరైజ్ చేయాలనుకుంటాడు. మధ్య మధ్యలో సోములుసార్
పిల్లలు సాప్ట వేర్ ఉద్యోగాల్ని చేస్తున్నారనేది కథకుడు చక్కగా స్ఫురింపజేసేలా
పలకరింపుల ద్వారా వర్ణించాడు. అంతేకాకుండా కథను ప్రారంభించడం కూడా చెట్టుమీద
పక్షులన్నీ ఎగిరిపోయినా, రెండు మూడు కాకులు మాత్రం అలాగే ఉన్నాయని కథకు కావలసిన
వాతావరణాన్ని ముందుగానే నేపథ్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఈ కథ సామాన్యులకు అంబేద్కరిజాన్ని అర్థమైయ్యేలా
చేస్తుంది. తన పిల్లలు కలాలు వదిలేసి తుపాకీలు పట్టి అడవుల్లోకి పోయి
తల్లిదండ్రులకు కన్నీళ్ళు మిగల్చమని అంబేద్కర్ చెప్పలేదు. ప్రజాస్వామ్యంగా పోరాడి
తమ హక్కుల్ని సాధించుకోవడానికి అనేక మార్గాల్ని తాను రాసిన రాజ్యాంగంలో
పొందుపర్చాడు. ఇవన్నీ ఈ పత్రిక లక్ష్యాల్ని తెలియజేసే అంశాలే.
మిత్రుడు,
కవి, ఉద్యమకారుడు, ఈ పత్రిక సంపాదకుడు డప్పోల్ల రమేశ్ పూనా ఒడంబడిక మీద రాసిన
వ్యాసం రాజకీయంగా బహుజనులు చైతన్యం కావడమే కాకుండా తమ శక్తిని ఓటుగా
మార్చుకొనేటప్పుడు జాగ్రత్తవహించకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఈ వ్యాసం
ద్వారా చారిత్రకంగా జరిగిన కుట్రను వెల్లడిస్తూ కొత్త ఆలోచనల్ని పురిగొల్పుతుంది. ఇంకా
ఈ పత్రికలో బహుజనుల సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటే అంశాలకు కూడా
ప్రాధాన్యానిస్తుందని దీనిలో ప్రొఫెసర్ కృష్ణగారి ఇంటర్వ్యూ, ఫ్రొఫెసర్ గుండెడప్పు
కనకయ్యగారు రాసిన వ్యాసాలు తెలియజేస్తున్నాయి.
ఈ
సందర్భంగా ప్రధానంగా గుర్తించాలి. మనం ఏ పని చేసినా ఆర్థికాంశాలు మనల్ని
ఒడిదుడుకుల్ని కలిగిస్తాయి. అంతేకాదు, ప్రతి పనికీ ఒక ప్రణాళిక ఉంటుంది. దీన్ని
క్రమపద్ధతిలో పాటిస్తే విజయం మనసొంతమవుతుంది. లూథర్ గల్లిక్ అనే ఒక సామాజిక
శాస్త్రవేత్త అడ్మినిస్ట్రేటివ్
మేనేజిమెంటు గురించి చెప్తూ ఏ పనైనా విజయవంతంగా జరగాలన్నా ఏమి చేయాలో, ఎలా చేయాలో
ఒక పదం ద్వారా తెలిపాడు. ఆ పదమే POSDCORB. దీనిలో Planning, Organizing, Staffing, Directing, Co-Ordinating, Reporting and Budgeting అనే అంశాల్ని గుర్తుపెట్టుకోవాలంటాడు. దీనిలో చివరిలో చెప్పినా
బడ్జెటింగ్ పట్ల చాలా జాగ్రత్త వహించాలి. అక్కడే అన్ని సమస్యలూ ఉత్పన్నమవుతాయి. ఈ
అంశాన్ని జయించగలిగితే మిగతావన్నీ జయించినట్లే. తెలంగాణ బహుజనం మాసపత్రిక
విజయం కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుందని గుర్తించాలి.
అయితే
బహుజనుల గురించి వారి సాంస్కృతిక జీవితాల గురించి తెలుసుకోవడానికి ఆచార్య కొలకలూరి
ఇనాక్ గారి కథలు మనకెంతగానో ఉపయోగపడతాయి. ఆయన ఇంచుమించు అన్ని బహుజన కులాల వృత్తుల
గురించీ కథలు రాశారు. వాటిని వీలుని బట్టి ఒక్కో సంచికలో ఒక్కోకథ లేదా దాని
సంక్షిప్త కథను ప్రచురించగలిగితే బహుజనులకున్న ఒక ప్రత్యామ్నాయ ఆలోచనాధోరణి మరింత
పటిష్టమవుతుంది. దీనిసాధ్యాసాధ్యాలను ఆలోచించండి.
ఇక,
చివరిగా ఒకమాట. ఈ పత్రిక ఇలా రావడానికి కృషిచేస్తున్న టీమ్ మెంబర్స్ అందరికీ
నాశుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో తానే అన్ని
చోట్లా కనపడాలనే తపన కంటే అందరినీ కలిపిపనిచేసే టీమ్ స్పిరిట్ ని పెంచడం ఒకటి. అది
ఉండబట్టే ఇంత పెద్ద సభను నిర్వహిస్తున్నా, వేదికపై కాకుండా దీని ఏర్పాట్లలో
తలమునకలై జనంలో కూర్చొన్నాడు మన డప్పోల్ల రమేశ్. మీ టీమ్ ని చూస్తుంటే పత్రిక
గొప్ప విజయాల్ని సాధిస్తుందనే ఆశ, నమ్మకం కలుగుతోంది. పత్రిక నిర్వహణలో నా వంతు
సహాయ సహకారాల్ని అందిస్తానని ప్రకటిస్తూ, నాకీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి
కృతజ్ఞతలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.’’
-డా.
దార్ల వెంకటేశ్వరరావు
3 అక్టోబరు 2015.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి