"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

17 January, 2015

‘‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’’ పుస్తకానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారి ముందుమాట ‘‘ఫేస్ బుక్’’


దార్ల ఒక మంచి చదువరి, బ్లాగరి. తన మునివేళ్ళను ఆధునిక విజ్ఞానశాస్త్రంలో ముంచి తెలుగు సాహిత్యానికి తిలకం దిద్దుతున్న నెటిజను. ఇవన్నీ మించి నాకు సహవ్రతుడూ, సహృదయుడూనూ. నిజాయితీ ఉన్న సాహితీకృషీవలుడు. ఈ మాట ఎందుకంటున్నానంటే- సెమినార్లు సెమినార్లంటూ అప్పటికప్పుడు ఒంటికాలిపై గాలిపేపర్లు పోగేసి డొల్ల సెషన్లలో తుస్సు తుస్సుమనిపించే వారి కంటే వెయ్యిరెట్లు నయం దార్ల. సివిల్సుకు ప్రిపేరయ్యే కుర్రాడిలా పుస్తకం పుస్తకం పోగేసి అక్షరం అక్షరం రాజేసి సంప్రదాయబద్ధంగా పత్రాన్ని వండుతాడు. ఈ మాటలు నిజమని సాహితీమూర్తులూ స్ఫూర్తులూ అనే పరిశోధన, విమర్శ వ్యాసాల పుస్తకంలో ఏ వ్యాసాన్ని పలకరించినా చెప్తాయి.
            దార్ల వెంకటేశ్వరరావు వర్తమాన సాహిత్యంతో కలిసి క్రమం తప్పక నడుస్తున్న విమర్శకుడు. ఆ కృషినీ ఈ మధ్య తెలుగు విశ్వవిద్యాలయం గుర్తించింది. ఉత్తమ విమర్శకుడి పురస్కారమూ సమర్పించింది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఏదైనా ఒక స్పెషలైజేషను ఎంచుకో. అన్నింటిలోనూ (శక్తిలేకుండా) తగుదునమ్మా అని వేలు పెట్టకు. ఆ రంగంలో చేతికి అందని లోతుల్ని స్పృశించు. మూలాల్ని పట్టుకో. నీ శక్తి ఏదైనా ఎంత ఉన్నా సర్వమూ దానికే ఒడ్డు. నీ కృషి ఫలిస్తుంది. ఆ ఫలాన్ని లోకం ఎప్పటికో ఒకప్పుడు గుర్తిస్తుంది. గుర్తించి తీరుతుంది. సరిగ్గా ఇదే చేశాడు దార్ల. విమర్శరంగం  ఎంచుకున్నాడు అందులోనే కృషి చేస్తున్నాడు. ఒక్కో మెట్టూ ఎక్కుతున్నాడు. శుభోజ్జయం.
            విషయసంకలనంబు విజ్ఞానమా! ఇటుక ఆమ వేరు ఇల్లు వేరుఅన్నారు. ఇది  సంకలన గ్రంథాల విషయంలో. ఇప్పటి విమర్శకులు తమ వ్యాసాలను కొంత సంకలన గ్రంథాల మాదిరిగానూ  తయారు చేయాలి. ఎందుకంటే సాహిత్యంలో బాగా విస్తృతమైన అంశాలను మనం పరిశోధనకు స్వీకరించినప్పుడు ఇది తప్పదు. కావలసిన ముడి పదార్థం మొత్తాన్నీ ఒకచోట సమీకరించి పెట్టడమూ ఒక పరిశోధనే. దానికీ టెక్నికాలిటీస్‌ ఉన్నాయి. ఒకేసారూప్యమూ, స్వాభావ్యమూ కల అంశాలను క్రోడీకరించాలి. అదే చేశాడు దార్ల ఈ వ్యాస సంపుటిలో. సాహిత్యంలో ఏదో ఒక ప్రక్రియలో విశిష్టంగా సేవలందించిన సాహితీమూర్తుల్ని స్వీకరించాడు వ్యాసవిషయాలుగా. అయితే కేవలం వారి గురించి చెప్పి విడిచి పెడితే నిజంగా....అది విజ్ఞాన సర్వస్వంలాగా బయోడేటావరకే పరిమితమయ్యేది. ఒక వైపు  ఈ సాహిత్యమూర్తుల జీవన రేఖను పరిచయం చేస్తూనే... మరోవైపు వారు చేసిన కృషినీ సాహిత్య స్ఫూర్తినీ విశ్లేషించటం ఈ వ్యాస సంపుటికి గుండెకాయ.
            విమర్శరంగంలోని వివిధపార్శ్వాలను ఈపుస్తకం తడిమిందనడానికి వ్యాసాలలోని వైవిధ్యమూ విమర్శలోని గాఢత నిదర్శనలు. అంతరార్థ రామాయణంపై రాసినపెయ్యేటి లక్ష్మీకాంతమ్మగారిని లోకానికి పరిచయం చేశాడు. తరిగొండ వెంగమాంబ, బండారు అచ్చమాంబ రచనలలోని కవితా మాధుర్యాన్నీ, స్త్రీ చైతన్యాన్ని తూకం వేశాడు. గురజాడ కవిత్వంలోని సంస్కరణ దృక్పథం, గిడుగు భాషా, సామాజిక దృక్పథం... వంటి వ్యాసాలు మనల్ని పునరాలోచనలో పడవేస్తాయి. ఆధునిక కవిత్వం, ఆధునిక సాహిత్య ప్రక్రియలు, కళాతత్త్వశాస్త్రం, అంతర్జాలం....ఇలా విషయ వైవిధ్యంతో కూడిన వ్యాసాలు సాహితీ విద్యార్థులకు చక్కగా పాఠం చెప్తున్నట్లుగా సరళమైన భాషలో అందించటం విశేషం. దార్లలోని విద్యార్థిమిత్ర విమర్శకుడిని అభినందిస్తున్నాను.
            అత్యాధునికమైన సాహిత్య విమర్శ సూత్రాలూ, సిద్ధాంతాలూ గమనించి ఆ దృష్టికోణంతో దార్ల ఈ వ్యాసాలను రచించినట్లు స్పష్టంగా చెప్పగలను. అస్తిత్వవాద భావజాలాన్ని బలమైన కంఠస్వరంగా విన్పిస్తున్న వారిలో దార్ల కూడా ఒకరు. సామాజిక భాషా సాహిత్యాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలూ, వాటి ఆచరణలూ మొదలైన వాటిపట్ల స్పష్టమైన చిత్రం ఉంది దార్ల దృష్టిలో. ఆ చిత్రాన్నే ఇక్కడ ఆవిష్కరించాడు. ఈ చిత్రం అందరి మన్ననల్నీ పొందాలనీ...ఒక విమర్శకుడిగా దార్ల వెంకటేశ్వరరావు పడుతున్న శ్రమనీ తపననీ చేస్తున్న కృషినీ లోకం మరోసారి గుర్తిస్తుందని నేను అభిలషిస్తున్నాను.ఈ వ్యాస సంపుటిలోని వ్యాసాలన్నీ సదస్సుల కోసం రాసినవే. సదస్సు ముగిసిన పిదప, ఆ వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి, విమర్శలను పున: సమీక్షించి పత్రాన్ని మళ్ళీ సిద్ధం చేయటం నిజాయితీకల పత్ర సమర్పకుడు చేయవలసిన పని. ఈ వ్యాసాలన్నీ ఇలా చేసినవేనని ఆ వ్యాసాలలో కన్పించే నిఖార్సయిన రిసెర్చి మెథడాలజీ చెప్పకనే చెప్తుంది. ఈ విషయంలో మాత్రం విద్యార్థులు- విద్యార్థులే కాదు కొందరైనా అధ్యాపకులూ దార్లని  చూసి నేర్చుకోవాలని నా అభిప్రాయం.  సీరియస్‌ గా సాహిత్యవిమర్శ, పరిశోధన రంగాలలో పని చేసే వారికీ, సాహిత్య విద్యార్థులకీ ఈ పుస్తకం ఒక ‘‘ఫేస్‌ బుక్‌’’ వంటిదని విన్నవించుకొంటూ-పాఠకులకు స్వాగతం పలుకుతున్నాను. దార్ల వారిని అభినందిస్తున్నాను.                                                                                                                                                          
                                                మీ
                                                               -ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
07-04-2014



No comments: