(బహుజన సాహిత్య దృక్పథం పుస్తకానికి ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారి ముందుమాట
‘‘విస్తరిస్తున్న విమర్శకుడు దార్ల’’)
దార్ల వెంకటేశ్వరరావు తాజా సాహిత్య విమర్శకతరంలో అగ్రగామి. సాహిత్య
విమర్శను ప్రవృత్తిగా చేసుకొని తవ్విపోస్తున్నారు దార్ల. ఒక విశ్వవిద్యాలయ
ఆచార్యుడు ఎంత తాజాగా, ఎంత సజీవంగా ఉండాలో దార్ల అంత తాజాగా, సజీవంగా ఉన్నారు. కేంద్రీయవిశ్వవిద్యాలయ తెలుగుశాఖ మొదట నుంచి
సంప్రదాయకేంద్రం. నవ్య సంప్రదాయపీఠం. దేశీయం, భారతీయం, జాతీయం వంటి పేర్లతో భూస్వామ్య మనువాదసాహిత్యానికి ఆధునిక కాలంలో
చలామణిని కల్పించడం కోసం అక్కడే బలమైన ప్రయత్నాలు జరిగాయి. ప్రగతిశీలవాదులు అక్కడ
మొదట్లో మైనారిటీలే. అందుకే అక్కడ తెలుగుశాఖ అనేక ప్రకంపనాలను చవిచూసింది. ఇప్పుడు
పరిస్థితి మారింది. అనేకులు ఉదారవాదులు ప్రజాస్వామ్యవాదులు అక్కడ
ఉపాధ్యాయులయ్యారు. దార్ల అందులో భాగమే. చేరామాటల్లోచెప్పాలంటే దార్ల ఒక
లిటరరీయాక్టవిస్టు (ఈమాట 1985 ప్రాంతాల్లో ఆయన నన్ను గురించి అన్నారు)
ఇప్పటికే సృజనాత్మక రచనలు చేయడం ఎలా?, సాహితీసులోచనం,
వీచిక, పునర్మూల్యాంకనం వంటి విమర్శగ్రంథాలు ప్రచురించిన దార్ల ఇప్పుడు బహుజనసాహిత్యదృక్పథం’ అనే
విమర్శ వ్యాససంపుటిని మనకందించారు. ఈ
వయసుకు ఈ కృషి చిన్నదేమీకాదు. అందుకే దార్లను నేను అభినందిస్తున్నాను. రచయితలకు
లాగే సాహిత్యవిమర్శకులకు కూడా ఒక ప్రాపంచికదృక్పథం, ఒకనిబద్ధత
ఉండాలని నా అభిప్రాయం. ఇవి దార్లకు ఉన్నాయి. అందుకే దార్లను నేను నమ్మకంతో
చదువుతాను. పత్రికలలో వచ్చే దార్ల వ్యాసాలను నేను ఎప్పటికప్పుడు చదివి అభిప్రాయాలు
చెబుతూ ఉంటాను. కొన్నిటిని మాత్రం చెప్పను. కాలక్రమంలో ఆయనే తెలుసుకుంటారని.
నాకు దార్ల ఇష్టంకావడానికి మరోకారణముంది. అది అధ్యయనంలో మడికట్టుకోకపోవడం, దృక్పథంతో రాజీపడకుండా విస్తృతంగా అధ్యయనం చేయడం ఎలాగో కార్ల్‌మార్క్స్, బి.ఆర్.అంబేద్కర్‌లు మనకు నేర్పారు. ఎవరి సాహిత్యాన్నైనా ఎప్పటి
సాహిత్యాన్నైనా ‘వినదగునెవ్వరు చెప్పిన’ అనే పద్ధతిలో చదివిన విమర్శకులు ఏమిచెప్పినా అధికారికంగా చెప్పగలరు.
సాహిత్య విమర్శకులు తాము ప్రతిపాదించే అంశాల సాహిత్య, శాస్త్ర, సామాజిక నేపథ్యం తెలుసుకోగలిగితే, బలమైన
ప్రతిపాదనలు చేయగలరు. దార్ల ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నందుకు ఆయనంటే నాకు ఇష్టం.
చేసిన అధ్యయనంలో ఆమోదించేవీ,
వ్యతిరేకించేవీ తర్వాత.
ముందుచదవాలి. అర్థంచేసుకోవాలి. ఇది మంచి సాహిత్య విమర్శకుని లక్షణం. దార్ల సమాజ పరిణామాలను, సాహిత్య పరిణామాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నారు. సాహిత్య విమర్శ
పరిణామాన్ని కూడా ఆయన తీవ్రంగానే చదువుతున్నారు. ఈ ముప్పేట అధ్యయనమే ఆయన సజీవంగా
ఉండడాడానికి కారణం.
వర్తమానంలో బతుకుతూ గతంలో జీవించే విమర్శకులకు మనకు కొదవేమీలేదు. వాళ్ళు
బండ్లకొలదీరాస్తుంటారు. అస్పష్టత,
గందరగోళం, పదాల మోత, దబాయింపులు, కృత్రిమసమన్వయాలు
వాళ్ళ లక్షణాలు. తెలుగు సాహిత్యవిమర్శ ఎదుగుదల పట్ల అనుమానాలు వ్యక్తం కావడానికి ఈ
బాపతు విమర్శకులే కారణం. దురదృష్టవశాత్తు వీళ్ళు విశ్వవిద్యాలయాలలో నిండిపోయి
సిలబస్‌లలో వీళ్ళప్రాధాన్యం పెరిగిపోయింది. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి
పోటీపరీక్షల సిలబస్‌లలో కూడా వీళ్ళదే హవా. వర్తమానంలో జీవిస్తూ గతాన్ని కూడా
వర్తమానదృక్పథంతో అధ్యయనం చేసినప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. శాస్త్రీయత ఉంటుంది.
దానికోసం కట్టమంచి నుండి అనేకులు ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు.
దార్ల ఈ మార్గంలో నడుస్తున్నందుకు సంతోషంగా ఉంది. వర్తమానమంతా ఒకముద్దకాకపోయినా, వర్తమాన భావధారలలో దేనిని స్వీకరించినా మేలే. దార్ల దళిత బహుజన దృక్పథంగా
సమాజాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. అందుకే
దార్ల విమర్శలో స్పష్టత కనిపిస్తుంది. వర్తమాన సమాజంలో అనేక భావధారలు ఉన్నాయని
తెలుసు. అందులో తనభావజాలం మీద ఆయనకు సంపూర్ణవిశ్వాసం ఉంది. అందుకే ఆయన విమర్శ
సైద్ధాంతికంగా ఉంటుంది.
ఈ పుస్తకంలోని వ్యాసాలు చదివితే దార్ల అధ్యయన విస్తృతి తెలుస్తుంది.
ప్రాఙ్నన్నయ యుగం నుండి ‘ఎన్నెల నవ్వు’ నవల దాకా ఆయన అధ్యయనం
పరుచుకుంది. శ్రీకృష్ణదేవరాయులు,
అన్నమయ్య, వీరబ్రహ్మంలను పునర్మూల్యాంకనం చేశారు. జానపదసాహిత్యం నుండి
డయాస్పోరాసాహిత్యం దాకా విమర్శ రాశారు. కులపురాణాలు, బహుజనసాహిత్యాల
గురించీ రాశారు. అందుకే దార్ల విస్తరిస్తున్న విమర్శకుడనడం. మైక్రోలెవిల్, మాక్రోలెవిల్ రెండురకాల విమర్శలలోను దార్ల దిట్ట.
అన్నమయ్య ‘బ్రహ్మమొక్కటే’ అనడానికి
ఆయనపైబడిన ప్రభావాలను అన్వేషించారు. ఆముక్తమాల్యద లో రాయలు దాసరికి
భక్తుడుగా ప్రాముఖ్యమిచ్చినా,
కుల నిర్మూలనా దృష్టిలేదన్నారు.
వేదాలలో కులం లేదని వాదించేవాళ్ళకు పురుషసూక్తంలోని కులం ఆధారాలను చూపించారు.
వీరబ్రహ్మంను సామాజిక విప్లవకారునిగా గుర్తించారు. ‘జగడం’ నవలలో
బోయ జంగయ్య స్వంత జీవితాన్ని అన్వేషించారు. ‘ఎన్నెలనవ్వు’ నవలలోని అంతర్గత ఆధారాలతో ఆ నవల కథాకాలం గుర్తించారు. భారతీయసాహిత్య భావన
మీద ఆలోచన స్థిరపడుతుండగా ప్రపంచ సాహిత్య భావనను చర్చించారు. సాహిత్యం కులం
గురించో, జెండర్ గురించో రాయబడినా అది
విశ్వసాహిత్యంలో భాగంకావాలని కోరుకున్నారు. ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీల పేరుతో గల 85 శాతం మంది ప్రజలను గురించి రాయబడేది బహుజనసాహిత్యమని నిర్వచించారు.
ఇవన్నీ దార్ల కృషీవల స్వభావాన్ని నిరూపిస్తున్నాయి. అందుకే దార్ల వర్తమాన
విమర్శకతరంలో పద్ధతైన విమర్శకుడని అనడం.
దార్లకు జాగ్రత్తగా మాట్లాడడం బాగా తెలుసు.
అప్పుడప్పుడూ కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ విశ్వనాథకు శ్రీశ్రీకి ఏమీ తేడా
లేదనడంవంటివి చేస్తుంటారు. కొంత నెమ్మదిగా ఆలోచిస్తే ఆ అభిప్రాయాలలోని వాస్తవం
ఆయనకే తెలిసి వస్తుంది. రెండున్నర దశాబ్దాలుగా పాపులర్ అయిన కొన్ని అభిప్రాయాలను
దార్లకూడా అప్పుడప్పుడూ అలవోకగా అనేస్తుంటారు. అసలు శత్రువును విస్మరించి
ప్రజాపక్షం వహించే ఇతర భావజాలాలే శత్రువులన్నట్లు మాట్లాడడం వల్ల గత రెండున్నర
దశాబ్దాలలో శత్రువు ఎంత బలపడ్డాడో కళ్ళముందు కనిపిస్తూనే ఉంది. ఉ.సా. వంటి వాళ్ళు
ఈ వాస్తవాన్ని గుర్తించారు. దార్లకి ఇవి తెలియనివి కావు. కొంచెం నెమ్మదిగా
ఆలోచించుకోగలిగితే ఆయన అభిప్రాయాలు ఆయనకే అర్థమౌతాయి. ఇదలా ఉంచితే దార్ల సాహిత్య విమర్శ
కృషిని నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన్ని చదవమని పాఠకులను కోరుతున్నాను.
-ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
20.05.2012
కడప
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి