సహృదయ విమర్శ
-డా. ద్వా.నా. శాస్త్రి
1-1-428, గాంధీనగర్
హైదరాబాద్ - 500080
ఫోన్: 9849293376
నా
జీవితంలో గర్వించే సన్నివేశాలు చాలా వున్నాయి. నాకున్న శిష్య సంపదకి ‘’నాలోన నేనే గర్వించుకొందు!’’ అటువంటి సంపదలో డా.దార్ల వెంకటేశ్వరరావు
ముఖ్యుడు. అమలాపురం - శ్రీ కోనసీమ భానోజి రామర్స్ కళాశాలలో దార్ల నా శిష్యుడు. “స్పెషల్
తెలుగు’’ విద్యార్థిగా నాకు బాగా దగ్గరయ్యాడు.
దార్ల
సోదరుడు, సోదరి కూడా నా శిష్యులే. డిగ్రీ
విద్యార్థిగా ఉండగానే దార్ల వెంకటేశ్వరరావు ప్రతిభావంతుడని గుర్తించి ప్రోత్సాహపరిచేవాడ్ని.
ఆ రోజుల్లోనే గ్రంథాలయాన్ని ఉపయోగించుకొనే అతి కొదిమందిలో (అధ్యాపకుల కంటె మిన్నగా)
దార్ల ఒకడు. సమకాలీన సాహిత్యాన్ని అధ్యయనం చేసి పరిశీలించటం అతడికి కళాశాలలోనే అలవడింది.
ఆ
తర్వాత ఒక సంఘటనలో దార్ల పక్షాన నిలబడి నా ఆత్మీయ మిత్రుడికి శత్రువునయ్యాను. దార్ల
వెంకటేశ్వరరావు అంటే నాకు అంత ఇష్టం! కేంద్రీయ విశ్వ విద్యాలయంలో జేరమని సలహా ఇచ్చాను.
అలాగే అక్కడ ఎం.ఏ. తెలుగు చదివి, ఎం.ఫిల్, పి.హెచ్.డి.లు
కూడా సంపాదించాడు. అంతేకాదు ఇవాళ అదే విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో అధ్యాపకుడు కూడా!
గురువుకి ఇంత కంటే సంతోష సమయం ఏమి వుంటుంది?
మా
దార్ల ”జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన’’ అనే ఎం.ఫిల్, సిద్ధాంత వ్యాసాన్ని ప్రచురించాడు. “
దళిత తాత్త్వికుడు' ' అనే కవితా సంపుటి తెచ్చాడు. నాగప్పగారి సుందర రాజుతో కలిసి
మాదిగల పక్షాన అక్షర సమరం చేశాడు. సుందర రాజుకి నేనంటే చాలా ఇష్టం. కానీ, దురదృష్టం ఏమిటంటే ఆ ఉద్యమ శీలి ఒక ప్రేమ
వ్యవహారంలో భీరువులాగా తనువు చాలించాడు! అటువంటి నాగప్పపై దార్ల “ ఒక మాదిగ స్మృతి: నాగప్పగారి సుందర్రాజు పరిచయం' ' అనే పుస్తకం రాశాడు. ”సృజనాత్మక రచనలు చేయడం ఎలా?’’ అనే మరో రచనలో
సృజనాత్మక రచనలు చేయడానికి తాను గమనించిన
మెలుకువల్ని వివరించాడు. ”దళిత సాహిత్యం: మాదిగ దృక్పథం’’ గ్రంథం లో కొన్ని చర్చనీయాంశాలను
పెట్టాడు. వివిధ పుస్తకాలకు రాసిన సమీక్షలను
”సాహితీ
సులోచనం’’ పేరుతో ప్రచురించాడు. ఈ " వీచిక' అనేది విమర్శ గ్రంథం.
దీనిని నా సహాధ్యాయుడు, గొప్ప విద్వాంసుడు, భాషా శాస్త్రవేత్త ఆచార్య పరిమి రామ నరసింహానికి అంకితమివ్వడం నాకు అమితానందం!
"కవి'గా పేరు తెచ్చుకోవటం కంటె, కథా రచయితగా మెప్పు పొందడం కంటె - విమర్శకుడిగా
ప్రశంసలు పొందటం కష్టతరం. అందరూ విమర్శకుడ్ని విరోధిగా లేదా అననుకూలునిగా చూస్తారు.
విమర్శను సహించలేని వారే అత్యధికం. విమర్శను స్వాగతించే వారు చాలా చాలా తక్కువ. ఈ రంగంలో
వున్న నాకు ఇటువంటి అనుభవాలు ఎన్నెన్నో! అయినా మా దార్ల ధైర్యంగా విమర్శను చేపట్టాడు.
దార్ల
విమర్శలో సంయమనం వుంది. విశ్లేషణ వుంది. తార్కికత కూడా వుంది. అందుకే ఇతని విమర్శను
"సహృదయ విమర్శ’’ అంటున్నాను. కవి లేదా రచయిత మనసును గ్రహించి తదను గుణంగా విమర్శించడమే
సహృదయ విమర్శ. దార్ల ప్రధానంగా దళిత రచయిత. అయితే అందులోనే చక్కర్లు కొట్టే సంకుచిత
స్వభావం అతనికి లేదు. సాహిత్యాన్ని సాహిత్యంగానే చూసే సహృదయం కూడా వుంది. ఈ “వీచిక’’ ద్వారా మున్ముందు మనకి మరొక
మంచి విమర్శకుడు రాబోతున్నాడని తెలుసుకుంటాం. ఇది శిష్య పక్షపాతంతో అంటున్న మాట కాదని
ఈ పుస్తకం చదివితే మీరే తెలుసుకుంటారు.
"వీచిక’’
లోగల అన్ని విమర్శ వ్యాసాలు వైవిధ్యమైనవి. విశిష్టమైనవి. విలక్షణమైనవి. అంతేకాదు -
విశ్లేషణాత్మకమైనవి కూడా. ఈ విమర్శను ఇలా వింగడించవచ్చు.
సాహిత్య
చరిత్రకి సంబంధించిన విమర్శ, విమర్శపై విమర్శ, పద్య కవితా విమర్శ, ప్రాంతీయ అస్తిత్వ విమర్శ దళిత విమర్శ, కథా విమర్శ, నవలా విమర్శ, నానీల విమర్శ, ముస్లిం స్త్రీవాద విమర్శ.
వీటిని
బట్టి దార్ల ఎక్కువగా సమకాలీన సాహిత్య విమర్శనే చేపట్టాడని తెలుస్తుంది.
దార్ల
వెంకటేశ్వరరావు విశ్లేషణా శక్తి, వివేచనా శక్తి తెలుసుకోవాలంటే “పరిశోధకుడుగా
ఆచార్య పింగళి లక్ష్మీకాంతం’’ అనే వ్యాసం పరిశీలిస్తే చాలు. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం
గారు ప్రతిభా మూర్తి అనటంలో సందేహం అక్కరలేదు. తమ “నోట్సు’’ ద్వారా మార్కులు వచ్చేలా
చేసి ఎంతోమంది ఎం.ఏ. తెలుగులో ఉత్తీర్ణులయ్యేలా అయన ఒక మార్గం వేశారు. చాలా సంవత్సరాలు ఆంధ్ర విశ్వ
విద్యాలయంలోనే కాదు - మిగిలిన విశ్వ విద్యాలయాలలో కూడా అప్పటికి లక్ష్మీకాంతం
గారి “నోట్సు’’ ఒక్కటే శరణ్యంగా వుండేది.
నిజానికి
పింగళి వారి "ఆంధ్ర సాహిత్య చరిత్ర'ను అంత గొప్పగా భావించని వారే ఎక్కువ. కానీ, దార్ల వెంకటేశ్వరరావు సుమారు ఇరవై పుటలలో
లక్ష్మీకాంతం గారి పరిశోధనా ప్రతిభను నిష్కర్షగా, లోతుగా మూల్యాంకనం చేశాడు. లక్ష్మీకాంతంగారిని
కొంత "అతి'గా ప్రశంసించాడేమో అనిపిస్తుంది
కానీ - తెలుగులో మొదటగా సాహిత్య చరిత్రను ఎలా అధ్యయనం చేయాలో - విశ్వ విద్యాలయాలలో
సాహిత్య చరిత్రను ఏ విధంగా బోధించాలో, ప్రశ్నా పత్రాలను ఎలా రూపొందించాలో పింగళి వారే మార్గం చూపారు.
ఆ రీత్యా దార్ల ప్రతి పాదనలను ఆహ్వానించవల్సిందే. కానీ, ప్రబంధ లక్షణాలుగా పింగళి లక్ష్మీకాంతం
గారు చెప్పినా,
జి.వి. సుబ్రహ్మణ్యం
గారు చెప్పినా అవి సహేతుకమూ సంపూర్ణమూ కానే కాదు. కావ్యం, ప్రబంధం సమానార్థకాలు కాగా, ఆయన రెండూ వేర్వేరుగా చెప్పి సంక్లిష్టతనీ, అస్పష్టతనీ ప్రకటించారు. దీనిని దార్ల
గుర్తించి ఉండవల్సింది. ఇదలా వుంచితే ఈ వ్యాసం చాలా రకాలుగా ప్రామాణిక విమర్శ వ్యాసం
అనడం ఉన్నమాటే అవుతుంది.
వల్లంపాటి
వెంకట సుబ్బయ్య మార్క్సిస్టు విమర్శకులు. చాలా వరకు హేతు బద్ధంగానే ఆలోచిస్తారు. నిబద్ధత
(కమిటెడ్) అనగానే విమర్శలో వక్రీకరణ తప్పదు. మధురాంతకం రాజారాం కథల్లో వర్ణన ఎక్కువనీ, రావిశాస్త్రి కథల్లో వ్యాఖ్యాన చాపల్యం
వుంటుందనీ వల్లంపాటి అనడం సమంజసం కాదు. కథా రచనలో ఇవి విభిన్న శిల్పాలు. కొత్తగా వ్యాఖ్యానించాలన్న
తాపత్రయమే దీనికి కారణం. ఈ లోపాలను దార్ల పసిగట్టగలిగితే మరింత బాగుండేది. అయినా దార్ల
విశ్లేషణ నవ్యాతి నవ్యం!
మల్లవరపు
జాన్ కవి గారి కవితా శక్తిని సరిగ్గా అంచనా వేసి
కవి సామరస్య వాతావరణాన్ని వాంఛిస్తున్నాడనటం అత్యంత సముచిత వ్యాఖ్య. “కళ కళ
కోసమా? ప్రజల కోసమా?’’ అనే చర్చలో జాన్ కవి ఉభయుల కోసమనే
వర్గానికి చెందుతారనటంలో దార్ల తీర్పు సమంజసంగా, కవి సహృదయపరంగా వుంది.
కళింగాంధ్ర
కవిత్వంపై రాసిన విమర్శ వ్యాసం దార్ల సునిశిత పరిశీలనకి మచ్చు తునక. మంచి విమర్శ వ్యాసమే.
అయితే చివరిలో ఒక ప్రశ్న లేవనెత్తి అసమంజస వ్యాఖ్య చేశారు. తూర్పు గోదావరి జిల్లాను
కళింగాంధ్రంలో పరిగణించటం సమంజసం అనటం అసమంజసం. భాషా శాస్త్ర వేత్తల ప్రకారమే కాదు
చారిత్రకంగా కూడా కళింగ ప్రాంతం వేరు. మొదట్లో కళింగాంధ్రను కూడా కోస్తాలో కలిపారు.
ఆ తర్వాత కోస్తా వేరు, కళింగాంధ్ర
వేరు అయింది. కళింగాంధ్ర కవులు, రచయితలు తమ రచనలలో గోదావరి జిల్లాల వారి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూనే వున్నారు.
విశ్వ విద్యాలయం ఏర్పాటుకీ ఈ ప్రాంత విభజనకీ ఎటువంటి సంబంధమూ లేదు. కొత్తగాచర్చకి తేవటం
అనవసరం గదా!
కాసుల
ప్రతాపరెడ్డి కథ “వెంటాడిన అవమానం’’ పై విమర్శ వ్యాసం సహేతుకంగా, ప్రామాణికంగా, విశ్లేషణాత్మకంగా సాగింది. నేటి కథల్ని
ఎలా విమర్శించాలో ఈ వ్యాసం చెప్తుంది. విశ్వ విద్యాలయాల్లో కథలపై పరిశోధన చేసే వారికి
ఈ వ్యాసం ఆదర్శం. ఆమ్రపాలి కథపై తులనాత్మక పరిశీలన చేసిన తీరు ప్రశంసనీయం.డి. కామేశ్వరి
గారి “మనసున మనసై’’ నవలపై దార్ల విశ్లేషణ కూడా ఔచిత్యంతో కూడుకొని ఆలోచనాత్మకంగా వుంది.
“దళిత
సాహిత్యం - మౌలిక భావనలు’’ అనే వ్యాసం సమగ్రమైనది. ఎన్నో వ్యాసాలు వచ్చినా -వాటి కంటె
సమగ్రంగా వుంది. పోటీ పరీక్షల అభ్యర్థులకి, సివిల్స్ అభ్యర్థులకి, అధ్యాపకులకి తోడ్పడే వ్యాసమిది. నేను
రాసిన “నానీలలో సినారె’’ కవితా సంపుటిపై కూడా వ్యాసం వుంది. ముస్లిం "మైనారిటీ
కవిత్వంలో స్త్రీవాద దృక్పథం’’ వ్యాసం ఎంతో కొత్త సమాచారం ఇస్తుంది.
మొత్తం
మీద మా దార్ల వెంకటేశ్వరరావు విమర్శనా రంగంలో కలం
కదపడం స్వాగతించదగినది. ఇదే పరిశీలననీ, అధ్యయనాన్ని మును ముందు కూడా “నిష్కర్షగా’’
కొనసాగిస్తే తెలుగు సాహిత్యానికి మరొక సహృదయ - సద్విమర్శకుడు లభించినట్టే!
-ద్వా.నా. శాస్త్రి
హైదరాబాదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి