(డా.పి.కేశవకుమార్ పాండిచ్చేరి విశ్వవిద్యాలయం, ఫిలాసఫీ విభాగంలో అధ్యాపకుడుగా పనిచేసేవారు. ఇటీవలే ఢిల్లీ విశ్వవిద్యాలయం ఫిలాసఫీ విభాగంలో ఆచార్యులుగా చేరారు. ఈయన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఫరిశోధన చేసేటప్పుడు నేను విద్యార్థిగా చేరాను. ఈయన వివిధ విద్యార్థి ఉద్యమాలతో పాటు, సాహిత్య కార్యక్రమాల్లోను చురుకుగా పాల్గొంటుండేవారు.
బహుజనకెరటాలు మాసపత్రికలో ఈయన రాసిన వ్యాసాలు, సంపాదకీయాలు ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఫిలాసఫీలో ఈయన ప్రచురించిన పుస్తకాలతో పాటు, తెలుగు సాహిత్యాన్ని తాత్త్వికదృష్టితో పరిశీలించడం ఈయన రచనల్లోని ఒక ప్రత్యేకత. ఈయన తన భావాలను ఎప్పటికప్పుడు తన బ్లాగు http://untouchablespring.blogspot.in/ ద్వారా కూడా అందుబాటులో ఉంచుతుంటారు.
క్యాంపస్ లో నన్ను దగ్గరగా పరిశీలించిన పరిశోధకుడు. గతంలో నేను ప్రచురించిన ‘‘దళితతాత్వికుడు’’ కవితాసంపుటిలోని కవితలతో పాటు మరికొన్ని కవితలను కలిపి త్వరలో ప్రచురించబోతున్న నా ‘‘నెమలికన్నులు’’ కవిత్వం గురించి డా.పి.కేశవకుమార్ రాసిన విశ్లేషణాత్మక వ్యాసాన్ని ఈయన అనుమతితో ఇక్కడ ముందుగానే అందిస్తున్నాను....దార్ల)
-డాక్టర్. పి.కేశవకుమార్
పాండిచ్చేరి యూనివర్సిటి,
పుదుచ్చేరి
21-11-2013
డాక్టర్ దార్ల
వెంకటేశ్వరరావు గుండెచాటున దాచుకున్న జ్ఞాపకాలకి పూసిన అక్షరాలీ ‘నెమలికన్నులు’. ఈ నెమలికన్నుల
నృత్యగానంలో అన్యాయాల్ని, అవమానాల్ని ఎదిరించిన ఆత్మగౌరవసంగీతముంది. చీకటి వెలుగుల
చాటున ప్రవహించిన బతుకుపాట వుంది. అక్షరాలు చేసిన ఆకలి చిందువుంది.
జీవితానుభవాల్లోంచి పుట్టుకొచ్చిన దళితదార్శినికత వుంది. వూరికీ, పల్లెకీ మధ్య
ఉన్న నిప్పుల గీతల్ని చెరిపేస్తూ, పల్లెనీ, పట్టణాన్ని విడదీసిన ‘నాగరికతా’ రహదార్లునీ
కలిపేస్తూ సాగే జుగలబందీ ఈ కవిత్వం.
నెమలికన్నుల కవిత్వం నిండా దళిత కలలే. కొత్త జీవితం కోసం హందాగా వుండే
బతుకుకోసం చులకనతనం లేని ఆధునికత్వం కోసం, వూరి ప్రేమతో పెనవేసుకున్న
రహస్యబంధాల్ని బహిరంగరాగాలాపన చేద్దామని. తెల్లపంచెలో మహారాజై మీసం మీద చెయ్యేసి
కోర్కెల గుర్రమెక్కిన అయ్య. పట్టుచీర కట్టుకుని ఫ్యానుకింద కూర్చుని కలరు టీవీ
చూస్తున్న అమ్మ... ఇప్పుడు తన కలల్లోనూ ఊహల్లోనూ తండ్రితోటమాలికాదు; తల్లి
పనిమనిషికాదు. ఆత్మన్యూనతను అవతలికిసిరేసిన నిండుమనిషి అతని కవితా వస్తువు.
జీవితాన్ని, కవిత్వాన్ని అట్టాగే శాసించే నిమంత్రకుడు కావాలనుకుంటాడు. అట్టాగని
వాస్తవ జీవితంలోంచి కలల ప్రపంచంలోకి పారిపోవాలనుకోవడం లేదు. అవమానమంటే
అర్థమయ్యే అందరినీ ప్రేమించడం తెలిసే దళిత
కులంలో పుట్టడమేమంచిదయింటాడు. ఆత్మగౌరవానికీ, ఆత్మవిశ్వాసానికీ వెన్నుపూసై నిలిచిన
పుట్టుమచ్చనే ప్రేమిస్తానంటాడు. ఈకవిత్వంలో కులం కట్టుబాట్లు, సాహిత్యం-సంస్కృతి,
భాష... ఇలా అనేక రూపాల్లో వున్న బ్రాహ్మణత్వాన్ని నిలదీసిన దళిత దృష్టి వుంది.
మాదిగచైతన్యంతో పురివిప్పిన నెమలికన్నుల జీవితముంది.
ఈ కవితాసంకలనంలో అనేక విషయాల పైన ప్రతిస్పందించిన కవితలు ఉన్నప్పటికీ,
అన్నిటా దార్లకున్న ప్రాపంచికదృక్పథం. సుస్పష్టం. అది బ్రాహ్మణీయ కులసమాజంపైన,
సాహిత్యం, సంస్కృతిపైన ఎక్కుపెట్టిన అచ్చమైన దళితదృక్పథం ఈ నెమలికన్నుల కవిత్వం
కొత్త పార్శ్వాలని తాకి దళితసాహిత్యం పరిధిని పెంచింది. ఉమ్మడి దళిత వుద్యమం నుండి
మాదిగ దండోరా వుద్యమం వరకు సాగిన దళిత ఉద్యమవైనాన్నీ చూడొచ్చు. సాహిత్యం ద్వారా దళిత ఉద్యమానికి అవసరమైన
మేధోపరమైన ఆలోచనని అందించింది. ఒకవైపు దళితస్పృహకి పదునుపెడుతూనే దళిత ఉపకులాల
మధ్య అంతరాన్ని గుర్తిస్తూ, సామాజిక న్యాయసూత్రం ద్వారా సమన్వయం ఏర్పరిచేప్రయత్నం
కన్పిస్తుంది. దళితజీవితానుభవం పునాదిగా సాహిత్యాన్ని రాజకీయాలనీ స్పృశించడమేగాక,
అన్ని విధాలా దళితుల ఉన్నతినీ, అభివృద్ధినీ అధికారాన్నీ కోరుకున్నట్టు
కన్పిస్తుంది. దళితుడంటే బాధలు, అవమానాలు, ఆకలీ, ఆవేదనలు అన్న నిన్నటి ఇమేజరీలకి దూరంగా
జరిగి ఆత్మగౌరవంతో హూందాగా, నిండుమనిషిగా మనమధ్య నడిచిపోయే దళితుడిని
ఆవిష్కరిస్తాడు. దళితఅనుభవాల్ని వెంటాడే అవమానాలుగా గాక, అదో ఆత్మ జ్ఞానంగా,
అమ్మవొడిగా చూస్తాడు. ఆ జ్ఞానాన్ని దళితవిమోచనగా మలుస్తాడు. ఆదిశలోనే
పుట్టుమచ్చల్ని ప్రేమిస్తాడు. పల్లెల్ని పట్ణణాల్లోకి లాక్కొస్తాడు. అమ్మని
యూనివర్సిటీలో పాఠంగా చేస్తాడు. అయ్యని దళిత తాత్త్వికుడిని చేస్తాడు. బ్రాహ్మణీయ
జ్ఞానాన్ని తలదన్నేలా చేస్తాడు.
ఈ కవిత్వంలో మారుతున్న కుల రూపాలనీ, మారని కులత్త్వాన్ని బాగానే
పసిగట్టేడు. కులమంటే వూరునీ, పట్టణం అందుకు భిన్నమనీ అనుకుంటాం. కులం అంటే
ప్రాచీనమనీ, సాంప్రదాయమనీ, ఆధునికత అందుకు వ్యతిరేకమనుకుంటాం. కిందికులాల వాళ్ళు
చదువుకుని ఆర్థికంగా ఎదిగిన కొద్దీ, కులం దానంతటదే కూలిపోతుందని కూడా
చెప్తూవుండటాన్ని వింటూవుంటాం. అయితే, రోజువారీ వాస్తవ జీవితం అందుకు భిన్నంగానే
వుంది. భారతీయపౌరసమాజంలో కుల వికృతరూపం స్పష్టంగానే వుంటుంది. అగ్రకుల మధ్యతరగతి
వర్గ, కుల దురహంకారం నుండి ఒక్క అడుగైనా ముందుకేయలేదు. మారిందల్లా భాష, రూపమే.
హృదయాంతరాల్లో కరడుకట్టుకుపోయిన కులం పదిలంగానే వుంది. దళితుల్ని వ్యతిరేకించే
ఉద్దేశ్యంతోనే రిజర్వేషన్లు కులం ప్రాతిపదికన గాక, ఆర్థిక ప్రాతిపదికగా
ఉండాలంటారు. అట్లాగని కులం వల్ల వారసత్వంగా వచ్చిన అధికారం హోదా, సంపదని ఏమాత్రం
వదులుకోడానికి సిద్ధంగా వుండరు. ఆధునిక సమాజంలో కులహింస భౌతిక రూపంలో గాకుండా,
మానసిక రూపంలోకి మారుతుంది. కులం గురించి ఆరాతీయడం ప్రత్యక్షంగా గాక, పరోక్షంగా
వుంటుంది. కుల దురహంకారంతో దళితులపైనా, మరీ ముఖ్యంగాదళిత మధ్యతరగతిపైనా జరిగే
దాడైతే వెయ్యిదొబ్బనాలతో ఒకేసారి గుచ్చినట్టుంటుంది. పట్టణాల్లోకి ఉద్యోగరీత్యా
వచ్చిన దళితులకి రోజువారీ జీవితం ఒక సవాలే. ఈ ఆధునిక ఆవాసాల్లో అభద్రతతో
కూడిన జీవితం, సామాజిక జీవితం అంటూ లేని ఒంటరి జీవితాన్ని జనసమూహాల మధ్యే గడపాల్సి
వుంటుంది. అందులో భాగంగా పుట్టుమచ్చల్ని కన్పించకుండా వుండాలనుకుంటారు. తనది కాని
జీవితాన్ని అనుకరించే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. తన వూరివాసనల్ని తన సొంత ఇంటి
వాళ్ళను దూరంగా వుంచేలా చేస్తుంది. అనుదినమూ ఆత్మన్యూనతకు క్రుంగిపోవాల్సి
వుంటుంది. దళితుడు అగ్రకుల హోదాని పొందేందుకు, వాళ్ళ విలువలని అనుకరించేందుకు చేసే
ప్రయత్నంలో చివరికి కుటుంబంలో ఓ హింసాత్మక పరిస్థితిలోకి నెట్టేయబడుతుంది.
ఒకవిధంగా చెప్పుకోవాలంటే ఆధునికతతో పాటు వచ్చిన హింసంతా దళిత కులాలే అనుభవించాల్సి
వస్తుంది. ఈ నెమలికన్నుల కవిత్వంలో, ఇటువంటి దళిత మానసిక స్థితిని బలంగానే
పట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇది దళిత సాహిత్యానికి కొత్తగా తోడైన అంశం.
పల్లెల్ని, పట్టణాల్లోకి తీసుకొచ్చినా, కూలీనాలీ చేసుకునే తల్లిదండ్రుల్ని నగరం
నడిబొడ్డులో దర్జాగా కూర్చోబెట్టైనా, పండిత భాషని కాదని దళిత భాషని, యాసని అట్టాగే
ముంగిళ్ళలోకి మోసుకొచ్చినా, ఆత్మన్యూనతతో గాక, ఆత్మగౌరవంతోనూ, తనదైన గుర్తింపుతో
బతకాలని చెప్పటంలో దార్ల దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. మనమూలాల్లోకి
వెళ్ళడానికి అలజడెందుకని ప్రశ్నిస్తాడు. ఇది ఖచ్చితంగా అగ్రకుల ఆధునికతకు భిన్నమైన
దళిత ఆధునికత. ఈదళిత ఆధునికతలో జీవితానికి, అనుభవానికీ ఆచరణకీ వున్న పేగుసంబంధం
వుంది. వ్యక్తుల్ని సామాజిక జీవితంలో భాగంగా చూడటమేగాక, ఆ సామాజిక జీవితం మరింత
ప్రజాస్వామికంగా, గౌరవప్రదంగా వుండాలన్న తపన వుంటుంది. కొత్తవిలువలు, తార్కికత, విజ్ఞానం సంగతేమో
గానీ, అటు దుర్మార్గమైన సాంప్రదాయ విలువలు, ఇటుమనిషిని సమానంగా గుర్తిస్తూ గౌరము,
హోదాని ఇస్తుందనుకున్న ఆధునిక జీవితం కుల సమాజంలో తనకి గుది బండగానే వుంటుంది.
దార్ల తన కవిత్వంలో భాషకి, బతుక్కి, సంస్కృతికీ ఉన్న సామాజిక
సంబంధాన్ని బలంగా ట్టకున్నాడు. తాను చదువుకున్న, ఉద్యోగం చేస్తున్న హైదరాబాదు
సెంట్రల్ యూనివర్సిటీలాంటి చోటైతే భాషే మనిషి అస్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.
చదువంటే ఇంగ్లీషే అన్నట్లు వుంటుంది. ఇంగ్లీషు రాకపోవడం అజ్ఞానంగా చూడబడుతుంది. అగ్రకులతనం, కాన్వెంటు చదవులు, పెదాలపై
అతికించుకుంటున్న ఇంగ్లీషు ముక్కల రూపంలో ఆధిక్యాన్ని సంపాదించుకుంటుంది. పల్లెటూరు నుండి, గవర్నమెంటు బడి నుండి వచ్చే దళితులకిది నిత్యహింసే.
అన్నీ తెలిసినా క్లాసురూములో మూగవాడిగా ఓ పక్క ఒదిగిపోవాల్సి వస్తుంది. ఇంగ్లీషే జ్ఞానకొలబద్దగా ఫ్రొఫెసర్లు భావిస్తూ,
దళితుల్ని చదురాని మొద్దులుగా చూస్తూ, మీకసలు ఇక్కడేమి పనన్నట్లు చూస్తారు. అట్లాగని తెలుగు చదువులు
ఇంగ్లీషు చదువులకేమీ తీసిపోలేదు. తెలుగు సాహిత్యం విషయానికి వస్తే, బ్రాహ్మణీయ
సాంస్కృతికాధిపత్యాన్ని చెలాయిస్తుంది. అందులో దళిత జీవితం ఉండదు. ప్రజాస్వామిక
విలువలుండవు. సగటు మనిషి మాట్లాడుకునే తెలుగు ఉండదు. అందుకేనేమో ప్రాచీన సాహిత్యం
క్లాసులో దళితుడైన దార్ల వెలేయబడతాడు. క్లాసురూములోంచి బయటకు పరిగెత్తాలనుకుంటాడు.
భాషంటే బతుకు రూపం కదా. ఈ భాషలో తన ఉనికి సున్నాగా, అధమంగా ఉండడాన్ని గమనించిన
దార్ల తనదైన భాషకోసం తన జీవితమున్న సాహిత్యం కోసం వెతుకులాడుకోవడం కనిపిస్తుంది.
అందుకే సామాజిక అస్తిత్వంలో నుంచి, సామాజిక భాషా సూత్రాల్లోనుంచి అగ్రకుల
బ్రాహ్మణీయ ఆధిక్యతను బట్టబయలు చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తెలుగు ప్రాచీన
భాషావాడుక విషయాన్ని గురించి మరింత ఆందోళన చెందతాడు. సామాన్యులకెవరికీ అర్థంకాని
గ్రాంథిక భాషకు వ్యతిరేకంగా వచ్చిన వ్యావహారిక భాషోద్యమం చివరికి బ్రాహ్మణీయ
సంస్కృతినే కొనసాగించేలా చేసింది. ఎన్నో పోరాటాలు చేసి దళిత సాహిత్యం ద్వారా తమ
అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేక్రమంలో మళ్ళీ కథ వెనక్కి నడుస్తూనే వుందని గమనించి,
తన సాహిత్యం కోసం. తన గొంతుకోసం, తన యాసకోసం, తనదైన మాటకోసం కవి పరితపించడం
కనిపిస్తుంది. తన దళిత జీవితంలోంచి, అనుభవంలోంచి, పోరాటాల్లోంచి వచ్చిన జ్ఞానాన్ని పాఠ్యపుస్తకాలుగా
చేయాలనుకుంటాడు.
దార్లవెంకటేశ్వరరావు మాదిగదండోరా ఉద్యమంతో బాటు ఎదిగిన మేధావుల్లో
ప్రముఖుడు. అది తన కవిత్వంలో కూడా స్పష్టంగా కన్పిస్తుంది. దళిత ఉద్యమం
బ్రాహ్మణీయవ్యవస్థని తూర్పారబడితే, దళిత ఉపకుల అస్తిత్వ ఉద్యమాలు దళిత కులాల మధ్య
వుండాల్సిన ప్రజాస్వామికత గురించి నొక్కి చెప్పింది. దార్ల కవిత్వం సామాజిక న్యాయం
కోసం నినదించింది. శత్రువైరుధ్యాలనీ, మిత్రవైరుధ్యాలని గుర్తించి పోరాడాల్సిన
అవసరాన్ని చెబుతూ మాదిగ మేనిఫెస్టోనందించింది. దార్ల మాదిగ దండోరా ఉద్యమాన్ని ఎంత
ఆర్ద్రతతో గుండెలకు హత్తుకున్నాడో, అంతే స్థాయిలో ప్రజాస్వామిక సంఘటిత దళిత
ఉద్యమాన్నీ అక్షర ఆవాహన చేసుకున్నాడు.
దార్ల కవిత్వం మనిషి జీవితానికున్న ఇంచుమించు అన్ని పార్వ్శాల్నీ
తడిమింది. నేటికాలంలో దాపరించిన అన్ని సామాజిక సంక్షోభాల్నీ తన కవిత్వంలోకి
లాక్కురావడమే గాక, తనదైన విమోచనా గొంతుకని వినిపిస్తాడు. ప్రపంచీకరణమీద
ఉక్కిపిడికిలై లేస్తాడు. ప్రపంచీకరణ ఎలా వనరులని కొల్లగొడతుందో, మన విలువల్ని
ఎట్లా కూలబొడుస్తుందో కవిత్వం కట్టేడు. వనరుల వేటలో కోనసీమ బ్లో అవుట్లు, కొత్త
మార్కెట్ పోటీకి చిరిగిపోయిన చేనేత అల్లికలు, ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్
మోహినీరూపానికి మసయిపోయిన ప్రేమలు, మానవీయబంధాలు, మనజ్ఞానసంపద, లైబ్రరీపుస్తకాలు,
ఇట్లా ప్రపంచీకరణ మీద కలం పోట్లు పొడుస్తూ కవిత్వ తిరుగుబాటు జెండా ఎగరేస్తాడు.
దార్ల ఈ కవితాసంకలనంలో అటు ప్రాపంచిక ఉద్యమాలతోనూ, ఇటు ప్రాంతీయ
ఉద్యమాలతోనూ ఒక దళితసంభాషణ జరిపేడు. ప్రపంచీకరణ పేర విస్తరిస్తున్న నయా
వలసవాదాన్ని ప్రతిఘటిస్తాడు. నిలువెత్తు విశ్వమానవ నాశనరూపాన్ని ప్రపంచాన్ని
శాసిస్తున్న శాసనాన్ని ధిక్కించినోళ్ళని తనివితీరాముద్దాడేడు. అగ్ర అమెరికా
కాలుకింద భూమిని కుదిపేసిన యుద్ధవీరుడు సద్దాంకి సలాం చేస్తాడు. ప్రాంతీయంగా వున్న
సామాజిక, ప్రాంతీయ అస్తిత్వఉద్యమాలకు అండగా కవిత్వాన్ని పరిచేడు దార్ల.
ఉత్తరాంధ్ర, తెలంగాణ ఉద్యమాలని బలపరుస్తూ అంతర్లీనంగా ఉన్న సామాజిక అసమానతల్ని
స్పృశించేడు. కోస్తాజిల్లాల్లో మాదిగబతుకు, తెలంగాణపోరాటానికేమంత భిన్నంగా లేదులే
అంటాడు. ఏదో బతుకుతెరువుకోసం తెలంగాణకొచ్చిన దళితుల్ని తెలంగాణాని
కొల్లకొట్టినోళ్ళుగా చూడొద్దంటాడు. తెలంగాణా ఉద్యమం ఈ తేడాని గమనించాలంటాడు.
ఇకపోతే, విప్లవపార్టీలు కులాన్ని ఉపరితల అంశంగా గాక పునాదుల్లోని కులం చొరబాటుని
గమనించాలని కోరుకుంటాడు. ఆ దిశగా పార్లమెంటరీ కమ్యూనిస్టుపార్టీలు, విప్లవపార్టీలు
కులాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆశించినట్టు కన్పిస్తుంది. వేంపెంట
మారణకాండక వ్యతిరేకంగా విప్లవపార్టీలు పోరాటాన్ని, విప్లవపార్టీలో కులసమస్య పట్ల
వచ్చిన వైఖరిని హర్షిస్తూ దళితులు కొత్తపోరాటానికి సమాయత్తమవ్వాల్సిందిగా
చెబుతాడు.
దార్ల వెంకటేశ్వరరావు దళిత కవిత్వానికి ఎన్నో కొత్త హంగులద్దేడన్నది
స్పష్టం. ఎన్నో ఆలోచనల్ని కవిత్వంలో మండించేడు. ఓప్రజాస్వామిక సమాజం కోసం, మనిషిని
మనిషిగా గుర్తించే రోజుకోసం, కేవలం మాటలతోనే సరిపెట్టకుండా, ఒక పోరాటానికి
దారివేస్తూ...
ఇప్పుడు కావాల్సింది... ధారాపాతమై కురవడం కాదు... అగ్నినేత్రమై
మండడం.... ఓ వజ్రసంకల్పాన్ని అందించడం... మేధోకార్ఱానాలు మార్మోగటంటాడు.
-డాక్టర్. పి.కేశవకుమార్,
పాండిచ్చేరి యూనివర్సిటి,
పుదుచ్చేరి
21-11-2013
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి