Wednesday, January 07, 2015

‘జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన’’ పుస్తకానికి ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి ముందుమాట ‘‘పరితోషము’’


పరితోషము
-ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి
M.A., Ph.D.(Telugu), M.A., Ph.D.(Sankrit),
Department of Telugu
ANDHRA UNIVERSITY,
Waltair, Visakhapatnam-530 003

                జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులని తట్టుకొంటూ సమాజంలో ఎన్నెన్నో సంఘ్షంణలకు లోనై ధీరోదాత్తతతో పురోగమిస్తూ నిరంతరవాగ్దేవతా వరివస్యాధురంధరులుగా కీర్తిగాంచిన కవిలోకమూర్ధన్యులు ‘‘కళాప్రపూర్ణ’’   సురగాలి తిమోతి జ్ఞానానందకవి.
       నన్నయగారి సంస్కృత పద ప్రచుర శైలీ విన్యాసం, తిక్కన గారి శిల్ప రచనా ప్రాగల్భ్యం, శ్రీనాథుని సీసపద్య శైలూషీ నాట్య విలాస వైవిధ్యం, పెద్దనగారి శిరీష కుసుమపేశల సుధామధుర  పదబంధ బంధురత-  ఇలా ఎందరిమహాకవుల రచనావిన్యాసాలో జ్ఞానానందకవిగారి రచనలలో రాశీభూతంగా  దర్శనమిస్తాయ. తన ప్రత్యేక రచనా వైభవానికి మెఱుగులు దిద్దుతాయ. ‘‘కమ్మని తేట తెన్గు నుడికారపు సొంపు, రసార్థ్ర దివ్యభావమ్ము లిఖింప నేర్పు’’  జ్ఞానానందకవి గారి సొత్తు.
            సనాతన భారతీయసంస్కృతి పరిరక్షణతత్పరత, సంఘ సంస్కరణ దీక్షాదక్షత, పరమోదాత్తసౌహర్ధసంపద, అనల్పపద్యకవితా  ప్రదర్శన    ప్రవీణత  జ్ఞానానందకవిగారికి విద్వజ్జన సమ్మానార్హతని అనుగ్రహించాయి. కవితా విశారద, కవిలోకవిభుషణ, విద్వత్కవిచూడామణి, కవిసార్వ భౌమ, కవితా శ్రీనాథ, పద్య విద్య ప్రభువు-  వంటి అనేక బిరుదులు వాటి అంతట అవే వారిని  వరించాయ. ఆంధ్రవిశ్వకళాపరిషద్దత్త  ‘‘కళాప్రపూర్ణ’’ బిరుదానికి శతశతా సమగ్రంగా సార్థక్యాన్ని చేకూర్చిన ధన్యజీవులు వారు.
             శ్రీ జ్ఞానానందకవిగారి సాహిత్య సర్వస్వంలో ఆమ్రపాలి అనే కావ్యం  మకుటాయమానమనదగ్గది. ఆమ్రరస నిర్బరంగా రచించబడిన ఆ మధురకృతి సాహిత్య చరిత్రలో చిరస్థాయగా నిలువదగ్గది. కావ్యరచనకు సంబంధించి సార్ధక పద ప్రయోగ దక్షత, మధుర బావ ప్రదర్శన ప్రవీణత, సురుచిర రసపోషణ చతురత, సజీవ పాత్ర చిత్రణ సమర్థత, ప్రౌఢ వర్ణనా నిర్వహణ నిపుణత మొదలైన పెక్కు అంశాలు ఆ మహకావ్యంలో  హృద్వానవద్యంగా పోషింపడ్డాయ.
            అహింసా సిద్ధాంతాన్ని లోకానికి ఉపదేశించి ఒక ప్రత్యేక దర్శనానికి  ఆధారభూతుడైన గౌతమబుద్ధుని వ్యక్తిత్వాన్ని ఈ విధంగా ఒక్క సీసపద్యంలో నిబంధించిన జ్ఞానానందకవిగారి ప్రతిభ అనల్పమైనది.
     
 ‘‘తన త్యాగమహిమచే ధర్మమ్ము భువనాన
స్థాపింప దొరకొన్న శాంతిమూర్తి
 తన వాక్ప్రభావాన దయయు శాంతియు భూత
కోటికి నేర్పించు మేటి గురువు
తన తపస్సిద్ధిచే ధారుణీ వలయాన
            జ్ఞానమ్ము పండించు మౌనిమౌళి                             
తన యహింసా సూత్రమున స్వర్గమునకు ని
 శ్రేణిఁ గల్పించు విశిష్ట గుణుఁడు                           
            మానవునకుఁ గ్రొత్త మార్గమ్ము చూపఁగ
 దపము నాచరించు ధర్మపరుడు’’
పాత్రల మానసిక స్థితిగతులని  సహజసుందరంగా  చిత్రించడంలో కవియొక్క సామర్థ్యం ప్రస్ఫుటమౌతూ ఉంటుంది. పాత్ర కూడా చైతన్యవంతం అవుతుంది. లిచ్ఛవులు గణభోగ్యగా కోరగా ఆమ్రపాలి పొందిన మానసిక సంక్షోభని పరమదయనీయంగా జ్ఞానానందకవి ఇలా చిత్రించారుః
 ‘‘అల్లారుముద్దుగా నవనిఁ బెంచినయట్టి
      తల్లిదండ్రుల నెడదఁదలుచి తలఁచి
 చిననాఁటి నుండియు  దనతోఁ  జరించు నె
      చ్చెలుల శ్లేషోక్తికిఁ  గులికి కులికి
 తన విద్దియలకుఁ  గారణ భూతలగు గురున్‌
      బత్తి నిండఁగఁ  జేతులెత్తియెత్తి
 వయసుతో పాటుగఁ  బయనించు కోర్కెలు
      పూడ్చగాఁబడెనంచు నేడ్చి  యేడ్చి
 గుండె పగులునట్లు కుమిలి కుమిలిపోయి
 చెప్పరాని వెతల కుప్పలో నఁ
 గూలఁ  బడిన యామ్రపాలి నెవ్వారలు
 ప్రేమతోడ  నాదరింతు  రొక్కొ?’’
ప్రాచీన గీర్వాణాంధ్రకవి సుత్రాములెల్లరూ తమ ప్రతిభావ్వాష్కల్య నిరూపణకి  వర్ణనలని రంగభూమికగా గ్రహించారు. జ్ఞానానందకవి పూర్వ మహకవుల మార్గంలోనే పయనిస్తూ పరమ ప్రాబంధికంగా అనల్ప కల్పనా సనాథంగా  వర్షారంభాన్ని ఇలా అభివర్ణించారు.   
        
‘‘గ్రీష్మతీక్ష్ణము మహోద్రేకమ్ము  చల్లార
     భేకసంతతి గొంతు విప్పునపుడు
సాంద్ర పయెధర జాలమ్ము ఘనరోద
     సీ వీథి నాట్యమ్ము సేయునపుడు
నలగి కలంగి బీటలు దేరి స్రుక్కిన
     భూదేవి హృదయముప్పొంగునపుడు
ధారాపరంపర నైఋతి పవనమ్ము
     పెడసరియై వీవఁ దొడఁగి  నపుపడు
నీలిగ గనాన మేలి శంపాలతాంగి
మెఱపు  నగవులు కురిపించి మెఱయునపుడు
పృథివి జనులు  గుబ్బగొడుగు  లెత్తినపుడు
చినుగు దొరసాని భువికి వేంచేసె నపుడు’’
ఒక పాశ్చాత్యవిపశ్చిచ్చిఖామణి “Poets are Judged by the frame of mind they induce in us”  అని కవి ఇచ్చే సందేశాన్ని  బట్టి అతని స్ధాయ పరిగణింపబడుతుందని  పేర్కొన్నాడు. జ్ఞానానందకవి తమ చిరకాల జీవితానుభవసారాన్ని పురస్కరించుకొని ఆమ్రపాలి మహకావ్యంలో  లోకానికిచ్చిన ఈ సందేశం సర్వజన సమాదరణీయమైనది.
‘‘పొలివోపు మర్త్యుల కొలఁది జీవితమున
     అగుపింపరాదెప్పడా గ్రహమ్ము
అఱనిముసాననేమగునొ  చెప్పఁగ  లేని
     జడునకెందులకురా  మిడిసిపాటు
కన్ను మూసినతోనె మన్త్నెన మనుజుని
     కేల యార్ష్యాద్వేషహలా హలము
పంచభూతాలచే బంధితుండగు  వాని
      కెందుకీ దౌర్జన్యకృన్మ  నస్సు
సార హీనమైన సంసార జడధిలో
నీదులాడ నెందు కిట్టి లిప్స
క్రుళ్లి పోవు  నీ జుగుప్సాకరంబైన
తనువునకు  నదేల  తామసమ్ము’’
ఈ విధంగా సమీక్షిస్తే శ్రీజ్ఞానానందకవిగారి  ఆమ్రపాలి బహువిధ చమత్కృతి సంభరితంగా  రచింపబడ్డ మధురకావ్యమని  విశదమౌతుంది. కవిగారి మాటలలో చెప్పవలసివస్తే ఆమ్రపాలి  ‘‘ప్రకటీభూత సరన్మరంద రసపూర్ణ, ద్యోగాంగఝరీ నిరంతర చలల్లీలా  విలీసైక వీచిక, చాంద్రీధవళైక మంగిళ మరీచి ప్రాభవోదార దీపిక’’
బింబి సారుడు కావ్యగత అయన ఆమ్రపాలికా సౌందర్యాన్ని ఉద్దేశించి చెప్పిన
‘‘అందాలకు మాటల మక
రందాలకు సర్వసత్కళా జీవన పున్‌
చందాలకు  నందాలకు
మందరమగు నామ్రపాలి... ...’’
అనే ప్రశంస  ఆమ్రపాలిక కావ్యసౌందర్యానికి  కూడా  సమంగా సమన్వయిస్తుంది.
            ఆధునిక యుగాంధ్ర సాహిత్యంలో ఆవిర్భవించిన బుద్ధచరిత్ర, సౌందరనందము వంటి బౌద్ధ సిద్ధాంత ప్రతిపాదక కావ్య పరంపరలో అత్యంత విశిష్టమైన స్థానాన్ని అలంకరించే ఆమ్రపాలి అనే మధుర కావ్యంపై చిరంజీవి దార్ల వెంకటేశ్వరరావు ఎం.ఫిల్., పట్టం కోసం పరిశోధన చేసి విద్వదామోద ముద్రపొంది ఆ పరిశోధన సిద్ధాంత వ్యాసాన్ని అచ్చువేయించడం అస్మదాదులకి పరమ హర్షపదం.

            ఆ గ్రంథంపై ఆ విష్కరింపబడిన పూర్వాంధ్ర సాహిత్య విమర్శకాగ్రేసరుల సమభిప్రాయాలని ఆమూలాగ్రంగా ఆకళింపు చేసుకొని ఆధునిక పరిశోధన పద్ధతిలో ‘‘జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన’’ అనే శీర్షికతో లఘు సిద్ధాంత వ్యాసాన్ని శ్రీ వేంకటేశ్వరరావు సంతరించిన విధం విద్వజ్జన సమభినంద్యం.
            ఈ పరిశోధన సిద్ధాంతగ్రంథం ప్రధానంగా ఆరు ప్రకరణాలలో రచింపబడింది.
            తొలిప్రకరణం ఉపోద్ఘాత ప్రాయం అనదగ్గది. జ్ఞానానందకవిగారి జీవితానికీ సాహిత్యానికీ సంబంధించినది. అందులో జ్ఞానానందకవిగారి జీవితంలోని ప్రధాన ఘట్టాలు రేఖామాత్రంగా ‘‘కొండ అద్దమందుఁ గొంచెమై యుండదా’’ అన్నట్లు చిత్రింపబడ్డాయి. జ్ఞానానందకవిగారి సాహిత్యాభిలాష, సాహితీదృక్పథం సమీక్షిపబడ్డాయి. జ్ఞానానందకవిగారి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అత్యంత సంగ్రహంగా నిరూపించిన పరిశోధకుని ప్రతిభ ఆవశ్యమూ అభినందనీయం.
            ఆమ్రపాలి కావ్యస్వరూప స్వభావాలు రెండో ప్రకరణంలో పరిశీలింపబడ్డాయి. కథకు సంబంధించిన చారిత్రికాంశాలు, ఇతివృత్తానికి గల మూలం, జ్ఞానానందకవిగారు గావించిన మార్పులు, ఎనిమిది ఆశ్వాసాలలోని కథాసారం ఈ ప్రకరణంలో వివరింపబడ్డాయి.
            ఆమ్రపాలి కావ్యంలిని వివిధ పాత్రల స్థితిగతులు ‘పాత్రపోషణ’ అనే మూడో ప్రకరణంలో నిరూపించబడ్డాయి. జ్ఞానానందకవిగారి పాత్రచిత్రణ విధానాన్ని విశ్లేషించిన పరిశోధకుడు ‘‘డా.జ్ఞానానందకవిగారు కొన్ని పాత్రలను వర్ణించేటప్పుడు ఆయా సన్నివేశాలను బట్టి తమతమ బహిరంతర ప్రవృత్తులను తామే వ్యక్తం చేస్తున్నట్లు రాయటం మరికొన్ని చోట్ల పాత్రల్లో కవి అంతర్లీనంగా ప్రవేశించడం కనిపిస్తుంది’’ అని ప్రకటించిన అభిప్రాయం ఆమోదయోగ్యమైనది.
            కావ్యత్వ నిరూపకాలైన వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, రసము- వంటివి ఆమ్రపాలిలో ఏ విధంగా నిర్వహింపబడ్డాయో నాల్గోప్రకరణంలో సమీక్షింపబడ్డాయి. ఆధునిక విమర్శకులు వర్ణనల స్వరూపస్వభావాలని ఎలా వివరించారో, వర్ణనల సంఖ్యా నిర్ణయం పట్ల ఆలంకారికుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఆరంభంలో పరిశోధకుడు క్లుప్తంగా పేర్కొనడం ప్రశంసనీయం. ఆ విషయాలు పరిశోధన వ్యాసాన్ని ప్రమాణబద్ఢంచేస్తున్నాయి.
            ఐదవ ప్రకరణం బౌద్దదర్శనసమన్వయానికి సంబంధించినది. పరిశోధకుడు బౌద్దదర్శనాన్ని బాగా అధ్యయనం చేసి తాత్సారాన్ని ఆమ్రపాలికావ్యానికి సమన్వయిస్తూ నిరూపించిన పద్ధతి పరమశ్లాఘ్యరమణీయం.
            ఆమ్రపాలి కావ్యేతివృత్తం అన్యభాషలలో ఏవిధంగా రచింపబడిందో తులనాత్మకంగా ఆరవ ప్రకరణంలో సమీక్షింపబడింది.
            ఏడవప్రకరణం కేవలం ఉపసంహారానికి సంబంధించినది.
            అనుబంధంలో జ్ఞానానందకవిగారి రచనలు, బిరుదములు, వారితో పరిశోధకుడు ముఖాముఖి గావించిన ప్రసంగం పేర్కోబడ్డాయి.
డా. యస్. టి. జ్ఞానానందకవిగారికీ వారు రచించిన ఆమ్రపాలికీ సంబంధించిన సర్వవిషయాలు సమగ్రంగా పరిశోధించి సంక్షేపంగా ఒక ఉత్తమసిద్ధాంతవ్యాసాన్ని రచించి లోకానికి అందించిన చిరంజీవి దార్ల వేంకటేశ్వరరావు ఆవశ్యమూ అభివంధ్యుడు. ఇతోధికంగా సాహిత్య వ్యాసాంగం చేస్తూ ఉత్తమపరిశోధకుడుగా వర్థిల్లాలని ఆ వర్థిష్ణువుని హార్దికంగా ఆశీర్వదిస్తున్నాను.

శుభం భూయాత్
-వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి,

4-5-1999.

No comments: