నాగప్పగారి
సుందర్రాజు చనిపోయిన తర్వాత అతని గురించి నాకు
తెలిసినంత వరకూ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు తప్ప ఒక్కరు కూడా పత్రికలలో వ్యాసాలు
రాయలేదు. దళిత సాహితీ వేత్తలు దళితుల్లోని కొన్ని ఉపకులాల వారి మరణాలకే సంస్మరణ సంచికలు
వేస్తున్నారు. దళిత పత్రికల వాళ్ళు నాగప్పగారి
సుందర్రాజు గురించి ప్రత్యేక సంచిక వేస్తామంటూనే రోజులు గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఒక గొప్ప సాహితీ వేత్త మరుగున పడిపోయే పరిస్థితులు
కలుగుతున్నాయనిపించింది.
నాగప్పగారి సుందర్రాజు ఆశించిన మాదిగ సాహిత్య
ధోరణినీ,
దాన్ని తీసు కొచ్చిన ఆ సాహితీ వేత్తనీ నామమాత్రంగా స్పర్శించు కోవడమే
తప్ప, అతని వ్యక్తిగత వివరాలు, మరుగున పడిపోతున్నాయి.
ఇది సాహిత్య చరిత్రకు చాలా నష్టం కలిగించే చర్య. నా శక్తి యుక్తుల మేరకు దీన్ని కాపాడాలని
భావించాను. అతని పుస్తకాలు ఇప్పటికే కనుమరుగై పోతున్నాయి. చూస్తూ చూస్తూ ఇలా అతని చరిత్ర
మరుగున పడిపోవడం బాధాకరమనిపించింది.
ఈ నేపథ్యంలో హైదరాబాదు విశ్వవిద్యాలయం, దళిత
స్టూడెంట్స్ యూనియన్ వారు సుందర్రాజు నా అధ్యక్షతన ఒక సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.
ఆ సందర్భంగా ఒక కర పత్రం రాయమని కొంత మంది విద్యార్థులు నా దగ్గరకు వచ్చారు. అప్పుడు కరపత్రం కోసం రాసిన
వ్యాసం ఒక బుక్ లెట్ గా ప్రచురించాను. దాన్ని ఆ రోజు సంస్మరణ సభలో మేరీ మాదిగ,
జాజుల గౌరి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత దీన్ని మరింత వివరంగా
రాయాలని భావించి ఆ వ్యాసాన్ని పెంచి ఈ రూపంలోకి తీసుకొచ్చాను.
నాగప్పగారి
సుందర్రాజుతో నిజానికి నాకున్నది చాలా తక్కువ కాలం పరిచయమే. అయినా
ఆ తక్కువ సమయంలో కూడా ఎక్కువ అనుబంధాన్ని పెనవేసుకున్నాను. అతడు
కూడా నన్ను అంత ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నాడు. అతను రాసిన “ఔను నేను దేశద్రోహినే” కవిత చదివి అతని దగ్గరకు వెళ్ళాను.
అప్పటికి నేను ఎం,ఏ.లో ఉన్నాను.
అతను డాక్టరేట్ చేస్తుండే వాడు. మేమిద్దరం దళితుల
గురించి మాట్లాడుకోవడం ద్వారా అతని ఆలోచనలు నచ్చి నేను అతనికి మరింత దగ్గరయ్యాను.
కలిసినప్పుడల్లా
క్యాంపస్ పరిస్థితులతో పాటు రాష్ట వ్యాప్తంగా మాదిగల స్థితిగతుల గురించి చర్చించుకొనే
వాళ్ళం.
ఆ చర్చల్లో నుండే మాదిగ సాహిత్య వేదిక రూపకల్పన జరిగింది.
మాదిగ
సాహిత్య వేదికకు నన్ను
వ్యవస్థాపక సహాయ కార్యదర్శిగా నియమించాడు. అప్పటికే మాదిగ దండోరా
ఉద్యమం మాదిగల సమస్యలను ప్రజలందరి ముందుకీ తీసుకొస్తుంది.
ఈ
పరిస్థతుల్లో మాదిగ సాహితీ వేత్తలను జాగృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా భావించాడు. క్యాంపస్
కే పరిమితం కాకుండా రాష్ట వ్యాప్తంగా మాదిగ సాహిత్య వేదికను
విస్తరించాలని కలలు కన్నాడు.
కవిత్వం, కథ,
నవల ... ఇలా అన్ని ప్రక్రియల్లోనూ మాదిగ రచనలను
తేవాలనుకున్నాడు. ’మాదిగ చైతన్యం’ కవితా సంకలనానికి నా పేరుతోనే పత్రికా ప్రకటన ఇచ్చి కవితలను సేకరించేలా చేశాడు.
సుందర్రాజుతో
నాకున్నది తక్కువ పరిచయమే అయినా, అతని ఆలోచనల్లో మాదిగల చరిత్ర, సాహిత్యం, సంస్కృతి గురించిన తపన ఎక్కువగా గమనించాను.
అతని ఆశయం పూర్తిగా నెరవేరకుండానే అకస్మాత్తుగా మరణించాడు. అతనిని గుర్తు చేసుకోవడం అంటే మాదిగ సాహిత్యాన్ని గుర్తు చేసుకోవడమే.
మాదిగ సాహిత్యాన్ని గుర్తు చేసుకోవడం అంటే నాగప్పగారి సుందర్రాజుని కూడా
తప్పని సరిగా గుర్తు చేసుకోవడమే.
తెలుగు
సాహిత్యం ఇప్పుడు మాదిగ సాహిత్యాన్ని ఒక ధోరణిగా గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాగే
మాదిగ సాహిత్యం నుండి సుందర్రాజుని విడదీసి చూడలేని పరిస్థితి ఉంది. అందువల్ల సాహితీ వేత్తలు సుందర్రాజుని అనివార్యంగానైనా గుర్తు చేసుకోవలసిందే.
ఒక సాహిత్య ధోరణికే కారణమైన సుందర్రాజుని గుర్తు చేసుకోవడం సాహితీ వేత్తలకూ,
మరీ ముఖ్యంగా మాదిగలకూ ఒక తప్పని సరి అవసరం. దీనిలో
భాగమే ఈ పుస్తకం రాశాను.
పుస్తకంలో
ప్రధానంగా అతని లక్ష్యాలను, ఆశయాలను, స్పందనలను,
అనుభూతులను రికార్డ్ చేశాను. దీన్ని చదివిన ప్రేరణతో
మీరూ అతను గురించి ఏమైనా రాసి ఉంటే నాకు పంపించండి. మలి ముద్రణలో
వాటిని చేర్చడానికి ప్రయత్నిస్తాను. సాహిత్యానికీ తన జీవితాన్ని
అంకితం చేసిన సుందర్రాజుని మాత్రం స్మరించు కోవడం తెలుగు సాహిత్యం చదివే వారందరి విధిగా
భావిస్తున్నాను.
- డా// దార్ల
వెంకటేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి