"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

21 జనవరి, 2014

గిడుగు వారి భాష, సాహిత్యం,సామాజిక దృక్పథం


భావవాదమే ఆయన ప్రాపంచిక దృక్పథమైనా భాషా వ్యవహారంలో మాత్రం సామాజిక వాస్తవాన్ని గుర్తించగలిగిన వ్యక్తిగా గిడుగు రామమూర్తి కనిపిస్తున్నారు. ఎందుకంటే, ఉద్యోగరీత్యా సవరలు అధికంగా నివసించే పర్లాకిమిడి ప్రాంతంలో తన జీవితాన్ని అంతటినీ గడిపారు. ఆ అవసరాలు, అప్పటికే సంస్కరణవాది అయిన గురజాడ అప్పారావుతో పరిచయం ఉండడం వంటివన్నీ భాష పట్ల ఆయనకు ఒక సామాజిక దృక్పథాన్ని కలిగించి ఉండొచ్చు.

గిడుగు వేంకట రామమూర్తి పేరు చెప్పగానే తెలుగు వ్యావహారిక భాషోద్యమాన్ని నడిపిన వాళ్ళలో ఆయన ఒక ప్రముఖుడిగా, సవర భాషా సంస్కృతులపై విశేషమైన కృషి చేసిన వ్యక్తిగా గుర్తుకొస్తాడు. అయితే, ఆనాడు గ్రాంథిక భాష ప్రాచుర్యంలో ఉండగా వ్యావహారిక భాష కావాలని వాదించడంలోగల సామాజిక పరిస్థితులు, ఆయనపై చూపిన ప్రభావాలను గుర్తించాల్సి ఉంది. అలాగే ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టి పెరిగినా, సవరల గురించి పరిశోధనలు కొనసాగించడంలో గల ఆంతర్యాన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది. అసలు ఆయన ప్రాపంచిక దృక్పథం ఏమిటి? ఆయన భాషకే పరిమితమైయ్యారా? లేక సృజనాత్మక సాహిత్యంకూడా రాశారా? సాహిత్యంపట్ల ఆయన అభిప్రాయలేమిటి? ఆయన రాసిన సాహిత్యంలో కనిపించే సమాజం ఎవరిది? మొదలైన ప్రశ్నలకు కొన్ని సమాధానాల్ని అన్వేషించడమే ఈ ప్రయత్నం

జీవితం- దృక్పథం
గిడుగు రామమూర్తి కుమారుడు (గిడుగు సీతాపతి) రాసుకున్న స్వీయ చరిత్ర (1962), ఆయనే రాసిన గతకాలపు స్మృతులు వ్యాసం (1964), గిడుగు వారి స్మారక సంచిక (1940), భారతి, కృష్ణాపత్రిక తదితర పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, సవర భాషపైనా, వ్యావహారిక వాదాల సందర్భంగా రాసిన వ్యాసాలు, వీటిపైనే ఆధారపడి ఇతరులు రాసిన మరికొన్ని వ్యాసాలు, ఉత్తరాలు, చేకూరి రామారావు, నడుపల్లి శ్రీరామరాజులు సంకలనం చేసి సంపాదకత్వం వహించి డెట్రాయిట్‌ తెలుగు లిటరరీ క్లబ్‌ (2005) ప్రచురించిన మరో సారి గిడుగు రామమూరి (వ్యాసాలు, లేఖలు) పుస్తకం- ప్రధానంగా గిడుగు వారి జీవితాన్ని, ఆయన దృక్పథాన్ని తెలుసుకోవడానికి ఆధారాలుగా కనిపిస్తున్నాయి.

గిడుగు రామమూర్తి పూర్వీకులు నేటి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర్లోని ఇందుపల్లి వాస్తవ్యులు. తర్వాత కాలంలో విజయనగరం దగ్గర్లోని పర్వతాల పేటకు వలస వెళ్ళారు. అక్కడే వెంకమ్మ, వీర్రాజులకు 1863 ఆగస్టు 29న రామమూర్తి జన్మించారు. నేటికీ ఇందుపల్లి ప్రాంతంలో వీరి కొబ్బరి తోటలు ఉన్నాయని రామమూర్తి కుమారుడు సీతాపతి ఒక వ్యాసంలో ప్రకటిం చారు. ఆయనకు దైవం పట్ల నమ్మకం ఉందని వీరేశలింగం కి రాసిన లేఖను బట్టి తెలుస్తుంది. కాబట్టి భావవాదమే ఆయన ప్రాపంచిక దృక్పథమైనా భాషా వ్యవహారంలో మాత్రం సామాజిక వాస్తవాన్ని గుర్తించగలిగిన వ్యక్తిగా గిడుగు రామమూర్తి కనిపిస్తున్నారు. ఎందుకంటే, ఉద్యోగరీత్యా సవరలు అధికంగా నివసించే పర్లాకిమిడి ప్రాంతంలో తన జీవితాన్ని అంతటినీ గడిపారు. ఆ అవసరాలు, అప్పటికే సంస్కరణవాది అయిన గురజాడ అప్పారావుతో పరిచయం ఉండడం వంటివన్నీ భాష పట్ల ఆయనకు ఒక సామాజిక దృక్పథాన్ని కలిగించి ఉండొచ్చు. ప్రాచీన కావ్యాల్లో కూడా వ్యావహారిక భాషను చూపించే ప్రయత్నం చేసి, ప్రజల వాడుకలో ఉంటేనే భాష నిలుస్తుందనేది ఆయన వాదం. మనం మాట్లాడుకునే భాషలోనే రచనలు కూడా వస్తే బాగుంటుందనీ, ఎక్కువమందికి విజ్ఞానం అందుబాటులోకి వస్తుందనేది ఆయన ఆశయం. అందుకోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలను అతిశయోక్తితో పొగిడేసినవాళ్ళున్నారు. `గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషావాదం లేవనెత్తడంతో తెలుగు కావ్యభాషాస్వరూపం మారిపోయింది' అని శ్రీశ్రీ అన్నారు. నిజానికి గిడుగు వారు వ్యావహారిక భాషావాదానికి కృషి చేసినా, ఆయన జీవించిన కాలంలోనే అది సంపూర్ణంగా విజయవంతం కాలేదు. ఆ విషయాన్ని గిడుగు వారే స్వయంగా చెప్పుకున్నారు కూడా. కానీ, ఆ ప్రయత్నాలు- తర్వాత కాలంలో విజయవంతం కావడానికి తోడ్పడ్డాయనుకోవచ్చు. ఇవన్నీ పరిశీలించినప్పుడు ఆధునిక వ్యావహారిక భాషను పరీక్షల్లో రాయగలిగే అవకాశంఉంటే సామాన్య, మధ్యతరగతివారికి కూడా విద్యార్జనకు అవకాశం కలుగుతుందనేది- భాషా వ్యవహారానికి సంబంధించిన ఆయన దృక్పథమని గుర్తించవచ్చు.

సవరలను అత్యంత దగ్గరగా పరిశీలించడంతో వారి గురించి లోకానికి తాను గమనించిన వాస్తవాల్ని తెలపాలనే జిజ్ఞాసే ఆయనను సవరలపై పరిశోధనకు పురిగొల్పి ఉంటుంది. అయితే, సవరలపై పరిశోధన చేయడానికి ఆయనకున్న మానవతాదృష్టే ప్రధాన కారణంగా చేకూరి రామారావు వ్యాఖ్యానించారు. సవరభాష నేర్చుకుంటేనే, వారితో బాగా కలిసిపోవచ్చు అనుకున్నారు. `హరిజనోద్ధరణ జరగడానికి 40 సంవత్సరాల ముందే 1894 ప్రాంతంలోనే గిరిజనులైన సవరలు (శబరులు)- వాళ్ళలో మళ్ళీ అంటరానివాళ్ళని తన ఇంటి దగ్గర పెట్టుకొని, దగ్గరగా కూర్చొని సవరభాష నేర్చుకున్నారు' అని సంస్కర్తగా గిడుగువారిని అడపా రామకృష్ణారావు అంచనా వేశారు. ఇవన్నీ పరిశీలించినప్పుడు గిడుగు రామమూర్తి అగ్రస్థానంలో సామాజిక గౌరవానికి నోచుకున్న వర్గంనుండి వచ్చినప్పటికీ, తన జీవితావసరాల రీత్యా సమాజంలో అట్టడుగు వర్గాలవారితో జీవించాల్సిన పరిస్థితుల్లో ఆయన జీవిత దృక్పథంలో మార్పు వచ్చిందని అనుకోవచ్చు. అదే ఆయన భాషాదృక్పథాన్నీ ప్రభావితం చేసి ఉంటుంది. `పేదవాళ్ళకి, పసిపిల్లలకు, స్త్రీలకు వాళ్ళకు అర్థమైన భాషలో విజ్నాన బోధ రామమూర్తిగారికి వ్యావహారిక భాషా వాదానికి లక్ష్యం. అదే ఆయన జీవితాశయం'. గురజాడ వారు మద్రాసు విశ్వవిద్యాలయం వారికి సమర్పించిన `డిసెంటు పత్రం'(అసమ్మతి పత్రం) లో ఉన్నటువంటి వాదనే గిడుగు వారి వాదనలోనూ కనిపిస్తుందని భాషావేత్తల అభిప్రాయం.

సాహిత్య దృక్పథం
కవిత్రయ మహాభారతం అంటే గిడుగు వారికి చాలా ఇష్టం. కథలు కూడా చదివే వారు. వాటి గురించి నిర్మొహమాటంగా మాట్లాడేవారు. యీసఫ్‌ కథలను సవరభాషలోకి అనువాదం చేశారు.1919లో `తెలుగు' పత్రికను స్థాపించి, కేవలం భాషకు సంబంధించినవే కాకుండా సృజనాత్మక సాహిత్యానికికూడా ప్రాధాన్యాన్నిచ్చేవారు. గ్రాంథిక వాదుల ఆక్షేపణలను తిప్పి కొట్టాలని ఈ పత్రికను నడిపారు. 1914లో `నిజమైన సంప్రదాయం' పేరుతో చిన్న పుస్తకాన్ని రాశారు. `వచన సాహిత్యం వ్యావహారిక భాషలో రాయడమే నిజమైన సంప్రదాయం'అని వాదించడమే ఈ రచన లక్ష్యం.

1932లో `అప్పకవీయ విమర్శనము' తాళపత్రకావ్యాలను పరిశీలించి రాసిన గ్రంథాన్ని బట్టి గిడుగు రామమూర్తి సాహిత్యాధ్యయనం విస్తృతంగానే చేసేవారని తెలుస్తుంది. చిన్నయసూరి `నీతిచంద్రిక' రెండవ ముద్రణను రామమూర్తిగారే ప్రచురించడంవల్ల సాహిత్యం ద్వారా భాషావ్యాప్తి కలుగుతుందని భావించారు. `ఆంధ్రపండిత భిషక్కలు- భాషా భేషజం', `బాల కవిశరణ్యం' పుస్తకాల్లోని భావాలను ముందుగా `తెలుగు' పత్రికలోనే ప్రచురించారు. `వ్యావహారిక భాషలో వ్రాసినపుడు కావ్యమెంత రసవంతంగా వుంటుందో నీకు అనుభవం మీద కాని తెలియదు. ఏదీ నీ కలాన్ని ఒక్కసారి అటువైపు తిప్పు' అని పర్లాకిమిడి పాఠశాలలో పనిచేసేటప్పుడు యల్లాపంతుల జగన్నాథం గారితో చెప్పడం వంటివన్నీ చూస్తే, సాహిత్యం వ్యాప్తికి కూడా వ్యావహారిక భాషను ఒక సాధనంగా వాడుకున్నారని తెలుస్తుం ది. ఆ తర్వాత జగన్నాథం రాసిన `గాదెల గండడు'అనే బొƒబ్బిలి పాట వరుసలో రాసిన గేయ ప్రబంధానికి `పీఠిక' కూడా రాశారు. `ముఖలింగ క్షేత్రమహాత్మ్యం' కావ్యం ఆధారంగా, శాసనాల ఆధారంగా `ముఖలింగ నగర ప్రాచీనత'ను గుర్తించారు. ముఖలింగక్షేత్రం'- `బెనారస్‌' లాంటి దని క్షేత్రమాహాత్మ్యం వర్ణించిందని, ఆ ఆధారంతో పరిశోధించి దీన్నే ప్రాచీనకాలంలో `జయంతి పురం' అని పిలిచేవారని నిరూపించారు.
నేటి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం దగ్గర్లోని కొంకు దురు గ్రామంలో కొన్ని శాసనాలు దొరికాయి. వాటిలో ఒకటి కొంకుదురు శాసనం. అది 1887 లో దొరికింది. దాన్ని మద్రాసు మ్యూజియంలో భద్రపరి చారు. వాటిని పరిష్కరించడానికి రామమూర్తికి పంపితే, దానిలో పేర్కొన్న అంశాలను శ్రీనాథుని `భీమఖండం' ఆధారంగా పరిశీలించారు. అందులోని అంశాలు అమలాపురం దగ్గర్లోని వెదిరేశ్వరం, పలివెల, ముమ్మిడివరం అనే గ్రామాలకు చెందినవని గుర్తించారు. నాటి సామాజిక స్థితినీ, దానవిశేషాల్ని కావ్యవిశేషాలతో పోల్చి చెప్పారు. సవరలకు సంబంధించిన `సవర పాటలు' సేకరించారు. 32 పాటలున్న వాటిలో- 30 పాటల్ని సేకరించారు.

20 స్వయంగా రాశారు . సవరల పాటల సేకరణకు చాలా కష్టడ్డారు. వాళ్ళ సంస్కృతిని రక్షించే ప్రయత్నం చేశారంటే, కింది వర్గాల సంస్కృతి పట్ల ఆయనకున్న గౌరవం వ్యక్తమవుతుంది. సవరలపై పరిశోధన చేయాలనుకోవడమే ఆయన సామాజిక దృక్పథాన్ని తెలుపుతుంది. ఆయన రాయాల్సిన విషయాలన్నీ ఆయన కుమారుడు సీతాపతి వ్యాసంగా రాశారు. సవరలను నేడు గిరిజనులుగా గుర్తిస్తున్నారు. వారి గురించి ఐతరేయ బ్రాహ్మణం నుండి అనేక కావ్యాల్లో పేర్కొన్న అంశాలను, సమాజంలో ఉన్న వాస్తవ స్థితిగతుల్ని వివరిస్తూ గొప్ప పరిశోధన చేశారు. సవరలు గంజాం, విశాఖజిల్లాల్లోను, ఒరిస్సా, బెంగాల్‌, సంబల్‌ పూర్‌ మొదలైన ప్రాంతాల్లో ఉండేవారని పేర్కొన్నారు. మహాభారతం, శాంతి పర్వంలో వీరి ప్రస్తావన కనిపిస్తుంది. విశ్వామిత్రుడు శపించిన వారిలో ఒకరిగా పేర్కొన్నారు. రామాయణంలో శబరి నేటి సవరలకు సంబంధించిందే అన్నారు. ఇలా అనేక అంశాలను పరిశోధించారు.గిడుగు వారి పరిశోధనను నడుపల్లి శ్రీరామరాజుగారి అభిప్రాయంతో ముగించడం సముచితంగా ఉంటుందనిపిస్తుంది.`తెలుగు సవర భాషల మీద ఆయన చేసిన అద్భుతమైన పరిశోధనల కంటే, వారు చేసిన అమూల్యమైన శాసన పరిశోధనల కంటే, రచనలలో వాడుక భాషా వ్యాప్తికి వారు చేసిన కృషి కంటే, వారి వ్యక్తిత్వం గొప్పది'. మొత్తం మీద కింది వర్గాల పట్ల, వారి సంస్కృతి-చరిత్రల పట్ల గౌరవభావాన్ని ప్రకటించిన విశిష్ఠ వ్యక్తిత్వం గిడుగు వారిదని- సవరలపై ఆయన చేసిన మొత్తం పరిశోధన కృషి తెలుపుతుంది. వ్యావహారిక భాషోద్యమంలో ఆయన చేసిన వాదాలు, ఉద్యమాలు భాషలోని శక్తిని అందరికీ అందేలా చేసిన ప్రయత్నంగా స్ఫష్టమవుతుంది. ఇవన్నీ ఆయన సామాజిక దృక్పథాన్నీ తెలియజేస్తున్నాయి.
(జనవరి 22 గిడుగు రామమూర్తి పంతులు వర్ధంతి)

కామెంట్‌లు లేవు: