"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

28 మార్చి, 2013

దళితసాహిత్యం పై శిఖామణిగారి ప్రసంగం – నా అనుభూతులు, విశ్లేషణ

మాట్లాడుతున్న ప్రముఖకవి శిఖామణి ( ఆచార్య కె.సంజీవరావు)గారు


నిన్న (27-03-2013) మా తెలుగుశాఖ ఆధ్వర్యంలో ప్రముఖకవి శిఖామణి ( ఆచార్య కె.సంజీవరావు)గారి ప్రసంగాన్ని  ఏర్పాటు చేశారు. ‘‘తెలుగు సాహిత్యంలో దళితవాద భూమిక’’ అనే అంశంపై ఆయన్ని ప్రసంగించమన్నారు. తెలుగుశాఖవారి ఉపన్యాసపరంపరలో భాగంగా దీన్ని ఏర్పాటుచేశారు. సెంట్రల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ ఆడిటోరియంలో ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. శిఖామణిగార్ని నన్ను పరిచయం చేయమన్నారు- మాతెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణిగారు.
 కవి శిఖామణిగా ప్రసిద్ధి చెందిన కె. సంజీవరావుగారు ‘సంజీవిని లాంటి కవిత్వం రాసిన కవి’ అని చెప్పి, ఆయన పుట్టిన వివరాలను ప్రస్తావించి, ఆయన రెండు డాక్టరేట్లను చేశారని, ఆయన దగ్గర పరిశోధన జరిగిన వివరాలను కూడా వివరించాను. తర్వాత ఆయన రాసిన కవితాసంపుటులను, విమర్శ గ్రంథాలను పేర్కొన్నాను. ఈ మధ్య జరిగిన ప్రపంచమహాసభల సందర్భంగా శిఖామణిగారు ‘దళితసాహిత్యోద్యమం’’ గ్రంథాన్ని రాసిప్రచురించారు. అది దళితసాహిత్యాన్ని అవగాహన చేసుకోవడానికి, అందరినీ దళిత సమస్యల గురించి ఆలోచించడానికీ, ఉపయోగపడే రచనగా ఆవేశానికి దూరంగా ఉండి రాసిన రచనగా, వస్త్వాశ్రయంగా కొనసాగిన రచనగా దీన్ని గుర్తించవచ్చనిపించింది. దీన్ని విశ్వవిద్యాలయస్థాయిలో తప్పనిసరిగా చదవదగిన పుస్తకంగా నేను భావిస్తున్నాను.
ఆయన గురించీ, ఆయన కవిత్వం, కవితానిర్మాణం, ఆయన తన కవిత్వంలో తీసుకున్న వస్తువైవిధ్యాన్ని గమనించాలంటే సౌభాగ్య రాసిన ‘శిఖామణి కవిత్వం-తాత్త్విక సౌందర్యం’’ పుస్తకాన్ని చదివితే మరెన్నో విషయాలు తెలుస్తాయని వివరించాను. శిఖామణిగారు ప్రధానంగా మూడు ప్రక్రియల్లో రచనలు చేశారనీ, అవి కవిత్వం, పరిశోధన, విమర్శలనీ, పరిశోధన-విమర్శల కంటే ఆయన కవిగా పిలిపించుకోవడానికి ఇష్టపడుతుంటారని వ్యాఖ్యానించాను.
ఆయన కవిత్వం సౌందర్యభరితంగా ఉంటుంది. వస్తువుతో సంబంధంలేకుండా పాఠకులంతా ఆ కవిత్వంతో తాదాత్మ్యం చెందుతుంటారు. దళితసమస్యల్ని వర్ణించినా ఆ సమస్యల్ని పాఠకులందరిచేతా అంగీకరింపజేసేగుణం ఆయన కవిత్వంలో ఉంటుంది. సున్నితత్త్వంతో పాటు సూటిదనం ఆయన కవిత్వంలో స్పష్టంగా కనిపించే గుణం. ఇది ఆయన కవిత్వంలో కనిపించే ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకూ మనలో చాలామందికి శిఖామణిగారు ఆయన రచనల ద్వారా మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినబోతున్నాం. తర్వాత ఆయనతో మాట్లాడబోతున్నాం. ఈ మూడు పద్ధతుల్నీ సమన్వయించుకోవడం ద్వారా శిఖామణిగారు పరిచయం కావడమే నిజంగా ఆయన మనకు పరిచయం కావడం. ఆయన్ని పరిచయం చేయడానికి వెబ్ సైట్ ( www.sikhamani.com ) నుండి సుమారు ఎనిమిది పేజీలు ప్రింటుతీసుకొచ్చాను. దీన్ని చూసిన శిఖామణిగారు ‘‘నాగురించి చెప్పడానికే సమయమెక్కువగా తీసుకోవడం కంటే, నాకు మాట్లాడడానికి ఎక్కువ సమయమిస్తే సంతోషిస్తాన’’ని నాతో ముందుగానే చెప్పారు. అందువల్ల దీన్నంతటినీ పరిచయం చేయలేకపోతున్నాను. ఆయన గురించిన మరిన్ని విషయాలను ఆయన పేరుతో ఉన్న వెబ్ సైట్ లో మనం చూసుకోవచ్చు; ఆ అవకాశం మన యూనివర్సిటీ వాళ్ళకెంతగానో ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ళు వెబ్ సైటులో చూడొచ్చు.
మనకు ఎం.ఏ., తెలుగులో దళితసాహిత్యం ఒకకోర్సుగా ఉండటం, అదీ ఈ సెమిస్టర్ ( ఫైనల్ సెమిస్టర్) లోనే ఉండటం వల్ల  దళితసాహిత్యంపై ప్రసంగాన్ని ఏర్పాటుచేయడం ఎంతో ఔచిత్యంగా ఉందనిపిస్తుంది. ఇది నాకు వ్యక్తిగతంగా కూడా సంతోషంగా ఉంది. ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేసినందుకు మేడమ్ గార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
దళితసాహిత్యంలో ఒక గొప్పకవిని పరిచయం చేసే అవకాశం నాకు లభించడం ఎంతోసంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు కలిగించినందుకు తెలుగుశాఖలోని ఇతర అధ్యాపక బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని శిఖామణిగారిని పరిచయం చేశాను.
శిఖామణిగారు చాలా హూందాగా, సంయమనంతో, సమయస్ఫూర్తితో ప్రసంగించారనిపించింది. దళిత సాహిత్య తాత్త్విక భూమికను వివరించే క్రమంలో 1909 మాలవాండ్రపాట నుండి మాత్రమే ఆయన ప్రారంభించారు. అంతకు ముందున్నదాన్ని కూడా వివరించాలంటే సమయం సరిపోదని అన్నారు. అందువల్ల ఆధునిక తెలుగుసాహిత్యంలో దళితసాహిత్యభూమికను వివరించేప్రయత్నం చేస్తున్నానని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. (ఇక్కడ శిఖామణిగారు జాగ్రత్తగా సంప్రదాయవాదలును ఏమీ వ్యాఖ్యానించకుండా బయటపడే మార్గాన్ని చక్కగా ఎన్నుకున్నారనిపించింది.) మాలవాండ్రపాట ఆంధ్రభారతిలో అజ్ఞాతకవి పేరుతో ప్రచురితమైనప్పటికీ, దాన్ని నిరుద్ధభారతం రాసిన కవి మంగిపూడి వెంకటశర్మ రాసి ఉండొచ్చని వ్యాఖ్యానించారన్నారు. నాకీ విషయంలో ఆయన ప్రసంగం కొంత స్పష్టతనిచ్చినట్లయ్యింది. అయితే అప్పుడు కాశీనాథుని నాగేశ్వరరావు ప్రత్యక్షరాజకీయాల్లో ఉండి, కాంగ్రెస్ వైపు దళితులను తిప్పవలసిన బాధ్యతల్లో ఉన్నారు. ఆంధ్రభారతి పత్రికలో ‘మాలవాండ్రపాట’ ఆయనే రాసి ఉండొచ్చనిపిస్తుంది. కానీ, కాంగ్రెసు సానుభూతిపరుడైన మంగిపూడివారిచేత ఆ పాటను రాయించి కూడా  ప్రచురించే అవకాశం లేకపోలేదని శిఖామణిగారి ప్రసంగం విన్న తర్వాత అనిపిస్తుంది. కానీ, ఈ విషయాలన్నీ శిఖామణిగారు వివరించలేదు. కాశీనాథునినాగేశ్వరరావుగారి ప్రస్తావన కూడా చేయలేదు.
 జాతీయోద్యమంలో భాగంగా కొనసాగిన సంస్కరణోద్యమంలో భాగంగా తెలుగులో దళితసమస్యలను దళితేతరులు కూడా రాశారని అన్నారు. దీనిలో గాంధీజీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. తమవర్గాన్ని సంస్కరించుకొనే దిశగా దళితులపై సహానుభూతితో ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఇది కూడా కొత్తవ్యాఖ్యానంగా నాకు అనిపించింది.
తర్వాత తొలితరంలోని కుసుమధర్మన్న, గుర్రం జాషువ,  బోయిభీమన్న మొదలైన వాళ్ళు తమ సమస్యల్ని తామే రాస్తామంటూ ముందుకొచ్చిన సాహితీవేత్తలుగా గుర్తించాలంటూనే, వీరి సాహిత్యంలో గాంధీజీ సంస్కరణోద్యమ ప్రభావం ఉందని, విశ్వవిద్యాలయ స్థాయిలో తొలితరం దళితసాహితీవేత్తగా ఆచార్యకొలకలూరి ఇనాక్ గారి గురించి  అంచెనా వేశారనిపించింది.ఇది వాస్తవానికి దగ్గరగా ఉందనిపించింది.
ఆ తర్వాత విప్లవోద్యమం నుండి స్ర్తీలు బయటకొచ్చిన వివరణ నాకు బాగా నచ్చింది. తమకు భార్యలుగా ఉండమనీ, మగపిల్లల్ని కనడానికి సహకరించమనడం వంటి వాటిని వ్యతిరేకించి ఆ ఉద్యమం నుండి బయటకొచ్చి ఆనాడు పత్రికల్లో ఆ విషయాలన్నీ వివరించారని, తర్వాత తెలుగులో స్ర్తీవాదసాహిత్యం ప్రారంభమైందని చెప్పిన సందర్భాన్ని హేతుబద్ధంగా, సోదాహరణంగా స్పష్టం చేసినట్లనిపించింది. అలాగే గిరిజన, దళిత, బహుజనులు విప్లవోద్యమాల్లో ముందుండి ఆత్మత్యాగాలకే ఉపయోగపడుతున్న స్థితినీ, తమ కులసమస్యల్ని పట్టించుకోని అగ్రవర్ణస్వభావాన్నీ వ్యతిరేకించి విప్లవోద్యమం నుండి శివసాగర్ బయటకొచ్చారని, ఆ తర్వాత ఆయన దళితసాహితీవేత్తగా మారారనీ, ఇప్పుడు చందుసుబ్బారావుగారిలాంటి ఎంతో మంది విరసం సానుభూతి పరులు కూడా కులసమస్యను అర్థం చేసుకోవడానికి అంబేద్కర్ రచనలను చదువుతున్నారని చెప్పిన విశ్లేషణ కూడా నాకు  బాగా నచ్చింది.  కొంతమంది పునర్మూల్యాకనం పేరుతో తమ గురించి ఎందుకు రాయలేదని తమకిష్టం వచ్చినట్లు కూడా రాస్తున్నారు. కొంతమందే అన్నీ రాయాలనేమీలేదు; రాసిన వారి పరిధినీ కూడా ఆలోచించి విమర్శించాలన్నారు.
ఈ వ్యాఖ్య చేస్తున్నప్పుడు చాలా మంది నావైపు ఒక్కసారిగా చూసినట్లనిపించింది. కొంతమంది గుసగుసలాడుకోవడం కూడా కనిపించింది. ఇది విప్లవోద్యమం గురించి చెప్తున్న క్రమంలో కాబట్టి, నాకెందుకో నన్ను ఉద్దేశించి అంటున్నారని నేను అనుకోలేదు. కానీ, వీళ్ళంతా అనుమానంగా నన్ను చూడ్డం మొదలు పెట్టడం, ఆయన ప్రసంగం పూర్తయిన తర్వాత ఒకరిద్ధరు ‘నీ పునర్మూల్యాంకనం’ గురించేనా ప్రస్తావించింది?’ అనడంతో వాళ్ళతో కాదన్నా, నాకు కూడా అనుమానం మొదలైంది. అందుకని దాన్ని నివృత్తి చేసుకోవడమే మంచిదనిపించింది. నేను ఇంటికొచ్చేసి, ఆయనకు ఫోను చేశాను. ఈ విషయం గురించి కొంచెం వివరణ కావాలన్నాను. ‘అయ్యో... దాన్ని అక్కడే అడిగినా చెప్పి ఉండేవాణ్ణి కదా దార్ల గారూ... ’’ అని ఆయన అభిప్రాయాన్నిలా వివరించారు. ‘‘ గురజాడ, శ్రీశ్రీ మొదలైన వాళ్ళంతా దళితులు, బహుజనుల గురించిరాయలేదని బి.యస్.రామలు మొదలైన వాళ్ళు పునర్మూల్యాంకనం పేరుతో విమర్శరాస్తున్నారు. నేను వాళ్ళను ఉద్దేశించే అలా అన్నాను. మీరు ‘పునర్మూల్యాంకనం’పేరుతో ఒక పుస్తకం ప్రచురించడం వల్ల అలా భావించుకున్నారేమో... అది మిమ్మల్ని ఉద్దేశించింది కాదండీ’’ అని శిఖామణిగారు వివరణ ఇచ్చారు. నాకిది సంతృప్తినిచ్చింది. ఒకవేళ నన్నే ఉద్దేశిస్తే కూడా దాని తెలుసుకోవడానికి కూడా ఫోను చేశాను. వెంటనే ఆయన మనసులోని అభిప్రాయాన్ని తెలుసుకోవడం వల్ల నా మనసు కూడా తేలికైనట్లయ్యింది. ఇక ఎవరేమనుకున్నా నాకేమీ ఇబ్బంది లేదనిపించింది.
అలాగే దళితసాహిత్యంలో మద్దూరినగేష్ బాబు మరికొంతమంది కొంత ఆవేశంతో తొలిదశలో ప్రయోగించిన పదజాలం దళితసాహిత్యానికి కొంత నష్టం చేసిందని అంగీకరించాలనే స్వరంతో చెప్పిన మాటలు కూడా వాస్తవికతను వివరించేలా అనిపించాయి. అయితే కర్నాటకలో  దళితుణ్ని చెట్టుకి కట్టేసి బలవంతంగా చెప్పులతో మలాన్ని తినిపించి, నోట్లో మూత్రం పోసిన సంఘటన చదివినప్పుడు ఆవేశం రాకుండా ఎలా ఉంటుందనీ అందుకనే ఆ జీవితాలను అనుభవించేవాళ్ళు ప్రయోగించే పదజాలం తీవ్రస్థాయిలో ఉండటంలో కూడా పెద్దనేరంగా భావించాల్సిన పనిలేదని చెప్పిన వివరణలు చాలామంది చేత అంగీకరించేలా ఉన్నాయనిపించింది.
ప్రపంచదేశాల్లో ముఖ్యంగా  దక్షిణాప్రికావంటి దేశాల్లో బండిలో మనుష్యుల్ని కూర్చోబెట్టుకొని నేటికీ మనుషులే లాగుతుంటారంటే అదెంతో మానవహక్కుల ఉల్లంఘనగా భావించాలని గగ్గోలు పెడుతున్నవాళ్ళు, మనదేశంలో మనిషి మలాన్ని చేతులతో ఎత్తి, నెత్తిన పెట్టుకొని దాన్ని దూరంగా పడేసి శుబ్రం చేస్తున్నదాన్నెలా అర్థం చేసుకోవాలని, ఆ వస్తువుతో వచ్చిన రచనలను పేర్కొంటూ వివరించిన వివరణ కూడా బాగుందనిపించింది.
తెలుగులో దళితసాహిత్యభూమిక ఏర్పాటు కావడంలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పాత్రను విస్మరించలేమని, ఇక్కడ నుండి వచ్చిన గుండెడప్పు, దళితమ్యానిఫెస్టో మొదలైన కవితా సంకలనాలను ప్రస్తావించారు. గుండెడప్పు పేరుతోనే ఒకకవితను రాసిన కనకయ్యను, పుస్తకాన్ని తీసుకొచ్చిన నాగప్పగారి సుందర్ రాజు, పట్టేటి రాజశేఖర్, కోయికోటేశ్వరరావు, జి.వి.రత్నాకర్ లను, కవితలు రాసిన చల్లపల్లి స్వరూపరాణి,  దార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళెంతో మంది దళితసాహిత్యం ఒక రూపంలోకి రావడానికి కృషి చేశారు, నేటికీ చేస్తున్నారని చెప్పారు.
దళితసాహిత్య తాత్త్విక భూమికలో పత్రికల పాత్రను, వివిధ సాహితీ సంస్థల కృషినీ  గుర్తించాల్సిన అవసరమెంతో ఉందన్నారు. నలుపు పత్రిక దళిత, బహుజనుల సమస్యలను వర్గదృక్పథంలో వివరించిందనీ, తొలుత బొజ్జాతారకం వర్గస్పృహతోను; కత్తిపద్మారావు హేతువాద దృక్పథంతోను పనిచేశారనీ, తర్వాత దళిత సమన్యల్ని కులదృష్టితో చూడ్డం మొదలు పెట్టారనీ విశ్లేషించారు. చివరికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సైద్ధాంతికధోరణుల ఫలితంగా దళితసాహిత్యంలో కూడా పోష్టుమోడర్న్ భావాలు ప్రవేశించాయనీ, సమస్యలను ఖండ ఖండాలుగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నారనీ, దీన్ని కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులే ముందుగా అందుకున్నారనీ, అందుకనే ప్రారంభంలో దళితసాహిత్యవేదికగా ప్రారంభమైనా, తర్వాత మళ్ళీ దాని నుండి విడివడి మాదిగసాహిత్యవేదిక ఏర్పడిందనీ  పేర్కొన్నారు. ఆయన సుమారు గంటన్నరు మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్య క్రమాన్ని 1909 నుండీ శాస్ర్తీయంగా వివరిస్తూనే దళితసాహిత్యానికి డా.బి.ఆర్. అంబేద్కర్ భావజాలమే తాత్త్విక భూమికగా స్థిరీకరించే ప్రయత్నం చాలా సమర్ధవంతంగా చేశారనిపించింది. దళితసాహిత్యం వివిధ మార్గాల్లో పయనిస్తుందనీ, ప్రాంతీయవాద సాహిత్యం ముఖ్యంగా తెలంగాణా సాహిత్యం, తర్వాత మైనారిటీ సాహిత్యం, స్ర్తీవాదంలో దళిత స్ర్తీవాదం మొదలైన విభాగాలుగా విడిపోయి కొనసాగుతోందన్నారు. ఇక్కడెక్కడా తెలుగులో దళితసాహిత్యం నుండి విడివడి గానీ, దానిలోని ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ గానీ మాదిగసాహిత్యం వస్తుందని ఆయన గుర్తించిన దాఖలాలు ఎక్కడా ఆ ప్రసంగంలో కనిపించలేదు.
చివరిగా ఒక మాట. ఆయన నన్ను సంబోధిస్తూ ‘‘ తమ్ముడు దార్ల ’’ అని వేదికపైనే ప్రకటించడం ఎంతో ఆత్మీయంగా అనిపించింది. 
(ఈ సమావేశానికి మా తెలుగుశాఖలోని అధ్యాపకులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య తుమ్మల రామకృష్ణ, ఆచార్య జి.అరుణకుమారి, ఆచార్య రామకృష్ణశాస్ర్తి, డా.పమ్మిపవన్ కుమార్, డా. బి.భుజంగరెడ్డి, డా.డి.విజయలక్ష్మిగారలు పాల్గొన్నారు. మిగతా అధ్యాపకులు ఆచార్య ఎన్.ఎస్.రాజు, డా.పిల్లలమర్రిరాములు, డా.డి.విజయకుమారిగార్లు హాజరుకాలేదు)
-దార్ల వెంకటేశ్వరరావు, 28-03-2013.

కామెంట్‌లు లేవు: