"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

26 December, 2012

భాషావృద్ధిలో ద్విముఖవ్యూహాలు?

(‘భాషావృద్ధిలో ద్విముఖవ్యూహాలు’ శీర్షికతో రాసిపంపిన నా వ్యాసాన్ని ‘తెలుగుకు గురజాడ చికిత్స వాడుకే వేడుక’ పేరుతో 24-12-2012 న సూర్యదినపత్రిక ‘అక్షరం’ సాహిత్యపుటలో ప్రచురించింది.
ఆ వ్యాసాన్నిక్కడ పున: ప్రచురిస్తున్నాను... దార్ల )
ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగుభాష అమలు గురించి విస్తృతంగానే చర్చజరుగుతోంది. భాషాప్రయుక్తరాష్ర్టంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడం, తెలుగు అధికారభాషకావడం, అది ప్రభుత్వకార్యకలాపాల్లో కనిపించక పోవడంతో భాషాభిమానుల్లో సహజంగానే దాగి ఉన్న అసహనం సమయం చూసుకొని కట్టలు తెంచుకొని బయట పడుతోంది. ఆవేశాన్ని కాసేపు పక్కనపెట్టి ఆచరణలోని వాస్తవికతను ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు భాషపెై కూడా ప్రభావాన్ని చూపిస్తుంటాయి. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత ఇది నిరూపితమైంది కూడా! సంప్రదాయవృత్తుల్లోనే ఉండిపోయేవాళ్లెలా అభివృద్ధిలోని వేగాన్ని అందుకోలేకపోతారో, మారుతున్న పరిస్థితుల్ని అవగాహన చేసుకొని దానికి అనుగుణమైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించలేని వాళ్లూ అలాగే వెనకబడిపోతుంటారు.

దీనిని గుర్తించిన భారతీయుల్లో చాలామంది వారి వారి ఆర్థిక స్థోమతల్ని బట్టి విదేశీ భాషల్ని అభ్యసించినవాళ్ళే తర్వాత కాలంలో పాలకులుగా, ఉన్నతాధికారులుగా చెలామణీలో కొచ్చారు. వాళ్ళ పిల్లలు అవే వ్యూహాల్ని అనుసరిస్తూ చదువంతా విదేశాల్లోను, పాలించేదిమాత్రం స్వదేశంలోను అన్నట్లే నేటికీ కొనసాగుతోంది. ఈ వాస్తవపరిస్థితుల్ని గుర్తించిన కొన్ని సామాజిక వర్గాలు - తెలుగు కొన్ని వర్గాలకే పరిమితమవుతోందని, అది మాత్రమే చదివితే తమ వర్గం నుండి ఏనాటికీ పాలకవర్గం గానీ, ఉన్నత విద్యావర్గం గానీ తయారయ్యే అవకాశంలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఆందోళన పడడంలో అర్థం ఉన్నా, ఇక్కడొకటి          గుర్తించాలి. తొలితరానికి చెందిన వాళ్ళింకా కళాశాల స్థాయి వరకూ కూడా రాలేదు. అందువల్ల తొలితరం వాళ్ళకి ప్రాథమిక స్థాయి నుండే కేవలం ఆంగ్ల భాషలోనే విద్యాబోధన జరగాలనే వాదన అన్నప్రాసననాడే ఆవకాయ పచ్చడి తినమన్నట్లుంటుంది. దీన్ని పరిష్కారించడానికే అన్నట్లు దూరదృష్టితో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలన్నారు. కానీ, దీన్ని కొంతమంది సమర్థవంతంగా నిర్వీర్యం చేస్తున్నారు. ఇలా చేయడానికి భాషాభివృద్ధిలో ద్విముఖ వ్యూహాల్ని అనుసరించడమే ఒకప్రధానకారణం. ప్రభుత్వ, ప్రెైవేటు రంగాలను సమాంతరంగా పెంచిపోషిస్తున్న విద్యావ్యవస్థలోని లోపాల్ని ఆధిపత్య, పాలక వర్గాలు తమకి అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ప్రభుత్వవిద్యాసంస్థల్లో తెలుగు మీడియం, ప్రెైవేటు విద్యాసంస్థల్లో ఇంగ్లీషు మీడియం, మార్కుల కోసం సంస్కృతం రాజ్యమేలుతున్నాయి. తెలుగు అధికారభాషగా ఉన్న ఈ రాష్ర్టంలో తెలుగు చదవకుండానే అన్ని చదువుల్నీ పూర్తిచేసుకోగలిగే వెసులుబాటు కూడా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు భాషాభివృద్ధి చేయడంలో గానీ, చేస్తున్నారనడంలో గానీ ఎవరి చిత్తశుద్ధిని శంకించాలి? అనుభవపూర్వకంగా వాస్తవాల్ని చూస్తున్నవాళ్ళు కేవలం తెలుగుభాష మాత్రమే ఉండాలని కోరుకోవడం లేదు. కానీ, పరాయిభాష మోజులోపడి తెలుగుని విస్మరించడాన్ని సహించలేకపోతున్నారు. తమ నిత్య వ్యవహారభాష పరాయిదెైపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

తెలుగు భాషను అమలు చేయాలంటున్న వాళ్ళలోను, చేస్తున్నామని చెబుతున్న వాళ్ళలోను చాలా మందిలో ద్విముఖ వ్యూహం ఉండొచ్చు. నేడు తెలుగుభాష వాడుకను కూడా ‘రాజకీయం’ చేస్తున్నవాళ్ళున్నారు. ఈ ద్విముఖవ్యూహాలు, రాజకీయాల అసలు రంగు తెలియాలంటే ఆచరణలో ప్రభుత్వం ముందుకు రావాలి. తెలుగు చదివేవాళ్ళకి ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఉత్తరప్రత్యుత్తరాల్ని, ప్రభుత్వఉత్తర్వుల్నీ తెలుగులో వెలువడేటట్లు యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలి. తెలుగు భాషని వ్యవస్థీకృతం చేయాలంటూ కొన్ని ప్రాంతాల భాషనే ‘ప్రామాణిక భాష’ అని మరికొన్ని ప్రాంతాలవారిపెై బలవంతంగా మోపుతున్నారనే వాదనల నుండి బయటపడ్డానికి అన్నిప్రాంతాల వాడుకభాషనీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకు భాషాశాస్త్రవేత్తలు అనేకసూత్రాల్ని ప్రతిపాదించారు. గురజాడ ‘అసమ్మతి పత్రం’ అంతా ఇటువంటి వాదనలతోనే నిండి ఉంది.ఇప్పుడు మన తెలుగు విద్యార్థులు పరీక్షల్లో సమాధానాల్ని వ్యావహారిక భాషలో రాసుకోవచ్చు.

కానీ, ఒక వందేళ్ళక్రితమే విద్యార్థులు తాము మాట్లాడుకునే భాషలోనే ఇలా పరీక్షలు రాసుకునే వీలుకల్పించాలని తెలుగు భాషను సజీవ భాషగా ఉంచాలని భావించి కొంతమంది అందుకు ప్రయత్నించారు. వాళ్ళలో గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు తదితరులెంతోమంది ఉన్నారు. పుస్తకాల్లో ఉండే భాషకు, మాట్లాడుకునే భాషకూ మధ్యగల వ్యత్యాసం వల్ల భాషను నేర్చుకోవడానికే ఎక్కువ సమయం పడుతుందని గుర్తించారు. ఇటువంటి పరిస్థితి తెలుగుతో పాటు ఇతర భాషల్లోను కనిపిస్తుంది. కానీ, తమిళం, కన్నడ, ఇటీవల కాలంలో మరాఠీ భాషల్లో వాటిని అధిగమిస్తున్నట్లు తెలుస్తుంది.ప్రధాన ద్రావిడ భాషలన్నింటిలో గ్రాంథిక, వ్యావహారిక భాషల మధ్య అంతరం ఎక్కువగా ఉండడాన్ని గమనించిన ఆనాటి (ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలోఉన్న) పరిస్థితుల్నిబట్టి అధికారులు ఇంటర్మీడియెట్‌ స్థాయిలో వ్యాసరచనకు సంబంధిం చినంతవరకు పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి భాషను రాయాలనే విషయంలో కొన్ని ప్రమాణాల్ని నిర్ణయించడానికి ఒక్కొక్కభాషకు ఒక్కొక్క కమిటీని నియ మించారు.

తెలుగు కమిటీలో వేదం వెంకట రాయశాస్త్రి, కొమర్రాజు లక్ష్మణరావు, ఆచార్య రంగాచార్యులు, జయంతి రామయ్య పంతులు, జి. వెంకట రంగారావు, గురజాడ అప్పారావు తది తరులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో కొంత మంది గ్రాంథికభాషను, మరికొంతమంది శిష్ట వ్యావహారికాన్ని సమర్థించారు. గ్రాంథికమని పేరు పెట్టి రాసే కృతక భాష అటు ప్రాచీన వ్యాక రణ సంప్రదాయానికీ, ఇటు ఆధునిక ప్రజావాగ్వ్య వహారానికీ విరుద్ధం కనక, అన్ని ప్రాంతాలవారికీ సుపరిచితమైన శిష్ట వ్యావహారికం ఆధునిక వచన రచనకు ఉపయోగిస్తే బాగుంటుందని, అటు వంటి భాషలో విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తే బాగుంటుందని గురజాడ అప్పారావు తదితర వ్యావహారికవాదులు ప్రతి పాదించగా, దాన్ని అధికసంఖ్యాకులెైన గ్రాంథికవాదులు అంగీకరించలేదు. ఈ పరిస్థితుల్లో గురజాడ అప్పారావు తన వాదాన్ని The Minute of Dissent to the Report of the Telugu Composition Sub-Committeeపేరుతో ఒక నివేదికగా మద్రాసు విశ్వవిద్యాలయం వారికి సమర్పించారు.

1914లో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు సన్సు ప్రచురణాలయం ప్రచురించిన దీనినే పోరంకి దక్షిణామూర్తి ‘డిసెంట్‌ పత్రం’ పేరుతోను; వి.రామచంద్రరావు ‘అసమ్మతిపత్రం’ పేరు తోను తెలుగులో అనువదించారు. ఇది తెలుగు భాషలో ఉన్న గ్రాంథిక, వ్యావహారిక, మాండలిక, గ్రామ్య భాషలు అనే వివిధ రూపాల్ని, వాటి లోని లోటు పాటుల్ని శాస్త్రీయంగా చర్చించింది. భాషకు వ్యాకరణం నిత్యం మారుతుందనే సత్యాన్ని సోదాహరణంగా నిరూపించి, తెలుగు భాష నిత్య ప్రవాహినిగా ఉండడానికి దాన్నెలా వినియోగించుకోవచ్చునో ఈ నివేదికలో వివరించే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ సందర్భంలో వెలువడిన వాదోప వాదాలనింటినీ నేడు మరో సారి చర్చలోకి తేవలసిన అవసరం ఉంది.అలాగే ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు భాషా సాహిత్యాల్నీ, ఆలోచనల్నీ శాసిస్తుండడంతో ఆంగ్ల భాష వాడుక అనివార్యమైపోతున్నా- స్థానిక అవసరాలకు కేవలం ఆంగ్లమే ఉండాల్సిన పనిలేదు. తెలుగులో కూడా కార్యకలాపాలు సాగించవచ్చు. నిజానికి తెలుగు భాష వాడుక గురించి మాట్లాడేవాళ్ళే- మన గ్రంథాలయాలు నిర్లక్ష్యానికి గురికావడం గురించి కూడా ప్రస్తావించాలి.
అందరిదగ్గరా ఇంటిపన్నుతో కలిపి ముక్కుపిండి మరీ 8 శాతం పన్ను వసూలు చేస్తున్న ప్రభుత్వం, ఆ గ్రంథాలయాల నిర్వహణపెై మాత్రం నీళ్ళు చల్లుతోంది. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతోందనో, అన్నింటినీ ఇంటర్నెట్‌లో స్కాన్‌చేసి అందుబాటులోకి తెస్తున్నామనో చెప్పేవాళ్ళు- ఆ శాస్త్ర, సాంకేతికతను ఎంతమంది అందుకునే స్థితిలో ఉన్నారో తెలియ చేసే పనికాదు. ఇవన్నీ ప్రజలపట్ల ప్రజాప్రతినిధులకు బాధ్యత లేకపోవడంవల్ల జరుగుతున్న నిర్లక్ష్యాలు. వీటన్నింటినీ తెలుగు ప్రజలు గుర్తిస్తున్నారు. ఇంతకు ముందులేనంత చెైతన్యం నేడు ప్రజల్లో కనిపిస్తోంది. ప్రపంచమహాసభల తర్వాత కూడా భాష పట్ల ఈ చర్చలు కొనసాగేటట్లు చూడాలి. ఇటువంటి భాషా చెైతన్యాన్ని నింపే ప్రజలకు, ఉద్యమాలకు ఇప్పటికే ఊతమిస్తున్న పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా మరింత అండగా నిలిస్తే, కచ్చితంగా తెలుగు భాషాభివృద్థిలో గల ద్విముఖ వ్యూహాన్ని ప్రజలంతా గుర్తించి, ప్రభుత్వాన్ని నిలదీసేరోజులొస్తాయి.
-డా.దార్లవెంకటేశ్వరరావు

venk

No comments: