ఈ ఆదివారం (23 డిసెంబరు 2012) వార్త అనుబంధంలో నా కవిత ’’ నానీ... నువ్వెప్పుడొస్తావురా.‘‘ ప్రచురితమైంది.
‘‘డాడీ...ఇన్నాళ్ళూ నువ్వెక్కడున్నావు
నీకెన్నో చెప్పాలి
నీ కెన్నో ముద్దులివ్వాలి’’
ప్రతి రోజూ ఒకటే కల!
నానీ...ఇంకా పుట్టని నా చిట్టికన్నా
ఇంత అర్థరాత్రి ముఖం కడుగుతారేంటని
అమాయకంగా అడిగే మీ అమ్మకు
నేనేమని చెప్పను రా
ప్రతి కలకీ నువ్విస్తున్న కన్నీటి ముత్యాల దండల్ని
బాత్‌రూములో దాచేస్తున్నానని చెప్పనా
నా మధుమోహనాంగి
మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటుందని చెప్పనా
పిచ్చిదిరా మీ అమ్మ
నేనేది చెప్పినా నమ్మేస్తుంది
నిన్నూ నాలోనే చూసుకుంటుంది కదా!
ఇప్పటికే
ఊహలకి రెక్కల్ని తొడిగి
నీకో అక్కను చేసి
అందరికీ నేనో అబద్దాల కోరునైయ్యాను రా
సముద్రమంత వేదనని కడుపులో దాచుకునీ
నన్నూరడిరచే అమ్మతోనూ
నువ్వాడుకుంటున్న
ఆ కలవరింతల్ని
కనిపెట్టలేననుకుంటున్నావు రా !
రా రా నానీ
రారా నా చిట్టి కన్నా
నువ్వు రాకపోతే
మబ్బుల్ని వెతుక్కుంటూ
నేనే వచ్చేస్తాను ర్రా!
- దార్ల వెంకటేశ్వరరావు
vrdarla@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి