(7-4-2012 Andhra jyothi సౌజన్యంతో)
ఆతడు
ఏదెన్ తోటను కూడా దాటినవాడు
తినవద్దన్న పండునే తిన్నవాడు
దొంగల 'స్నానాల గది'లో
జ్ఞానస్నానమాచరించినవాడు
ఇంటికి పాస్టరొచ్చినట్లు
అంబేద్కరైటై అడవికి వెళ్ళినవాడు..
అగ్నిస్తంభాన్ని కౌగలించుకుని
ఇస్రాయేలీ ఐగుప్తీయ విచికిత్సలో
'ఎర్ర సముద్రాన్ని'దాటేద్దామనుకున్నవాడు...
కవిత్వానికి తోటరాముడతడు..
కోర్కెలు తీరని సిద్ధార్ధుడతడు
విప్లవమిక్కడ జలాక్షరమై
విటుత్వమై విభాజకమై సాయుధమై
ఒకే కులసమూహవాచకమైనప్పుడు
సవర్ణ మార్క్సిజానికి
సమాధి పెట్టెను తయారుచేసినవాడతడు..
హోచిమిన్ పెదవులు అతనికాదర్శం
'నాగపూర్ 'పై మొలిచిన చంద్రుడతనికిష్టం
కలంవిదిలిస్తే కవి కుమారుడి విప్లవ శృంగారం
'అలలుకనే కలలమీద నిఘా'పైనే నిఘానేత్రం
విప్లవమతడికి పులిగాయం
మావోయిజానికతడే దళిత లేపనం
అతడే ఒక ఉజ్వల గేయం...
ఈ కుల జనజీవన స్రవంతి
దళితానికి అంతరిక్షంకన్నా సుదూర భవంతి ..
రక్త మాంసాలు కోసినా
చిక్కని కవిత్వమై కనిపించిన అతగాడస్తమిస్తే
ఒక 'కవిత్వ చందమామ'గా నిష్క్రమిస్తే
'చచ్చిన తెలుగు కవి సమాజం' నోళ్ళు
సుఖవ్యాధిపీడితసాహిత్య మంచపు కోళ్ళు
'గో బాక్ సైమన్' అన్న దుర్మార్గులు వీళ్ళు...
ఆత్మను తెలుసుకోకుండా...
-తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి