Thursday, February 23, 2012

తొలి ద ళిత కవి ‘మాదిగ మహా యోగి’ దున్న ఇద్దాసు

తొలి ద ళిత కవి దున్న ఇద్దాసు
వర్ణవ్యవస్థను ప్రశ్నించిన తొలి ప్రముఖుడు బుద్ధుడు. ఆ మార్గం శతాబ్దాల పాటు మూసుకపోయింది. మళ్లీ
ఆ మార్గాన్ని తెరిచింది బసవేశ్వరుడు. తెలంగాణలో దాని వారసుడు పాల్కురికి సోమనాథుడు. శిష్టవర్ణ కథనాల్ని తిరస్కరించి మడేలు మాచయ్య, కమ్మరి గుండయ్యలకు పట్టం కట్టిన మార్గదర్శి పాల్కుర్కి. ఆ మార్గంలో శిష్టవర్గ పురాణాల్ని కాదని విస్మృత కులాలు తమ కుల పురాణాల్ని సృష్టించుకున్నరు. ఈ కుల పురాణాల సృష్టి వర్ణ వ్యవస్థ మీద, వర్ణాధిక్యత మీద వేసిన పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న
తదనంతరం ‘ప్రధాన స్రవంతి’లోకి రాకపోయినా ఒక పాయగా సాగుతూ వస్తూనే ఉంది. ప్రచారం దృష్ట్యా
అది పాయ కావచ్చు. కాని జనాభా దృష్ట్యా అది పాయ కాదు. అదే ప్రధాన స్రవంతి. సరే పాయ అనుకున్నా అది ఆగలేదు. చెవుల్లో సీసం పోసినా, నాలుక ఖండించినా అది ఆగలేదు.

ఉపమ గలిగి శయ్యల నొప్పిఉన్న
అంఘ్రిభవుని కావ్యంబు
గ్రాహ్యంబు కాదు
పాయసంబైన సంస్కార పక్వమైన
కాకజుష్టంబు హవ్వంబు కాని యట్లు


అని నిషేధం విధించినా ఆగలేదు.తొలుత ఆ పాయ నుంచి గొప్ప శూద్ర కవులొచ్చినారు. కందుకూరి రుద్రకవి, తెనాలి రామలింగకవి, మన్నెంకొండ హనుమద్దాసు, వేపూరి హనుమద్దాసు, రాకమచర్ల వెంకటదాసు, పోశెట్టి అంగకవి, గావండ్ల రాజలింగకవి, సుంకరనేని ఫణికుండలుడు, గడ్డం రామదాసు, గౌడపురాణం రచించిన మల్లికార్జున సిద్దయోగి మొదలగువారు అట్లాం టి గొప్ప కవులు.
ఆ పాయలోని రెండవ పొర అయిన దళితుల నుంచి కవులొచ్చినారు. అట్లా వచ్చిన కవి చింతపల్లి దున్న ఇద్దాసు (1811-1919). లభిస్తున్న సమాచారం మేరకు ఇద్దాసు తొలి దళితకవి. బిరుదు రామరాజు గారు ఈయనను ‘మాదిగ మహా యోగి’ గా సంబోధించినాడు. ఇద్దాసు యోగిగానే ప్రసిద్ధి చెందినాడు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా అయ్యవారిపల్లి గ్రామం లో ఇప్పటికీ ఉన్న ఇద్దాసు ఆశ్రమం ఆ ప్రసిద్ధికి నిదర్శనం.

కరణాలు, రెడ్లు మొదలుకొని అనేక కులాల వారు ఆయన శిష్యులు గా ఉండడం ఆ గొప్ప తనానికి మరో నిదర్శనం. ఇద్దాసు యోగి గా ఉంటూనే అనేక కీర్తనలు, తత్త్వాలు, మేలుకొలుపులు రాసినందువల్ల ఆయనను నేను కవిగా ‘ముంగిలి’లో చేర్చిన. ఇద్దాసు అసలు పేరు ఇద్దయ్య. మాదిగ కులానికి చెందిన దున్న రామ య్య, ఎల్లమ్మలకు క్రీ.శ.1911 ప్రాంతంలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామంలో జన్మించాడు. రైతుల దగ్గర జీతగాడిగా ఉన్న ఇద్దయ్య తత్త్వకవిగా పరిణితి చెందడం ఆశ్చర్యకరం. పశువుల కాపరిగా ఉన్నప్పుడు సాధువుల సాంగత్యం ఏర్పడి వారి నుంచి తత్త్వగీతాలు నేర్చుకున్నాడు. మోటకొడుతూ ఆశువుగా తత్త్వగీతాలు అల్లిపాడేవాడు.

ఆ గీతాలు విన్న పరసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య ఇద్దయ్యకు లింగధారణ చేయించి, పంచాక్షరీ మంత్రం ఉపదేశించినాడు. తర్వాత ఇద్ద య్య పోతులూరి వీరవూబహ్మం, ఈశ్వరమ్మలు ప్రచారం చేసిన రాజయోగం సాధన చేసినాడు. ఆరునెలలు అడవుల్లో సంచరించి ఏకాంతంగా యోగసాధన చేసినాడు. పూర్ణయోగి అయిన తర్వాత అష్టసిద్ధులతని వశమై అనేక మహిమల్ని ప్రదర్శించినాడని జనశృతి. అట్లా ఇద్దయ్య-ఇద్దన్న, ఇద్దాసు అయినాడు. ఊరూరు తిరుగుతూ భక్తి, జ్ఞాన వైరాగ్యాల్ని ప్రబోధిస్తూ వందలాది మంది శిష్యుల్ని, భక్తుల్ని, అనుయాయుల్ని చేసుకుంటూ అచ్చంపేట తాలూకా అయ్యవారిపల్లి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దాసు అనేక తత్త్వాల్ని, కీర్తనల్ని, మేలుకొలుపుల్ని ఆశువుగా వచించినాడు. ఇందులోంచి 32 తత్త్వాల్ని మాజీ మంత్రి పి. మహేంవూదనాథ్ సంపాదకత్వం లో మల్లేపల్లి శేఖర్‌డ్డి ‘శ్రీదున్న ఇద్దాసు గారి తత్త్వాలు’ పేరుతో ముద్రించినాడు.


పల్లవి: మీరయ్యవారా?
బ్రహ్మముగన్న వారయ్యగారూ
॥ మీర ॥
అనుపల్లవి: మీరయ్య వారైతే
మిగుల చెన్నంపురి
కంటిగురుని సేవ కనబరిచి తిరుగక ॥ మీర ॥
చరణం: గజరాజుకు మారు గ్రామ సూకరి బుట్టి
గ్రామశుద్ధి చేసి గజము నేననిమేటి
దానితో మారు మాటాడు తెలియని
వారు దానంతవారూ॥ మీర ॥
సింహమునకు మారు శునకనాథుడు బుట్టి
రేయి పగపూల్ల భౌభౌ మనియేటి
దానితో మారు మాటాడ తెలియని
వారు దానంతవారూ ॥ మీర ॥
తేజిగానికి మారు గార్ధభంబు బుట్టి
బంధమేసుకొని గరిక భక్షించేటి
దానితో మారు మాటాడ తెలియని
వారు దానంతవారూ॥ మీర ॥
వ్యాఘ్రమునకు మారు మార్జాలము బుట్టి
కండ్లు మూసుకొని పాలువూదాగేటి
దానితో మారు మాటాడు తెలియని
వారు దానంతవారూ ॥ మీర ॥

కామధేనువు మారు కడగోవు జన్మించి
మూతి వంచుకొని పూరి భక్షించేటి
దానితో మారు మాటాడు తెలియని
వారు దానంతవారూ॥ మీర ॥

వాసిగ తుంగతుర్తి వాసుని మరుగు జేరి
ఆత్మను గన్న ఇద్దాసయ్యగారు
మీరయ్య గారా?
ఆత్మను గన్న వారయ్య గారూ ॥ మీర ॥
ఇద్దాసు గారి ఈ తత్త్వం ఆయన కవితా తత్త్వాన్ని చిత్రిక పడుతుంది.
‘అ కులస్థుడై యున్న యభవుని భక్తికి
ఏ కులంబని నిర్ణయించెదవు’
‘ఎట్టి దుర్జాతి బుట్టిన నేమి
యెట్టును శివభక్తుడిల పవివూతుండు’

‘మలిన దేహుల మాలలనుచును
మలిన చిత్తుల కధిక కులముల
నెలవొసంగిన వర్ణధర్మమధర్మ
ధర్మంబే’
అని గురజాడ చెప్పడానికి
భూమిక నేర్పరచింది.
‘మాలల నంటగ రాదని
గోల నొన్చదరేలా గొప్పర నీకున్
మాలల గోసిన రక్తము
మీలోనను పాలుగలవే నిజముగ
నరుడా (1934)


అన్న పాల్కుర్కి భగవంతుని ముందు కులం ప్రసక్తి లేదని కులాలన్నీ ఒక్క ప్రబోధించినాడు. అది శూద్ర కులాల్లో సూతనోత్తేజాన్ని నింపింది. ఆ భావన కొనసాగింపు ఇద్దాసు ఈ కీర్తన. ఆ భావన కులపురాణాలు, అన్నమాచార్య, వీరవూబహ్మం, వేమనల మీదుగా ఇద్దాసు దాకా ప్రవహించింది. ఆత్మన్యూనత నుంచి బయటపడడం మొదలుకొని ఆధిక్యతను ప్రశ్నించేదాకా ఆ భావన దోహదం చేసింది. అది ఈ కీర్తనలో ప్రతిబింబించింది.

ఇద్దాసు మహిమల్ని ప్రదర్శించినప్పుడు ఆపహాస్యం చేసిన బ్రహ్మణులనుద్దేశించి ఆశువుగా చెప్పిన గొప్ప కవితాత్మకమైన కీర్తన ఇది. బాహ్యశుద్ధి కాదు అంతశ్శుద్ధి ముఖ్యమన్నది ఈ కీర్తన ఉద్దేశం. అంటే కులం ముఖ్యం కాదన్నది తాత్పర్యం.

ఈ భావనే తర్వాతి కాలంలో...
అని జగన్నాథం ఆవేదన చెందడానికి, దైద దేవేందర్ ‘తొండం’(1975) అనే కావ్యం రాయడానికి ఇటీవల అంద్శై గ్యారయాదయ్య, వేముల యెల్లయ్య, చిత్రం ప్రసాద్, జూపాక సుభద్ర, గోగు శ్యామల, జాజులగౌరి, పసునూరి రవీందర్, జిలుకర శ్రీనివాస్, కదికృష్ణ, చైతన్య ప్రకాష్ మొదలయిన వారు కులాధిక్యతను ప్రశ్నించడానికి కొత్త భావజాలంతో పాటు ఇద్దాసు మీదుగా నిరంతర ధారగా కొనసాగిన సబావూల్టన్ పాయ పూర్వ రంగ మేర్పరిచింది.
అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో ఇద్దాసు జన్మించి రెండు వందల సంవత్సరాలవుతున్న సందర్భంగా ఆయన రచనలన్నింటినీ సేకరించి ముద్రించడం, ఆయన కృతుల మీద విశ్లేషణ చేయించడం ఆయనకొనసాగింపుకు సార్థకత  చేకూరుతుంది.
-డా. సుంకిడ్డి నారాయణడ్డి
( నమస్తే తెలంగాణ సౌజన్యంతో...)

2 comments:

Gandra Mahesh said...

namaskaram sir mee vyaasam chaala bhaagundi sir. oka chinna doubt "ఆ పాయలోని రెండవ పొర అయిన దళితుల నుంచి కవులొచ్చినారు. అట్లా వచ్చిన కవి చింతపల్లి దున్న ఇద్దాసు (1811-1919)". ani oka chota , maro chota
"ఇద్దాసు అసలు పేరు ఇద్దయ్య. మాదిగ కులానికి చెందిన దున్న రామ య్య, ఎల్లమ్మలకు క్రీ.శ.1911 ప్రాంతంలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామంలో జన్మించాడు". ani ichaaru. mariyu ithanu 1811 lo ni kavi iathe 108years brathikaadaa? guruvugaaru dayachesi telupagalaru.mee sisyudu mahesh

vrdarla said...

మిత్రమా, వ్యాసాన్ని పరిశీలనాత్మకంగా చదివినందుకు నిన్ను అభినందిస్తున్నాను. వ్యాసంలో చింతపల్లి దున్న ఇద్దాసు గారు జననం విషయంలో 1811లో పుట్ఠి, 1919 వరకు జీవించినట్లు బిరుదురాజు రామరాజుగారు కూడా ఆంధ్రయోగులు అనే గ్రంథంలో పేర్కొన్నారు. దీన్ని ఆధారం చేసుకొనే సుంకిరెడ్డి నారాయణరెడ్డిగారు ఒక వ్యాసాన్ని రాసి, దాన్ని నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురించారు. అయితే, ఆ వ్యాసంలో 1811కి బదులు 1911 అని ముద్రణా దోషం కనిపిస్తుంది. దీన్ని గుర్తించిన మీకు అభినందనలు. ఈ వ్యాసంలోని కొంతభాగం ఆయన రాసిన ముంగిలి( తెలంగాణా ప్రాచీన సాహిత్యం) పుస్తకం ( పుటలు: 630-631)లో కొంతభాగాన్ని ప్రచురించారు. దీనిలో కూడా 1811-1919 గానే ఇద్దాసుగారి కాలాన్ని పేర్కొన్నారు. ఇక, ఈ వ్యాసాన్ని నేను ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక సౌజన్యంతో, దానిలో ఎలా ఉంటే అలాగే మరలా నా బ్లాగులో ప్రచురించాను. ‘మీవ్యాసం’ అని సంబోధిస్తూరాసిన మిత్రమా దీన్ని గమనించాలి. దీన్ని రాసిన వారు డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డిగారే తప్ప నేను కాదు.
శుభాకాంక్షలతో
మీ
దార్ల