Sunday, February 12, 2012

అన్నమయ్య సాహిత్యం – దళిత దృక్పథం-డా||దార్లవెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసర్‌, తెలుగు శాఖ
హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు-500 046
09989628049
            ''అన్నమయ్య''గా ప్రసిద్ధిపొందిన తాళ్ళపాక అన్నమాచార్యుల గురించి ఎక్కడ జాతీయ సదస్సులు జరిగినా, ఆ సదస్సు లక్ష్యమేదైనా ఒక సంకీర్తనను మాత్రం ప్రస్తావిస్తుంటారు. అదే '' బ్రహ్మమొకటే...పరబ్రహ్మమొకటే...'' అనే సంకీర్తన. అన్నమయ్య 32వేల కీర్తలు రాసినట్లు వాళ్ళ మనమడు తాళ్ళపాక చిన్నన్న రాసిన ''అన్నమాచార్య చరిత్రము'' చెప్తున్నా, దొరికినవి మాత్రం 14,238 అని ఆ రంగంలో కృషి చేసిన పండితుల అభిప్రాయం. వాటిలోను పరిశోధకులు, విమర్శకులు పట్టించుకొనేవి వందల్లోనే ఉంటాయనీ, వాటికి సంగీతాన్ని స్వరపరిచడం ద్వారా ప్రజల్లోకొచ్చినవి వాటిలో మరోసగం ఉండవచ్చేమోనని అన్నమయ్య సాహిత్యాన్నీ, సంగీతాన్నీ పరిశీలిస్తున్నవారి అభిప్రాయం. 

ఎవరెన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేసినా అన్నమయ్య సమకాలీన సమాజాన్ని వదిలేసి తన సంకీర్తనల్ని రాయలేదనేది ఆయన సాహిత్యంలో ప్రతిఫలించే సామాజికి వస్తు దృక్పథాన్ని చూసేవారి అభిప్రాయం.వీళ్ళందరిలోను చర్చలోకి వచ్చేది ప్రధానంగా ఈ సంకీర్తనే.దీనికి కారణం ఈ సంకీర్తనలో దేవుడి దృష్టిలో బ్రాహ్మణుడు నడిచేదీ, చండాలుడు జీవించేది మాత్రమే కాకుండా సర్వజీవులకు శ్రీహరే అంతరాత్మ అనే భావన వక్తమైంది. బహుశా ఇటువంటి వాటి ఆధారంగానే చలనచిత్ర నిర్మాతలు సినిమాల్లో అన్నమయ్య దృష్టిలో కులం లేదని తీశారు. ముఖ్యంగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున 'అన్నమయ్య'గా నటించిన సినిమాలో దళితుల దేవాలయ ప్రవేశ సన్నివేశాన్ని చక్కని దృశ్యకావ్యంగా మలిచి, సామాన్య ప్రజల్లో కూడా అన్నమయ్య కులాలకు అతీతుడనే భావనను కలిగించగలిగారు.

ఒకవైపు పరిశోధకులు, విమర్శకులు మరోవైపు సినిమాల వల్ల అన్నమయ్య రాసిన అన్నివేల సంకీర్తనల కన్నా, ఒకటి రెండు సంకీర్తనలే ప్రాచుర్యంలోకి వచ్చాయి కానీ, మిగిలిన సంకీర్తనల్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంకా చాలా చోట్ల అన్నమయ్య చేసిన కులప్రస్తావన కనిపిస్తుంది. ఇక్కడో ప్రశ్న వస్తుంది. ఆధ్యాత్మికవాదైన అన్నమయ్యను కులదృష్టితో చూడొచ్చా?       

                                    భారతీయసమాజం చాతుర్వర్ణ వ్యవస్థను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాటించినందువల్ల ప్రతీకవినీ ఈ కులదృష్టితో పరిశీలించడానికి అవకాశమేకాదు, అవసరం కూడా ఉంది. ఇలా పరిశీలించడం వల్ల వాళ్ళ పరిమితుల్ని, కులం పట్ల వాళ్ళ తాత్త్వికతనీ గుర్తించడానికి వీలవుతుంది.లేకపోతే ఏదో సందర్భంలో అలవోకగా చెప్పినవాటిని సీరియస్‌గా తీసుకొని వాళ్ళనో కులనిర్మూలన ఉద్యకారులుగా కీర్తించేవాళ్ళు బయలుదేరేప్రమాదముంది. 

ఇప్పటికే అంబేడ్కర్‌, జోతీరావుబా ఫూలే, ఇవిరామస్వామి నాయకర్‌ వంటి వాళ్ళతోను, ఒకోసారి వాళ్ళను మించి కూడా ఆ తాత్త్వికత చింతన పట్ల అవగాహన లేక కొంతమందీ, తెలిసి కూడా చారిత్రక వక్రీకరణలో భాగంగా మరికొంతమందీ గాంధీజీ 'హరిజనోద్ధరణ'ను ప్రచారం చేస్తున్నారు. ఈ పరిమితులతోనే అన్నమయ్య సాహిత్యాన్ని కూడా దళితులు అవగాహన చేసుకోవాలి. అందువల్ల అన్నమయ్య సాహిత్యాన్నీ కులదృష్టితో పరిశీలించడం తప్పుకాదనుకుంటున్నాను.

భారతదేశంలో భక్తి ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసి పడుతున్న క్రీస్తు శకం 15, 16 వ శతాబ్ధాల్లో అంటే  9-5-1408 (సర్వధారి సంవత్సరం, వైశాఖశుద్ధపూర్ణిమ) లో సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అన్నమయ్య సుమారు 95 సంవత్సరాలు పాటు జీవించి 23-2-1503లో మరణించారు.కేవలం సంకీర్తనలు మాత్రమే కాకుండా సుమారు 12 శతకాలు రాసినట్లు వాటిలో ప్రస్తుతం శ్రీవేంకటేశ్వరశతకం మాత్రమే లభించిందంటున్నారు.వీటితో పాటు మంజరీ ద్విపదలో ''శృంగారమంజరి'' , ''ద్విపదరామాయణమ్‌'', ''వేంకటాచల మాహాత్మ్యమ్‌'', సంస్కృతంలో ''సంకీర్తనాలక్షణమ్‌'' మొదలైన రచనలు చేసినట్లు తెలుస్తుంది. వీటన్నింటినీ పరిశీలించకుండా అన్నమయ్య కులదృష్టిని స్ఫష్టంగా వివరించే వీల్లేకపోయినా, లభిస్తున్నవాటితో కొన్ని ఒక అంచెనాకి వచ్చే అవకాశం లేకపోలేదు.

''బ్రహ్మమొకటే...పరబ్రహ్మమొకటే..సంకీర్తనను విశ్లేషిస్తూ ఆరుద్ర జీవులకు కర్మ, జ్ఞాన, భక్తి ప్రపత్తులనే యోగాల చేత బ్రహ్మప్తాప్తి కలుగుతుందని వైష్ణవులు భావిస్తారని చెప్పారు. భక్తుడు తన ఆత్మను పరిపూర్ణంగా పరమాత్మలో అధీనం చేయడం జరుగుతుంది. భగవానుని లీలల్ని అనుభవించి, అతని దయను ప్రస్తుతించడమే ప్రపత్తి. సర్వజీవకోటి శరణాగతికి ఉపయోగపడే యోగం ఈ విశిష్టాద్వైతంలో ప్రపత్తుల ద్వారా సాధ్యమౌతుందని భావిస్తారని వివరించారు. దీన్ని బట్టి సర్వజీవులకు శరణాగతుడైన భగవంతుడు, దళితులకు మాత్రం దూరమెందుకవుతాడనేది అన్నమయ్య సంకీర్తనలనుండి గ్రహించగలిగే భావనగా గుర్తించవచ్చు. అందుకనే- ''నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటు నిద్ర అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే
చండాలుండేటి సరిభూమి యొకటే'' అని స్తుతించగలిగాడు అన్నమయ్య.

పుట్టుకచేత బ్రాహ్మణులైనా, వారిలో తాము నమ్ముకున్న దైవం పట్ల తప్ప భౌతికమైన సుఖదు:ఖాలు తాత్కాలికమని భావించినట్లే, భేదభావాల్ని కూడా నిజమైన భక్తుల పాలిట నిలవజాలవన్నారు.                      అందు వల్లనే అన్నమయ్య ఒక సంకీర్తనలో -
''వేదములు చదివియును విముఖుడై హరిభక్తి
ఆదరించలేని సోమయాజి కంటె
ఏదియును లేని కులహీనుడైనను విష్ణు
పాదములు సేవించుభక్తి ఘనుడు' అని పలికాడు. యజ్ఞయాగాదులు చేసినా దైవభక్తిలేకపోతే వ్యర్థమన్నాడు. నిజమైన దైవభక్తి కలిగిన వాడు భేదభావాల్ని చూపడనేది అన్నమయ్య భావన. అందుకనే  భక్తిలేకపోతే ఏ కులంలో పుట్టినా అధముడేననీ, భగవంతుణ్ణి సేవించేవాడు ఏ కులస్థుడైనా గొప్పవాడేననీ ప్రశంసించగలిగాడు. పండితులు చెప్పే నవవిధ భక్తుల్లో ఏదొక మార్గంలో భగవంతుణ్ణి సేవించుకొనే అవకాశం ఉందనేది అన్నమయ్య భావన కావొచ్చు.నవవిధభక్తిమార్గాల్ని మించిన అనేక మార్గాల్ని కూడా చూస్తే తప్ప అన్నమయ్య భక్తి అంతసులభంగా అర్ధం కాదనేవాళ్ళూ ఉన్నారు.

మరొక చోట 
''అనుగు దేవతలకును అల కామ సుఖమొకటే
ఘనకీటపశువులకు కామసుఖమొకటే
దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యునకొకటే
వొనర నిరుపేదకు వొక్కటే అవియు
కొరలి శిష్టాన్నమములు కొను నాకటినొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాకలకటే
పరగ దుర్గంధములపై వాయువొకటే
వరుస పరిమళముపై వాయువొకటే
కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద పొలయు నెండొకటే
కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామమొకటే'' అని దేవుడ్ని కీర్తించారు. సర్వజీవులకు సుఖదు:ఖాలు సమానమేననీ, అలాగే ప్రకృతికి లేని భేదాలు, పంచభూతాలు చూపించనీ, అటువంటప్పుడు మానవుల మధ్యమాత్రమే వివక్ష  ఉండటం సరైందికాదనే దృష్టి ఈయన సంకీర్తనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దృష్టితో చూసినప్పుడు అన్నమయ్య ప్రత్యేకించి దళితుల గురించే చెప్పకపోయినా, సర్వజీవులకూ శరణాగతుడైనవాడు భగవంతుడనీ, ఆ శరణాగతుల్లో దళితులు కూడా ఒకభాగమేనని అన్నమయ్య భావించినట్లు ఒకనిర్ధారణకు రావచ్చు. ఇక్కడ పశు పక్ష్యాదుల నిద్ర, వాటి తిండి, వాటి విధుల్ని జాగ్రత్తగా గమనిస్తే, ఒక్కొక్కరకంగా వాటి జీవనవిధానం ఉండొచ్చు. అవి ఒక్కొక్క విధిని నిర్వర్తిసుండొచ్చు.అయినంతమాత్రం చేత వాటిని తక్కువగా చూడాల్సిన పనిలేదనీ, అవి చేయవలసిన, జీవించాల్సిన పద్ధతిలోనే జీవిస్తూ, చివరికి అవి కూడా భగవంతునిలోనే లీనమవుతాయనే మరోదృష్టి ఉంది.జన్మకు కారణం ఉంటుందనీ, ప్రతి జన్మపైనా ఇంతకు ముందు జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితం ఉంటుందనీ, ఒక్కో పని చేయడానికీ ఒక్కోకారణం ఉంటుందని కర్మసిద్ధాంతం వివరిస్తుంది. పశుపక్ష్యాదులు, మనుష్యులు అంతా కారణజన్ములని ప్రబోధిస్తుంది.

 హిందూధర్మంలో కర్మసిద్ధాంతానికి ఎంతోవిలువుంది. అందుకనే అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుని వరప్రసాదం వల్లనే జన్మించినట్లు, తన పదహారవయేట నుండే సంకీర్తనలు, రచనలు చేయడం కూడా దైవానుగ్రహం వల్లనేనని ఆయన గురించి రాసిన చరిత్ర చెప్తుంది. వీటన్నింటినీ చూసినప్పుడు మనవిధిని మనం నిర్వర్తిస్తూ, మన పరిధుల్లోనే మనభక్తిని శ్రీహరిపై పెట్టాలనేది అన్నమాచార్యుల వారి బోధన సారాంశం కావచ్చు. దీన్ని ఒక సంకీర్తనలో-''ఎక్కువకులజుడైన హీనకులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు
పరమగు వేదాంత పఠన దొరికియు సదా
హరిభక్తిలేని సన్యాసికంటే
సరవిమాలిన అంత్యజాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకునాతడే ఘనుడు'' అని వివరించాడు. దీన్నిబట్టి మనపుట్టుక, మనకి వంశపారంపర్యంగా సంక్రమించేవిధులు మనచేతుల్లో లేవనీ ఎక్కడ పుట్టినా, ఎక్కడ జీవిస్తున్నా, మనపని (సేవ) మనం చేస్తూనే, మనదృష్టిని మాత్రం  భగవంతుడిపైనే పెట్టాలి. దీన్ని మరింత స్పష్టంగా మరో చోట చెప్పిన సంకీర్తనలో -
 ''నిర్మలుడై యాత్మ నియతి గలుగువాడే
ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు
కర్మమార్గములు కడవని వాడే
మర్మమై హరిభక్తి మఱవనివాడు'' అని వివరించాడు. కర్మసిద్ధాంతం ద్వారా భక్తిమార్గాన్ని సర్వజీవులకు ప్రబోధించాడు అన్నమయ్య.అందులో దళితులు కూడా ఉండొచ్చు. పారలౌకిక జీవితం గురించి ప్రబోధించిన హిందూ మతంలోనిఈ '' కర్మమార్గమే'' దళితుల్ని ఈలోకంలో అధ:పాతాళానికి తొక్కేసింది. నేటికీ రకరకాల రూపాల్లో సామాజికంగా, ఆర్థికంగా దళితుల్ని మరింత నాశనం చేస్తుంది.

ఉత్తరభారతదేశంలో ''భంగీ, చమార్‌, మాంగ్‌లు, దక్షిణభారతదేశంలో ''పాకీవాళ్ళు, రెల్లి, మాదిగ, మాలలు'' చేసే మలమూత్రాదుల్ని శుభ్రం చేయడం, పశువుల్ని, మనుషుల శవాల్ని కాల్చడం, పూడ్చిపెట్టడం వంటి పనులు చేయాలి. ఇలాంటి పనులన్నీ పవిత్రమైనవంటూ కీర్తిస్తూనే, ఆ పనుల్ని చేయడం ద్వారానే కర్మమార్గాన్ని ఆచరించి ''ముక్తి''పొందొచ్చని ''గాంధీమహాత్ముడు'' ప్రకటిస్తూ వీళ్ళంతా దేవుని బిడ్డలు(హరిజనులు) అని తన సానుభూతిని ప్రకటించాడు. ఈ ''కర్మ''ను వద్దను కున్నా అవి వంశపారంపర్యంగా వెంటాడుతున్న వైనాల్ని భగవాన్‌ దాస్‌ రాసిన '' మై భంగీహూ'' (తెలుగులో డా|| జి.వి.రత్నాకర్‌ అనువాదం 'నేను భంగీని') గానీ, హైదరాబాదు బుక్‌ ట్రస్టువాళ్ళు ప్రచురించిన గీతారామస్వామి, విమలలు రాసిన '' మా కొద్దీ చండాలం'' వంటి పుస్తకాల్ని గానీ చదివితే తెలుస్తుంది.సాక్షాత్తూ ''భగవాన్‌ శ్రీకృష్ణుల''వారే గుణ కర్మలను బట్టి వర్ణవిభజన చేశాననీ, కర్మలను ఆచరించడమే తప్ప, వాటి ఫలితాల్ని ఆశించకూడదని బోధించిన వాటినే నేటికీ 'భగవద్గీత'రూపంలో ఏన్నోదేవాలయల్లో మారుమ్రోగుతున్నాయి.

            వాస్తవిక జీవితంలో ''కర్మలు'' ఇలా ఆచరణలో కనిపిస్తున్పప్పుడు అన్నమయ్య చెప్పి ''కర్మమార్గాలు'' ఎలాంటివోనని దళితులు ఆలోచించాల్సిందే. అయితే, అన్నమయ్య దళితుల గురించి ప్రత్యేకించి చెప్పకపోయినా, కలనిర్మూలన భావాల్ని ప్రకటించకపోయినా, అంతర్గతంగా కర్మసిద్ధాంతాన్నే ప్రబోధించినా, ఆయన పుట్టిన కుటుంబ పరిధులు, జీవితాంతం శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలోనే గడపడం వంటివన్నీ కొన్నిపరిమితుల్ని విధిస్తాయి. శూద్రకులంలో పుట్టి, పెరిగి స్వతంత్ర ఆలోచనా విధానంతో జీవిస్తూ కులనిరసన చేసిన వేమన, పోతులూరి వీరబ్రహ్మం వంటివారితో పోల్చుకుంటే, అనన్నమయ్యకు కొన్ని పరిమితులు, పరిధులు ఉన్నాయని గుర్తించకతప్పదు. అందుకనే అన్నమయ్యను తాత్వికంగా భావవాదైనా, ఆయనలోనూ కవిగా కొన్ని సంస్కరణ భావాలున్నాయని ప్రముఖవిమర్శకులు ఆచార్య కె.కె.రంగనాధాచార్యులు, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వంటివాళ్ళు వ్యాఖ్యానించారు. సుమారు ఆరువందలయేళ్ళ క్రితం నాటి ఒక సనాతన బ్రాహ్మణకవినీ, వైష్ణవభక్తుణ్ణీ నేటి ఇరవై ఒకటో శతాబ్దంలో ఉండి కులంనిర్మూలకు అన్నమయ్య ఏమీ చెప్పలేదని నిర్ణయించడం  ఆ కాలంలోకి వెళ్ళి చూస్తే అంత సులువుకాదు.3 comments:

శ్యామలీయం said...

కాదేదీ విమర్శ కనర్హం.
కాదేదీ పునర్మూల్యాంకనాని కనర్హం.
ఈ రోజు మేథావులు చెలమణిలోకి తెచ్చిన కొత్త కొబద్దలతో పాత కాలం వాటిని, పాత కాలం వారిని నిర్దాక్షిణ్యంకా కొలిచి పారెయ్యటమే. ఆ హక్కు మనకు మనమే యిచ్చేసుకున్నాము.
రాబోయే తరాలవారుకూడా అదే పని చేయవచ్చుకదా?
రాబోయే తరాలవారి కొత్తకొలబద్దలతో కొలిపించుకొనటానికి మనమూ, మన గొప్ప కొత్త సంస్కృతీ సిధ్ధమేనా?
రేపటి తరాలు తప్పుపట్టే అవకాశం లేకుండా బ్రతకటం సాధ్యమా?
మేథావుల మేథస్సు సమాజాన్ని మరింత గందరగోళం పాలు చేయటమేనా తమ కొత్తకొత్తవర్గీకరణలతో వాదాలతో?

పాపం అన్నమయ్య.

vrdarla said...

రాబోయే తరాలవారుకూడా అదే పని చేయవచ్చు.

.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

చాలా బావుందండీ. very balanced analysis :)

శ్యామలీయం గారు,

"పాపం అన్నమయ్య." అనుకోవాల్సినంత విమర్శ ఇందులో ఏముందండీ. బహుశా మనిద్దరిలో ఎవరో ఒకరు సరిగ్గా చదవలేదేమో ఈ వ్యాసాన్ని :)