Friday, January 13, 2012

జీవన తాత్త్వికతను ఎగరేసే రెక్కలు !

గత రెండేళ్ళనుండీ తెలుగులో విరివిగా వస్తున్న కవితా రూపం ‘రెక్కలు’. ఎం.కె. సుగమ్‌ బాబు ప్రారంభించిన ఈ ప్రక్రియ అనతికాలంలోనే అనేక మంది కవుల్ని, విమర్శకుల్ని ఆకర్షించింది. కేవలం తెలుగులోనే కాకుండా ఆంగ్లంలోకీ ఈ కవితలు అనువాదం పొందాయి. సుగమ్‌ బాబు రాసిన కొన్ని ఎంపికచేసిన రెక్కలు కవితల్ని డేవిడ్‌ షూల్‌ మ్యాన్‌, ఆవులమంద మోహన్‌ ఆంగ్లంలోకి అనువదించగా, డా నోముల సత్యనారాయణ సంపాదకత్వంలో అది ‘ఛ్చీఠీ’ పేరుతో 2008లో ప్రచురితమైంది. తర్వాత కాలంలో శ్రీనివాస గౌడ్‌ ‘వెలుతురు వెలయాలు’, పద్మకళ ‘దృష్టి’, పెద్దూరి వెంకటదాసు, ధూర్జటి, షరీష్‌భాయ్‌ ముగ్గురూ కలిపి ‘త్రివేణి రెక్కల శతకం’ (2011), మల్లవరపు చిన్నయ్య ‘ఆమని’- ఇంకా చాలా మంది రెక్కలు కవితా సంపుటాల్ని ప్రచురిస్తున్నారు. రెక్కలు కవిత్వాన్ని పత్రికలు కూడా విరివిగానే ఆదరిస్తున్నాయి.

రెక్కలు కవిత ఆరు పాదాల్లో ఉంటుంది. మొదట నాలుగు పాదాలు రాసి, చిన్న గ్యాప్‌ ఇచ్చి మిగతా రెండుపాదాల్ని రాస్తుంటారు. రెక్కలు కవిత రెండు భాగాలుగా ఉంటుందన్నమాట! పై నాలుగు పాదాలు పక్షి శరీరంగాను, మిగతా రెండూ పక్షి రెక్కలుగాను భావిస్తూ దీనికి ‘రెక్కలు’ అనే పేరుపెట్టారనుకోవచ్చు. వీటి గురించి ప్రముఖ విమర్శకుడు డా అద్దేపల్లి రామమోహనరావు వ్యాఖ్యానిస్తూ ‘పైనాలుగు పాదాలు ఒక జీవితానుభవాన్ని గూర్చి చెబితే, చివరి రెండు పాదాలు ఆ అనుభవం ద్వారా కవి చెప్పదలచిన తత్త్వం గూర్చి చెపె్తై. జీవితానుభవం నుంచి ఉపరితలానికి వెళ్ళి ఆలోచిస్తేనే తత్త్వం విశదమౌతుంది. రెక్కలతో, ఆకాశంపైకి ఎగిరితేనే చలనం ఉన్నతమౌతుంది’ అన్నారు.

నాలుగు భాగాలుగా ఉన్నా, ఇది హైకూ, నానీల మాదిరిగా కాకుండా సిలబల్స్‌ లేదా అక్షర నియతికంటే పాదాలు, పదాల నియమానికి కట్టుబడినట్లుంది. ఒకటి నుండి మూడు పదాల వరకూ ఒక్కో పాదంలో పాటిస్తున్నారు. ఎక్కవమంది చివరి రెండు పాదాల్లో చివరి పాదాన్ని ఒకే పదంతో ముగించడం కనిపిస్తుంది. అలాగే మరో నియమం- ఎక్కువ మంది ఆరు పాదాల్నీ ఒకటి రెండు పదాలతోనే కవిత్వీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల సంక్షిప్తతతో పాటు, కవితకి సూటిదనం వస్తుంది.
ఆహా...
ఈ సువాసనలో
ఎంతహాయి
తెరచుకుంటున్నాయ్‌
వాకిళ్ళు’ ఇది సుగమ్‌ బాబు రాసిని ఒక రెక్కలు కవిత. దీనిలో ఒక్కోపాదానికి ఒక్కోపదం మాత్రమే ఉన్నా, చెప్పదలచుకున్నదాన్ని శక్తిమంతంగా వర్ణించగలిగారు.

మొదటి నాలుగు పాదాల్లో జీవితంలో దేన్నైనా కనీసం స్పర్శించకుండానే నిర్ణయాలు వెలువరించడం కంటే, దాన్ని పరిశీలించడం ద్వారా కొత్తదనమేమిటో తెలుసుకోగలుగుతామనే సూచన ఉంది. కేవలం ఏవో కొన్ని అభిప్రాయాల్ని ముందుగానే స్థిరీకరించుకొని, ఆ ప్రమాణాలతో లేదా ఆ దృష్టితోనే చూడడమనేది నూతన అన్వేషణను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని అడ్డుకున్నట్లే అవుతుంది. మొదటి దానిలో అనుభవం- అది అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గాని అనుభవం అయినవెంటనే- నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నా, కొత్తద్వారాలు ఉంటాయని చూడకపోతే, స్థిరీకృత అభిప్రాయాల్నే నిర్ణయాలుగా ప్రకటించేఅవకాశం ఉంటుంది. దీన్ని కవి ‘తెరచుకుంటున్నాయ్‌/ వాకిళ్ళు’ అంటూ కొత్తదనానికి, నూతన విజ్ఞానానికి స్వాగతం పలకాల్సిన అవసరాన్ని అభివ్యక్తీకరిస్తున్నారు.

మల్లవరపు చిన్నయ్య ‘ఆమని’ కవితా సంపుటిలో ఒక రెక్కలు కవిత ఇలా ఉంది.
‘మబ్బుల్లో
ఇళ్ళు
వాననీళ్ళై

జారిపోతాయ్‌-
నిలకడైంది
నేల!’ పైనున్న నాలుగు పాదాల్లో ఒక అందమై భావచిత్రం స్ఫురిస్తుంది. చిత్రకారుడికైతే అందమైన బొమ్మను గీయానిపిస్తుంది. మబ్బు స్థిరంగా ఉండదు. అది దాని లక్షణం. ఎటు గాలేస్తే, అటు వెళ్ళిపోతుంది. అక్కడ లేదా దానిమీదెవరైనా ఇళ్ళు కట్టుకుంటారా? వాస్తవిక ప్రపంచంలో జీవించాలంటున్నారు. సత్యం మాత్రమే నిలుస్తుంది. అశాస్త్రీయత నిలవదు. ఊహల్లో విహరించడం కంటే, తన శక్తిసామర్థ్యాల్ని గుర్తెరిగి విజయం వైపు పయనించమని ప్రబోధిస్తున్నారు కవి. అదృష్టం, దురదృష్టమంటూ పనిచేయకుండానే ఫలితాన్ని ఆశించడం తగదనే జీవితసత్యం దీనిలో ఉంది. ఇలాంటి తాత్త్విక సత్యాలేన్నో ‘ఆమని’ నిండా ఉన్నాయి.

తమ కవితలనే కాకుండా రాష్ర్ట వ్యాప్తంగా రెక్కల కవులందరినీ ఒకచోటకు చేర్చినట్లుగా పెద్ద రెక్కలు కవితా సంపుటాలనే ప్రచురిస్తున్నవారూ ఉన్నారు. మన విమర్శకులు ఇతర కవితా ప్రక్రియలతో పోల్చడం- రెక్కలు విషయంలోనూ జరుగుతున్నా, రెండూ భిన్నమైన రూపాలు. దేని శక్తి దానికుంది. అయినా, మినీ కవితా ప్రక్రియలు విరివిగా వస్తున్నప్పుడు వాటిని పోల్చి చెప్పడం కూడా విమర్శకుల బాధ్యతే అవుతుంది. మినీ కవిత్వంలో గానీ, ఇలాంటి లఘుకవితా రూపాల్లో గానీ ఒక లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
లోకోక్తుల్ని చిన్న చిన్నపదాలుగా విడగొట్టేసి కవిత్వంగా ప్రచురిస్తున్నవాళ్ళున్నారు. అది రెక్కలు కవిత్వ తత్త్వం సరిగ్గా అవగాహన కానివాళ్ళు- రెక్కలుగా రాస్తున్న దానిలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచమంత భావనని ఒక రెక్కలోనే ఇమిడ్చేయాలనే అత్యుత్యాహం కూడా కొంతమంది రెక్కలు కవిత్వంలో వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు వచ్చిన హైకూ, రుబాయిత్‌, గజల్స్‌ వంటి రూపాల్లో నియమాల్ని చెప్పడం వల్ల వాటిని పూర్తిగా కాకపోయినా, వాటిలో కొన్నింటినైనా పాటించే ప్రయత్నం చేయగలిగారు. వచనకవిత్వానికి వచనంలో రాయడమే మొట్టమొదటి లక్షణంగా భావిస్తున్నట్టు, ఆరు పాదాల్లో రాయడంతోనే రెక్కలు కవితారూపం వస్తుందనుకోకుండా, దాని తాత్త్వికతను, పాద లేదా అక్షర నియతినీ నిర్దేశించుకోవడం వల్ల ఈ ప్రక్రియకు స్పష్టత వస్తుంది. ఆ ప్రయత్నాన్ని రెక్కలు కవులూ, రెక్కలపై విమర్శలు రాస్తున్నవారూ గమనిస్తారని ఆశిద్దాం! 
-డా. దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు.
ఫోను: 9989628049, email: vrdarla@gmail.com

No comments: