Thursday, January 05, 2012

వికారాబాద్ మొదటి మున్సిపల్ చైర్మన్ ( మా మామగారు) మృతి

మా మామగారు, వికారాబాద్ పట్టణ తొలి మున్సిపల్ చైర్మన్ డా. ఎం.దేవదాస్ (71) మంగళవారం రాత్రి (9.15 ని.లకు) హఠాన్మరణానికి గురైయ్యారు.
 డా.ఎం.దేవదాసు పార్ధివదేహం
గత కొంతకాలంగా రాజకీయాలనుండి బయటకొచ్చి, ఆధ్యాత్మికచింతనలో గడుపుతున్నారు. ఆయన చేపట్టిన దేవాలయం కూడా ప్రారంభం కావల్సి ఉంది. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహం వచ్చిన వెంటనే దేవాలయాన్ని ప్రారంభించాలని ఎదురు చూస్తున్నారు.

డా.దేవదాసు గారు నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, ఆలంపల్లి, వికారాబాదు
ఇంతలోనే పూజచేసుకొని, తన కుమారుడు, భార్యలను పిలిచి, బొట్టుపెటించుకొని, తన పూజగదిలోనే కొడుకు భుజాలపై వాలిపోయి మరణించారు
.డా.దేవదాసు గారి పార్దివదేహం దగ్గర కుటుంబసభ్యులు, బంధువులు
డా. దేవదాస్ గార్కి నలుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు. (ఆ కుమార్తెలలో మొదటి అమ్మాయి ( మంజుశ్రీ) ని నేను వివాహం చేసుకున్నాను. ) పిల్లలంతా బాగానే సెటిల్ అయ్యారు. మొదటి అమ్మాయి మంజుశ్రీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్, రెండవ అమ్మాయి వసుంధర అడ్వకేట్, మూడు, నాల్లవ అమ్మాయిలు కనకదుర్ల, మాయాదేవి ఇద్దరూ జిల్లాపరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయినిలుగా పనిచేస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు శశికళాధర్ కూడా జిల్లాపరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా నే పనిచేస్తున్నాడు.
డా.దేవదాస్ మరణించారని తెలిసి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. పార్ధివదేహాన్ని బుధవారం మధ్యాహ్నానం వరకూ ప్రజల సందర్శనార్థం ఉంచి, సాయంత్రం ఊరేగింపుగా తీసుకెళ్ళి, వికారాబాదు దగ్గర్లోని ఆలంపల్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

డా.దేవదాసుగారి అంతిమయాత్ర.

ఈ అంత్యక్రియలకు ముందు డా.దేవదాస్ పార్ధివదేహాన్ని వికారాబాదు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డా.ఏ. చంద్రశేఖర్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.

నమస్తే తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ఎడిషన్, 05 Jan-2012

 డా.దేవదాస్  రాజకీయ, సామాజిక కృషి: ( సంక్షిప్తంగా)
వికారాబాదు పట్టణం, ఆలంపల్లిలో పుట్టి పెరిగిన ముత్తరగళ్ళ దేవదాసు, 1968లో ఎం.బి.బి.యస్ చేసి, రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ గా శిక్షణ పొంది, ఆ ప్రాంతాల్లో దళితుల అభివృద్దికి కృషి చేశారు.తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత వికారాబాదు పట్టణం కావడం, దానికి ఎన్నకలు జరగడం, ఆ ఎన్నికల్లో చైర్మన్ గా విజయం సాధించడం జరిగిపోయాయి. తర్వాత అనేక సార్లు శాసనసభ్యుడిగా నిలబడినా, విజయం సాధించలేకపోయారు. మున్సిపల్ చైర్మన్ గా ఉండగా , స్వయం నిర్ణయాలపై ఆధారపడ్డం, అగ్రవర్ణాల వారు చెప్పినట్లే విధాన నిర్ణయాలు తీసుకోకుండా, పట్టణశ్రేయస్సునే ఆకాంక్షించడం  వల్లనే తనని తర్వాత కాలంలో ఏ పదవిలోకీ రాకుండా అడ్డుకున్నారని నాకు చెప్పేవాడాయన.

డా.దేవదాసుగారి మృ తదేహాన్ని ఊరేగిస్తున్న దృశ్యం


డా.దేవదాసుగారి అంతిమయాత్ర.

తన తల్లి పక్కనే తననూ సమాధి చేయమని చెప్పినచోటే డా.దేవదాసుగారి సమాధి.
మొదటి నుండీ హిందూ ఆచార సంప్రదాయాలను పాటించేవాడు.అందుకే నేటికీ వాళ్ళింటిలో శాఖాహారానికే ప్రాధాన్యాన్నిస్తారు.కనీసం గంటపాటైనా పూజచేసేవాడు. నేనెప్పుడన్నా మా మామగారింటికి వెళ్ళినప్పుడు నన్నెక్కడ పూజలో కూర్చోమంటారోనని భయపడేవాణ్లి. 
నాకు తెలిసిందేమిటంటే, నేటికీ వికారాబాదు పరిసరాల్లో దళితులు క్రైస్తవులుగా మారకుండా ఉండడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ డా.దేవదాసుగారే కారణమని అంటుంటారు. వాళ్ళ పిల్లలంతా నేటికీ ఆ ఆచార సంప్రదాయాల్లోనే జీవిస్తున్నారు.   చిత్రం ఏమిటంటే, డా.దేవదాసుగారి తమ్ముడు వేణుగాపాల్ మాత్రం తన అన్నయ్యను గౌరవిస్తూనే, తాను మాత్రం అంబేద్కరిస్టుగా జీవిస్తాడు.
ఏది ఏమైనా మా మామగారు చనిపోయినందుకు నా ప్రగాఢసంతాపాన్ని ప్రకటిస్తున్నాను. 
-డా.దార్లవెంకటేశ్వరరావు
5.1.2012

No comments: