విశాఖపట్నం,
7-10-2011.
7-10-2011.
'నీలిజెండా' సంపాదకులు బొజ్జా తారకం గారికి జి.కె.డి. ప్రసాద్ జైభీములతో రాస్తున్న లేఖ...
మహాశయా...
''డాక్టర్ బండి సత్యనారాయణ కవితాసంపుటి 'రెప్పలేనిలోకం' ఆవిష్కరణ''శీర్షికన (నీలిజెండా, సంపుటి:4, సంచిక : 17, సెప్టెంబర్ 1-15, 2011, పుట : 7) వార్తాకథనాన్ని ప్రచురించారు. దీనిలో డాక్టర్ బండి సత్యనారాయణ గారిని ప్రముఖ దళితకవిగా పేర్కొనడం జరిగింది. ఈ విషయం మీద నాకు అభ్యంతరం వుంది. ఆయన కవి కావచ్చేమోకాని దళితకవి కాదని తమకు తెలియజేస్తున్నాను.
1. డాక్టర్ బండి సత్యనారాయణ ఇంతవరకు దళిత కవిత్వం రాయలేదు.
2. దళిత సిద్ధాంతాలకు వ్యతిరేకమయిన అంశాలను శీర్షికలుగా చేసుకుని కవిత్వాన్ని రాశారు.
3. దళిత కులంలో పుట్టిన కవులని దళితకవిగా పిలవ్వల్సిసిన అవసరం లేదని గతంలో
దశాబ్దకాలం జరిగిన 'దళితవాద వివాదాలు' చర్చ నిరూపిస్తుంది.(ఈచర్చలో మీరూ వున్నారు)
4. దళితకులంలో పుట్టి వాళ్ళ కోసమే కవిత్వాన్ని రాసేవారిని మాత్రమే నేను దళితకవులని భావిస్తాను.
5. 'రెప్పలేని లోకం' కవితాసంపుటిలో ఒక దళితపదం కూడా లేదు. (జతచేసిన సమీక్షలో
గమనించగలరు)
6. ఈయన గతంలో చేసిన రచనలన్నీ దళితేతర రచనలే (దళితజీవితాలకు, సాహిత్యానికి సంబంధం లేని రచనలు)
అ) గుండెపగిలిన శబ్దం(కవిత్వం) (చావు)
ఆ) దరిచేరేదారి (రేడియోనాటకం) (మత్స్యకారులకి సంబంధించిన విషయం)
ఇ) కొత్తరుతువు (కవిత్వం) (ప్రకృతి కవిత్వం)
ఈ) పునరపిజననం (దీర్ఘకవిత) (కర్మసిద్ధాంతాన్ని కౌగిలించుకుంటున్న వాదం)
పిహెచ్.డి థీసెస్‌ని రెండు భాగాలుగా ముద్రించిన గ్రంథాలు
అ) భాగవత జానపద గేయపరామర్శ
ఆ) భాగవత జానపదకథలు, కథాగేయాలు
ద్వా.నా.శాస్త్రితో కలసి చేసిన ఉమ్మడి రచనలు
అ) తెలుగుతేజం పురిపండ అప్పలస్వామి జీవితం - సాహిత్యం
ఆ) విద్యావరణం (దీర్ఘకవిత)
ఇక్కడ పేర్కొన్న ఆయన రచనలు ఏవీ దళిత సాహిత్య సంబంధితం కాదు.
ఈ కారణాలతో నేను డాక్టర్ బండి సత్యనారాయణని దళితకవిగానూ, ప్రముఖ దళితకవిగానూ దళిత పత్రికలు పేర్కొనడాన్ని ఖండిస్తున్నాను. కాగితాల వినియోగాన్ని పెంచే కవిత్వంతో దళిత ప్రజానీకానికి పని లేదని నేను విశ్వసిస్తున్నాను. లి'వార్షికాదాయం' కోసం చాల మంది 'కవి' అవతారాలెత్తుతున్నారు. వీరిలో కొందరు మరీ బరితెగించి దళితకవి అవతారాలెత్తుతున్నారు. ముఖచిత్రం నుంచి ఆవిష్కరణ వరకు అన్ని ఖర్చుల్నీ ప్రజలనెత్తినపెట్టి కవులుగా ముద్రవేసుకుంటున్నారు. సామాజిక అవసరం కోసం రావలసిన కవిత్వాన్ని కాలదన్ని సరదా కవిత్వం రాసి సంబరపడుతున్నారు.
'దళితకవి' చాలా శక్తివంతుడు. దళితకవికి, దళిత సాహిత్యానికి ఉద్యమ చరిత్ర వుంది. ప్రాణాలను పణంగా పెట్టి కలాన్ని నడిపించిన కదనరంగం దళితకవి జీవితం. అటువంటి దళిత కవుల సరసన నయాపైసా, వడ్డీపాయిదాల, రియలెస్టేట్ కవులందర్నీ చేర్చడాన్ని నేను నిరసిస్తున్నాను. మీరు ప్రచురిస్తే బాగుంటుంది.
------------------------------------------------------------------------------------------------------------
(గోదావరిజిల్లాల గ్రామాల్లో ఆర్.ఎం.పి., పి.ఎం.పి., వైద్యులు ఏడాదికోసారి భక్తి పేరుతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తుంటారు. ఇది సత్యనారాయణస్వామి మీద భక్తి కాదు చదివింపుల (కానుకలు) మీదనే అని విరోధులంటూవుంటారు. నేను మాత్రం దీన్ని వార్షికాదాయం అంటాను.)
-------------------------------------------------------------------------------------------------------------
జైభీములతో...
-జి.కె.డి.ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి