29-8-2011 Surya Literary Supplement
-Dr.Darla Venkateswara Rao,
Assistant Professor,
Dept .of Telugu,
University of Hyderabad, (Central University),
Gachibowli, Hyderabad-500 046
e-mail: vrdarla@gmail.com
Ph: 040-23133563 (O), Mobile: 09989628049,
1.0 పునర్మూల్యాంకన విమర్శ :
సాహిత్యాన్ని ఉత్పత్తి చేసేవాళ్ళు, దాన్ని మూల్యాంకన చేసేవాళ్ళు మారినప్పుడల్లా సాహిత్య విలువల నిర్ణయంలో మార్పులొస్తాయి.‘మూల్యాంకనం’ చేయడమంటే రచనలోని సాహిత్య, సామాజిక విలువల్ని గుర్తించడమే. ఆ సామాజిక, సాహిత్య పరిస్థితులు మారినప్పుడు ఆ విలువల్ని మళ్ళీ నిర్ణయం చేయడాన్నే పునర్మూల్యాంకన విమర్శ అంటారు. ఆంగ్లంలో దీన్ని ‘‘రీవేల్యూయేటివ్ క్రిటిసిజమ్’ అని ఆంగ్లం పిలుస్తారు. దీన్నే ‘‘పునర్విమర్శ’’ అని కూడా అంటారు.
1.1 వివరణ:
1.సాహిత్యంలో శాశ్వత విలువలు ఉండటానికి అవకాశంలేదనే విశ్వాసమే పునర్మూల్యాంకనకు మొదటి కారణమంటూ ‘‘ అంతవరకూ ఉపయోగంలో లేని కొత్త సిద్ధాంత, సాహిత్య విమర్శా సూత్రాలను ఉపయోగించటమే’’ సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయటం అంటారని వల్లంపాటి వెంకట సుబ్బయ్య (విమర్శాశిల్పం, పుటలు:18,19) పేర్కొన్నారు.
2.‘‘ సాహిత్య చరిత్రను నిర్దిష్టంగా దాని కాలంలోని తత్త్వ శాస్త్ర, నైతికశాస్త్ర, రాజకీయ, న్యాయ వ్యవస్థ, మత, ఆర్థిక విషయాలతో అవిభాజ్యమైన సంబంధం కలిగి ఉంటుందనే దృష్టితో అధ్యయనం చెయ్యాలి. ఇలాంటి అధ్యయనమే సాహిత్యం నిర్వహించిన వాస్తవ సామాజిక పాత్రని నిరూపించగలదు.దీనినే పరస్పరవాదం అంటారు’’ అని త్రిపురనేని మధుసూధనరావు (సాహిత్యంలో వస్తు-శిల్పాలు, పుట: 86) పునర్మూల్యాంకన విమర్శనే తనదైన రీతిలో వివరించారు.
3.‘‘సాహిత్యం సమాజాన్ని మూల్యాంకన చేస్తుంది.అది సృజనాత్మకంగా జరుగుతుంది. కొంతకామయినాక అదే సాహిత్యం పునర్మూల్యాంకన కూడా చేస్తుంది. మారిన సామాజిక పరిస్థితులు ఈ అవసరాన్ని కల్పిస్తాయి. అలాగే, సాహిత్య విమర్శ కూడా సాహిత్యాన్ని ఒకసారి మూల్యాంకన చేస్తుంది. మరికొంతకాలానికి పునర్మూల్యాంకానికి పూనుకుంటుంది. సంప్రదాయ కథలు ఆధునిక కాలంలో నూతన దృక్పథంలో వ్రాయబడడం పునర్ మూల్యాంకనం’’ అని ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (చర్చ, పుట:132) నిర్వచించారు.
ఇంకా చాలా మంది పునర్మూల్యాంకన విమర్శను వివరించిన వాళ్ళు ఉన్నారు.
తెలుగులో కట్టమంచి రామలింగారెడ్డి ‘‘కవిత్వతత్త్వ విచారం’’ (1914) కాలం నుండే పునర్మూల్యాంకన జరిగినా, దాన్నొక సిద్ధాంతంగా వల్లంపాటి వెంకటసుబ్బయ్య అనువర్తించి చూపారని ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. దీన్ని పరిశోధన కంటే భిన్నమైన విమర్శగా ఆచార్య హెచ్.ఎస్.బ్రహ్మానంద ( తెలుగులో పరిశోధన, పుట: 36) పేర్కొన్నారు. ఇక పునర్మూల్యాంకన విమర్శ స్వరూప, స్వభావాల్ని పరిశీలిద్దాం!
1.2 పునర్మూల్యాంకన విమర్శ - పార్శ్వాలు
పునర్మూల్యాంకన విమర్శలో రెండు పార్శ్వాలు ఉన్నాయని విమర్శకులు (ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, చర్చ,పుట:132.) వర్గీకరిస్తున్నారు. మొదటి పార్శ్వం, సృజనాత్మక సాహిత్యం రూపంలో సమాజాన్ని మూల్యాంకన, పునర్మూల్యాంకన చేస్తూ వెలువడటం. అంటే, సమాజ అవసరాలకు అనుగుణంగా సాహిత్య సృజన జరుగుతూనే, మళ్ళీ అదే సృజనాత్మక సాహిత్యం మారిన సామాజిక అవసరాలకు అనుగుణంగా పునర్మూల్యాంకనతో పున: సృజనగా రూపొందుతుందన్నమాట.
వీటికి ఉదాహరణలుగా రామాయణ, భారతాలకు సంబంధించిన కథలు ఆధునిక కథలుగా రాసే ప్రయత్నాన్ని చాలా మంది చేస్తున్నారు. అలాగే కొన్ని నీతి శతకాలకు ప్రాచీన కథల్ని వివరణలుగా రాసిన పుస్తకాల్ని ( వేమన, సుమతీ శతకపద్యాలకు పురాణ కథలు, రచయిత్రి శ్రీమతి కుసుమ.కె.మూర్తి) చెప్పుకోవచ్చు.
కనుక,సాహిత్య పరిణామంలో వస్తున్న మార్పుల్ని మాత్రమే కాకుండా, గతంలో విమర్శకులుగా చేసిన తమ అభిప్రాయాల్లో వచ్చిన పరిణామాల్ని కూడా సమీక్షించుకునే అవకాశం పునర్మూల్యాంకన విమర్శ వల్ల కలుగుతుంది.ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’’(13 సంపుటాలు),డా॥ముదిగంటి సుజాతారెడ్డి ‘‘చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర’’(1996), డా॥పిల్లి శాంసన్ ‘‘ దళితసాహిత్య చరిత్ర’’ (2000), డా॥సుంకిరెడ్డి నారాయణరెడ్డి ‘‘ ముంగిలిా తెలంగాణా ప్రాచీన సాహిత్యం’’(2009) మొదలైన సాహిత్య చరిత్రలతోపాటు ప్రత్యేకించి ఈ దృష్టితో తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం కనిపిస్తుంది.
రెండవ పార్శ్వం, ఒకసారి రచనను మూల్యాంకన చేస్తూ విమర్శ వెలువడినా, మారిన సామాజిక విలువల్ని బట్టి ఆ విమర్శల్ని సైతం పునర్విమర్శ చేయడం. వీటికి కుల, మత, ప్రాంతీయ సైద్ధాంతిక భావజాలాల వంటి కొలమానాలుగా ఉండటం కారణం కావచ్చు.
వీటికి ఉదాహరణలుగా నన్నయ నుండి శ్రీశ్రీ వరకూ వారి సాహిత్యాన్ని కుల, మతం, ప్రాంతీయ దృక్పథంతో పునర్మూల్యాంకన చేయడం విస్తృతంగానే జరుగుతుంది.
పునర్మూల్యాంకన విమర్శ స్వరూపం రీత్యా వాదాప్రతివాద విమర్శగానే కనిపిస్తున్నా, స్వభావం భిన్నంగా ఉంటుంది.ఉదాహరణకు డా॥ద్వానాశాస్త్రి (‘సద్విమర్శ ఎందుకు రావడం లేదు’ వ్యాసం, ఆంధ్రభూమి ‘సాహితి’ 25-06-2001), ‘భావవాద సాహిత్యంలో కొట్టుకుపోతున్న పదసాహిత్య పరిశోధకులు’ గురించి ‘ఆంధ్రజ్యోతి’ (7-6-1999)లో ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి రాసిన విమర్శ వ్యాసాలు, విమర్శ రీత్యా వాద-ప్రతివాద స్వరూపాన్ని కలిగి ఉన్నా స్వభావం రీత్యా పునర్మూల్యాంకన విమర్శ అవుతుంది.
విమర్శకులు గతంలో తాము చేసిన తమకు కలిగిన కొత్తచూపు, నూతన అవగాహనలతో వచ్చిన పరిణామం దృష్ట్ట్యా తమ విమర్శను తామే పునర్మూల్యాంకనం చేసుకోవడం కూడా దీనిలో ఒకభాగమే. ఇటువంటి విమర్శకు ఉదాహరణగా తాపీ ధర్మారావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్యల విమర్శల్ని గమనించవచ్చు.
1. మొదట్లో వ్యవహారిక భాషావాదంతో గిడుగు, గురజాడలను, సనాతన సంప్రదాయ ధోరణిలోనే భావకవిత్వాన్ని విమర్శించారు. 1930 తర్వాత ఆయన విమర్శలో చారిత్రక, సామాజిక దృష్టి కనిపించి తన సాహిత్య విమర్శను తానే పునర్మూల్యాంకనం చేసుకున్నారు. ఆయన రాసిన ‘‘కొత్తపాళీ’’, ‘‘ సాహిత్య మొర్మరాలు’’ అనే సాహిత్య విమర్శ గ్రంథాలతో పాటు ‘‘ఇనుపకచ్చడాలు’’, ‘‘దేవాలయాల మీద భూతు బొమ్మలెందుకు?’’, ‘‘పెళ్ళి - దాని పుట్టపూర్వోత్తరాలు’’ పుస్తకాల్లో ఇటువంటి పునర్మూల్యాంకన విమర్శ కనిపిస్తుంది.
2. వల్లంపాటి తన 1980లో రాసిన ‘‘ఆధునిక సాహిత్య విమర్శ పద్ధతులు’’ వ్యాసంలో ‘‘జీవితము, సాహిత్యము, సాహిత్య విమర్శా సమబాహు త్రిభుజంలోని మూడు భుజాలవంటివి. ఈ మూడూ ఒకదాన్ని విడిచి మరొకటి నిలవలేవు. ప్రతిపత్తి దృష్టితో చూచినప్పుడు వీటి మధ్య ఎక్కువ తక్కువలు లేవు’’ అని రాసుకున్న దాన్నే 1981లో ‘‘సాహిత్యంలో వస్తున్న మార్పుల్ని ఆధారం చేసుకొని సాహిత్యంలో వస్తువూ, రూపమూ మారుతూ ఉంటాయి. ఈ మార్పుల్ని ఆధారం చేసుకొని సాహిత్య విమర్శ వస్తుంది’’ అని వివిధ చర్చలానంతరం గుర్తించానని (విమర్శాశిల్పం, పుట:1) తన సాహిత్య విమర్శను తానే పునర్మూల్యాంకనం చేసుకున్నారు.
కనుక,సాహిత్య పరిణామంలో వస్తున్న మార్పుల్ని మాత్రమే కాకుండా, గతంలో విమర్శకులుగా చేసిన తమ అభిప్రాయాల్లో వచ్చిన పరిణామాల్ని కూడా సమీక్షించుకునే అవకాశం పునర్మూల్యాంకన విమర్శ వల్ల కలుగుతుంది.
ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’’(12 సంపుటాలు),డా॥ముదిగంటి సుజాతారెడ్డి ‘‘చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర’’(1996), డా॥పిల్లి శాంసన్ ‘‘ దళితసాహిత్య చరిత్ర’’ (2000), డా॥సుంకిరెడ్డి నారాయణరెడ్డి ‘‘ ముంగిలి- తెలంగాణా ప్రాచీన సాహిత్యం’’(2009) మొదలైన సాహిత్య చరిత్రలతోపాటు ప్రత్యేకించి ఈ దృష్టితో తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం కనిపిస్తుంది.
1.3 విమర్శ నుండి పునర్మూల్యాంకన విమర్శకు పయనం:
సృజనాత్మక రచనల్ని చేస్తూ కవులు వివిధ సందర్భాల్లో కావ్యావతారికల్లో కవిత్వమెలా ఉండాలో తమ అభిప్రాయాల్ని చెప్పినా, అవి విమర్శ కొలమానాలుగా కాకుండా, ఆ కవుల్ని, ఆ రచనల్ని అవగాహన చేసుకోవడానికి సహకరిస్తాయని, ఆచార్య జి.నాగయ్య ‘‘కావ్యావతారికలు’’ (1968), ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ‘‘ప్రాచీనాంధ్రకవుల సాహిత్యాభిప్రాయాలు’’ (1992) గ్రంథాలు, మరికొంతమంది రాసిన వ్యాసాలు తెలుపుతున్నాయి. ప్రాచీన కవుల కావ్యావతారికల్లో కొన్ని విమర్శక స్ఫృహ, Ûప్రమాణాలు ఉన్నట్లనిపించినా, అంతర్గతంగా భారతీయాలంకారిక సిద్ధాంతాల ప్రభావమే కవుల్ని తమదైన రీతిలో వ్యక్తీకరించేలా చేసిందనటం సమంజసం.
సంస్కృత పంచతంత్ర కథల్లోని ‘విగ్రహతంత్రం’ కథని కొక్కొండ వెంకట రత్నం పంతులు తెలుగులోకి అనువదించి 1872లో ప్రచురించాడు. కందుకూరి వీరేశలింగం కూడా ‘విగ్రహతంత్రం’ కథని అనువదించి ‘వివేకవర్దిని’ ప్రత్రికలో ప్రచురించగా, రెండిరటిలో కొక్కొండ వారి అనువాదమే బాగుందని కొక్కండ వారే శివశంకర్ పాండ్యాపేరుతో 1875లో రాశాడు. ఈ రచనను ఖండిస్తూ పాశ్చాత్య సాహిత్య దృక్పథంతో కందుకూరి వీరేశలింగం రాసిన ‘‘విగ్రహతంత్రవిమర్శనము’’ (1876) గ్రంథంతో తెలుగులో ‘సాహిత్య విమర్శ’ ప్రారంభమైందని విమర్శకుల అభిప్రాయం (ఆచార్య ఎస్.వి.రామారావు, తెలుగులో సాహిత్య విమర్శ, పుట: )
ఆ తర్వాత కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి ‘వివేకచంద్రికా విమర్శనము’’(1896), పి.దక్షిణామూర్తి ‘పింగళిసూరన’ (1892), వెన్నేటి రామచంద్రరావు ‘మనుచరిత్ర-వసుచరిత్ర రచనా విమర్శము’ (1899) మొదలైన గ్రంథాల్లో పాశ్చాత్య సాహిత్య సంప్రదాయాల్ని అనుసరించినా అది మండనము,మండన-ఖండనము, ఖండనము పద్ధతిలో తులనాత్మక, వాద ప్రతివాద విమర్శగానే కొనసాగింది.
ఇటువంటి ఖండన - మండన విమర్శ కొనసాగుతున్న నేపథ్యంలోనే కట్టమంచి రామలింగారెడ్డి ‘కవిత్వ తత్త్వ విమర్శనము’ (1914)లో భాష గ్రాంథికమైనా, తెలుగు సాహిత్యంలో ఆధునిక విమర్శకు స్పష్టమైన మార్గాన్నేర్పరిచింది. అందుకనే ‘పునర్మూల్యాంకన విమర్శ’ కట్టమంచితోనే ప్రారంభమైందని విమర్శకులు (విమర్శాశిల్పం, పుట: 19) భావిస్తున్నారు.
1.4 తెలుగులో పునర్మూల్యాంకన విమర్శ - నాలుగు దృక్పథాలు
భారతీయ ఆలంకారిక సిద్ధాంతాలతో కట్టమంచి వరకూ కొనసాగిన విమర్శ, ‘కవిత్వతత్త్వ విమర్శనము’తో ఒక మలుపు తిరిగి కవి భావనా శక్తిని, సామాజికాంశాల్ని చూడడంతో ప్రాచీన సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం ప్రారంభమైంది. ఇది నాలుగు ధోరణుల్లో కొనసాగుతుందని వర్గీకరించవచ్చు.
మొదటి ధోరణిని డి.డి.కోశాంబి, రొమిల్లాథాపర్ వంటి చరిత్రకారులు అందించిన దృష్టితో రామాయణ, మహాభారతాల్ని చారిత్రక దృష్టికోణంతో పునర్మూల్యాంకనం చేయడం ప్రారంభమైంది.భారతదేశ చరిత్రను సాహిత్యంతో ముడిపెట్టి రాసిన డి.డి.కోశాంబి పుస్తకాల్ని బాలగోపాల్, వి.రామకృష్ణ తదితరులు తెలుగులోకి పరిచయం చేశారు. అలాగే ఇ.హెచ్.కార్ ‘‘చరిత్ర అంటే ఏమిటి?’’ (1983), అనే పేరుతో వల్లంపాటి తెలుగులోకి తెచ్చారు. చిన్న వ్యాసమే అయినా కోశాంబి వ్యాసాన్ని ‘‘భగవద్గీత చారిత్రక పరిణామం’’ ( 1995), ఆర్వీయార్ ‘‘భగవద్గీత - మార్క్సిజం’’ (2002) మొదలైనవన్నీ తెలుగు సాహిత్యాన్నీ, విమర్శనీ పునర్మూల్యాంకనం చేసినవే. మద్దుకూరి చంద్రశేఖరరావు ‘‘ఆంధ్రసాహిత్యంలో కొత్తపోకడలు’’ రారా (సారస్వత వివేచన), ఆర్వీయార్, కొ.కు (సాహిత్య ప్రయోజనం) శ్రీశ్రీ ( మనగురజాడ), కె.కె.రంగనాథాచార్యులు సంపాదకత్వంలో వచ్చిన ‘‘తెలుగు సాహిత్యం మరోచూపు’’ , ‘‘ తొలి తెలుగు సమాజ కవులు’’ మొదలైన విమర్శ గ్రంథాల్లోను, విడివిడిగా రాసిన వ్యాసాల్లోను నన్నయ నుండి నేటి సాహిత్యం వరకూ చారిత్రక, సామాజిక, ఆర్ధిక, స్త్రీవాద, దళిత, ప్రాంతీయ అస్తిత్వ భూమికలో కొత్త ఆలోచనల్ని అందించారు. అలాగే, వెల్చేరు నారాయణరావు ‘‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’’ , వి.చెంచయ్య ‘‘సాహిత్య దృక్పథం’’ మొదలైన విమర్శ గ్రంథాల్ని పేర్కొనవచ్చు.
రెండవ ధోరణిని జ్యోతిబా పూలే, అంబేద్కర్ భావజాల దృక్పథంతో సాహిత్యాన్ని, విమర్శనీ పునర్మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఆచార్య కొలకలూరి ఇనాక్, కత్తి పద్మారావు, సతీష్‌చందర్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, బి.యస్.రాములు, బొజ్జాతారకం,జి.లక్ష్మీనరసయ్య, దార్ల వెంకటేశ్వరరావు తదితరుల్ని పేర్కొనవచ్చు.
నన్నయ నుండి నేటి వరకు సాహిత్యాన్నీ, కవుల్నీ కుల, మత దృష్టితో చూడడం ఈ ధోరణిలో కనిపిస్తుంది. నన్నయ బ్రాహ్మణ భావజాలాన్ని కాపాడ్డానికే సాహిత్యాన్ని రాశాడనీ, తర్వాత కాలంలో శివకవులు కొంతవరకూ దళితుల్ని దగ్గరకు చేర్చుకున్నా, మతానికి వీరిని ఉపయోగించుకున్నారనీ, ఆ తర్వాత వేమన, వీరబ్రహ్మం దళితుల్ని దగ్గరకు చేర్చుకొనే ప్రయత్నం చేశారనీ ఈ ధోరణిలోని విమర్శకులు విమర్శ చేస్తున్నారు. ముఖ్యంగా జాషువ గురించి ఎక్కువగా విమర్శ, పునర్మూల్యాంకన విమర్శ వచ్చింది. జాషువా గురించి కందుకూరి ‘‘ఆంధ్రకవుల చరిత్ర’’లో పేర్కొనలేదనీ, ఆరుద్ర ‘‘ సమగ్రాంధ్ర సాహిత్యం’’ లో దళితేతరకవులకిచ్చినంత ప్రాధాన్యతనివ్వలేదని కత్తి పద్మారావు (దళితసాహిత్యం-జాషువా, 2008 : 41), మొదలైన విమర్శకులు పేర్కొన్నారు. అలాగే, జాషువాను కవికోకిలగానే తప్ప సామాజిక దృష్టితో చూడలేదనే విమర్శ వచ్చింది. ఇదంతా పునర్మూల్యాంకన విమర్శలో భాగమే.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కులం పోవాలని ఆశించలేదనీ, ‘‘అన్నీ బ్రహ్మమనే ధోరణిలో కులభేదాల్ని ఖండిరచా’’రని అస్తిత్వదృక్పథం (ఎన్.గోపి,‘‘కర్మయోగి వీరబ్రహ్మం’’వ్యాసం) విమర్శించారు. అలాగే అన్నమయ్య కూడా కులాన్ని నిరసించడంగా కాకుండా, దేవుని ముందు అన్ని కులాలు సమానమనే దృష్టినే ప్రదర్శించాడనీ, దీన్ని పరిశోధకులు గమనించాలని రాచపాళెం చంద్రశేఖర రెడ్డి (చర్చ, పుట:67) సోదాహరణంగా వివరించారు.
చేకూరిరామారావు (చేరాతలు)లోను, కాత్యాయనీ విద్మహే ‘‘సంప్రదాయ సాహిత్యం - స్త్రీవాద దృక్పథం’’లోను, జయప్రభ కన్యాశుల్కంలో మధురవాణి గురించి చేసిన విమర్శ ఎక్కువ భాగం పునర్మూల్యాంకన విమర్శగానే కనిపిస్తుంది. గురజాడ కథల్తో బండారు అచ్చమాంబ కథల్ని పోలుస్తూ ‘‘దిద్దుబాటు’’ (కథానిక)ని ప్రాంతీయ అస్తిత్త్వచైతన్యంతో పునర్మూల్యాంకన చేశారు. స్త్రీ విద్య, ధనత్రయోదశీ వంటి కథల్ని తొలి తెలుగు కథానికలుగా నిర్ణయించే ప్రయత్నం స్త్రీవాద, ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంలో భాగంగా జరిగిన పునర్మూల్యాంకన విమర్శగా కనిపిస్తుంది.
ఈ రెండు ధోరణులు మార్క్సిస్టువిమర్శ, అస్తిత్వ విమర్శలు పునర్మూల్యాంకన విమర్శ దృక్పథాల్లో అంతర్భాగంగా కొనసాగుతున్నాయి.
మూడవ ధోరణిని చూస్తే, ప్రాచీనసాహిత్యాన్ని ఆధునిక సామాజిక, పాశ్చాత్య సిద్ధాంతాలతో పునర్మూల్యాంకనం చేస్తున్నట్లే, ఆధునిక సాహిత్యాని భారతీయ ఆలంకారిక సిద్థాంతాలతో అనువర్తించే ప్రయత్నంలోను పునర్మూల్యాంకన విమర్శ వస్తుంది. నవ్యసంప్రదాయం పేరుతో వచ్చిన సాహిత్యంలో ప్రధానంగా ఈ ధోరణే కనిపిస్తుంది. జి.వి.సుబ్రహ్మణ్యం, ముదిగొండ వీరభద్రయ్య, వడలి మందేశ్వరరావు మొదలైన వాళ్ళ విమర్శలో ఈ దృష్టి కనిపిస్తుంది.
అస్తిత్వవాద విమర్శలో భాగంగా తెలంగాణా సాహిత్యాన్ని ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో శాస్త్రీయంగా పునర్మూల్యాంకన చేస్తున్న ముదిగంటి సుజాతా రెడ్డి నవలా సాహిత్యాన్ని భారతీయాలంకారిక సిద్ధాంతాల్లోని రససిద్దాంతంతో అనువర్తిస్తూ రాసిన కొన్ని వ్యాసాల్ని ‘‘రసచర్చ-ఆధునికత’’ (2009) పేరుతో ప్రచురించిన పుస్తకం ఈ ధోరణికి చెందిందే.
నాల్గవ ధోరణిని చూస్తే, ప్రాచీన సాహిత్యంలో దైవవరాలతో కవులు పుట్టడం ( వేములవాడ భీమకవి), కవిత్వం రాయడం (పోతన, మొల్ల తదితరులు), సరస్వతీదేవే స్వయంగా కావ్యాన్ని రాయడం(పిల్లలమర్రి పినవీరభద్రుని జైమినీ భారతం) వంటి కల్పిత కథలలో విమర్శ ఉందనీ, అది జానపదుల విమర్శ అనీ ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘‘ జానపదుల సాహిత్య విమర్శ ’’ ( 2010) ప్రతిపాదించడం కనిపిస్తుంది. ప్రాచీన సాహిత్యాన్ని ఈ విమర్శన దృష్టితో చూసినప్పుడు, భావవాదం నుండి జానపదుల ‘‘లౌకికత్వం’’ అనేది నాటి ప్రజల్నీ, కవుల్నీ అనేక ప్రమాదాల నుండి కాపాడడానికి చేసిన కల్పనలుగా భావించాలి. తద్వారా నాటి జీవన పరిస్థితులు జానపదుల కల్పనలకు కారణమైతే, వాటినే కవులు దైవవరాలుగా, మాహాత్మ్యాలుగా వర్ణించారని అవగానకు ఈ ప్రతిపాదన తోడ్పడుతుంది. దీన్నింకా సైద్ధాంతికంగా పరిశీలించవలసిన అవసరం ఉన్నా, ప్రాచీన తెలుగుకవుల మాహాత్మ్యాల్ని ఆధునికంగా అవగాహన చేసుకోవడానికిది మార్గం వేస్తుంది. ఇది కూడా పునర్మూల్యాంకన సాహిత్య విమర్శలో భాగమే అవుతుంది.
1.4.1 మార్క్సిస్టు పునర్మూల్యాంకన విమర్శ తీరు తెన్నులు
గతితార్కిక, భౌతిక వాదంతో ఉపరితలంలో కనిపించే అనేకాంశాలకు పునాధిలోఉండే అంశాల ప్రభావ విశ్లేషణతో తెలుగు సాహిత్యం అంతా ఆస్థాన, ఆస్థానేతర సాహిత్యంగా సాహిత్యాన్నీ, విమర్శనీ పునర్మూల్యాంకనం చేస్తున్నారు. గురజాడ, శ్రీశ్రీ, అభ్యుదయ సాహిత్యాన్ని మాత్రమే కాకుండా, వీరిని అస్తిత్వవాద దృష్టితో విమర్శించే విమర్శపై కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళు మార్క్సిస్టు దృక్పథంతో పునర్మూల్యాంకన విమర్శ చేస్తున్నారు. కన్యాశుల్కం ( గురజాడ), మాలపల్లి (ఉన్నవ నవల) పై ఇటువంటి విమర్శ విస్తృతంగా వచ్చింది.ఆధునిక యుగకర్తగా గురజాడనూ, అభ్యుదయ యుగకర్తగా శ్రీశ్రీనీ గుర్తించి వాళ్ళే, ఆ నిర్ణయాల్ని పునర్మూల్యాంకనం చేసుకొంటూ ఆధునిక కాలంలో యుగకర్తలకు కాలం చెల్లిందంటున్నారు. కులాన్నీ, లింగ వివక్షనూ మార్క్సిస్టుదృక్పథంతో విశ్లేషిస్తున్నారు. గుర్రం జాషువా సాహిత్యాన్నీ, ఆ సాహిత్యంపై వచ్చిన విమర్శపై పునర్మూల్యాంకన విమర్శ చేస్తున్నారు.
ప్రస్తుతం మార్క్సిస్టు విమర్శ, సంప్రదాయ విమర్శల్నీ, అస్తిత్త్వవాద విమర్శల్నీ పునర్మూల్యాంకన చేస్తూ ఒక నూతన సమన్వయానికి ప్రయత్నిస్తుంది.మిత్రవైరుధ్యంతోనే అస్తిత్వవాదుల్ని ప్రపంచీకరణ ప్రభావాన్ని గుర్తించమని హెచ్చరిస్తూ, సంప్రదాయ సాహిత్యాన్ని బలంగానే తిరస్కరించే ప్రయత్నం చేస్తుంది.
1.4.2 అస్తిత్వవాద పునర్మూల్యాంకన విమర్శ తీరుతెన్నులు
నన్నయ నుండి నేటి వరకు వచ్చిన సాహిత్యాన్నీ, విమర్శనీ అస్తిత్త్వం కోసం తపిస్తున్న స్త్రీ, దళిత, మైనారిటీ, ప్రాంతీయ, బహుజన వాదాలతో పునర్మూల్యాంకన విమర్శ వస్తుంది.
తమ ఆత్మగౌరవాన్ని కించపరచడానికి, కనీసం మనుషులుగా కూడా పరిగణించకపోవడానికి కారణమైన ‘కులాన్ని’ ఆధారంగా చేసుకొని దాన్ని ఒక కొలమానంగా దళితసాహిత్య విమర్శ, పునర్మూల్యాంకన విమర్శ కొనసాగింది. దళితుల్లోను అంత:సంఘర్షణలున్నాయని, సాహిత్యమంతా ఒకటిగా భావిస్తూనే వివక్షకు గురిచేసిన దళితేతరుల్లాగే తమనీ దళితులూ వివక్షకు గురిచేస్తూ, నిర్లక్ష్యానికి గురిచేసి తమ అస్తిత్వాన్ని గుర్తించాలని దళితుల్లోని ఉపకులాల వాళ్ళు సాహిత్యపరంగాను, విమర్శపరంగాను పునర్మూల్యాంకనం చేస్తున్నారు.
స్త్రీవాదుల్లో జెండర్, లింగవివక్షను, ప్రాంతీయ చైతన్యవాదులు ప్రాంతాన్ని అనుసరించి వివక్ష కొనసాగిస్తున్నారంటూ, మైనారిటీలుగా బతుకుతున్న ముస్లిం, క్రైస్తవులు మతాన్నీ, సంఖ్యాబలాన్నీ ఆధారంచేసుకొని వివక్ష కొనసాగిస్తూ ఆధిపత్యంపై తిరుగుబాటుగా సాహిత్యాన్నీ, సాహిత్య విమర్శనూ పునర్మూల్యాంకన చేస్తున్నారు. సంప్రదాయాన్ని ప్రశ్నిస్తూనే భాషలో, తీసుకొనే వస్తువులో కొత్త ప్రమాణాలు అవసరం అంటున్నారు. తమ వాస్తవిక జీవితం నుండి సాహిత్యాన్నీ, విమర్శనీ చూడాలంటున్నారు. సాహిత్య పీఠాల్నీ, యుగకర్తల్నీ పునర్మూల్యాంకనం చేస్తూ తమ తమ స్థానాల్ని నిర్ధారణ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
విమర్శపై పునర్మూల్యాంకన విమర్శ
కత్తి పద్మారావు జాషువాపై వచ్చిన విమర్శల్ని ఖండిస్తూ చేసిన విమర్శా, కొలకలూరి ఇనాక్ దిగంబరకవుల సాహిత్యంలో అశ్లీలపదాలున్నాయని చేసిన విమర్శల్ని పూర్వపక్షంచేస్తూ వచ్చిన విమర్శ పునర్మూల్యాంకన విమర్శ అవుతుంది.
సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం విస్తృతంగానే జరుగుతున్నా, సాహిత్యవిమర్శ పునర్మూల్యాంకనం చేయడం ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని 2004 సాహిత్యవిమర్శను సమీక్షిస్తూ ( వార్త : 9-1-2005) ప్రముఖ విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి,(చర్చ, ప్రథమముద్రణ,2006, ద్వితీయ ముద్రణ, 2010-132) వ్యాఖ్యానించారు. కనుక, పునర్మూల్యాంకనకు ఉన్న భిన్న పార్శ్వాల్ని గమనించాలి.సాహిత్య విలువల్ని నిర్ణయించిన విలువల్ని పున: సమీక్ష చేసే దిశగా పునర్మూల్యాంకన విమర్శ కొనసాగుతుంది. సాహిత్యపునర్మూల్యాంకన చేసే విమర్శకులు అధికంగానే ఉన్నా, విమర్శను పునర్మూల్యాంకన చేస్తున్న విమర్శ మాత్రం కొద్దిగానే వస్తున్నా, మొత్తం మీద ఇప్పుడు సాహిత్యం, సాహిత్య విమర్శ పునర్మూల్యాంకనం చేసుకొంటుందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు.
ఆధారగ్రంథాలు:
ఇనాక్, కొలకలూరి, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం,హైదరాబాదు: జ్యోతి గ్రంథమాల,
ద్వితీయ ముద్రణ, 2010, ( ప్రథమ ముద్రణ, 1996).
ఇనాక్, కొలకలూరి, జానపదుల సాహిత్య విమర్శ, హైదరాబాదు: జ్యోతి గ్రంథమాల, 2010.
ఎల్లయ్య, వేముల, స్కైబాబ ( సంపాదకులు). ముల్కి ( ముస్లిం సాహిత్య సంకలనం), హైదరాబాదు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2005.
కుసుమ.కె.మూర్తి, వేమన, సుమతీ శతకపద్యాలకు పురాణ కథలు, దృశ్య పబ్లికేషన్స్, హైదరాబాదు:
ప్రథమ ముద్రణ: జనవరి, 1999, ద్వితీయ ముద్రణ: సెప్టెంబరు,1999)
చంద్రశేఖరరెడ్డి,రాచపాళెం. చర్చ ( తెలుగు సాహిత్య విమర్శ, పరిశోధనల మీద వ్యాసాలు),
హైదరాబాదు: విశాలాంధ్ర బుక్ హౌస్, ద్వితీయ ముద్రణ, 2010, ( ప్రథమ ముద్రణ, 2006).
చంద్రశేఖర రెడ్డి, రాచపాళెం. ‘‘వేయిరేకులుగా వికసిస్తున్న తెలుగు సాహిత్య విమర్శ’ (వ్యాసం,
పుటలు: 198-202),తెలుగుపున్నమి(వ్యాససంకలనం), సుబ్బారావు, గుత్తికొండ, పూర్ణచందు, జి.వి.(సంపాదకులు), విజయవాడ: కృష్ణాజిల్లారచయితల సంఘం, 2011.
నారాయణరెడ్డి, సుంకిరెడ్డి. ముంగిలి (తెలంగాణా ప్రాచీన సాహిత్యం), సికిందరాబాద్:
తెలంగాణ ప్రచురణలు, 2009.
నారాయణరెడ్డి, సుంకిరెడ్డి. గనుమ ( దళిత, బహుజన, ముస్లిం, తెలంగాణ అస్తిత్వ సాహిత్య వ్యాసాలు),
హైదరాబాదు: తెలంగాణ సాహిత్య పరిషత్,2010.
పద్మారావు, కత్తి.దళితసాహిత్యం -జాషువ, పొన్నూరు: లోకాయుక్త ప్రచురణలు, 2008,
( ప్రథమ ప్రచురణ,2001).
మధుసూధనరావు, త్రిపురనేని. సాహిత్యంలో వస్తు-శిల్పాలు, హైదరాబాదు: పర్‌స్పెక్టివ్ ప్రచురణలు, 1997.
రవి, తెలకపల్లి. శ్రీశ్రీ జయభేరి ( జీవితం-సాహిత్యం-రాజకీయాలు), హైదరాబాదు: ప్రజాశక్తి బుక్‌హౌస్,2010.
రామలింగారెడ్డి, కట్టమంచి. కవిత్వతత్త్వవిచారము అను పింగళి సూరనార్య కృత కళాపూర్ణోదయ
ప్రభావతీ ప్రద్యుమ్నముల విమర్శనము, విశాఖపట్టణం: ఆంధ్రవిశ్వకళాపరిషత్, 1980.
రాములు, బి.ఎస్. బహుజనతత్త్వం, హైదరాబాదు: విశాల సాహిత్య అకాడమీ ప్రచురణ, 2003.
రామానుజరావు, దేవులపల్లి., అప్పారావు, పి.యస్.ఆర్., సుబ్రహ్మణ్యం,జి.వి. (సంపాదకులు).
తెలుగులో పరిశోధన,హైదరాబాదు:ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1983.
రంగనాథాచార్యులు, కె.కె.( సంపాదకుడు), తెలుగులో తొలిసమాజ కవులు, హైదరాబాదు:
ఆంధ్రసారస్వత పరిషత్తు, 1983.
రంగనాథాచార్యులు, కె.కె.( సంపాదకుడు), ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు,
హైదరాబాదు: ఆంధ్రసారస్వత పరిషత్తు, 2005, (ప్రధమ ముద్రణ,1982).
లక్షణ చక్రవర్తి, సి.హెచ్., వారిజారాణి., విజయకుమార్,పి., (సంపాదకులు). ఆధునిక సాహిత్య విమర్శ రీతులు, హైదరాబాదు: ఆంధ్రవిద్యాలయ స్నాతకోత్తర తెలుగు శాఖ,2005.
లక్షణ చక్రవర్తి, సి.హెచ్., వారిజారాణి., విజయకుమార్,పి., (సంపాదకులు). ఆధునిక సాహిత్య విమర్శకులు-ప్రస్తానాలు (సమకాలికులు), హైదరాబాదు: ఆంధ్రవిద్యాలయ స్నాతకోత్తర తెలుగు శాఖ,2008.
వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. విమర్శాశిల్పం, 2002ా18,19) ,హైదరాబాదు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్, 1997.
వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. రాయలసీమలో ఆధునిక సాహిత్యం-సామాజిక సాంస్కృతిక విశ్లేషణ, మదనపల్లి:స్వీయప్రచురణ, 2006.
వెంకటేశ్వరరావు, దార్ల. పునర్మూల్యాంకనం ( సాహిత్యవ్యాసాలు), హైదరాబాదు: సొసైటీ అండ్
ఎడ్యుకేషన్ ట్రస్టు, 2010.
సత్యనారాయణ, ఎస్. (సంపాదకుడు). దళితవాదవివాదాలు, హైదరాబాదు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్, 2000.
సుజాతారెడ్డి, ముదిగంటి. (సంపాదకురాలు). ముద్దెర ( తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్య
విమర్శ వ్యాసాలు) హైదరాబాదు: రోహణమ్ ప్రచురణలు, 2005.
(తెలుగు శాఖ, యోగివేమన విశ్వవిద్యాలయం, కడప మరియు సాహిత్య అకాడమీ, బెంగుళూరు వారు సంయుక్తంగా 26, 27 ఆగస్టు 2011తేదీలలో నిర్వహించిన ‘‘ తెలుగు సాహిత్య విమర్శ-భావజాల అధ్యయనం ’’ జాతీయ సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి