మన తెలుగులో మూడు భావజాలాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లనిపించే ప్రచురణ సంస్థలు కనిపిస్తున్నాయి. మొదటి స్థానంలో మార్క్సిస్టు భావజాలాల్ని వ్యాప్తిచేసేవి, రెండవస్థానంలో సంప్రదాయసాహిత్యాన్ని ప్రచురించడానికి ఆర్థికసహాయాన్ని అందిస్తూ, ప్రచురిస్తున్నవీ, మూడవ స్థానంలో కులనిర్మూన లక్ష్యంగా, ప్రాంతీయ వివక్షల్ని వివరించే సాహిత్యాన్ని ప్రచురిస్తున్న సంస్థలుగా వీటిని వర్గీకరించుకుకోవచ్చు. ఇలాంటి విభజనకి ప్రమాణాలేమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చు. మార్కెట్లోను, గ్రంథాలయాల్లోను లభిస్తున్న పుస్తకాలే వీటికి ఆధారం. దీన్ని శాస్త్రీయంగా గణాంకాలతోసహా నిరూపించే ప్రయత్నంతో ఈ వ్యాసంలో విశ్లేషించలేకపోయినా, ఆ ప్రయత్నం జరిగితే ఫలితాంశాలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. మనమనుకున్నట్లు పై మూడు రకాల భావజాలాలున్న ప్రచురణ సంస్థల్ని, ఆ ప్రచురణల్ని అమ్మే విక్రయశాలల పరిస్థితుల్ని గమనిస్తే ధార్మికసంస్థలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయనిపిస్తుంది.
విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ‘‘మతం మత్తుమందు’’ అని నమ్మి, దాన్ని ప్రచారం చేసే ప్రచురణ సంస్థలు మతపరమైన పుస్తకాల్ని కూడా విరివిగానే అమ్ముతుంటారు. కానీ, ధార్మికసంస్థల వారు అమ్మే పుస్తక విక్రయశాలల్లో ఎక్కడా మార్క్సిజం వాసన కూడా రానివ్వకుండా జాగ్రత్తపడతారు.మార్క్సిస్టు ప్రచురణ సంస్థలు ఇంతగా వాసన చూసి పుస్తకాల్ని విక్రయించడంలో దూరం పెట్టేయకపోయినా, కులనిర్మూలనను, కుల చైతన్యంతో రాసే సాహిత్యాన్ని మాత్రం ప్రచురించకుండా మాత్రం జాగ్రత్త పడుతున్నాయి. ఒకటి రెండు ప్రచురణలు కనిపిస్తున్నా, వాటిలో వర్గదృక్పథమే ప్రధానమౌతుంది.ఇలాంటప్పుడు రెండు రకాలైన (మత, వర్గ) భావజాలాల్ని ప్రచారం చేయడానికి ప్రచురణ సంస్థలు ఉన్నా, తెలుగులో కులనిర్మూనచైతన్యంతో రాసే రచనల్ని ప్రచురించే సంస్థల్ని గాలించాల్సిన పరిస్థితే కనిపిస్తుంది.ఇలాంటి పరిస్థితే మన తెలుగు పత్రికల్లోను కనిపిస్తుంది. పార్టీలకు అండగా ఉండే పత్రికల్లో సాధారణంగా వారి లక్ష్యాలకు అనుగుణంగా రాసే సాహిత్యాన్నే ప్రచురిస్తుంటారు. దానికి కారణం, పార్టీకి, దానికి అనుబంధంగా ఉండే సాంస్కృతిక సంఘాలకీ కొన్ని ప్రణాళికలు ఉంటాయి. వాటిని అనుసరించే సాహిత్యసృష్టిజరుగుతుంది. అటువంటప్పుడు ఇక్కడ సృజనకారుడికి ఉన్న స్వేచ్ఛ కొంత హరించకతప్పదు. వాని ఆలోచనలపై ‘నియమాలు’ పెత్తనాన్ని చెలాయిస్తుంటాయి. అదే క్రమంలో ‘‘స్వేచ్ఛ’’ పేరుతో కొనసాగేÛ విశృంఖలత్వానికి దారితీయకుండా ఉండేందుకు ఆ మార్గం ఉపయోగపడుతుంది. ఇటువంటప్పుడు సృజనకారుడు ఆ మార్గంలో నడవలేక బయటకొచ్చేసే అవకాశమూ ఉంది. మరికొన్నిసార్లు ఆ మార్గంలో ఉంటూనే వ్యవస్థీకృత ప్రయోజనాల్ని నెరవేరుస్తూ, దాని వల్ల తన ప్రయోజనాల్ని కూడా నెరవేర్చుకుంటూ, వైయక్తికమైన అనుభూతుల్ని వదల్లేక ‘‘అజ్ఞాత’’ వ్యక్తిగా బహిర్గతమైయ్యే అవకాశం ఉంది. దీనిలో భాగమే చాలా మంది కలం పేర్లు, మారు పేర్లతో సృజనకారులుగా బయటకు వస్తుంటారు. ఇటువంటి వాళ్ళ ద్వైదీభావాన్ని అంచనా వేయడం చాలా కష్టమైనా, అవకాశాలు అందిపుచ్చుకునే వాళ్ళుగా వీళ్ళని గుర్తించవచ్చు.
మరికొన్ని సార్లు ఆ వ్యవస్థలో ఉంటూనే అజ్ఞాతంగా ప్రవర్తించడంలో ఆ వ్యవస్థనే సక్రమమార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితీ కనిపిస్తుంది. అందుకే కరపత్రాలు, ఉత్తరాలు, పోస్టర్లనీ, ఈ మధ్య కాలంలో ఎస్‌ఎమ్‌ఎస్‌ల్నీ, ఇంటర్నెట్‌లో వచ్చే బ్లాగుల్నీ, వాటిపై వచ్చే వ్యాఖ్యల్నీ జాగ్రత్తగా గమనించాలి.వీటిలో తక్షణత్వం, తీక్షణత్వం ఎక్కువగా ఉంటుంది.సరిదిద్దుకోవాల్సిన అంశాలుంటాయి.ఇక్కడ కూడా కొన్ని అతివాదధోరణులు తప్పవు.వాటికెంత వరకూ ప్రాధాన్యాన్నివ్వాలో, అంతవరకే వాటిని చూడాలి. వీటిని జాగ్రత్తగా గమనిస్తే సాహిత్యానికి ఉపయోగపడే కొన్ని అంశాలుంటాయి.
బ్లాగుల్లో రాసిన రచనలో సమగ్రత లోపించిందనిపించినప్పుడు దాన్ని సరిదిద్దుకొనే అవకాశం ఉండటం వల్ల రచయితకు మరోఅవకాశం దొరుకుతుంది. అలాగే, క్లిష్టమైన అంశాల్ని విశ్లేషించుకోవచ్చు. సామరస్యపూరిత వాతావరణంలో సాగే వాదప్రతివాదాల వల్ల సాహిత్యానికీ, సాహిత్యకారులకీ ప్రయోజనం ఉంటుంది. నేడు పత్రికల్లోను వాదప్రతివాదనలు సాగినా, వారాలు, నెలలూ ఆగాల్సి వస్తుంది. దీనికి తోడు రాసిందాన్ని ‘‘ఎడిట్’’ చేసి ప్రచురించడం వల్ల రచయిత భావాలు వక్రీకరణకు గురవుతున్నా, వాటిని మళ్ళీ వినిపించుకునే అవకాశాలు చాలా తక్కువ. ఇంటర్నెట్‌లో అయితే, తనకు నచ్చిన భాషలో కావాల్సినంతగా రాసుకోవడానికి బ్లాగులు ఉచితంగానే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే వీటిలో గల సాంకేతిక పరిజ్ఞానం వల్ల తాను ఇంతకు ముందు రాసిన దాన్ని మళ్ళీసరిచేసుకొనే వీలుంది.కానీ, వెంట వెంటనే మార్చేసుకోనే వీలుండటం వల్ల బ్లాగుల్లో వచ్చే రచనల విశ్వసనీయత అనుమానస్పదవేఅవుతుంది.వాటిని మార్చకుండా వాదప్రతివాదనలు చేసేవాళ్ళూ ఉన్నారు.ఇవన్నీ ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి.బహుశా వీటన్నింటినీ గమనించే కావచ్చు, అంతర్జాలం ( ఇంటర్నెట్)లో పెట్టిన ‘‘ఈ పత్రికలు’’ వెంటనే స్పందించడానికి వీలుగా వ్యాఖ్యల్ని రాయడానికి అవకాశం కల్పిస్తున్నాయి.
ఇవన్నీ ఇలా ఉండగా ఇటీవల కాలంలో యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్,న్యూఢల్లీి వాళ్ళు వివిధ పధోన్నతులకు కచ్చితంగా ఐఎస్‌బిఎన్ (Iూదీచీ-Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ూ్aఅసaతీస దీశీశీస చీబఎపవతీ) , ఐఎస్‌ఎస్‌ఎన్ (Iూూచీ - Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ూ్aఅసaతీస ూవతీఱaశ్రీ చీబఎపవతీ) నంబర్లు గల పత్రికలు, పుస్తకాలనే పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధనను ఒకదాన్ని పెట్టింది. ఆంగ్లంలో ప్రచురించే గ్రంథాలకి ఇటువంటి నిబంధనలు చాలా సులువుగా అనువర్తించుకునే అవకాశం ఉంది. తెలుగు పుస్తకాల్ని ప్రచురించేవాళ్ళు ఈ నెంబర్ల విషయంలో పెద్దగా పట్టించుకోవట్లేదు. నిజానికి ఈ నెంబర్లు ఉన్న పత్రికలు,పుస్తకాలు అంతర్జాతీయ ప్రమాణాల్ని అనుసరించి వెలువడుతున్నాయా? లేదా? అనే విషయాల్ని చూడ్డానికి ఎలాంటి సంస్థాలేదు. కాకపోతే, అవి ఉంటే, సర్కులేషన్‌కి ప్రాధాన్యానిచ్చే సంస్థలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఈ నెంబర్లు లేకపోతే గ్రంథాలయాల్లో ఆ పుస్తకాల్ని ఉంచడానికి ఇష్టపడవు. ఇక్కడే మరో విషయాన్నీ ప్రస్తావించుకోవాలి.పుస్తకం లేదా పత్రికలో వచ్చిన వ్యాసం యొక్క ప్రామాణికత ఆ నెంబరు ఉండటం వల్ల మాత్రమే ఒనగూరుతుందనీ చెప్పలేం. అందుకనే యు.జి.సి.వాళ్ళు భారతీయ భాషాగ్రంథాలు, పత్రికల ప్రామాణికతను నిర్ణయించడంలో దేశవ్యాప్తంగా ఒకే నియమాన్ని అనుసరించడం కుదరకపోవచ్చు. అయినప్పటికీ, రానున్న కొన్ని సంవత్సరాల్లో ఈ నెంబర్ల అవసరం పట్ల రచయితల్లోను, ప్రచురణ కర్తల్లోను చైతన్యం వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ నెంబర్లు లేకుండానే మన తెలుగు ప్రచురణసంస్థలు, వ్యక్తిగతంగాను పుస్తకాల్ని ప్రచురించుకొంటున్నారు. మన తెలుగు పత్రికలు కూడా ఈ నెంబర్ల పట్ల ప్రస్తుతం పెద్దగా దృష్టిని కేంద్రీకరించకపోయినా,భవిష్యత్తులోనైనా వీటి పట్ల శ్రద్దవహించాల్సిన అవసరం ఉంది. అప్పుడు తాను రాసిన రచనకు విలువ ఉందని భావించడం వల్ల పరిశోధకులు, సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకొనే వాళ్ళు దినపత్రికలకు కూడా విరివిగానే రచనల్ని పంపిస్తారు.ఎంతమంది ఎలాంటి రచనల్ని పంపినా, ఆ రచన నిజంగా ఆ ఇష్టాయిష్టాలతో రాశాడా? లేదా? అనే విషయాన్ని గుర్తించగలిగేది పాఠకుడే!అయినప్పటికీ, ఇలా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, విమర్శ లేదా ఏదైనా ఒక ప్రక్రియకి సంబంధించిన సాహిత్య పరిణామాన్ని విశ్లేషించడం వల్ల ఆ సాహిత్య గమనం తెలుస్తుంది. రచయితలు ఎలాంటి సాహిత్యాన్ని రాస్తున్నారని గానీ, పాఠకులు ఎలాంటి సాహిత్యాన్ని ఆదరిస్తున్నారని గాని, లేదా పత్రికలు, ప్రచురణకర్తలు ప్రోత్సహిస్తున్న సాహిత్యం ఎటువంటిదో గుర్తించడానికి గాని కాలానుక్రమంగా వచ్చిన సాహిత్య విశ్లేషణ ఉపయోగపడుతుంది.
-Dr.Darla Venkateswara Rao,
Assistant Professor,
Dept .of Telugu,
University of Hyderabad, (Central University),
Gachibowli, Hyderabad-500 046
e-mail: vrdarla@gmail.com
Ph: 040-23133563 (O), Mobile: 09989628049,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి