నిన్నటిదాకా నా సీతాకోక చిలుక
రెక్కలు తొడిగినట్లుండే
కోటి సోయగాల కోనసీమ
సంక్రాంతి ముగ్గుల్లో
పారాణింకా ఆరని సిగ్గు మొగ్గల్లో
దీపావళి కాంతుల నిత్యసింగారిణి!
గుండెల్లో కొలస్ట్రాల్ పేల్చిన పేలుళ్ళకో
నమ్మిన మనసు దహించిన బ్లోఅవుట్లకో
‘మారక’ద్రవ్యమై
హాస్పటల్ బెడ్‌పై వాలిపోయింది!
చూపులన్నీ నిర్జీవాలు
కోప తాపాలన్నీ బలవంతపు ప్రయత్నాలు
మాటల్లో వేదాంతం
చేతల్లో విధ్యుక్తం
క్షణక్షణాల్లో జీవితం
వరం పొందాకే నిర్వేదం!
నీటిబుడగలో, మట్టి కుండలో
కొవ్వొత్తి వెలుగులో
ఆకాశ నక్షత్రాల్లో...
‘గీత’ బోధలో తెలుస్తున్న జీవ రహస్యం!
- దార్ల వెంకటేశ్వరరావు
(ఆ మధ్య ఆపోలో ఆసుపత్రిలో చేరినప్పుడు రాసిన కవితని ఆంధ్రభూమికి పంపాను. అది వచ్చిందో లేదో నేను చూసుకోలేదు. ఆఫ్సర్ గారు ఆంధ్రభూమిలో పనిచేసేటప్పుడు దాన్ని రెగ్యులర్ గా చూడ్డమే కాదు, అప్పుడప్పుడూ రాసి ఆయనకి ఇచ్చేవాడ్ని. ఆయన ఎంతగానో ప్రోత్సహించేవారు. ఈ మధ్య దానికి రాయకపోవడమే కాకుండా, రెగ్యులర్ గా చూడలేకపోతున్నాను. ఈ రోజు ఎందుకో నా పేరు గూగుల్ లో శోదిస్తే, ఈ కవిత ఆంధ్రభూమిలో ఆగస్టు,15, 2010, ఆదివారం సంచికలో ప్రచురించినట్లు తెలుసుకొని, చాలా రోజుల తర్వాత నిజమైన సంతోషాన్ని అనుభవించాను. ఆ కవిత ఇది....దార్ల)
1 కామెంట్:
దార్ల;
ఈ కవిత బాగుంది. మీ ఆత్మీయ వచనాలకు కూడా ధన్యవాదాలు.
కానీ, అపోలో ప్రస్తావన నాకు అర్థం కాలేదు.
అంతా క్షేమమని అనుకుంటున్నా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి