"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

28 March, 2011

అస్తిత్వ ఉద్యమాల్లో కుల సాహిత్యం

Courtesy : 28 March 2011 Surya Literary Supplement


-డా॥దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ, 
సెంట్రల్‌యూనివర్సిటి, హైదరాబాదు-46
తెలుగు సాహిత్యంలో స్త్రీ, దళిత, మైనారిటి, ప్రాంతీయ, బహుజన ఉద్యమాలు తారాస్థాయికి చేరుకున్న తర్వాత సాహిత్యానికి ఉన్న బాధ్యత పెరిగింది. అంతకు ముందున్న సాహిత్యంలోనూ అది కనిపిస్తున్నా, శిష్టవర్గాలమని చెప్పుకుంటున్న వారి దృష్టి నుండే అది లక్షణీకరింపబడిరది. దానితో సమాజశ్రేయస్సు అంటూనే కొన్ని వర్గాల వారి శ్రేయస్సుకే ఒక సాధనంగా సాహిత్యాన్ని మలుచుకునే ప్రయత్నం అవిశ్రాంతంగా కొనసాగింది.దాన్నే నేటికీ సాహిత్య విలువలు, వారసత్వం పేరుతో బోధనాంశాలుగా అమలైపోతున్నాయి. 
ఆంధ్రమహాభారతాన్ని  చాతుర్వర్ణ పరిరక్షణ కోసమని స్పష్టంగా చెప్పినా, అది కొన్ని ఆధిపత్యవర్ణాల వారి సాహిత్యమనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.కులాన్ని పరిరక్షించడంలో అది వెయ్యేళ్ళకు పైగా తన పాత్రను తాను నిర్వహించుకొంటూనే పోతుంది.దళిత సాహిత్యం కులం వద్దని, దాన్ని నిర్మూలించేదిశగా రూపొందినా, దీన్ని కులసాహిత్యంగా ప్రచారం చేయడం ఆశ్చర్యకరం! శివకవులు కులాన్ని విస్మరించి, భక్తిభావానికి అధికప్రాధాన్యాన్నిచ్చి, సామాజికంగా కులవివక్షను ఎదుర్కొంటున్నవాళ్ళను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేసినట్లనిపిస్తుంది. కానీ, వీరిలోనూ కులాన్ని విస్మరించలేమన్న వాళ్ళున్నారు. అయినప్పటికీ, తెలుగు సాహిత్యంలో తొలిసారిగా అనేక కులాల వాళ్ళను ప్రధాన జీవనస్రవంతిలోకి రమ్మని పిలుపునిచ్చిన వాళ్ళు శివకవులనే చెప్పుకోవచ్చు. కానీ, సామాజికంగా తక్కువగా చూడబడుతున్న కులాల వాళ్ళ త్యాగాల్ని  శైవమత వ్యాప్తికి ఉపయోగించుకుని పరోక్షంగా మరోసారి కులంపై మతం తన ఆధిక్యాన్ని ప్రదర్శించుకుంది.
మతం మత్తుమందని చెప్పి, కులాన్ని కూడా మతంలో అంతర్భాగంగా పరిగణించి, ప్రత్యేక కుల అస్తిత్వాన్ని గుర్తించనవసరం లేదని చాలామంది వాదించడానికి కులపుట్టుక ఒక బలమైన కారణమే. కులం అనేది ప్రధానంగా హిందూ మతభావన నుండే పుట్టినా,గుణ, కర్మ విభాగాలు ఆచరణలో చెప్పిందానికి విరుద్ధంగా మానవత్నాన్ని విధ్వంసం చేసి, మరిన్ని కులాల ఆవిర్భావానికి కారణమైంది.హిందూమతం, ప్రపంచవ్యాప్తంగా కులభావన లేని మతాల్లోను కులవిభజనలకు మార్గం వేసింది. అలా ప్రవేశించిందే క్రైస్తవం, ముస్లిం మతాల్లోను కులం.నేడు భారతదేశం నుండి అనేకదేశాల్లో విస్తరించి, కులం ఒక ప్రపంచ సమస్య అయ్యింది.అందుకే కేవలం కులాన్ని మతంలో అంతర్భాగంగా మాత్రమే చూస్తే సరిపోదు. దాన్నొక ప్రత్యేక సామాజిక సమస్యగానే పరిగణించాలి.తెలుగులో ఆ మతాల్లోను కనిపించే కులవివక్షనిరసనతో సాహిత్యం వస్తోంది.
విప్లవోద్యమ సాహిత్యం తొలిసారిగా దాన్ని ప్రశ్నించినా, కులాన్ని పునాదిగా  కాకుండా, ఉపరితలాంశంగానే నిరూపించేప్రయత్నం చేసింది. కులం, లింగ, ప్రాంతీయ వివక్షలకు గురవుతున్నవాళ్ళను కూడా శ్రామికులు, పీడితులుగానే పరిగణించడం వల్ల వీళ్ళ అస్తిత్వాన్ని గుర్తించడంలో దేశీయవాస్తవికతలను వర్గవాదులు విస్మరించినట్లయ్యింది. అందువల్ల అస్తిత్వ సాహిత్యాన్ని వ్యతిరేకించే సంప్రదాయసాహితీకారుల్లోనే వీరూ చేరిపోతున్నారు.   
పలనాటివీరచరిత్రలో ‘కన్నమనీడు’ని, అతడ్ని చేరదీసిన బ్రహ్మనాయుడ్ని గుర్తిస్తూనే, ఆ వీరత్వం దేనికి                            ఉపయోగించుకున్నారని అస్తిత్వ సాహిత్యం ప్రశ్నిస్తుంది.శ్రీకృష్ణదేవరాయులు మాలదాసరి కథలో నిష్కళంకమైన భక్తిని గమనిస్తూనే, కథనీకరించిన తీరులో, పూర్వం బ్రాహ్మణుడనడంలోని సృజనశీలతను కూడా అస్తిత్వ సాహిత్యం లోతుగానే అధ్యయనం చేస్తుంది. అందువల్లనే నన్నయ ధర్మవ్యాధుణ్ని కూడా ఇలాగే వర్ణిస్తే, హేతువాద దృష్టితో త్రిపురనేని రామస్వామి చౌదరి ‘‘సూతపురాణం’’లో వర్ణితమైన ధర్మవ్యాధుని పాత్రతో తులనాత్మకంగా పరిశీలించి విలువల్ని నిర్ణయించడంలో అస్తిత్వ వాదం భౌతికవాదానికే పీట వేస్తుంది.నాటి సామాజికతకు భావనాత్మక ప్రతిఫలనంగా  ఆపాత్రల్ని ఎవరైనా సూత్రీకరించే ప్రయత్నం చేసినా కూడా, దాన్ని నిర్ద్వంధంగా తిరస్కరిస్తుంది. అన్ని పాత్రలు ఆ కవి సృష్టే అయినప్పటికీ, కవి ఆత్మీయత ప్రసరించిన పాత్రలు కాకుండా, మిగతా వాటి ద్వారా వ్యక్తమైన భావాల వల్ల ఆ సాహిత్యదృక్పథాన్ని గుర్తిస్తుంది. అందువల్ల అన్ని పాత్రల్నీ ఆ కవే సృజనీకరించినా, తన భావజాలాన్ని స్థిరీకరించడానికి జరిగిన ప్రయత్నాన్ని వివిధ ఆధారాలతో కనుగొని, కులాధిక్యాన్నీ, కులవివక్షల్నీ ప్రదర్శించిన తీరుతెన్నుల్ని అస్తిత్వవాదం సూత్రీకరణలు చేస్తుంది. కావ్యంలో అనేక ఉపాఖ్యానాలు, అనేక పాత్రలు కల్పించినా, కవి తాను పుట్టుక వల్ల గానీ, ఆశ్రయం వల్ల గానీ, కావ్యం ఎవరికోసం రాశారనేదాన్ని బట్టి కవి ఆత్మీయతల్ని కనుగొనే ప్రయత్నం చేస్తుంది.
రామాయణాన్ని రాసిన వాల్మీకి ఒక బోయవాడైనా, కావ్యంలో వ్యక్తమైన భావజాలాన్ని బట్టి కవి అస్తిత్వాన్ని నిర్ణయిస్తూనే, కవికి గుర్తింపునిస్తున్నదెవరో, ఇవ్వనిదెవరో గమనిస్తూనే, అటువంటి కావ్యాల్నీ, ఇతిహాసాల్నీ రాసిన కవులకీ, కావ్యాలకీ ఇస్తున్న గౌరవమర్యాదల్ని ప్రస్తావిస్తు, తమ అస్తిత్వాన్ని విస్మరించి, తాత్కాలిక ప్రయోజనాలకు లంగిపోతే చరిత్రలో అటువంటివాళ్ళకుండే అస్తిత్వమెలా ఉంటుందో గమనించమనే హెచ్చరికగా వాళ్ళనే చూపిస్తుంది. ఇక్కడే మరొకటి కూడా చర్చలోకి వస్తుంది. 
తమ కులానికి చెందని వాళ్ళు తమ గురించి రాస్తుంటారు. తమ కులం వాళ్ళ రచనలకంటే ఎఫెక్టివ్‌గా ఉండొచ్చు. అప్పుడే రచనలకు, రచయితలకు ప్రాధాన్యాన్నివాలనే సందేహం రావచ్చు. తమ కులాన్ని ఆధారంగా చేసుకుని జరుగుతున్న వివక్షను తమ వాళ్ళు సమర్థవంతంగా రాయలేనంతకాలం మరో కులం వాళ్ళు రాసినా, వాటిని తమ గురించి రాసిన సాహిత్యంగానే గుర్తించడం జరుగుతుంది. కానీ, తమ కులం వాళ్ళు రాయాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, ఆ అవకాశాన్నివ్వకుండా కులేతరులు ఆ అవకాశాల్ని లాక్కోవాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తారు. తమ కులాన్ని వాళ్ళ బిరుదులకోసమో, బహుమతుల కోసమో మాత్రమే ఉపయోగించుకుని, ఆచరణలో తమ కులాన్ని విస్మరిస్తే చూస్తూ సహించకూడదంటుంది అస్తిత్వకుల సాహిత్యం. తమని రాయనివ్వనంత మాత్రం చేత వాళ్ళని వ్యతిరేకించడమో, నిరాదరించడమో కాదు. వాళ్ళు తమ నిజమైన అస్తిత్వాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నిజాయితీగా ఒప్పుకుని, వారిని ప్రోత్సాహించాలి. అలా కానప్పుడు వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. 
ఇదే సూత్రం తమకులం వాళ్ళు తమకి కులం లేదంటూ కులవ్యతిరేక చైతన్యంతో రాసే రాతలను, ఆ కవులను తీవ్రంగానే వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. కానీ, తమ కులం వాళ్ళనే గుర్తింపుతోనే, వాళ్ళేమి రాసినా ఆకాశానికి ఎత్తేసి, తమ కుల రచయితలు గొప్పవాళ్ళనే ప్రచారం అస్తిత్వకుల సాహిత్యంలో కనిపిస్తుంది. దీనికి అస్తిత్వవాద సాహిత్యం పట్ల సరైన అవగాహన లేకపోవడమే కారణం. కాబట్టి, శిక్షణాతరగతుల్ని నిర్వహించి,, ఆ రంగంలో నిష్ణాతుల చేత ప్రసంగాల్ని ఇప్పిండం, వ్యాసాల్ని రాయించడం ద్వారా నిజమైన అస్తిత్వ సాహిత్య చైతన్యాన్ని పెంపొందించగలగాలి. దీనితో పాటు అస్తిత్వవాద సాహిత్య పరిధుల్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆధిపత్యాన్ని, వివక్షనీ వ్యతిరేకిస్తూ, మళ్ళీ వాటినే మరో రూపంలో ఆచరణలోకి తీసుకొచ్చేప్రయత్నాలు మంచిది కాదు.ఇంచుమించు ఇవే నియమాలు మిగిలిన అస్తిత్వవాద ఉద్యమసాహిత్యానికీ వర్తిస్తాయి. వివక్షను ప్రశ్నించి,తమ అస్తిత్వాన్ని గుర్తించమని అస్తిత్వసాహిత్యం వాదిస్తుంది.     

No comments: