"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

18 October, 2010

బతుకమ్మ - దసరాపండుగ - దళితులు


18`10` 2010
ఎప్పడికప్పుడు అనుకుంటూనే ఉంటాను.
మనసుని కదిలించిన వాటన్నింటినీ భద్రపరుచుకోవాలని.
కానీ, కుదరదు. ఏదో బద్దకం. ఏదో భయం.
కొన్ని రాయాలనిపిస్తుంది. 
మరికొన్ని రాస్తే ఏమవుతాదో అనిపిస్తుంది. అనుభవాన్ని అక్షరీకరించేటప్పుడు, దాన్ని ఆలోచన మింగేస్తుందన్నమాట.
నిజమే. అన్నీ రాయలేం. అదీ కొన్ని పదవుల్లో, కొన్ని బాధ్యతల్లో ఉన్నప్పుడు అనుకున్నవన్నీ రాయలేం. కానీ రాయగలిగేవి కూడా రాయకపోతే ఎలా?
ఇప్పటికే డైరీలు రాయడం మానేస్తున్నాం.
మనం కలిసిన వ్యక్తుల నుండి మనమెన్నో నేర్చుకోవాల్సినవుంటాయి. వాటిని గుర్తు పెట్టుకోవాలి. కొన్ని కేవలం మనకి మాత్రమే కాదు. మనం కలిసిన వ్యక్తుల గురించి ఇతర్లూ తెలుసుకోవాల్నినవుంటాయి. అది మన దృష్టి కోణమే కావచ్చు. అది కొంతమందికి నచ్చొచ్చు. మరికొంతమందికి నచ్చకపోవచ్చు కూడా!
దీనివల్లేమొస్తుంది?
మన మనసు తేలిక పడుతుంది.
ఆ మధ్య ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య చనిపోయారు. మన తెలుగు సాహిత్య విమర్శకుల్లో ఆయన కూడా చాలా గొప్పవాడు. నేనాయన గురించి ఒక నివాళి వ్యాసం రాయాలనుకున్నాను.
సరిగ్గా అప్పుడే నాకు కొంత అనారోగ్యం. తగ్గేసరికి కొన్ని రోజులు పట్టింది. దీనితో ఆయన గురించి అప్పుటికే పత్రికల్లో కొంతమంది రాసేశారు. అయినా మరెక్కడైనా రాయాలనిపించింది. రాయలేకపోయాను. అది నేటికీ నాకు తీరని వేదనను కలిగిస్తుంది. అయినా ఎప్పుడోకప్పుడు రాయాలనుకుంటున్నాను. 
ఇలాంటి సమయంలో ఒకరోజున అఫ్సర్‌ అమెరికా నుండి ఫోను చేశారు. అప్పుడప్పుడూ ఆయనే ఫోను చేసి పలకరిస్తుంటారు. ఆయన్ని నేను గురువుతో సమానంగా భావిస్తాను. ఆయన పత్రికల్లో ఉండగా నన్నెంతగానో ప్రోత్సహించారు.
ఫోను చేసినప్పుడల్లా అక్కడి సాహిత్య విషయాల్ని నాకు చెప్తంటారు. ఇక్కడెలా ఉందని అడుగుతుంటారు. నిజానికి ఇక్కడే సాహిత్య ధోరణులు కొనసాగుతున్నాయో, ఇక్కడి సాహిత్య వాతావరణమెలా ఉందో ఆసక్తి కలిగిన అక్కడి వారికే బాగా తెలుసనిపిస్తుంది.
ఆ మాటల సందర్భంలో కోవెల సంపత్కుమారాచార్య గురించి ప్రస్తావించాను. ఆయన గురించి రాయాలనున్నా రాయలేని స్థితిలో ఉన్నానన్నాను.
 ‘కొంతమందిని కొన్ని భావజాలాల్తో కట్టిపడేస్తుంటాం. కానీ వాళ్ళ వ్యక్తిత్వాల్ని కూడా చూడాలి. కోవెల వారి భావజాలం విషయంలో విభేదాలున్నా ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదండీ’ అన్నాను.
దానికీ అఫ్సర్‌ ఔననీ, కోవెలతో తనకున్న పరిచయాన్ని చెప్పారు.
నిజానికిలాంటివన్నీ మనం రాసుకుంటుండాలి. మనం అనేకమంది సాహితీవేత్తల్ని కలుస్తుంటాం. అనేకమందితో మాట్లాడుతుంటాం. వాళ్ళ గురించి అనేక విషయాల్ని గమనిస్తుంటాం. ఇలాంటివన్నీ మనమెక్కడొకచోట రాసుకుంటుండా’లన్నారు.
ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. రాయాలనిపించింది.
ఆ ప్రేరణతోనే ఈ శీర్షికను ప్రారంభిస్తున్నాను. 
కనీసం నెలలో ఒకసారైనా రాయాలనుకుంటున్నాను. కుదిరితే మరిన్ని రాసే అవకాశం కూడా ఉంది. కానీ, నిర్ధిష్టమైన రోజుకో, తేదీకో రాసేయాలనుకోవడం లేదు. నాకున్న వీలుని బట్టి దీన్ని రాయాలనుకుంటున్నాను. కానీ, నన్ను కదిలించిన సంఘటన అనిపించినప్పుడు దాన్ని విస్మరించకూడదనీ భావిస్తున్నాను.
    నిన్న ( 17 `10`2010) తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌ ఫోను చేశారు.
కవిగానే ఆయన నాకు పరిచయం.
తర్వాత తెలిసింది ఆయన వెస్ట్‌ ఆసియా - సౌతాఫ్రికాకు, ఇండియన్‌ టూరిజమ్‌ తరపున రీజనల్‌ డైరెక్టర్‌ అని!
అయినా నేనాయన్ని కవిగానే భావిస్తాను. ఆయన ‘‘ దళిత వ్యాకరణం’’ కవితా సంపుటిని 2007 లో ప్రచురించారు. ఆ కవితలు వివిధ పత్రికల్లో అచ్చైనప్పుడే నన్నెంతగానో ఆకట్టుకునేవి. ఇప్పటికీ సమకాలీన సమస్యల పట్ల, ముఖ్యంగా దళిత క్రైస్తవ సంఘటనల గురించి ఆయన రాస్తున్న కవిత్వంలో నాకేదో నిజాయితీ కనిపిస్తుంది. ఆయనకి చాలా విషయాల పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటిలో చాలా వాటితో నేనేకీభవించలేనివీ ఉన్నాయి.
     ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, బతుకమ్మ పండుగ విషయంలో నాబ్లాగులో ఈ మధ్య నేనొక  పోస్టుపెట్టాను. దాని సారాంశమేమిటంటే, తెలంగాణాలోని ప్రజలందరి పండుగగా బతుకమ్మను కొంతమంది చెప్తున్నారు. మరికొంతమందేమో, దాన్ని కొందరిపండుగగా చెప్తున్నారు.అందులో దళితులకు కూడా అవకాశం కలిగించాలని కోరుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ దీనికి సంబంధించిన ప్రతినిథుల్ని ఎంపికచేశామని శ్రీ బి.జయరామ్‌ మాదిగ ( ఆంధ్రప్రదేశ్‌ మాదిగ దండోరా సంక్షేమ సమితి అధ్యక్షుడు) ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. దాన్ని నాకు కూడా పంపారు.దాన్ని యథాతధంగా నేను నా బ్లాగులో పెట్టాను.

     గతంలో ఒక పుస్తకాన్ని ( పొన్నాల బాలయ్య, ‘‘ ఎగిలివారంగ ’’ ) సమీక్షిస్తూ కొన్నిచోట్ల దళితుల్ని బతుకమ్మ ఆడనివ్వరని రాశాను. ఆ అభిప్రాయం సరైందికాదని ఒకరు వాదించారు. దానికోసం ఎదురు చూస్తుంటే నేను గతంలో రాసింది సరైనదేనని ఉద్యమప్రాయంగా వచ్చిన అభిప్రాయాలు నాకెంతగానో సంతోషం కలిగింది.
దీన్ని చదివి విల్సన్‌ సుధాకర్‌ ఫోను చేశారు. నిజానికి నేను ఇక్కడ నేపథ్యగాయని సుశీల గారి ప్రోగ్రామ్‌ కి అతిథిగా వెళ్తున్నాను. వచ్చేటప్పటికి టైమెంతవుతుందో తెలియదు. అందువల్ల మీతే బతకమ్మ గురించి మాట్లాడేద్దామనిపించిందన్నారు. తెలంగాణలో తాను చాలా రోజులున్నానీ, బతుకమ్మ దళితుల పండుగ కాదనీ సుధాకర్‌ అన్నారు.
    ఆ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే దళితుల్లో బాగా చైతన్యం వస్తుందనీ, అదీ సాంస్కృతిక చైతన్యం కావడం మరింత సంతోషించదగిందనీ మాట్లాడుకున్నాం. అదేమిటంటే, ఇటీవల రావణాసురుడు, మహిసాసురుల గురించి టీ.వీల్లో చర్చలు జరుగుతున్నాయి. వీటిలో ప్రొఫెసర్‌ ఘంటాచక్రపాణి, కత్తిపద్మారావు వంటి ప్రముఖులు పాల్గన్నారు.  స్థానికులైన పాలకుల్ని ఆర్యులు తమ ఆయుధశక్తితో ఓడిరచి, యుద్ధఖైదీలుగా చేసుకుని, వారినే దళితులుగా మార్చారనీ, విజయం సాధించిన వాళ్ళు ఆర్యులైనా, ఆ భావజాలాన్ని జీర్ణించుకున్న ఇక్కడి హిందువులు దాన్ని తమ సాంస్కృతిక వారసత్వంగా భావించుకుంటున్నారని వాదించారు. ఈ చర్చనీయాంశాన్ని ప్రధాన వార్తల్లో కూడా ప్రముఖంగా టి.వి.9లో చూపించారు. అది అంతకు ముందు టి.వి.9లోనే చర్చలో భాగంగా కొనసాగిందే.  కాబట్టి ఇప్పుడు మన దసరాపండుగతో ప్రారంభమైన సాంస్కృతిక ఆధిపత్య నిరసన మరెన్ని కొత్తకోణాల్ని చూపిస్తుందో చూడాలి కదా అనుకున్నాం.
నిన్న Sunday Times of India , లో“Dalit seeks non-Brahmin judge for justice  అనే పేరుతో ఒక వార్తొచ్చింది. తమకు జరిగిన అన్యాయాన్ని నివేదించుకుంటూ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా కోర్టు కెళితే అక్కడా వాళ్ళే న్యాయమూర్తులుగా ఉండటాన్ని వ్యతిరేకించిన వార్త అది.
దీనిలో ముఖ్యవిషయాన్ని ఇలా హైలెట్‌ చేశారు “ The dalit, who wanted to complain about the discrimination against his caste in junagadh district court found his plea being heard by justice RR Tripathi When he heard the judge’s name he said “I cannot expect justice from you because you are a brahmin”  దీన్ని బట్టి వివక్షను ఎదుర్కోవడంలో దళితులు చైతన్యవంతం అవుతున్నారనిపించింది. జడ్జి బ్రాహ్మణుడైనంత మాత్రం చేత వాళ్ళకే న్యాయం చేస్తాడని అనుకోలేం. దళితుడున్నంత మాత్రం చేత కూడా దళితులకేదో న్యాయం జరిగిపోతుందనీ అనుకోలేం. కానీ, ఇక్కడ మనం చూడాల్సింది వాళ్ళలో వచ్చిన ఆలోచన. దానికి అనేక కారణాలున్నాయి. అనేక అనుభవాలున్నాయి. అందుకే ఇది ఒక శుభపరిణామం.
ఇలాంటి విషయాలెన్నింటినో విల్సన్‌ సుధాకర్‌ గారితో చర్చించాను.

    


1 comment:

phoenix said...

Very nice post.
Congratulations.


ramnarsimhareddy,
(mathrubhasha)
nallagonda.