-డా//దార్ల వెంకటేశ్వరరావు[*]
19వ శతాబ్ధంలో దేశవ్యాప్తంగా వచ్చిన అనేకమైన మౌలికమైన మార్పుల్లోపత్రికల స్థాపన ఒకటి క్రైస్తవ మిషనరీలు . ప్రధానంగా తమ మత ప్రచారం కోసం ముద్రణ యంత్రాలను విరివిగా స్థాపించారు. ఆ తరువాత కొంత మంది సాంస్కృతిక పునర్జీవనంలో భాగంగా సంస్కరణోద్యమాలకు వేదికగా మరికొన్ని పత్రికలను స్థాపించారు. అంతటితో ఆగకుండా జాతియోధ్యమ స్ఫూర్తిని నలు దిశలా వ్యాపింప చేయడానికి కూడా పత్రికలు ప్రధాన సాధనంగా ఉపయోగపడతాయని గుర్తించ గలిగారు. స్త్రీవిద్య ఆవశ్యకత, మూఢ విశ్వాసాల ఖండన, గ్రాంథిక, వ్యావహారిక భాషోద్యమాలు, వాటి వాద ప్రతివాదాలు మొదలైన వన్నీ నాటి పత్రికలలో ప్రముఖంగా కనిపించేవి. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా మతాంతరీకరణలో భాగంగా దళితులను ప్రస్థావిస్తూ వారి ఆర్థిక, సాంఘిక పురోభివృద్ధి కోసం మతాంతరీకరణ జరుగుతుందనే దృక్పథంతో అనేక పత్రికలు ప్రచారాన్ని కొనసాగించాయి. వార్తలు, కథలు, నవలలు, గేయాలు మొదలైన రూపాలలో కూడా ప్రచారంలోజరుగుతూ ఉండేది. దళితుల నిజ జీవితాలను, వారి అనుభవాలను వ్యక్తీకరించే ప్రసార, ప్రచార మాద్యమాల లోపాన్ని అప్పుడే నాటి దళిత మేధావులు గుర్తించగలిగారు. ఆ ఆలోచనల నుండి దళిత పత్రికలను స్థాపించాలనే ఆలోచన ప్రారంభమైంది.
దళిత పత్రికల ఆవిర్భావ నేపథ్యం:
భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అనే విభజన ఉనప్పటికీ, దళితులు అనే పదం ప్రధానంగా అణచివేతకు గురవుతున్న కింది వర్ణాల వారనే అవగాహన లో ప్రచారంలోకి వచ్చింది. కానీ, క్రమేపీ వెనుకబడిన తరగతులు, ముస్లింలు, గిరిజనులు తమ తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితులలో దళితులు అంటే మాల, మాదిగ తదితర షెడ్యూల్డ్ కులాల వారనే అవగాహనే స్థిర పడిపోయింది. కనుక, దళితులనే పారిభాషిక పదంలాగే దళిత పత్రికలు అంటే ఏమిటో నిర్వచించేటప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. దళితుల గురించి రాసిన పత్రికలు దళిత పత్రికలు అవుతాయా? దళితులు నిర్వహించిన పత్రికలు దళిత పత్రికలు అవుతాయా? అనేది నిర్ణయించేటప్పుడు ఈ సమస్య పైకి వస్తుంది. ఈ రెండింటినీ పరిగణలోకి తీసు కొం టూనే, దళిత సమస్యలను ప్రధానంగా చర్చించిన పత్రికలను లేదా దళిత సమస్యలనే ప్రధానంగా చేసుకొని వారిని చైతన్యపూరితం చేసేటట్లు నిర్వహించిన పత్రికలను దళిత పత్రికలు అనడం సమంజసంగా ఉంటుంది. ఈ అవగాహనతోనే ఈ వ్యాసంలో దళిత పత్రికలను గుర్తించే ప్రయత్నం చేస్తాను.
భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు జ్యోతిరావ్ పూలే చేసిన దళిత ఆత్మగౌరవ పోరాటా లను ఆయన భావాలను విస్తృతంగా ప్రచారం చేసిన 'దీన బంధు' పత్రికను తొలి దళిత పత్రికగా చెప్పవచ్చు.1870 లో జ్యోతిరావ్ పూలే సత్యశోధన సమాజం అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు సన్నిహితంగా ఉంటూ , వర్ణాశ్రమ ధర్మాన్ని, కర్మ కాండలను ఖండిస్తూ 1880 ప్రాంతంలో నడిచిన దీనబంధు పత్రికకు నారాయణరావ్ మేఘాజీలోఖండే దీనికి సంపాదకుడుగా వ్యవహరించారు. డా// బి.ఆర్. అంబేద్కర్ 1922లో 'బహిష్కృత హితకారిణి' సంస్థను స్థాపించారు. ఈ సమాజం 'బహిష్కృత భారత్' అనే పత్రికను నడిపింది. శివరామ్ కాంబ్లీ 'సోమవంశీ మిత్ర' అనే మాస పత్రికను నడిపారు. 1922 ప్రాంతంలోనే డా// బి.ఆర్. అంబేద్కర్ 'మూక్ నాయక్' అనే పత్రికను స్థాపించారు. దేశ వ్యాప్తంగా ఇలా వివిధ భాషల్లో దళిత పత్రికలు ప్రారంభమయ్యాయి. దళిత పత్రిక, దర్పణం, ప్రబుద్ద భారత్,అస్మితాధర్మ, ప్రమేయ, నికాయ, జాయజా, భీం పత్రిక, జనతా, సింహగర్జన, శ్రామిక్ నివార్ మొదలైన పేర్లతో వివిధ భాషల్లో దళిత పత్రికలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే జ్యోతి బాపులే, సాహూ మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, డా// బి.ఆర్. అంబేద్కర్ మొదలైన వారి భావజాల ప్రభావంతో, వారు తెచ్చిన చైతన్యంతో తెలుగులో కూడా దళిత పత్రికల స్థాపన ప్రారంభమైంది.
తెలుగులో దళిత పత్రికలు:
ఆంధ్రప్రదేశ్ లో వేమూరి రాంజీరావు పంతులు 1917 నుండి మచిలీపట్నం కేంద్రంగా చేసుకొని నడిపిన 'దీన బంధు' పత్రికలో దళితులకు సంబంధించిన వార్తాంశాలు వచ్చేవి. ఆ తర్వాత హైదరాబాదు కేంద్రంగా చేసుకొని మన్య సంఘం ఆధ్వర్యంలో 'పంచమం' పత్రిక కూడా వెలువడేది. వీటిలో దళితులకు సంబంధించిన వార్తలు ప్రచురించినా, అవి దళితులకు "ఒక సైద్ధాంతికమైన స్ఫూర్తిని ఇవ్వలేక పోయాయని" తెలుగులో దళిత పత్రికలపై పరిశీలన చేసిన గౌరీశ్వరరావు అభిప్రాయ పడ్డారు.
1942లో మద్రాసు నుంచి బి.ఎస్. మూర్తి 'నవ జీవన' పత్రికను ప్రచురించారు. 1950లో 'వ్యవసాయ కూలీ' పేరుతో బోయి భీమన్న సంపాదకత్వ సహకారంతో వేముల కూర్మయ్య ఒక పత్రికను నడిపారు. 1933లో జాలా రంగస్వామి 'వీర భారతి' పత్రికను, చుండ్రు మల్ల వెంకటరత్నం రాజమండ్రి కేంద్రంగా 'జీవన జ్యోతి' పత్రికను, దిడ్ల పుల్లయ్య 1927లో 'ఆది ఆంధ్ర' పత్రికను, గెద్దాడ బ్రహ్మయ్య అమలాపురం కేంద్రంగా 'ఆదిమాంధ్ర' పత్రికను, పాము రామ్మూర్తి కాకినాడ కేంద్రంగా 'ఆది హిందూ' పత్రికను నడిపినట్లు ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర గ్రంథంలో యాగాటి చిన్నారావు (2007: 66, 132) పేర్కొన్నారు.
1937 ప్రాంతంలో కుసుమ ధర్మన్న సంపాదకుడు గా 'జయభేరి' పత్రిక వెలువడింది. 1931 ప్రాంతంలో భాగ్యరెడ్డి వర్మ 'భాగ్య నగర్' పేరుతో ఒక వార పత్రికను నడిపినట్లు తెలుస్తుంది. ఇది 1937లో 'ఆది హిందూ' పత్రికగా మారింది. (విఙ్ఞాన సర్వస్వం 1988; 421) బొజ్జా అప్పల స్వామి (జ్యోతి;), జొన్నకోట ఆశీర్వాదం (మూక్ నాయక్), ఐ.వి. చిన్నయ్య (ఆంధ్ర రిపబ్లికన్), ఆర్. రహ్మద్ జోసఫ్ (సమతా వాణి)', కె.జి. సత్యమూర్తి (ఎదురీత)', బి.ఎస్.రాములు (గబ్బిలం), కాత్యాయని (చూ పు )', ఇర్లపాటి వెంకన్న (చైతన్య వికాస్) ఫాదర్ అరుల్ రాజా (విద్యార్థి విశ్లేషణ) లు వివిధ పేర్లతో పత్రికలను నడిపినట్లు కొండపల్లి సుదర్శన రాజు (2002:10) పేర్కొన్నారు. వీటిలో ఎదురీత పత్రిక దళితులను చైతన్యవంతం చేయడానికి విశేషంగా కృషి చేసింది. చూపు పత్రికలో అందెశ్రీ వంటి వాళ్ళ ఇంటర్వ్యూలను, దళిత కవిత్వంలో అమ్మ వంటి వ్యాసాలను ప్రచురించింది. గౌతు లచ్చన్న 'బహుజన' పత్రికను 1960లోను, 'మహాజన' వార పత్రికను 1983లోను స్థాపించి నడిపారు.
"తెలుగులో దళిత పత్రికలు పరిశీలన" పేరుతో కొంకే గౌరీశ్వరరావు ఎం.ఫిల్ కోసం ఒక పరిశోధన వ్యాసాన్ని ఆచార్య ఎన్.ఎస్. రాజు గారి ఆధ్వర్యంలో హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించారు. దీనిలో కొన్ని దళిత పత్రికల వివరాలు ఉన్నాయి. కానీ, వాటి స్వభావాన్ని ఆ పరిశోధన పరిధుల దృష్ట్యా వివరించలేదనిపిస్తుంది. అందువల్ల ఆ పత్రికలను పేర్కొంటూనే వాటిలో నేను గమనించిన ఆ పత్రికల స్వభావాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
వార పత్రికలు:
శెట్టి కన్నమ రాజా 'పీడిత జన' 1983), పొనుగుమట్ల విష్ణుమూర్తి 'జనమిత్ర' (1985), ఐప్ప మధుకర్ 'అరుంధతి' (2005) నెల్లి నాగేశ్వరరావు 'ఉషోదయం' (2006)లు వార పత్రిక లలో పేర్కొనదగినవి.
వీటిలో జనమిత్ర వారపత్రిక అంబేద్కరిజం తో పాటు స్థానిక దళిత సమస్యలను ప్రచురిస్తున్నది. అయితే, ఈ పత్రిక చాలా కాలం నుండి ఒక శాసనసభ్యుడిని టార్గెట్ చేసుకొని అతని చర్యలను ఖండించే దిశగా కొనసాగుతున్నది. పేర్లు లేని లేఖలను కూడా ప్రచురిస్తున్నది. ఆ శాసనసభ్యునికీ, ఎడిటర్ కీ మధ్య ఏవో వైయక్తిక కారణాల వల్ల ఇలాంటి వార్తలు, వార్తాంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నా య ని ఆ పత్రికలలో ని కథనాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. దీనిలో అంబేడ్కర్ పై మాత్రమే కాకుండా, గాంధీజీ పై కూడా కవితలు ప్రచురించారు. హేతువాదానికి సంబంధించిన వ్యాసాలు కూడా వచ్చాయి. కేవలం దళిత రచలకే కాకుండా, ఇతర రచనలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చారు. ఎస్. సి., వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పత్రిక. వర్గీకరణకు వ్యతిరేకంగా రాసిన అనేక వ్యాసాలు కవితలను కూడా ప్రచురించింది.
సాధారణంగా వారపత్రికల్లో ఉండే ఇంటి, వంట విషయాల కంటే సామాజిక సమస్యలనే ప్రధానం చేసుకోవడం దళిత వార పత్రికల ప్రత్యేకత గా చెప్పుకోవచ్చు.
పక్ష పత్రికలు:
గోవాడ నిరీక్షణ రావు 'భాగ్య నగర్' (1956), బి.వి. రమణయ్య 'జయ్ భీమ్' (1975డా// యెండ్లూరి చిన్నయ్య 'ప్రజా బంధు' (1984), వి.వామనదాస్ 'బీట్ - రూట్' (1985), , బొజ్జా తారకం 'నలుపు' (1990) లు ప్రముఖమైనవి.
భాగ్యనగర్ కొన్ని ప్రత్యేక సంచికలను కూడా ప్రచురించింది. అంబేద్కర్, గాంధీ సంస్కరణోద్యమాల ప్రభావం ఈ పత్రిక లలో పై ఎక్కువగా కనిపిస్తుంది. విలువైన వ్యాసాలు దీనిలో ఉన్నాయి.
నలుపు పత్రికలో స్త్రీ సమస్యలను కూడా లోతుగా చర్చించే వ్యాసాలు ప్రచురించారు. వామ పక్ష భావాల రచనలు ఎక్కువగా దీనిలో కనిపించేవి. కవితలు, పుస్తక సమీక్షలు, దళిత సమస్యలను కుల,వర్గ దృక్పథాల సమన్వయంతో రాసిన అనేక రచనలను దీనిలో ప్రచురించారు.
మాస పత్రికలు:
ఉండ్రు సుబ్బారావు 'హరిజన' (1933), ) కొత్తపల్లి సరళ 'భీమ్భేరి' (1989), కత్తి పద్మారావు 'దళిత రాజ్యం' (1994), వి.టి. రాజశేఖర్ 'బహుజన సమాజ్' (1995), వి.టి. రాజశేఖర్ 'దళిత వాయిస్' (1995), కె.జి. సత్యమూర్తి 'ఈనాటి ఏకలవ్య' (1996), అంబేద్కర్ ఎడ్యూకేషనల్ సొసైటీ సభ్యులు 'సంఘమిత్ర' (1998), ఎస్. రఘుపతి రావు 'మన వాణి' (2001), దుడ్డు ప్రభాకర్ 'కుల నిర్మూలన' (2001), యమలా సుదర్శన్ 'దళిత శంఖారావం' (2001), బుద్దకోటి 'బహుజన కెరటాలు' (2002), సత్యానందం 'దళిత బహుజన శ్రామిక విముక్తి' (2002), సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ ఎ.పి. సంస్థ 'సాక్షి' (2003), పిల్లి డేవిడ్ కుమార్ 'దళిత కమెండో' (2003), అంబేద్కర్ మిషన్ సభ్యులు అంబేద్కర్ మిషన్ (2004),సి.హెచ్. విద్యాసాగర్ ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్తలుగా దండోరా (2008), ఎల్.ఎస్.రావు ప్రధాన సంపాదకులుగా అరుంధతీయవాణి (2008) పత్రికలు ముఖ్యమైనవి.
దళిత పత్రికల తీరు తెన్నులు:
దళిత రాజ్యం లో కత్తి పద్మారావు, దేవరపల్లి మస్తాన రావు ల రచనలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇది దళిత మహాసభకు కరపత్రంలా ఉండేది. కత్తి పద్మారావు రచనలకు వేదికగా ఉండేది. వీటిలోని వ్యాసాలు తర్వాత కాలంలో కొన్ని పుస్తకాలుగా కూడా ప్రచురించారు. దళిత చరిత్ర, సామాజిక , సాంస్కృతిక అంశాలపై సాధికారికమైన వ్యాసాలు ప్రచురించారు. ఈ పత్రిక కూడా ఎస్.సీ. వర్గీకరణకు వ్యతిరేకంగానే పనిచేసింది. దళిత సమైక్యత పేరుతో రచనలను ప్రకటించింది.
బహుజన సమాజ్, దళిత వాయిస్ పత్రికలు దళిత దార్శినికతను దృష్టిలో పెట్టుకొని దళితుల్లోని అత్యధిక కులాల భావాలను సమీకరించే దిశగా కొనసాగింది. దళిత సాహిత్యానికి సంబంధించిన ప్రత్యేక సంచికను కూడా ప్రచురించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.
ఈనాటి ఏకలవ్య దళితుల్లో గొప్ప ఆశను కలిగించింది. దళిత వార్తలను, విశ్లేషణలను ప్రచురిస్తూనే, దళిత సాహిత్యంలో వస్తున్న కొత్త ధోరణులను కూడా స్పృశించగలిగింది. దళిత సౌందర్య శాస్త్రం పై విలువైన వ్యాసాలను కలిపి ఒక ప్రత్యేక సంచిక కూడా ప్రచురించింది. మంచి కవితలు,కథలు, సమీక్షలు, ఇంటర్వ్యూలను ప్రచురించింది. మాదిగ సాహిత్యానికీ, ఎస్.సి. వర్గీకరణకూ కొంతవరకూ వేదికగా నిలిచింది. అయినంత మాత్రం చేత పూర్తిగా సమర్థించిందని చెప్పలేం. కానీ, కొంత ప్రజాస్వామిక ధోరణిని ప్రదర్శించింది. నాగప్పగారి సుందర్ రాజు ఇంటర్వ్యూని ప్రచురించిన ఏకైక ప్రత్రిక తెలుగు దళిత ఇదే! విద్యావంతులు, మేధావులు, కళాకారులను ఒక వేదికపైకి తేవాలనే ఆరాటం ఆ పత్రిక రచనలు, ఆశయాలు, లక్ష్యాలలో కనిపించి నా, ఆ పత్రిక లక్ష్యం నెరవేరకుండానే ఆగిపోయింది. మంచి క్వాలిటీ పేపర్ తో నడిపిన మొట్టమొదటి దళిత పత్రిక అని అభివర్ణించగలిగే పూర్తిగా అవకాశం ఉంది.
మనవాణి పత్రికలో బౌద్ద మత భావాలు, అంబేద్కర్ రచనల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయ సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వారి ప్రకటనలు, దళిత సభల వివరాల వంటి వాటిని ఎక్కువగా ప్రచురిస్తుంది. ఇది కూడా ఎస్.సీ వర్గీకరణను సమర్థించక పోగా, దాన్ని వ్యతిరేకిస్తూ సంపాదకీయాలను రాసింది. బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన రాజ్యాధికార వార్తల దిశగా కొనసాగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేంకటేశ్వరస్వామి కి సంబంధించిన ప్రకటనలు దీనిలో ఎక్కువగా కనిపిస్తాయి.
వి.నందగోపాల్ ప్రచురణ కర్తగా సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ , ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు బైమంత్లీ గా నిఘా పేరుతో ఒక పత్రికను తీసుకొస్తున్నారు. అయితే, దీన్ని ప్రైవేటు సర్క్యులేషన్ గా ప్రకటించారు. దేశంలో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దళితులపై జరుగుతున్న హత్యాచారాలు, అత్యాచారాలను తేదీలతో సహా ప్రకటించటం ఈ ప్రత్రిక ప్రత్యేకత. అలాగే, రాజ్యాంగంలో పేర్కొన్న వివిధ హక్కులను, చట్టాలను, ఆ పూర్తి వివరాలను అందిస్తుంది. అలాగే, దళిత ఉద్యమంలో, విద్యారంగంలో నిష్ణాతులైన వారి చేత ఎంతో సాధికారితతో రాయించిన వ్యాసాలను ప్రచురిస్తున్నారు. సంఘటనలను ప్రత్యక్షంగా పరిశీలించిన వివరాలను అందించడం కూడా మరో ప్రత్యేకత. అయితే, దీన్నెందుకు ప్రైవేటు సర్క్యులేషన్ గా ప్రకటించారో తెలియాలంటే ఆ పత్రికలన్నీ లోతుగా విశ్లేషించవలసి ఉంటుంది. కొసమెరుపుగా ఈ పత్రికలో ఒక కవితను ప్రచురిస్తుంటారు.
‘కులనిర్మూలన’ పత్రిక వర్గ దృక్పథంతో దళిత సమస్యలను వివరిస్తున్నది. గ్రేస్ నిర్మల ఆధ్వర్యంలో 'దళిత' త్రైమాసిక పత్రిక (2005) నడుస్తున్నది. దీనిలో దేవదాసీ వ్యవస్థ గురించి వ్యాసాలు ప్రచురిస్తున్నారు.
దండోరా పత్రిక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళ అధికారిక పత్రికలా ఆ వార్తలకే అధిక ప్రాధాన్యం కనిపిస్తుంది. కలర్ తో ప్రచురిస్తున్నారు. పత్రికలో ప్రచురించే అంశాల పట్ల మరింత స్పష్టత అవసరం. సినిమా విషయాల నుండి ఇంటి చిట్కాల వరకూ దొరికిన ప్రతీ విషయం ప్రచురిస్తున్నట్లు కనిపిస్తుంది. వ్యాసాల విషయంలో ప్రామాణికత సాధించవలసిన అవసరం ఉంది. హిందూ భావజాలాన్ని కూడా వివిధ వ్యాసాల్లో ప్రచురిస్తుండడం ఆశ్చర్యకరం. తెలంగాణా ప్రాంత దళితులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పత్రిక, సమకాలీన రాజకీయ సమస్యలను వ్యాఖ్యానిస్తూ సంపాదకీయాలు రాస్తుంటుంది.
అరుంధతీయ వాణి పత్రిక కూడా దండోరా నడుస్తున్న దారిలోనే నడుస్తున్నట్లు కనిపిస్తున్నా, దాని కంటే కొంచెం విలువైన వ్యాసాలను ప్రచురిస్తున్నది. అయితే, క్రైస్తవమత, దైవ ప్రచారం ఈ పత్రిక లో అంతర్గంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం వస్తున్న దళిత పత్రికలలో సాధ్యమైనంత వరకూ అంబేద్కర్ లక్ష్యాలకు దగ్గరగా నిలుస్తూ, ఒక ప్రామాణిక పద్దతిలో కొనసాగుతున్న పత్రిక మాత్రం బహుజనకెరటాలు. దీన్ని కలర్ అయిల్ పెయింట్ కవర్ పేజీతో ఆకర్శణీయంగా ప్రచురిస్తున్నారు. దీనిలో సంపాదకీయాలు, వ్యాసాలు, కవితలు, సమీక్షలు, వార్తాంశాలు , ఫోటోల ఎంపికలో, ప్రచురణలో చాలా జాగ్రత్తను పాటిస్తున్నారు. రాజ్యాధికారానికి కావలసిన భావజాలాన్ని అందించడమే కాకుండా, సాంస్కృతిక అంశాలపై కూడా దృష్టిని కేంద్రీకరించడం ఈ పత్రిక మరో ప్రత్యేకత, ఊరు నుండి ప్రపంచం వరకూ దళిత, పీడిత ప్రజల ఆలోచనలను, ఆశయాలను, విజయాలను విశ్లేషిస్తూ రచనలను ప్రచురిస్తున్నారు. ఉత్తర భారతదేశంలోన్ దళిత వర్గాల్లో వచ్చిన రాజకీయ చైతన్యాన్ని దీప్తి వంతం చేస్తూ కాన్సీరామ్ ఆలోచనల వేదికగా ఈ పత్రిక నడుస్తున్నట్లు అనిపిస్తుంది. రాజకీయ అధికారం సాధించడం ద్వారా దళితుల సమస్యలెన్నీ పరిష్కారమవుతాయనే లక్ష్యంతో పయనిస్తుంది. ఈ వ్యూహంలో భాగంగానే ఎస్.సీ వర్గీకరణ ను సమర్థిస్తూ ఒక ప్రత్యేక సంచికను కూడా ప్రచురించడం చారిత్రాత్మక విశేషం. అయితే, దీనిలోని వ్యాసాల విశ్లేషణల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, దళిత పత్రికల్లో మొట్టమొదటి సారిగా ఒక ప్రజాస్వామిక రీతిలో వర్గీకరణను సమర్థిస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయం. కవులపై కూడా ప్రత్యేక సంచికలను ప్రచురించడమే కాకుండా, ఆ పత్రికల్లో వచ్చిన వ్యాసాలను కొన్నింటిని ఎంపిక చేసి పుస్తకాలుగా కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ప్రజారాజ్యం కూడా ఇలాంటి పని చేసినా, అది ఒకరిద్దరి రచనలపై దృష్టి కేంద్రీకరించడమే ప్రధానంగా కనిపిస్తే, ఈ పత్రిక ఒక భావజాలాన్ని ప్రచారం చేసే దిశగా పుస్తక ప్రచురణను చేపట్టడం దీని ప్రత్యేకతను తెలుపుతూ, ప్రజారాజ్యం పత్రిక కంటే ఒక అడుగు ముందుకు నిలిచేలా ఉంది, కొన్ని విషయాల్లో ముఖ్యంగా మాల రచయితలకు, వారి రచనలకే ప్రాధాన్యతనిస్తున్నారనే విమర్శలను గుర్తించి వాటిని సరిదిద్దుకోగలితే భవిష్యత్తులో తెలుగు దళిత పత్రికల్లో ఏకైక ఉత్తమ పత్రికగా నిలుస్తుందనే ఆశ కల్పిస్తుంది. దళితులు కూడా సమర్థ వంతంగా, ప్రామాణికమైన వ్యాసాలను రాస్తూ, పత్రికను నడపగలరని నిరుపించగలిగే సత్తా ఉన్న పత్రికగా పేర్కొనే అవకాశం ఉంది.
దళిత పత్రికలలో కనిపించే ముఖ్యాంశాలు:
మొత్తం మీద దళిత పత్రికలను పరిశీలించినప్పుడు, ప్రధానంగా కింది ఆశయాలు కనిపిస్తున్నాయి.
అస్పృశ్యత నిర్మూలన, కుల నిర్మూలనలకు కృషి చేయడం;
స్థానిక, రాష్ట్ర, జాతీయ దళిత విశేషాలను తెలియజేయడం;
దళితుల అభివృద్ధి కోసం పాటు బడిన వారి వార్తలను ప్రచురించి దళితులలో నూతన చైతన్యాన్ని, దళిత స్ఫూర్తిని పెంపొందించడం;
దళిత కవులను వారి జయంతి, వర్థంతులను, ఆ సందర్భంగా వచ్చిన వార్తలను ప్రచురించడం;
దళిత నాయకులను వారి జయంతి, వర్థంతుల వార్తలను ఆ సందర్భంగా ప్రత్యేక వ్యాసాలను ప్రచురించి సమకాలీన దళిత సమస్యలను సమీక్షిస్తూ దళితులను చైతన్యవంతం చేయడం;
వివిధ ప్రాంతాలలో దళితులపై జరుగుతున్న దాడులను, హత్యాచారాలను, అత్యాచారాలను తెలుపుతూ అలాంటివి జరగకుండా ఉండటానికి దళిత సంఘాల ఆవిర్భావ ఆవశ్యకతను తెలపటం;
దళితులపై జరిగిన లేదా జరుగుతున్న వివిధ సంఘటనల పూర్వా పరాలను తెలుసుకొని వాస్తవ విషయాలను అందించటానికి ప్రయత్నించటం;
దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, ఆ పథకాల, ఆ ప్రభుత్వ ఉత్తర్వుల వివరాలను అందించటం;
డా// బి.ఆర్. అంబేద్కర్, జ్యోతి బాపులే, కాన్షీరామ్, మాయావతి మొదలైన దళిత నాయకుల రాజకీయ లక్ష్యాలను భావ జాలాన్ని విస్తృతంగా వ్యాపింప జేయాలనుకోవటం;
దళితులను చైతన్యవంతం చేసే కవితలు, కథలు, పాటలు , పుస్తకాల సమీక్షలు, దళిత కవుల, కళాకారుల పరిచయాలు …. ఇలాంటి వాటిని కూడా ప్రచురించడం;
ఇలా అనేక లక్ష్యాలతో దళిత పత్రికలు నడుస్తున్నాయి. ప్రారంభించిన కొంత కాలానికే ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల చాలా పత్రికలు మూత పడిపోవటం ఒక విషాదకరమైన విషయం. దళితుల సాంస్కృతిక అంశాలను లోతుగా చర్చించడానికి తగినన్ని పుటలను దళిత పత్రికలలో చేర్చలేక పోవడం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. 'బహుజన కెరటాలు', 'నీలి జెండా’ ( జ్ణానేశ్వర్) పత్రికలలో దళితుల సాంస్కృతిక పరమైన అంశాలపై దృష్టి పెట్టినా, నిష్ణాతులై ఉండీ ముందుకు రాని దళిత రచయితలు కొరత కూడా కనిపిస్తుంది.
దళిత పత్రికల భవిష్యత్తు:
దళిత రచయితలలో కూడా అనేక మంది విషయ నిష్ణాతులు ఉన్నా, వారి పరిశోధనాంశాలను దళిత పత్రికలలో ప్రకటించడానికి చాలా మంది ఆసక్తి చూపించడం లేదా? లేకపోతే దళిత పత్రికలు ఉన్నట్లే వారికి తెలియడం లేదో పరిశీలించవలసి ఉంది. దళిత రచయితలంతా దళిత పత్రికలలో ప్రచురణకు ప్రామాణిక వ్యాసాలను సంక్షిప్తం చేసి అందిస్తే ఆ పత్రికలకు మరింత శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఆ కొరత కూడా దళిత పత్రికల్లో కనిపిస్తుంది. అందువల్ల 'బహుజన కెరటాలు' పత్రిక చాలా తెలివైన నిర్ణయం తీసుకొని ఆయా రంగాలలో నిష్ణాతులైన రచయితలను సంపాదక, సలహా వర్గాలుగా భాగస్వామ్యం చేసి వాళ్ళు రాయడాన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తింపజేస్తుంది.
‘విశాఖపట్నం నుండి వెలువడే 'ప్రకాశిని' మాస పత్రిక ను ఆచార్య యోహన్ బాబు, డా// కే.యస్. ఎన్. రాజులు జనరల్ పత్రికగా నడుపుతూనే దళిత రచయితలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా దళిత రచయితలు రాసిన పరిశోధన పత్రాలను ప్రచురిస్తున్నారు.
తెలుగులో దళిత పత్రికలు వస్తున్నప్పటికీ ఆర్థిక కారణాల వల్ల అనతి కాలంలోనే మూత పడుతున్నాయి. దళితుల అన్ని పార్శ్వాలను స్పృశించాలంటే కనీసం దళిత రాజకీయ వేత్తలు, సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఆర్థికంగా ఆదుకోగలిగిన దళితులు మేధావులతో కలిసి దిన పత్రికను, ఒక మాస పత్రికను నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే దళితులలో ఉన్న చైతన్యాన్ని సమర్థవంతంగా ప్రదర్శించడానికి వీలవుతుంది. ఆ దిశగా దళితులంతా అలోచిస్తారని ఆశిద్దాం.
ఆధార గ్రంథాలు:
గౌరీశ్వర రావు, కొంకే. 2007, తెలుగులో దళిత పత్రికలు - పరిశీలన. (ఎం.ఫిల్ అముద్రిత పరిశోధన వ్యాసం) హైదరాబాదు
విశ్వవిద్యాలయం : హైదరాబాదు.
చిన్నారావు, యాగాటి. 2007, ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర (1900-1950). హైదరాబాదు బుక్ ట్రస్ట్ ప్రచురణ:
హైదరాబాదు.
రామరాజు, బిరుదు రాజు. (సంపాదకులు) 1988, విఙ్ఞాన సర్వస్వం (తెలుగు సంస్కృతి-2). తెలుగు విశ్వవిద్యాలయ
ప్రచురణ: హైదరాబాదు.
లక్ష్మణ రెడ్డి, వి. 2002, తెలుగు జర్నలిజం అవతరణ వికాసం. రచనా జర్నలిజం కళాశాల ప్రచురణ: హైదరాబాదు.
వెంకటేశ్వరరావు, పొత్తూరి. 2004, ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ప్రచురణలు:
హైదరాబాదు.
సత్యనారాయణ, ఎస్వీ. (సంపాదకత్వం) 2000, దళితవాద వివాదాలు. విశాలాంధ్ర ప్రచురణ: హైదరాబాదు.
హైమావతి. 1978, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న. సన్మాన సంఘ ప్రచురణ: హైదరాబాదు.
సుదర్శన రాజు, కొండపల్లి. 2002, దళిత సాహిత్యం- చారిత్రక నేపథ్యం, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురణ: వాల్తేరు.
[*] అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, గచ్చిబౌలి, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, ఇండియా, ఫోను: 09989628049, E- mail: vrdarla@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి