"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

23 జూన్, 2010

దార్లకొ త్త పుస్తకం “పునర్మూల్యాంకనం”


GA.doc
కొత్త దృష్టిని ప్రసరించే సాహిత్య వ్యాసాలు
-ఆచార్య జి. అరుణ కుమారి
తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
విమర్శకు కొన్ని సూత్రాలున్నాయి. వాటిని ఆకళింపు చేసుకోవటానికి కావలసిన మార్గాలు దార్ల వెంకటేశ్వరరావు రచనల్లో  కనిపిస్తాయి. వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాల్ని ఇటీవల పునర్మూల్యాంకనంపేరుతో ప్రచురించారు. ఈ వ్యాసాల్లో దార్ల స్వీకరించిన వస్తువుని పలు విమర్శలను దృష్టిలో ఉంచుకొని తాను చెప్పదలచిన విషయాన్ని తానే ఓ పాఠకుడిలా ప్రశ్నించుకుంటూ రచయితగా సమాధానాలతో వాటిని పరిష్కరిస్తూ విషయ చర్చ కొనసాగిస్తాడు. ఇది దార్ల వారి రచనా పద్ధతి. మిరియాలు ఎంత ఘాటుగా ఉంటాయో కొన్ని సందర్భాలలో వీరి వ్యాసాలు అంత ఘాటుగానే ఉంటాయి. చర్చలకు తావిచ్చే పరిశోధన  వ్యాసాలు అందులోనూ విమర్శకు సంబంధించిన వ్యాసాలు కాబట్టి!
అంతవరకు సాహిత్యానికున్న విలువలకు మళ్ళీ విలువ కట్టడాన్ని పునర్మూల్యాంకనం అని అనవచ్చు. దీనికే ఇంగ్లీషులో Revaluation అన్నమాట.  గ్రంథంలో మొదటి వ్యాసం సమగ్రాంధ్ర సాహిత్యంలో సాహిత్య యుగ విభజన - ఆరుద్ర భావ పరిణామం. ఆంగ్ల సాహిత్య చరిత్రల్లో యుగ విభజన జరిగినట్లే రాజులను, పోషకులను ఆధారంగా చేసుకొని  ఆరుద్ర సాహిత్య చరిత్ర యుగ విభజన చేసాడు. ఆరుద్ర రచించిన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర పునర్ముద్రణలో చేసిన మార్పులను గుర్తించటం దార్ల తన అధ్యయనంలో ప్రధానాంశంగా భావించారు. నాణాలను సేకరించే అభిరుచి ఉన్నవాడిలా వివిధ ముద్రణలను సేకరించి, ముద్రణకు ముద్రణకు వచ్చే మార్పులను గమనిస్తూ అధ్యయనం చేయడం కూడా పరిశోధనలో భాగమవుతుంది. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో విషయ పరిణామం యుగవిభజన పరంగానే కాదు, కర్తృత్వం విషయంలోనూ చర్చలకు తావిస్తుంది.
ఆంధ్ర వాఙ్మయ చరిత్రను కవిత్వవేది, భోగరాజు నారాయణ మూర్తి, చిలుకూరి వీరభద్రరావు, వంగూరి సుబ్బారావు,చాగంటి శేషయ్య, ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని మొదలైన వాళ్ళు రచించిన వేవీ పునర్ముద్రణలో మార్పులను తావివ్వనివి. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం పునర్ముద్రణలో పలు మార్పులకు తావివ్వడం వలన విమర్శకు వస్తువయ్యింది.
మైనారిటీ సాహిత్యం - మరో చూపు’’ లో రాజ్యాంగం ప్రకారం హిందువులు తప్ప ఇతరులందరూ జనాభా సంఖ్యలోమైనారిటీలుగా గుర్తింపబడుతున్నారన్నారు. మైనారిటీ అనే పదానికి అర్థాన్ని రాజ్యాంగపరంగా, సాహిత్య పరంగా బేరీజు వేసి అది సమకాలీన సాహిత్యాన్ని గుర్తించగలిగే కొత్త ధోరణి అని వ్యక్తీకరించారు. మైనారిటీ అనేది సంఖ్యావాచకం అనే దృష్టితోను, ఒక వర్గ సాహిత్యాన్ని అభివ్యక్తికరించే కోణంలో ఎదుర్కొనే సమస్యల కారణంగాను, స్వేచ్ఛారాహిత్యం వల్లనూ,  ప్రజల మానసిక భావన వల్లనూ మైనారిటీ సాహిత్యం అంటే మాదిగ, క్రైస్తవ, తెలంగాణ సాహిత్యాలని పునర్మూల్యాంకన దృష్టితో పరిగణించారు. గ్లోబలైజేషన్‌, లోకలైజేషన్ అనే వాటికి తేడా తెలియకుండానే మూసలో పొసినట్టుగా అనేకరచనలు వెలుగులోకి వచ్చాయి. ‘‘భిన్న పార్శ్వాల్లో ప్రపంచీకరణ కవిత్వం’’ లో ప్రపంచీకరణ నేపథ్యం, దాని మంచి చెడులను ఎంచి చూసారు. ‘‘మా తాత చెప్పులు కుట్టేవాడు .... నేనిప్పుడు కవిత్వం రాస్తున్నాను'' అని దార్ల అనటంలో నాలుగు తరాల దళిత జీవనం కనిపిస్తుంది. కర్మ సిద్ధాంతం ఒక తరం అనుభవిస్తే, తిరుగుబాటు లేనితనం మరో తరమైతే, సంస్కరణ దిక్కుగా ఇంకొక తరం ఎదురు చూస్తే, మరొక తరం అభ్యుదయం వైపుగా పరిణామ దిశను సూచిస్తుంది. భిన్న పార్శ్వాల్లో ప్రపంచీకరణ కవిత్వం ఇంతవరకు వచ్చిన ప్రపంచీకరణ కవిత్వంలో మేలుకన్నా కీడేఅధికంగా ఉందని చూసే పార్శ్వమే కనిపిస్తుంది. కాని దార్ల వ్యాసంలో ప్రపంచీకరణ వల్ల కుల వృత్తులు చేతి వృత్తులుగామారడం గమనించాలన్నారు. కొన్ని వర్గాలకు ప్రపంచీకరణ మేలు కలిగించిందనే పార్శ్వాన్ని చూపిస్తూ కులం,అంటరానితనం ప్రపంచీకరణ వలన పోలేదని చిన్న కుటుంబాలు, వ్యవసాయం, సహజత్వాన్ని పోగొట్టుకున్న పల్లెలు, వైరస్ సోకిన వ్యవస్థ ప్రపంచీకరణ ముసుగులో విద్య... వంటి అనేక పార్శ్వాల్ని పరిశీలించారు.
నవల రెండవ ముద్రణలో ‘‘ముఖచిత్రం’’ పై "ఉద్యమాల నేపథ్యంలో తొలి దళిత నవల'’’ అని ప్రకటించుకోవడం సరైనదవుతుందా అనేది  వ్యాస రచనకు మూలం. వివిధ పరిణామాల్లో వికాసం చెందిన దళిత ఉద్యమ చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలి. వచ్చిన సమీక్షలను వ్యాసాలను పరిశోధనలను గమనించి మలి ముద్రణ రూపొందాలనేది రచయిత ఉద్దేశం. తొలి దళిత ఉద్యమ నవలగా కాదు, దళిత ఉద్యమాన్ని వర్ణించిన నవలగా చూడమని పునర్మూల్యాంకన దృష్టితో సూచిస్తున్నారు. ఒక నవల రాజకీయ, సామాజిక అంశాలను అందిస్తున్నప్పుడు  నవలను విలువ కట్టే రీతిలో ప్రతి చిన్న అంశం పరిగణనలోకి వస్తుందనే విషయాన్ని  వ్యాసం ధ్రువ పరుస్తుంది.
హెమింగ్వే రాసిన The Old Man And the Seaనవలలో కథానాయకుడు బెస్తవాడు. “అతడు అడవిని జయించాడునవలలోని కథానాయకుడు పందులు మేపుకునే గిరిజనుడు. కుల వృత్తులు వేరు. ఒకరిది సముద్రపు వేట. మరొకరిది అడవిలో తప్పిపోయిన సుక్కపంది కోసం వేట.  రెండు నవలల్లో కథాగమనం ఒకటే. మార్పు అంతా నేపథ్యంలోనే ఉంది. దీన్ని అనుసరించే వేట కొనసాగింది. కేశవరెడ్డి అతడు అడవిని జయించాడు నవలలో పరుల ధనాన్ని అపహరించే నక్కలు, రాబందుల బారి నుండి ముసలివాడు తప్పించుకొని సురక్షితంగ ఇంటికి చేరుకుంటాడు.
హెమింగ్వే రాసిన ఓల్డ్ మాన్ అండ్ ది సీ నవలలో సముద్రంలో షార్క్ చేపలను చంపి తాను పట్టిన 8 అడుగుల చేపను  దాడిలో పోగొట్టుకొని అస్తి పంజరంతో ఒడ్డుకు వస్తాడు.  రెండు నవలల్లోని కథానాయకులిద్దరూ తమసంపదను పోగొట్టుకుంటారు. కాని హెమింగ్వే నవలలో షార్క్ చేపలు ఐదింటిని ( పరుల ధనాన్ని ఆశించే వాటిని ) చంపి - శారీరక పోరాటం కన్నా మానసిక సంఘర్షణలో విజయాన్ని సాధిస్తాడు. అతడు అడవిని జయించాడు నవలలో ముసలివాడు పొందిన తృప్తి కూడ అదే. ప్రపంచం అనే అడవిలో నక్కలు, రాబంధుల బారి నుండి తన సంపదను పోగొట్టుకొని ఇంటికి చేరుతాడు. దీనిలో Survival of the fittest, Struggle for existence కనిపిస్తుంది. అస్తిత్వ పోరాటంలో బాహ్య పోరాటమే కాదు, ఆంతంగిక పోరాటంలో గెలిచాననే తృప్తి రెండు నవలల్లోను కనిపిస్తుంది. మనిషికి సంఘర్షణలోను, అపజయంలోను, మరణంలోను గౌరవం ఉండాలనే సందేశాన్నందిస్తున్నాయి  నవలలు.  రెండు నవలల్లో శిల్ప పరంగానే కాదు, వస్తు పరంగాను సామ్యమున్నది.  కోణంలో పరిశోధన జరగాల్సిన అవసరముంది. అతడు అడవిని జయించాడు నవలలో మానవ జీవితాన్వేషణ తత్త్వాన్ని ,ఇకో టచ్డ్ నవల గా ను పరిశీలించడం విశేషం.
మునెమ్మ నవలలో మాతృస్వామ్యంపై పెత్తనం చెలాయించే పితృస్వామిక వికృత రూపంగా కనిపిస్తున్న కోణాన్ని పేర్కొంటు దార్ల మునెమ్మ లోని శక్తి స్వరూప పార్శ్వాన్ని గుర్తించారు. పశువులలోని సహజ గుణాన్ని వాంఛిత దృష్టిగా భావించి కథను నడిపించటం  కథలోని వస్తువు. కల్పితాలను నవలా వస్తువు చేసి మాజిక్ రియాలిజం శిల్పాన్ని అనుసరించినట్టుగా రచయిత  వ్యాసంలో పేర్కొన్నారు.
గంగాధరి శ్రీరాములు అనేక మంచి పాటలు పాడటం నేర్పించి ‘‘మాస్టార్జీ’’ అయ్యాడని మాస్టార్జీ సాహిత్యంలో మట్టిపరిమళాలు లో వివరించారు. కళను బతికించడం కోసం మాస్టార్జీ చేస్తున్న కృషి కొనియాడదగినది. బహుజనులతో   పాటు కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా  దేశ మూల వాసులే అనేది మాస్టార్జీ సిద్ధాంతం. దళిత దార్శినికులను తన పాటల్లోస్మరించి, దళితుల్ని మాత్రం పోరాటాలకు ఉసిగొల్పుతున్న కులం వాసన పోని మార్క్సిస్టుల్ని మాత్రమే నిందిస్తూ రచించిన పాటల పరిమళాలను  వ్యాసంలో చక్కగా పరిచయం చేసారు.
దళిత సాహిత్యంలో ప్రయోగంలో ఉన్న పదజాలన్ని గుర్తించి చర్చించవలసిన అవసరం ఉందని దళిత సాహిత్య విమర్శ -  సాంకేతిక పదజాల నిర్ణయ సమస్యలు  ఆధునిక సాహిత్య విమర్శలో ప్రవేశించిన నూతన పారిభాషిక పదాలను గమనించవలసిన అవసరం పరిశోధకులకు ఉంది. దళిత కవిత్వంలో నూతన పదకల్పనలను వివేచించిన తీరు బాగుంది. ఒకే అర్థంలో కాక, భిన్నార్థాలలో ప్రయోగింపబడే పదాలు, అవి ఏర్పడే పద్ధతులను వివరించారు. దళిత కవిత్వంలోనూతన పదకల్పనలను సేకరించవలసిన అవసరం ఉంది. ఇది పరిశోధకుల బాధ్యత అవుతుంది.
నవలల్లో, కవిత్వంలో, చరిత్ర యుగవిభజనలో పునర్మూల్యాంకం అవసరమనే కోణంలో తెలుగు సాహిత్యానికి విలువైన విమర్శ వ్యాసాలు దార్ల అందించారు. నిశిత దృష్టితో ఉద్యమాలకు సంబంధించిన నవలలను పరిశీలించవలసిన తీరును, ప్రపంచీకరణ కవిత్వం, మాదిగ సాహిత్యం, గేయం... వీటిలో భావజాలంలో వచ్చిన మార్పులను, ముద్రణకు ముద్రణకు  మధ్య ఉన్న తేడాలను గుర్తించవలసిందంటూ సూక్ష్మాంశాలను కూడా పరిగణనలో తీసుకోవాలనే జాగ్రత్తను సూచించినపద్ధతులు, రచనల్లో భిన్న పార్శ్వాల మూల్యాంకన ఆవశ్యకతను చూపించారు. భిన్న పార్శ్వాల మూల్యాంకన రచనకు పరిపుష్టినిస్తుంది. పరిశోధకులకు  మూల్యాంకన దృష్టి అవసరం.
తెలుగు సాహిత్య వికాసానికి, పరిశోధకులకు అనేక విమర్శ వ్యాసాలను మూల్యాంకన దృష్టితో పరిశీలించి అందించి, కొత్త దృష్టిని ప్రసరిస్తున్న దార్ల వెంకటేశ్వరరావు గారిని అభినందిస్తున్నాను. ముందు ముందు విశ్వసాహిత్య విశ్లేషణ  వైపు దృష్టి ప్రసరించాలని ఎదురు చూస్తూ  పునర్మూల్యాంకనం పుస్తకం పాఠకులకు కొత్త ఆలోచనల్ని అందిస్తుందని చెప్పవచ్చు.
( పునర్మూల్యాంకనం ( సాహిత్య వ్యాసాలు), రచయిత: డా. దార్ల వెంకటేశ్వరరావు , పుస్తకం వివరాలు: వెల: రూ. 75/- పుటలు: 144, లభించుచోటు: నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్)

1 కామెంట్‌:

ramnarsimha చెప్పారు...

Sir,

I have read the review just now on

your "PUNAR-MULYANKANAM"..

Congratulations..

yours,
Ramanarsimha,
(Mathrubhasha)..

rputluri@yahoo.com