Monday, June 21, 2010

మా నాన్న గురించి ఆంధ్రజ్యోతిలో

17-6-2010
పొద్దున్నే కామేశ్వరరావు గారు ఫోను చేశారు.
‘‘ఆంధ్రజ్యోతిలో మీరు రాసింది హార్ట్‌ మెల్టింగ్‌గా ఉందండీ’’ అన్నారు.
‘‘ ఆ పత్రిక్కి నేనీ మధ్యేమీ రాయలేదే. ఏమిటండీ అది..’’ అన్నాను ఏమి రాశానో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ!
‘‘ అదేనండీ... మీ బ్లాగులో నుండి తీసుకుని వేశారనుకుంటా’’ అన్నారు.
‘‘ ఏమిటండీ అది’’
‘‘మీ నాన్న గారి గురించి..’’
వెంటనే చూశాను.
మా నాన్నగారు చనిపోయినప్పుడు నా బ్లాగులో రాసుకున్నదాన్నుండి కొంత భాగాన్ని నవ్య పేజీలో ప్రచురించారు.
ఆ పత్రిక సౌజన్యంతో దాన్నిక్కడ మళ్ళీ ప్రచురిస్తున్నాను.

బదిలీ లేని ఉద్యోగంలో బందీ అయి చివరి రోజుల్లో కూడా పక్కన ఉండి ప్రేమని పంచలేకపోయినందుకు క్షమించు నాన్నా అని అడుగుతున్నారు దార్ల. సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర్‌రావు పంచుకుంటున్న నాన్న జ్ఞాపకాలు సంక్షిప్తంగా... మార్చి 30 తెల్లవార గట్ల ఫోన్ మోగింది. తమ్ముడి ఫోనది. ఒక చేదు నిజం. భరించలేని నిజం. దుఃఖం తన్నుకొచ్చింది. ఆపుకోలేకపోయా. రేపటి నుంచి నేను 'బాబా' అని ఎవరిని పిలవాలి? మాటలన్నీ మౌనంగా దుఃఖిస్తున్నాయి. ఆలోచనలన్నీ నాన్న జ్ఞాపకాలతో గుండె కోత పెడుతున్నాయి. ఇప్పటికిప్పుడు నాన్నని చూడాలి? ఎలా?

*** navya. అమ్మా నాన్నకి దగ్గరగా ఉండే విధంగానే మా జిల్లా తూర్పు గోదావరిలోనే గవర్నమెంటు జూనియర్ లెక్చరర్‌గా పెద్దన్నయ్య చేరమని చెప్పినా చేరలేకపోయాను. రంగారెడ్డి జిల్లాలో వచ్చిన డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం నన్ను మా జిల్లాకు వెళ్లకుండా ఆపేసింది. తర్వాత బదిలీ మీద వెళ్దామనుకున్న నేను సెంట్రల్ యూనివర్సిటీలో బదిలీ లేని ఉద్యోగంలో బందీ అయిపోయాను.

ఇప్పుడు నాకంటే అన్నయ్య, తమ్ముడు, చెల్లి వాళ్లే బెటర్ అనిపిస్తోంది. కావాలనుకున్నప్పుడు కుటుంబంతో కష్టసుఖాలను కలిసి పంచుకున్నారు. ఏ ఉద్యోగం లేకపోయినా పొలం చేసుకుంటూ నిత్యం అమ్మానాన్నలతో కలిసి జీవించి, చివరి గడియాల్లో కూడా నోట్లో కాసింత గంజి పోయగలిగే అదృష్టం వారికే కదా దక్కింది. నాకు ఆ భాగ్యమేది? నాలో రూపాయలు చేరి ఆత్మీయుల్ని కాటేశాయా? నాలో అధికారకాంక్ష చేరి అనుబంధాల్ని దూరం చేసేసిందా?

*** నాన్న చిన్నప్పటి నుంచి చాలా కష్టజీవి. అన్ని పనులూ చేసేవాడు. మా నాన్న చదువుకోలేదు. సెంటు భూమి తాతగారి నుంచి వారసత్వంగా రాకపోయినా ఇల్లు కట్టాడు. పొలం కొన్నాడు. మా నలుగుర్నీ చదివించాడు. మేమిలా బతకడానికి మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారో అనిపిస్తుంటుంది. వారిని కేంద్రంగా చేసుకుని నేను కొన్ని కవితలు రాశాను.

వాటిలో కొన్నింటిని దళిత తాత్త్వికుడు కవితా సంపుటిలో ప్రచురించాను. తర్వాత నాన్న స్పర్శ పేరుతో కవితలు రాశాను. వాటిల్లో ఏముందో నాన్నకి తెలియదు. చదివి వివరిస్తే ఒక మహర్షిలా నవ్వేవాడు. అది నా తృప్తి కోసం రాసుకున్నానా? నాన్నని వస్తువుగా చేసుకుని వాడుకున్నానా?

*** తాను చనిపోయే ముందురోజు నన్ను అడిగాడట. "పిల్లోడు ఫోన్ చేశాడా? ఈ మధ్య రాడా?'' అని. నేను కొన్న కొబ్బరి తోటలోకెళ్లాడట. అక్కడ కాసేపు తిరిగాడట. అక్కడున్న పిచ్చి మొక్కల్ని పీకేశాడట. ఇంకా ఏం చేశాడో.. బహుశా ఆ తోటలోనే నన్ను చూసుకుని ఉంటాడు.అల్లారు ముద్దుగా ఎత్తుకోడానికి నీకో పసిపాపనివ్వలేకపోయినందుకు క్షమించు బాబా! నా కొడుకు కారేసుకొస్తాడు. కారులో ఊరంతా తిరిగేస్తా'' అనే వాడివట. నీ శవాన్ని చూడడానికి అది నాకు ఉపయోగపడింది తప్ప, నిన్ను బతికుండగా కారులో తిప్పలేనందుకు నన్ను క్షమించు బాబా!


సారాంశాన్ని వేశారు.
మరోసారి కన్నీళ్ళు వచ్చాయి!
రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు నాకు తెలిసిన వాళ్ళ నుండి చాలా ఫోన్స్‌ వచ్చాయి.
మా నాన్నగారి గురించి ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
` దార్ల వెంకటేశ్వరరావు

6 comments:

చెప్పాలంటే.... said...

anubhandaalu apyaayatalu manaku daggara gaa vunnappudu vaati viluva teledu....konni sarlu telisinaa duram gaa vundaka tappadu....nijaanni baagaa raasaaru....

Ramu S said...

సర్,
నేను కూడా జ్యోతి లో ఇది చదివాను. బాగుంది. మీరు ఎందుకు నాన్న దగ్గరకు వెళ్ళలేక పొయ్యారో నాకు అర్థం కాలేదు.
మా నాన్న గారి గురించి నేను రాసింది నా బ్లాగ్ లో చూడండి.
S.Ramu
apmediakaburlu.blogspot.com

డా.దార్ల said...

రాము గారు, థాంక్యూ...
కానీ... నాన్నదగ్గరకు వెళ్ళాను. నేను అప్పుడు బాలుగులో రాసిన దాన్ని పూర్తిగా వెయ్యకపోవడం వల్ల అలా అర్థం చెసుకుని ఉంటారు.
మీ
దార్ల

డా.దార్ల said...

రాము గారు, థాంక్యూ...
కానీ... నాన్నదగ్గరకు వెళ్ళాను. నేను అప్పుడు బాలుగులో రాసిన దాన్ని పూర్తిగా వెయ్యకపోవడం వల్ల అలా అర్థం చెసుకుని ఉంటారు.
మీ
దార్ల

prabhakar said...

very nice.andari badha loni gaadha.

Nrahamthulla said...

క్షమించు నాన్నా! http://nrahamthulla.blogspot.in/2010/05/blog-post_10.html?showComment=1276274676090