"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

29 April, 2010

తెలుగు గుండెల్లో Classical గుబులు

నాకిప్పుడు సంతోషించాలో

దుఃఖించాలో తెలియనంత అయోమయంగా వుంది

మళ్ళీ పాతకాలానికి

లాక్కిపోతారేమోనని భయంగా వుంది

మళ్ళీ కందుకూరి, గురజాడ, గిడుగుల అడుగుల్ని

వెతుక్కోవాల్సొస్తుందేమోనని గుండె గుబులుగా వుంది.

ప్రాచీనాంధ్ర భాషకు classical గుర్తింపొచ్చిందని

నిన్ననే మెయిల్ వచ్చింది

మూలనున్న బండీరాల్నీ, ౡల్నీ, అరసున్నాల్నీ

బలవంతంగా బంధించి

బాణాల్లా గురిపెట్టిందా మెయిల్!

అది ఇన్ బాక్స్ (Inbox)లో కొచ్చిన

స్పామ్ (Spam) మెయిల్లా వుంది

రసికుని ముందు బుసకొడుతున్న యువతిలా వుంది

శృంగార దేవతై నిలబడిన రహస్య వైరస్ లా వుంది!

ఇంగ్లీషులో రాసుకున్నతెలుగుసన్మాన పత్రాన్ని

టీ.వీ యాంకర్ చిలుక పలుకుల్లా చదువుతున్నట్లుంది.

నిజమైన తెలుగంటే ప్రజల సజీవ ప్రవాహం కదా

అతకని అక్షరాలతో ఇదేంటిలా అసహ్యంగా వుంది

కాలంతో పరిగెట్టలేని పొడపాములా పడుంది!

ఇదేనా ప్రాచీనాంధ్రకు పునర్వైభవమంటే

సంస్కృతాన్నో, అచ్చతెనుగునో కృతకంగా గుదిగుచ్చడమేనా?

నాకిప్పుడు సంతోషించాలో

దుఃఖించాలో తెలియనంత అయోమయంగా వుంది

మళ్ళీ పాతకాలానికి

లాక్కిపోతారేమోనని భయంగా వుంది

మళ్ళీ కందుకూరి, గురజాడ, గిడుగుల అడుగుల్ని

వెతుక్కోవాల్సొస్తుందేమోనని గుండె గుబులుగా వుంది.

.

విన సొంపైన గోదావరి గల గలల అక్షర రమ్యతతో

ప్రసన్నకథా కలితార్థయుక్తి రమణీయ మలుపులతో

ధర్మాధర్మరాజనీతి కళా చాతుర్యంతో

మందార మకరంద మాధుర్యాన్నీనింపిన పచ్చని పొలాల్లో

ఆడుతూ పాడుతూ కనిపించే

పల్లె పడుచు శృంగార కేరింతలతో

తెలుగు భాషా సాహిత్య సశ్యరమను పండించిన పద్యం మనదే!

ఔనుపద్యం మనదే! కాదన్నదెవరు?

తేనె తియ్యగా వుందని

నీటిలా దాహం తీర్చుకోలేం కదా!

బూజు పట్టిన తాళ పత్రాల్లోనే పడున్న

తాత ముత్తాతల్ని పైకి లేపి

సన్మానిస్తున్నందుకు కూడా సంతోషంగానే వుంది

ముని మనవడి మాటలను కూడా

వింటారో లేదోనని మాత్రం భయంగా వుంది

పురాణం, ఇతిహాసం, ప్రబంధం, శతకం...

ఇవే మన సంస్కృతీ సంప్రదాయాలంటూ

కంప్యూటర్ యుగంలో కూడా

కంఠస్థమే పట్టమంటారేమో

విఙ్ఞాన విషయంగా కాకుండా

తెలుగంటే కళగానే మిగిల్చేస్తారేమో

పంచెలతో, పిలకలతో

జంఘాలశాస్త్రులవ్వమంటారేమో

గ్రాంథికభాషనే రాస్తానంటారేమో

కృతకభాషనే మాట్లాడతానంటారేమో

ప్రామాణికమే భాషంటూ

మాండలికం వద్దంటారేమో!

Classical తెలుగిప్పుడు

కొత్త ‘class’ నేదో సృష్టిస్తుందేమోనని భయంగానే వుంది

Classical Telugu అంటే ప్రాచీనమో, సంప్రదాయమో,

శిష్టమో, విశిష్టమో మీకిష్టమైన పేరుతోనే పిలవండి

ప్రజల భాషను మాత్రం గుండెనిండుగానే పండనివ్వండి

తెలుగు భాషను ప్రజల భాషగానే ఉండనివ్వండి

ఆదాన ప్రదానాలన్నీ సహజం కదా

విరోధినామ సంవత్సరమా? విరోధం తప్పదా?

నాకిప్పుడు సంతోషించాలో

దుఃఖించాలో తెలియనంత అయోమయంగా వుంది

మళ్ళీ పాతకాలానికి

లాక్కిపోతారేమోనని భయంగా వుంది

మళ్ళీ కందుకూరి, గురజాడ, గిడుగుల అడుగుల్ని

వెతుక్కోవాల్సొస్తుందేమోనని గుండె గుబులుగా వుంది.

---డా// దార్ల వెంకటేశ్వరరావు,

హైదరాబాదు సాలార్ జంగ్ మ్యూజియం, లెక్చర్ హాల్ లో 28-3-2009 తేదీన జరిగిన"తెలుగు పాశస్త్యం పై సాహితీ గోష్ఠి " లో చదివిన కవిత) published in Visalandhra daily literary supplement on 1-2-2010

6 comments:

బొందలపాటి said...

నాకు మాత్రం అసలు మొత్తం తెలుగు భష అనేదే ఉంటుందా ఊడుతుందా అని భయం గా ఉంది.

ఆ.సౌమ్య said...

చాలా బాగా రాసారు. ప్రాచీన భాష హోదా అని వినగానే సంతోషం కలిగిందేకానీ ఇంత ఆలోచించలేదండీ

ramnarsimha said...

Very nice..

Unknown said...

నిజమే సుమండి - చాలాబాగా చెప్పారు... నా పత్రికలో ప్రచురించాలని ఉంది, మీరు అనుమతి ఇస్తే

www.samputi.com

Unknown said...

నిజమే సుమండి - చాలాబాగా చెప్పారు... నా పత్రికలో ప్రచురించాలని ఉంది, మీరు అనుమతి ఇస్తే

www.samputi.com

vrdarla said...

lalita garu,
thanks for your comment.
ika naa kavitalu gaani, rachanalu gaani prajopayogam kosam denilonaina punH pracurinchukovaccu. deenikosam pratyekinchi permission teesukonavasaram ledu. kaane, dayachesi pracurinchemundu leda tarvata naina uppandiste chalu.
mee patrika baaguntunnadi. naa rachanalanu meeru nirabhyantaranga pracurinchukovaccu.
mee
darla