"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

20 ఏప్రిల్, 2010

సాహితీవేత్తల అరుదైన వ్యక్తిత్వ ప్రతిబింబం "మా నాన్న గారు'

Dr.Darla Venkateswara Rao
Assistant Professor,
Department of Telugu
School of Humanities,
UNIVERSITY OF HYDERABAD
Gachibowli, Hyderabad. A.P.,India
Mobile: 09989628049
సాధారణంగా ఏదైనా ఒక గాఢమైన ముద్రవేయగలిగిన రచనను చదివినప్పుడు, ఆ రచన చేసిన వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. వాళ్ళపై వచ్చిన జీవిత చరిత్రలు చదవాలనిపిస్తుంది. కానీ, మన తెలుగు సాహితీవేత్తల జీవిత విశేషాలు, అదీ ముఖ్యంగా ప్రాచీన సాహితీవేత్తలవయితే అసలే దొరకడం గగన కుసుమమే అన్నట్లుంటుంది. అప్పుడు ఆ కవి గురించి రకరకాల "కథలు' ప్రచారంలోకి వచ్చేస్తుంటాయి. కొన్ని రచనల్ని రచయిత వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి వ్యాఖ్యానించేటప్పుడు తప్పుడు నిర్ణయాలకు కారణమవుతుంటాయి. దీనిక్కారణం ఆ కవి జీవిత విశేషాలు కొన్ని కూడా లభించకపోవడమే ప్రధాన కారణం! ఇటువంటి పరిస్థితి కేవలం ప్రాచీన తెలుగు కవులకే కాదు, ఆధునిక సాహితీవేత్తలకూ తప్పట్లేదు. అందువల్ల సాహిత్యాన్ని చదివే వాళ్ళు, ఆ సాహితీవేత్తల జీవిత వివరాలు కూడా తెలుసుకోగలిగినట్లైతే ఆ సాహిత్యాన్ని అవగాహన చేసుకోవడంలో తప్పుడు నిర్ణయాలకు, అభిప్రాయాలకు లోను కాకుండా ఉండేందుకు సహకరిస్తుంది! ఇలాంటి లక్ష్యంతోనే ప్రముఖ విమర్శకుడు డా.ద్వా.నా. శాస్త్రి " మా నాన్న గారు'' పేరుతో కీర్తిశేషులైన అరవైరెండుమంది తెలుగు సాహితీవేత్తల జీవిత విశేషాలను ఒక గ్రంథంగా ప్రచురించారు. సాహితీప్రముఖుల వివరాలను వారి కూతురు లేదా కొడుకు నుండి సేకరించినా, అవి వారి మాటల్లోనే వ్యాస రూపంలో ప్రకటించడం ఒక విశేషం.

ప్రసిద్ధ పరిశోధకుడు, తొలి తెలుగు పదం "నాగబు' ని గుర్తించిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి వాళ్ళ కుమారుడు ప్రముఖ పరిశోధకుడు వేటూరి ఆనందమూర్తి అనేక విశేషాల్ని వివరించారు. కందుకూరి వీరేశలింగం ఆంధ్రకవుల చరిత్ర రాసేటప్పుడు ప్రభాకర శాస్త్రి గారు పరిశోధన విధానాన్ని వివరిస్తూ, అనేక పద్యాల్ని పంపి సహాయం చేశారని పేర్కొన్నారు. సన్మానాలప్పుడు జరిగే పొరపాట్ల వల్ల వయోభారం మీద పడుతున్న కవులు ఎలా అసహనానికి గురౌతుంటారో రాయప్రోలు సుబ్బారావు గారి గురించి శ్రీనివాస్‌ గారు రాసిన సంఘటన వివరిస్తుంది. తృణకంకణం గొప్ప కావ్యం రాసిన కవి తన భార్యను వంటింటికే పరిమితం చేసిన నిజాల్ని శ్రీనివాస్ గారు వెల్లడించడంలో నిజాయితీ కనిపిస్తుంది. నాటి స్త్రీకున్న స్వేచ్చను తెలుపుతుంది.
మొక్కపాటి నరసింహశాస్త్రి గారి పేరు వినగానే "బారిస్టర్‌ పార్వతీశం'గుర్తుకొస్తుంది. దానిలో కథానాయకుడు ఇంగ్లండు వెళ్ళేటప్పుడూ చేసే హంగామా, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు నవ్వు తెప్పిస్తుంటాయి. నరసింహశాస్త్రి గారే లా చదవడానికి లండన్‌ వెళ్ళారేమో ననే సందేహం కూడా వస్తుంటుంది. నిజంగానే రచయిత లండను వెళ్ళాడని ఆయన రాసిన స్వీయ చరిత్ర మనకి తెలియ జేస్తున్నా, ఆ రచనా నేపథ్యం మరింత తెలియాలంటే, వాళ్ళమ్మాయి అడ్డాల లలితాదేవి గారి మాటల్లో వినాల్సిందే. నరసింహశాస్త్రి గారు నవలని చేతితో రాయలేదనీ, తాను చెపుతుంటే వ్రాయసకాండ్రు రాసేవారని ఈ పుస్తకాన్ని బట్టి స్పష్టమవుతుంది.
తెలుగు మాస్టార్లంటే నేటికీ చాలా చోట్ల చులకన భావం ఉంది. ఇతర సబ్జెక్టుల వాళ్ళకిచ్చేంత జీతం తెలుగు వాళ్ళకివ్వడానికి మనస్కరించని స్థితే ఇంకా చాలా ప్రైవేటు విద్యాసంస్థల్లోనేటకీ కనిపిస్తుంది. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారిని ఈ విషయం చాలా ఆలోచింపజేసింది. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్నప్పుడు నాటి వైస్‌ ఛాన్సలర్‌ తో మాట్లాడి, ఆంగ్లోపన్యాసకులతో పాటు సమాన వేతనాన్ని తెలుగు వాళ్ళూ పొందేలా చేయడంలో విశేషమైన కృషిచేసిన వారు లక్ష్మీకాంతం గారని వాళ్ళబ్బాయి సుందరం గారు పేర్కొన్న విషయాలను బట్టి తెలుస్తుంది. ఆంధ్రసాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్ష వంటి పరిశోధన, విమర్శ గ్రంథాలు, తొలకరి, సౌందరనందం మొదలైన కావ్యాలు రాసిన సాహితీ వేత్త కుటుంబంలో ఎవరూ సాహిత్యం పై అభిరుచిని పెంచుకోలేకపోయామని సుందరం స్పష్టం చేశారు. సౌందరనందం కావ్యం రాయడంలో జంటకవులుగా ప్రసిద్ధులైన పింగళి, కాటూరి వారి భాగాలు ఎంతవరకూ ఉన్నాయో తెలియాలంటే పింగళి సుందరం గారు చెప్పిన ముచ్చట్లు చదవాల్సిందే. జంటకవుల పేరుతో రాసిన రచలను అర్థం చేసుకోవడానికీ వ్యాసం కొంతవరకూ తోడ్పడుతుంది.
దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి గురించి వాళ్ళబ్బాయి రాధాకృష్ణ మూర్తి రాస్తూ వాళ్ళ నాన్నగారు కులం కట్టుబాట్లను అధిగమించలేకపోయిన వైనాన్ని తెలిపారు. అలాగని కరడుకట్టిన కులవాది కాదని కూడా తెలిపారు. గుర్రం జాషువా గురించి వాళ్ళమ్మాయి హేమలతా లవణం చెప్పిన అంశాలు కవిని అర్థం చేసుకోవడానికి చాలా తోడ్పడతాయి. కులం పొందిన అవమానాలు హృదయాన్ని చీల్చినా, అందరి హృదయాల్ని కరిగించగలిగిన ప్రేమమూర్తిగా సాగిన వివిధ ఘట్టాల్ని వివరించారు. నిజానికీ వ్యాసం కంటే అంతకు ముందే జాషువా గురించి హేమలతా లవణం గారు అనేక విషయాలు రాసినా, వాటి కంటే కొత్త విషయాల్ని ఇందులో ప్రస్తావించారు. " నాన్న గారు తన రచనల్లో ఆస్తిక వాదిగా కనిపిస్తారు. కాని, ఆచరణలో పూర్తిగా నాస్తికుడుగా నాకు కనపడతారు''(పుట: 66) అని హేమలత గారు వ్యాఖ్యానించడాన్ని అర్థం చేసుకుంటేనే జాషువాలోని నాస్తికాస్తికత్వం అవగాహన అవుతుంది.
అడవి బాపిరాజు గారి గురించ వాళ్ళమ్మాయి క్రొవ్విడి ప్రేమకుమారి తన ప్రేమనంతా కవిత్వంగా మార్చి రాసినట్లుగా ఎంతో ఆత్మీయంగా ఉంది. కవిది భీమవరం. అయినా ఆయన వృత్తి రీత్యా తెలంగాణాలోనే జీవించి చనిపోయారు. ఆయనతో పెనవేసుకున్న సాహితీ కళా బంధువులంతా తెలంగాణా ప్రాంతంలో అనేక చోట్ల సంతాప సభలు పెట్టారని వివరించారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన సురవరం ప్రతాప రెడ్డి గారి గురించి సుమారు ఏనభైసంవత్సరాల వాళ్ళబ్బాయిఎస్. ఎన్. రెడ్డి రాస్తూ తెలంగాణ ప్రాంతంలో తెలుగుకి స్థానం లేని కాలంలో తెలుగు భాష గురించి తపించిన మహోన్నత వ్యక్తిగా కీర్తించారు. నిజాం సార్వభౌమాధికారాన్ని కూడా నిరసిస్తూ సంపాదకీయాలు రాసేవారనీ, తెలుగు భాషను కాపాడ్డం కోసం ఆంధ్రవిద్యాలయం స్థాపించారని, కోర్టుల్లో కూడా తెలుగు భాష వాడుక పెరగాలని ఆప్పుడే సామాన్యుడికి కూడా న్యాయం అందుబాటులోకి వస్తుందని తపించేవారని వివరించారు. తమ నాన్న గారు చాలా పట్టుదల, ఆత్మగౌరవాన్ని అభిలషించిన వ్యక్తి అనీ అందుకనే తెలంగాణలో తెలుగు కవులు లేరన్నవాళ్ళకు సమాధానంగా 354 మంది ప్రసిద్ధ కవుల్ని గుర్తించి గోల్కొండ సంచిక వేశారని పేర్కొన్నారు. నిజానికివన్నీ వివిధ పుస్తకాల్లో దొరుకుతున్న వివరాలే. తండ్రి సాహితీ వ్యక్తిత్వం గురించి వివరిస్తే బాగుండేది.
గడియారం వేంకటశేషశాస్త్రి శివభారతం రాసిన ప్రసిద్ధ కవి. రాయలసీమ ప్రాంతం, కడప వాసి. ఆయన తెల్లవారగట్ల రచనలు రాసేవారని తన కొడుకు సుబ్రహ్మణ్యం గారు రాశారు. ఇలా అనేక మంది జీవితాల్లో కనిపించే విశేషఘట్టాల్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకంలో ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రముఖ కవుల గురించి ఉన్నా, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సాహితీవేత్తలే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. తెలంగాణా ప్రాంతం నుండి దాశరధి, సుద్దాల హనుమంతు, దేవుల పల్లి రామానుజరావు, వానమామలై వరదాచార్యులు మొదలైన వాళ్ళ గురించి వివరించారు.
కళింగాంధ్ర ప్రాంతం నుండి రావిశాస్త్రి, చాసో, బలివాడ కాంతారావు తదితరుల విశేషాల్ని పేర్కొన్నారు. చాలా మంద కవులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి తెలంగాణా ప్రాంతంలో స్థిరపడిపోయిన స్థితి కనిపిస్తుంది. అయినా, వాళ్ళని జన్మస్థలం గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళ ప్రాంతం చెప్పడం తప్ప, ఇంచుమించు ఈ ప్రాంతంలోనే స్థిరపడిపోయిన వాళ్ళున్నారు. ఒకప్పుడు రాయల సీమలో భాగంగా ఉండే ప్రకాశం జిల్లా నుండి వచ్చిన కేతవరపు రామకోటశాస్త్రి గారు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి, ప్రస్తుతం వాళ్ళమ్మాయి కాత్యాయనీ విద్మహే వరంగల్‌ వాస్తవ్యులుగానే పరిగణన పొందుతున్నారు. అదే జిల్లాకు చెందిన నాయని సుబ్బారావు గారు, వారి కూతురు నాయని కృష్ణకుమారి గారు హైదరాబాదు వాస్తవ్యులైపోయారు. కృష్ణా జిల్లాకు చెందినప్పటికీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తెలంగాణా ప్రాంతానికి చెందిన వారుగానే పేరు ప్రఖ్యాతులు పొందారు. వాళ్ళబ్బాయి ఆనందమూర్తి హైదరాబాదు వాస్తవులే అయిపోయారు. అలాగే చాలా మంది తెలంగాణా ప్రాంతంలోనే స్థిరపడిపోయి, వాళ్ళ పిల్లలు ప్రముఖ సాహితీ వేత్తలుగా ప్రఖ్యాతివహిస్తున్నారు. వీటన్నింటినీ బట్టి కవుల్ని ప్రాంతాల వారీగా విభజించుకుని పరిశీలించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. సాహిత్యాన్ని ప్రాంతీయ దృక్పథంతో పరిశీలన చేయడం ప్రారంభమైన ఈ సమయంలో ఈ అధ్యయనానికి కూడా ఈ పుస్తకం విలువైన సమాచారాన్ని అందిస్తుంది.
ఈ పుస్తకాన్ని పరిశోధన గ్రంథం గానే భావించవలసిన అవసరం ఉంది. మన సాహిత్య చరిత్ర రచనా పరిణామం కావలి రామస్వామి తెలుగు వాళ్ళ గురించి ఇంగ్లీషులో ది బయోగ్రాఫకల్‌ స్కెచ్చెస్‌ ఆఫ్‌ డక్కన్‌ పోయిట్స్‌ పేరుతో 1829లో రాయడంతో మొదలైంది. ఆ తర్వాత గురజాడ శ్రీరామ మూర్తి కవిజీవితములు ( 1893), తర్వాత కందుకూరి వీరేశలింగం ఆంధ్రకవుల చరిత్రము ( 1917), చాగంటి శేషయ్య కవితరంగిణి( 1946), మధునాపంతుల సత్యనారాయణ ఆంధ్ర రచయితలు( 1950) , నిడదవోలు వెంకట్రావు తెలుగు కవుల చరిత్ర ( 1953), బులుసు వెంకట రమణయ్య ఆంధ్ర కవిసప్తశతి ( 1956), ఊటకూరి లక్ష్మీకాంతమ్మ ఆంధ్ర కవయిత్రులు ( 1958), ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( 1965) వంటి వన్నీ కవుల చరిత్రలను వెల్లడించే రచనలు. వీటిలో చాలా వాటిలో కవుల గురించి పుక్కిట పురాణాలు ఉన్నాయి. కవుల్ని అర్థం చేసుకోవడంలో అనేక ఇబ్బందులున్నాయనిపిస్తాయి. వీటిని సరిదిద్దే మార్గంలో కేవలం సాహిత్యాన్నే పరిశీలించే దిశగా కొన్ని సాహిత్య చరిత్రలు వచ్చాయి.
సాహిత్య చరిత్రల్లో ముఖ్యమైనవి. వంగూరి సుబ్బారావు ఆంధ్రవాజ్మయ చరిత్ర ( 1929), కవిత్వ వేది ఆంధ్రవాజ్మయ చరిత్ర సంగ్రహము ( 1928), బసవరాజు అప్పారావు ఆంధ్ర కవిత్వ చరిత్రము ( 1932) కాశీనాధుని నాగేశ్వరరావు ఆంధ్రవాజ్మయ సూచిక ( 1929), ఖండవల్లి లక్ష్మీరంజనం ఆంధ్ర సాహిత్య సంగ్రహము ( 1949), శిష్టా రామకృష్ణ శాస్త్రి ఆంధ్ర వాజ్మయ చరిత్ర సంగహము ( 1957), దివాకర్ల వెంకటావధాని ఆంధ్రవాజ్మయ చరిత్రము ( 1958), కూర్మా వేణుగోపాల స్వామి ఆంధ్ర వాజ్మయ సంగ్రహ చరిత్ర ( 1958), పింగళి లక్ష్మీకాంతం ఆంధ్ర సాహిత్య చరిత్ర ( 1974), జి. నాగయ్య తెలుగు సాహిత్య సమీక్ష ( 1983-85), ద్వానాశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర ( 1998) వంటి సాహిత్య చరిత్రలలు అవగాహన చేసుకోవడానికి ఇప్పుడు వచ్చిన " మానాన్న గారు '' గ్రంథం ఎంతగానో తోడ్పడుతుంది.
ఇది విశ్వవిద్యాలయాల్లో ఒక పరిశోధన ప్రాజెక్టుగా రావలసిన గొప్పగ్రంథం. అలాగని ఇందులో ఉన్న విషయాలన్నీ వాస్తవాలె అనునుకోవడానికి లేదు. కానీ, చాలా మంది వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నించారని మాత్రం చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతులు పొందిన సాహితీవేత్తలైన తమ వాళ్ళ గురించి యధార్థవిషయాలు ఎంతమంది చెప్పారనేదీ అనుమానమే. వాళ్ళని కీర్తించడమే పనిగా పెట్టుకున్నట్లున్న వ్యాసాలూ దీనిలో చాలానే ఉన్నాయి. గ్రంథ కర్త ద్వానాశాస్త్ర తన నాన్న గారిలోని బొమ్మా బొరుసులను చూపించారు. తమకి నచ్చని విషయాలను కూడా చెబితే వారి విశిష్టవ్యక్తిత్వాలు మరంతగా స్పష్టమయ్యేవి. ఆ దిశగా మిగిలిన అనేక మంది ఉన్నసాహితీవేత్తల గురించి కూడా తెలియపరిచే రచనలు వెలువడవలసిన అవసరాన్ని ఈ పుస్తకం చాటిచెప్తోంది. నిరంతరం సాహిత్యంతో కుస్తీ పడుతూ, ఏదొక కొత్త విషయాన్ని లోకానికి అందించాలనే పరిశోధనాసక్తి గల డా.ద్వా. నా. శాస్త్రి తెలుగుసాహిత్య చరిత్ర అధ్యయనానికి కొత్తదారుల్ని చూపే మార్గం వేశారు. కవిజీవిత కావ్య సమన్వయ విమర్శకు ఈ గ్రంథం ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే దీన్ని సాహిత్యాన్ని, కవుల్నీ అవగాహన చేసుకునే మరో మార్గం వేసిన గ్రంథంగా దీన్ని అభివర్ణించవచ్చు. దీనిలో అరుదైన కవుల ఫొటోలు కూడా ప్రచురించడం బాగుంది.
( మానాన్నగారు ( కీర్తిశేషులైన 62 మంది సాహితీప్రముఖుల జీవిత విధానాలు), రచయిత: డా. ద్వా. నా. శాస్త్రి, 1/8 డెమ్మీ సైజు 379 పుటలు, ఖరీదు రూ. 400/- పుస్తకం లభించు స్థలం: డా. ద్వానా శాస్త్రి , 09849293376‌)
మనలో మనమాట : నాకు బాగా తెలిసిన వాళ్ళైతే డా. ద్వానా శాస్త్రి గారు 50% తగ్గించి ఇద్దామని చెప్పారు ... దార్ల
( ఈ వ్యాసం సూర్య దినపత్రిక ( 19-4-2010) లో ప్రచురితమైంది)

1 కామెంట్‌:

Rajendra Devarapalli చెప్పారు...

దార్ల గారు,ఇప్పుడే ఈ పుస్తకావిష్కరణ సభనుంచి వచ్చాను
http://wp.me/pPLDz-ZM ఇక్కడ మీరా సభ విశేషాలు చూడవచ్చు.మీ వ్యాసంలో...ఒకప్పుడు రాయల సీమలో భాగంగా ఉండే ప్రకాశం జిల్లా నుండి వచ్చిన...అన్నారు.కానీ అది పాక్షికసత్యమే.ఎందుకంటే కర్నూలు,నెల్లూరు,గుంటూరు జిల్లాల నుంచి ఎంపికచేసిన ప్రాంతాలతో ప్రకాశం జిల్లా ఏర్పడింది.గమనించగలరు