Wednesday, February 17, 2010

భిన్నపార్శ్వాల్లో ప్రపంచీకరణ కవిత్వం

-డా.దార్ల వెంకటేశ్వరరావు, అసిస్టెంటు ఫ్రొఫెసరు,

సెంట్రల్యూనివర్సిటి, హైదరాబాదు-500 046. సెల్‌: 9989628049.

కవికి జీవితానుభవాలు ప్రధానం. జీవితంలో ఎదురయ్యే సుఖ ధుఃఖాలకు కవి స్పందిస్తాడు. తన సుఖ దుఃఖాలకు కారణాలేమిటో తెలిసినా, తెలియక పోయినా తన కెదురైన అనుభవాన్ని వ్యక్తీకరిస్తాడు. అవన్నీ తన అనుభవాలే కానక్కర్లేదు. సహానుభూతితో కూడా స్పందిస్తాడు. పరగత సుఖ దుఃఖాల్ని తనవిగా భావిస్తాడు. తన జీవితంలోగల ఒడిదుడుకులకు గల కారణాలేంటో కూడా వివరించే కవులూ కొంతమంది ఉంటారు. జీవితానుభవమే తప్ప, దానికి గల హేతువుల్ని ప్రస్తావించని కవులు, హేతువుల్ని అన్వేషించే కవులు అనే రెండు ప్రధాన ధోరణులు గల వాళ్ళు తెలుగులో కవిత్వం రాస్తున్నారు. మార్స్కిజం తనకు తెలియదంటూనే దానిలో తత్త్వాన్ని తన కవిత్వంలో పెట్టిన శ్రీశ్రీ లాంటి వాళ్ళ లాగే, ప్రపంచీకరణ ప్రభావం వల్ల అలా జరుగుతుందని చెప్పలేకపోయినా, చెప్పడానికిష్టంలేకపోయినా దాన్ని వ్యతిరేకిస్తూ కవిత్వం రాసేవాళ్ళెంతో మంది ఉన్నారు.

భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ 1990 దశకం తర్వాతనే దాని ప్రభావం విస్తృతంగా కనిపించటం ప్రారంభమైంది. గాట్ ఒప్పందాలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF), ప్రపంచ బ్యాంక్ అప్పుల గురించి మార్క్సిస్టులు బాగా ప్రచారం చేయడం, ప్రచారాన్ని ప్రజలు, కవులు తమ జీవితానుభావాలతో సరిపోల్చి చూసుకోవడం ఇప్పటి నుండే ఎక్కువగా ప్రారంభమైంది.

ధరలు పెరగడం, టెర్మినేటెడ్ సీడ్స్ ప్రవేశించటం, వీటికి తోడు కల్తీవిత్తనాలు రైతుల్ని కుంగదీశాయి. అత్యధిక శాతం ప్రజలు గ్రామాల్లోనే జీవించడం వల్ల సహజంగానే ప్రభావమంతా గ్రామీణ జీవన విధానంలో కనిపించడం ప్రారంభమైంది. జీవనాధారమైన వ్యవసాయం వాణిజ్య పంటల పరమౌతుంది. పచ్చని పొలాలు రొయ్యల, చేపల చెరువులై పోతూ కాలుష్యం మరింతగా పెరిగిపోవడం వల్ల వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. దీనికి తోడు యంత్రాలతో వ్యవసాయం చేయడం ఎక్కువయ్యింది. దీనితో చేతివృత్తులు, కుటీర పరిశ్రమల పైనే ఆధారపడి జీవించే వారి జీవితం దుర్భరమైపోతోంది.

ప్రపంచీకరణ వల్ల కులవృత్తులు, చేతి వృత్తులు నాశనమైపోతున్నాయనే ఆందోళన కనిపిస్తుంది. దిశగా చాలా మంది కవిత్వం రాసారు.

""సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు

సంస్కరణాగ్నిలో సమిధలై పోయాయి

ప్రవేటీకరణ రాజసూయ యాగంలో

అన్ని వర్ణాలూ, వివర్ణాలౌతున్నాయి'' అని డి. కృష్ణమూర్తి ""నిషిద్ధ రైతు'' కవితలో వర్ణించారు. వృత్తులు పోతున్నాయనే బాధే తప్ప, వృత్తులకు మన వాళ్ళెంత గౌరవమిస్తున్నారనే విషయాన్ని ప్రస్తావించడం లేదు.

"వృత్తులు కూలీ ఉపాధీ పాయె

ప్రత్నామ్నాయం లేకనెపాయె

కూలిన బ్రతుకుల నిలుపుటకైన

కుటీర పరిశ్రమలైనా లేవు

బహుళ జాతి కంపెనీల మాయల్లోనా మా యన్నల్లారా

-భారత పల్లెలు నలిగిపోయి కుమిలె అయ్యల్లారా'' --- " "పల్లె కన్నీరు పెడుతుందో.'అనే గేయంలో గోరేటి వెంకన్న కరుణ రసం ఉట్టిపడేలా రాసి, గానం చేశాడు.

ఇక్కడే ఒక విషయాన్ని చర్చించుకోవాలి. కులవృత్తులు, చేతి వృత్తులు ఒకటి కాదు. భారత దేశంలో కొన్ని కులాలకు నిర్దేశించిన వృత్తులు లాభదాయమైనవి కాదు, లేదా వారి జీవితాల్లో అవి వెలుగులివ్వకపోగా, మరింత దిగజారిపోవడానికి కారణమవుతున్నాయి. కొన్నింటికి అత్యంత గౌరవం లభిస్తూ, మరికొన్నింటికి అగౌరవం కలుగుతుంది. ఇది కులవృత్తుల్లో కలుగుతున్న వాస్తవం. కులవృత్తి చేతి వృత్తిగా మారలేదు. ఎవరు వృత్తినైనా చేసుకొనే స్వేచ్చ లేదు. మన సమాజంలో కులం అనివార్యం. కులంతోనే అత్యథికులకు గుర్తింపు కలుగుతుంది. అందు వల్ల కొన్ని కులాలకు కొన్ని వృత్తులు వంశపారంపర్యంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని కులవృత్తులకు సమాన గౌరవం ఎలా లభిస్తుంది? కుల వృత్తి చేతి వృత్తి గా మారడం, అన్ని వృత్తులకు సమాన గౌరవం లభించడం జరగడం లేదు. ఇది గ్రామాల్లో అసలు సాధ్యం కావడం లేదు. అలా ప్రయత్నిస్తే ఘర్షణలు, కొట్లాటలు జరిగిపోతున్నాయి.

పట్టణం, నగరాల్లో కుల వృత్తి చేతి వృత్తి గా మారి సాంఘిక, ఆర్ధిక రంగాల్లో గౌరవం కలుగుతుంది. కుల వృత్తి చేతి వృత్తిగా మారడానికి మనం ముందుగా ప్రయత్నంచాలి. అప్పుడు ప్రపంచీకరణ పరిస్థితుల్లో ""వృత్తులు'' నాశనమైపోతున్నాయని బాధ పడటంలో నిజమైన ఆవేదన కపడుతున్నట్లవుతుంది.

పారిశ్రామికీకరణ, పాశ్చాత్యీకరణ, ఆధునికీకరణల ఫలితంగా దళితుల జీవితాల్లో చాలా వరకూ అభివృద్ధికరమైన మార్పులే వచ్చాయి. అంతవరకూ లేని విద్యావకాశాలు లభించాయి. కాల క్రమంలో కుల వృత్తి, చేతిత్తిగా మారింది. మతపరమైన హింస తగ్గింది. సామాజికంగా గౌరవం పెరిగింది. ప్రజాస్వామ్యం అందించిన స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి భావనలు దళితుల్ని ప్రధాన జీవన స్రవంతికి తీసుకోని రావడానికి ద్వారాలు తెరిచేలా చేసింది. కుల వృత్తిని మానేసి మరోవృత్తి చేసుకోవడం ద్వారా వచ్చే మార్పుల్ని దళితులు అభివృద్దికరమైన వాటిగానే భావిస్తున్నారు.

"" మా ముత్తాత చెప్పులు కుట్టేవాడు

మా తాత కూలిపని కెళ్ళేవాడు

మా అయ్య అక్షరం కోసం ఆశగా చూసేవాడు

నేనిప్పుడు కవిత్వం రాస్తున్నాను

నా కొడుకు రేపు ఫ్రొఫెసరవుతాడు'' అని కవి (దార్ల వెంకటేశ్వరరావు) అనడంలో దళితులు సాధించిన అభివృద్ధి పరిణామం వెనుక కులవృత్తి మారి, తమ జాతి స్వేచ్చ, సమానత్వం కోసం తరతరాలుగా ఎదురు చూసిన వైనం కనిపిస్తుంది.

ప్రజాస్వామ్యం కూడా ప్రపంచీకరణలో భాగమే అయినప్పుడు దాని వల్ల దళితులకు కొంత మేలే జరిగిందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం వల్ల దళితులకు ఓటు హక్కు వచ్చింది. దీనితో దళితుల సంక్షేమం గురించి అన్ని పార్టీలు ఆలోచించవలసిన పరిస్థితులే దళితుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగకరంగా మారాయి. దీనిలో భాగంగానే హాస్టల్స్ ఏర్పడ్డాయి. వీటి వల్ల దళితులు ఎంతోమంది చదువుకోగలుగుతున్నారు. తమ ఇంటి దగ్గర తినడానికి లేని పరిస్థితుల్లో తాము తింటున్న ఆహారాన్ని చూసి దళితులు ఎలా ఫీలవుతుంటారో సిద్దంకి యాదగిరి రాసిన ఒక కవితను చూస్తే తెలుస్తుంది.

హాస్టల్ల.....

బువ్వ కలుపుతూ మెతుకుల్ని జూస్తే

ఒకపారి అయ్యవ్వ యాదికొచ్చి

మతిల కుతి కొట్టు కుంటది....

.జెండా వందనం నాడు బోంది వెడితే

అడవిల కంకులు, కాయలు కాల్చి దెచ్చిన "అయ్య'

మంగలం పెంకల ప్యాలాలు ఏంచిన "అవ్వ'

అంగి జేవుల వోసిన "నాయినవ్వ'

బుక్కసా... బుక్కమనే మా "తాత' మాటలు

చెవులు మరిసినా కండ్లు మరవలేదు.''

ప్రపంచీకరణ ప్రభావంతో అన్నీ మారుతున్నా "కులం' అంతరించి పోవట్లేదు. కులం వల్ల కలిగే ద్వేషాలు, అంటరాని భావన పోవట్లేదు. దీన్నీ అన్ని ప్రాంతాల కవులూ రాస్తున్నారు. కత్తుల కిషోర్ కుమార్ కులం వాసన పోని ఊరు గురించి చెప్తూ....’’ఊరి గురించి మాట్లాడాలంటే

మా కన్నీళ్ళను, మా ఆకలి అవమానాల్నీ తవ్వుకోవడమే'' నంటాడు కవి.

ప్రపంచీకరణ ఒక్కసారిగా వచ్చినది కాదని నమ్మితే అది దళితుల్ని కొంత ముందుకి తీసుకెళ్ళడానికీ, విద్యావకాశాలకి అవకాశం కలిగించిందనీ ఒప్పుకోక తప్పదు. దీన్ని తైదల అంజయ్య అనే కవి ఇలా వర్ణించాడు. "

"కరువుకు

మనుషులను అమ్ముకున్నట్టి

ఆకలి చావు మా తాత

అప్పులను తీర్చుటకు

కడుపు గట్టుకున్న

వలస బతుకు మా అయ్య

చినిగిన అంగీ లాగుతో

బడిలో చేసే జండా వందనం నేను'' ఇలా వర్ణించడంలో దళితులు కనీసం పాఠశాలల్లో కైనా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయినా, మార్పు పునాదిలో కూడా రావాలి. కులం' గ్రామాల్లో చూపే ప్రభావాన్ని ప్రపంచీకరణ కూడా ఏమీ చేయలేకపోతోంది. అందుకే ""వర్గం : కులం'' పట్ల భిన్నమైన సిద్ధాంతాలు బయలుదేరాయి. .

మరో కోణంలో చూస్తే, గ్రామాల్లో యంత్రాలతో వ్యవసాయం చేసే పరిస్థితి పెరిగిపోవడం, పంట పొలాలు రొయ్యల చెరువులుగా మారిపోవడంతో కూలీ పనిమీద ఆధారపడి జీవించే వాళ్ళు బతుకుతెరువు వెతుక్కొంటూ పనిచేసుకోవడానికి వలసలు పోక తప్పట్లేదు. వలసలు వెళ్ళవలసిన పరిస్థితుల్ని గమనిస్తే ఎంతో దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. గురించి కవులు అన్ని ప్రాంతాల నుండీ కవిత్వం రాస్తున్నారు. తమ జీవనాధారమైన పశువుల్ని అమ్ముకోవలసివస్తుందంటూ . .""మా సీమలో కరువు

బిడ్డ లాంటి పశువును

/అడ్డంగా అమ్మిస్తోంది

ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ చేయించి

మనుషుల్ని

వలస పక్షుల్ని చేయిస్తోంద'ని రాచపాళెం చంద్రశెఖరరెడ్డి " అదృశ్యమవుతున్న దృశ్యం' మనకి చూపిస్తున్నారు.

ఇలాంటి కరువు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుందని మరికొంతమంది రాస్తున్నారు.

"మా కరువిప్పుడు

ప్రాంతీయవేదన కాదు

ది జాతీయ విపత్తు

మా గ్రామీణ జీవన సౌందర్యాన్ని

కాలరాస్తున్న కరువు

మన సామాజిక, సాంస్కృతిక విలువల్ని

కాటేస్తున్న కరువు

ఉమ్మడి కుటుంబ వ్యవస్థని

ఊరుమ్మడి బతుకులుగా ఛిద్రంచేస్తున్న కరువు'' కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించటం గ్రామీణ సంస్కృతిలో ఒక భాగం.

విద్య, ఉద్యోగాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి రావడం ఆధునిక కాలంలో ఎలాగూ తప్పదు. కానీ, పొలాల్లో నీళ్ళులేక, పంటలు పడించుకోలేక, వలస పోవలసిన పరిస్థితి ఘోరం. ఒకవేళ నీళ్ళు ఎలాగో కొద్దోగొప్పో అందినా, కల్తీ విత్తనాలు, ఎరువుల వల్ల సర్వం కోల్పోయి, పెట్టిన పెట్టు బడులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనేవాళ్ళు, పట్నం, నగరం వెళ్ళి పనో, పాటో చేసుకొని, అప్పులూ తీర్చవలసిన పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమై పోవడం విషాధకరం. కార్పోరేట్ విద్య, వైద్యం వల్ల, వ్యవసాయంలో పెట్టుబడులలకు తాముచేసిన అప్పులు తీర్చలేక అవయవాల్ని అమ్ముకోవడమో, వ్యభిచార కూపంలోకి దిగిపోవడమో జరుగుతుంది. అందుకని గ్రామాల్ని వదిలి నగరాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. ఇది ప్రపంచీకరణ ప్రభావం ఫలితంగా ఎక్కువైంది.

తెలంగాణా, రాయలసీమ, కళింగాంధ్ర, మధ్యాంధ్రల........ ప్రాంతాన్ని చూసినా విచ్ఛిన్నమై పోతున్న ఉమ్మడి కుటుంబం, దాని వెనుక గల ప్రపంచీకరణ ప్రభావాన్ని ప్రాంత కవులు వాటిని కవిత్వీకరిస్తున్నారు.

పచ్చని పొలాలతో కళకళలాడిన పల్లెల్లు రొయ్యల చెరువులుగా మారిపొయిన పరిస్థితి కోస్తాంధ్రలో కనిపిస్తుంది. కోడికూతలతో, పక్షుల కిలకిల రావాలతో, సుప్రభాతాలతో నిద్ర లేచే పల్లెలు ఇప్పుడు యం త్రచప్పుళ్ళతోనే మేల్కొనవలసి వలసి వస్తుందం టున్నారు పాటిబండ్ల రజని.

""రూపాయిలు డాలర్లకు మారకపోయాక

వరిచేలు వ్రయ్యలయ్యి రొయ్యకయ్యలయాక

పల్లె

చల్ల చిలికే చప్పుళ్ళతో కాక ఐస్క్రషర్ల మోతతో గొప్పగా మేల్కొంటుంది

ప్రతి కుటుంబానికి సర్వసాధారణంగా డబ్బున్నా లేకపోయినా గ్రామాల్లో పండగ వచ్చిందంటే గొప్ప హడావిడి ఉండేది."

‘’సంకురాత్రి పండుగొచ్చిందటే

సకినాలే సకినాలు

వాకిట్లో అడుగుపెట్టటం యమ కష్టం

ముగ్గు తొక్కినోని వీపంతా నుగ్గునుగ్గయ్యేది’’ అని కందుకూరు శ్రీరాములు నాటి పండగల్లో ప్రధానంగా ముగ్గులు పెట్టుకొనేటప్పుడు కనిపించే హడావిడి వర్ణించాడు. సహజత్వానికి దూరంగా పండుగలు జరుపుకోవడం గ్రామాల్లోనూ కనిపిస్తుంది.

సమాచార రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫోను, సెల్ ఫోను వాడేవారి సంఖ్య గణనీయంగానే పెరిగింది. కొన్ని అవాంచనీయ కార్యకలాపాలు సెల్ ఫోను వల్ల కలిగినా, దళితులకు, నిరక్షరాస్యులకు కొంత ఆత్మగౌరవాన్ని కలగజేసిందనే చెప్పాలి. ఒకప్పుడు నిరక్షరాస్యులు తమ బంధువులకు ఒక ఉత్తరం రాయాలన్నా, వచ్చిన ఉత్తరం చదివించుకోవాలన్నా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. అత్యధిక శాతం దళితులు నిరక్షరాస్యులు. కనుక, సమస్యను ఎక్కువగా వాళ్ళే ఎదుర్కోవలసి వచ్చేది. అయినా, ఇతర వర్గాల్ని, వర్ణాల్ని చూసినప్పుడు చాలా మంది సెల్ ఫోన్ తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ, దగ్గరున్న వాళ్ళతో మాట్లాడకుండా కాలం గడిపేసేవాళ్ళూ కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి చాలా మంది కవులు కవిత్వం రాసారు."

"సంక్రాతి వస్తోందంటే ఊరంతా కడిగిన ముత్యమయ్యేది

బీదాబిక్కీసైతం కొత్తబట్టల్లో కళకళలాడేవారు

రచ్చబండలు, గుళ్లూ, నీటి తగాదాలు, కొట్లాటలు,

కపిలబావులు, ఆలమందలు,

"గొర్రెల' గుంపులు...... తాటి ముంజెలు

గంగమ్మ జాతరలు, పొంగళ్లు, కొలుపులు,

వీధి భాగవతాలు అన్నీ ఒకటే''అన్నట్లు గ్రామాలు ఉండేవని చీకోలు సుందరయ్య వర్ణించడం వెనుక నాటి గ్రామీణ సంస్కృతి తెలుస్తుంది.

మరి నేటి పండగల గురిం చి చెప్తూనే అన్నీ ఎలా మార్కెట్ అవుతున్నాయో చెపుతూ పాటిబండ్ల రజని ఇలా న్నార్ణిస్తున్నారు."

"ఇక విదేశీ మార్కు ప్లాస్టిక్ గొబ్బిళ్ళొస్తాయి! ...

బహుళ జాతుల భయంకర కోరల్తో

మకరరాశి సిద్ధంగా ఉంది!

తన పంచనామా రిపోర్టుపై తానే సంతకమైన

సూర్యుడ్నది కొద్దికొద్దిగా మింగేస్తుంది!

చీకట్ని తలుచుకొని చింతపడకండి!

మకరం బ్రాండ్ మల్టీనేషన్ కంపెనీలు

వెలుతుర్నిక వాక్యూమ్ ప్యాక్లలో అమ్ముతాయి!'' ఇప్పుడు అనేక వస్తువులను అలాగే అమ్ముతున్నారు. పేటెంట్సంపాదిం చి బహుళజాతి కంపెనీలు ఎప్పుడు ఏమి అమ్ముతాయో చెప్పలేని పరిస్థితిలో ఉన్నామనే ఆందోళన కవితల్లో కనిపిస్తుంది.

ఉన్న కొద్ది పొలాల్లో కూడా ఫెస్టిసైడ్స్ వాడకం పెరగింది. ఉత్పత్తి పెరిగినా వాతావరణ కాలుష్యంతో సహజంగా లభించే స్వచ్ఛమైన గాలీ, నీరూ కలుషితమైపోతున్నాయి. అలాగే వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని తగ్గించడానికి వాడే మందులు కూడా కల్తీలమయమయ్యాయి.

పేదల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వ శాఖలు ఆర్థిక సరళీకృత విధానాల వల్ల నిర్వీర్యమైపోతున్నాయి. అనేక ప్రభుత్వ వైద్యుల, మందుల కొరత వల్ల కార్పోరేట్ హాస్పటల్స్లో వైద్యమే దిక్కవతుంది. అది ఖరీదైపోయి, రోగమొచ్చినా ఆసుపత్రికి వెళ్ళడం కంటే ఆత్మహత్య చేసుకోవడమో, ఎలాగోలా కొన్నాళ్ళు బతికి తనువు చాలించడమో మంచిదనే ధోరణి పెరిగిపోతుంది. ఖరీదైన వైద్యం చేయించుకోలేక మంత్ర తంత్రాలకు బలవుతున్నారు. మరోవైపు కుటుంబంలో కొంతమందినైనా బతికించుకోవాలని, కుటుంబంలోని మరి కొంతమంది అనేక "తప్పని సరి త్యాగాలకు" పాల్పపడవలసి వస్తుంది. రక్తాన్ని కిడ్నీల్ని, పిల్లల్ని కూడా అమ్ముకోవడం ... ఇలా తమలో పనికొచ్చే మానవ అవయవాల్ని అన్నింటినీ అమ్ముకోవడం చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. అక్కడా మళ్ళీ దళారుల మోసాల్లో చిక్కుకోవడం గ్రామీణుల్లోనే ఎక్కువగా జరుగుతుంది.దీనికి నిరక్షరాస్యత కూడా తోడవుతుంది.

అప్పుడప్పుడూ పత్రికలు, టీ.వీ. చానల్స్ వార్తల్ని బయటపెట్టినా వాటిని అరికట్టడానికి పాలకులు వివిధ కమిటీలు వేస్తున్నాయి. అయినా, కిడ్ని రాకెట్స్ , అవయవ వ్యాపారం ఆగడంలేదంటే, ఆకలి, కరువు గ్రామాల్లో ఎంతగా తాండవిస్తుందో తెలుస్తుంది.

ఒకప్పుడు జాతర్లు జరిగితే ఊరివాళ్ళంతా కలిసిమెలిసి కళలను ఆస్వాదించేవారు. జానపద కళలు ప్రదర్శంచేవారు. దాని వల్ల కళలు కాపాడబడేవి, కళాకారుల కడుపు నిండేది. ఇప్పుడు టి.వి.లు వచ్చిన తర్వాత అందరూ కలిసి మెలిసి కళల్ని ఆస్వాదించే పరిస్థితి ఎలాగూ లేదు. కనీసం కళాకారులకు ప్రత్యామ్నాయ ఉపాథిలేకుండా పోయింది. ఆవేదన కవులు తీవ్రంగానే వ్యక్తంచేశారు."

"ఇప్పుడు గల్లీకో కాన్వెంటు స్కూలు

ఆర్.ఎం.పి. డాక్టర్లు

పంచాయితీ ఆఫీసు రేడియో గ్రామసీమల్లేవు

టీ.వి. యాంటీనాలు డిష్ టీ.వి. కేబుల్ వైర్లు తప్ప

జానపదాలు - జాతరలో తప్పిపోయాయో పత్తాలేవు కదా-'' అని వి.పి. చందన్ రావు ఊళ్ళలోకి వస్తున్న కొత్త సంస్కృతిని వర్ణిస్తున్నాడు.

"ఆరుమైళ్ల పాఠశాలకు నడచి వెళ్లిన పిల్లవాడు

చీకటిపడ్డా ఇంటికి తిరిగిరాలేదని

చేతిలాంతరుతో ఆదుర్దాతో ఎదురొచ్చే నాన్నలు

చిన్న ప్రయాణం పెట్టుకుని సంచీ సర్దుకోగానే

కన్నీళ్లు కన్పించకుండా రెప్పలు సర్దుకునే

అమాయకపు అమ్మలు

ఏమైపోయారు?

మాయకులోనైపోయారు?''అని డా. కలువగుంట రామమూర్తి నాటి గ్రామీణ సంస్కృతిలో అనేకాంశాలు ""ఔట్డేటెడ్ ఆనందాలు''గా మారిపోతున్నాయంటున్నాడు కవి. అం తే కాదు ఇలా కవులు ఆవేదన పడటం వెనుక విద్యావిధానంలో వచ్చిన మార్పులు కనిపిస్తున్నాయి. అలాంటి విద్యావిధానం వల్ల కోల్పోతున్న మమతానుబంధాల్ని గుర్తుచేస్తున్నారు.

ఒకప్పుడు చదువు విజ్ఞానం కోసం జరిగేది. ప్రపంచీకరణ తెచ్చిన అవకాశాలు, తెచ్చిపెడతాయనే ఆశలతో దగ్గరున్న పాఠశాలల కంటే, కార్పోరేట్విద్య వైపు చిన్నప్పటినుండే పిల్లల్ని చదివిస్తున్నారనేది కవుల ఆందోళనలోని ఆంతర్యం!

ఇంకోవైపు ఆడపిల్లల్ని అమ్ముకోవడం, వయసులో ఉన్నవాళ్ళు వ్యభిచారంలో అయిష్టంగానే దిగినా, దాన్నే వృత్తిగా మార్చేసుకోవడం, తర్వాత ఎయిడ్స్ వంటి భయంకరమైన రోగాలతో మరణించడం గ్రామీణప్రాంతాల్లోనూ కనిపిస్తుంది.

టీ.వి. ఇంటర్నెట్, సెల్ ఫోన్ వినియోగం పెరిగింది. అవి గ్రామాల్లోకీ తెచ్చిన ఘనత ప్రపంచీకరణదే అయితే అవి ప్రవేశించిన తర్వాత వాటిని వినియోగించేవారి ప్రవర్తనలో, వాళ్ళు మాట్లాడే భాషలో సంస్కృతి పరంగా ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. అశ్లీలత పెరిగింది. sms, multimedia, Bluetooth, infrared వంటి సౌకర్యాలు దుర్వినియోగమవుతున్నాయి. చాలా మంది ఫోటో కెమేరా, రికార్డింగ్ సౌకర్యాలున్న సెల్ ఫొన్లను అసభ్యకార్యక్రమాలకు వినియోగిస్తూ గ్రామీణ సంస్కృతిలో భయకంపిత వాతారణాన్ని సృష్టిస్తున్నారు. అది మార్కెట్ చేసుకొనేవరకూ పయనిస్తుంది. గ్రామాల్లో కూడా కంప్యూటర్వినియోగం పెరుగుతుంది. ఇప్పటికే పట్టణాలు, నగరాలలో కంప్యూటర్లేకపోతే పనీ జరగని పరిస్థితి నెలకొంది. దీని దగ్గర కూర్చుంటే మానవ సంబంధాలన్నీ యాంత్రిక సంబంధాలే అవుతున్నాయి."

"చతురస్రాకారపు నీలితెర ఇప్పుడతని ఆకాశం

ఇప్పుడతని సర్వస్వం

తన ఎలుకను

మీటేవేలుగా మారింది

ఎలుకను మీటటం

ఏనుగు నెక్కటానికేననీ తేలిపోయింది

""కుశల ప్రశ్నలూలేవు, కులాసా కబుర్లూలేవు

ఉభయకుశలోపరులు అసలే లేవు

వస్తువ్యామోహంలో - వస్తు సహవాసంలో

మనిషి ఒక ప్రాణమున్న వస్తువు, వేళ్ళులేని మొక్క

/.... ..... .... ..... /

విశ్వం కుగ్రామమైనందుకు క్షణం గర్వపడదాం

విశ్వం విఫణి వీధిగా మారినందుకు

మనసులోనే తనివితీరా విలపిద్దాం'' అని ఇలాంటి వ్యవస్థను "వైరస్'గా పెన్నా శివరామకృష్ణ వర్ణిస్తున్నాడు.

నేడు ఆంగ్ల భాషతెలిసిన వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కూడా విస్తృతమవడంతో స్థానిక మాతృ భాషలు అంతరించిపోయి ఆంగ్లభాష తన పెత్తనాన్ని చెలాయించే పరిస్థితి ఏర్పడింది అందువల్లనే ఎక్కువ మంది తమ పిల్లల్ని ఆంగ?్ల భాషను చదివించాలనే తహతహలతో ఉన్నారు. దాన్ని చదువుకోలేని వాళ్ళు తెలుగు మీడియం లో చదువుకోవడం వల్ల పెద్దపెద్ద ఉద్యోగాలు రావనే నిరుత్సాహానికి గురవుతున్నారు. దీని వల్ల నిరక్షరాస్యత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరో వైపు ప్రభుత్వం విద్యను అందించే పనిని కార్పోరేట్ సంస్థలకు పరోక్షంగా ఒప్పజెప్పేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్స్కిస్టు భావజాలం గల పార్టీలు దిశగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.

"పొద్దుణ్ణించి రాత్రిదాకా

మెదళ్ళ పొలాల మీద ట్రాక్టరులా మోగుతున్న టి.వి

పసి మట్టెలో టెర్మీనేటర్లు నాటుతుంది

వేల, లక్షల ఇంగ్లీషు మీడియమే స్కూళ్ళు

శబ్దాలతో బద్దలైపోతున్న ఆకాశం.

సంస్కృతి నా యిల్లైతే

భాష నా వీధి గుమ్మం

సంస్కృతి నా జీవితమైతే

భాష నా శ్వాస మార్గం

సంస్కృతి నా అమ్మైతే

భాష నా ఆరాధనా గీతం

వీధి గుమ్మాన్ని మోతరాకుండా

వాడు పగల గొడుతుంటే

ఇల్లు కన్నీటి గోడలై పునాదుల్లోకి యింకి పోతుంది

శ్వాస మార్గాల్ని కొత్త యాసలు కోసేస్తుంటే

జీవితం చీలికలైన నాలుకల్లోకి వలస పోతుంది'అని అద్దేపల్లి రామ్మోహనరావు వర్ణించాడు.

గ్రామీణ సంస్కృతిలో కనిపించే భిన్నపార్శ్వాలను చాలా వరకూ తెలుగు కవులు పట్టుకోగలుగుతున్నారు. కళింగ ఆంధ్ర కవులు "తూరుపు'' (కళిగాంధ్ర కవిత్వం); తెలంగాణా కవులు ""మత్తడి'', ""పొక్కిలి'', ""గుజరాత్ గాయం'', రాయలసీమ కవులు "వొరువు'' మొదలైన కవితా సంకలనాల్ని ప్రచురించారు. రంజని సంస్థ ప్రత్యేకించి ""అమ్మ'', ""మా ఊరు'' పేర్లతో రెండు కవితా సంకలనాలను తీసుకొచ్చింది. తెలంగాణా ప్రాంతం నుండీ అన్వర్ సంపాదకత్వంలో "నాయిన''కవితా సంకలనం వచ్చింది. ప్రజాసాహితి, అరుణతార, నేటినిజం, ప్రస్థానం వంటి పత్రికలు ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వాన్ని అధికంగానే ప్రచురించాయి. ప్రపంచీకరణ ప్రభావంతో రాసిన కవితల్ని దిన పత్రికలు కూడా సాహిత్యానుబంధాల్లో ప్రచురించాయి.

ఇవే కాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళూ వృత్తులు, ఉద్యోగాల నిమిత్తం పట్టణ ప్రాంతాల్లో

జీవిస్తూ కూడా, తమ తమ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కనిపించే "సంస్కృతి'ని, తాము నివసిస్తున్న పట్టణ, నగర సంస్కృతులతో పోల్చుకుని కవిత్వం రాస్తున్నారు. అలాంటి వాటిలో కొన్నింటిని రంజని సంస్థ "అమ్మ', "మా ఊరు' పేర్లతో కవితా సంకలనాలుగా ప్రచురించింది. వీటన్నింటిలోనూ అత్యధిక శాతం మంది కవులు గ్రామీణ సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబం, కుటుంబం, వ్యవసాయం, రైతుజీవనం, వలసల గురించి తమ తమ అనుభవాలను వర్ణించారు. కోల్పోతున్న మానవ సంబంధాలను, అన్నీ "మార్కెట్' అయిపోతున్నందుకు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


(సూర్య దినపత్రిక 8-2-2010 లో దీని సంక్షిప్త వ్యాసం ప్రచురితం)

No comments: