"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

23 జనవరి, 2010

ఇది ‘‘స్వేచ్ఛకోసం’‘ కవుల చేసే యుద్ధ నగారా!

-డా. దార్ల వెంకటేశ్వరరావు

సాహిత్యంలో శ్రీశ్రీ అనేక సంచలనాలకు కేంద్రం బిందువుగా కన్పించడం వల్లనే నేటికీ చర్చనీయాంశమవుతున్నాడు. తాను ప్రయోగించిన భాష అంత సరళమైంది కాకపోయినా, సామాన్యుడికి కూడా ఆ భ్రమని కల్పిస్తుంది. సామాన్య పాఠకులు సైతం చాలా మంది తమకేదో అర్థమైపోయిందనే భావన కొస్తుంటారు. శ్రీశ్రీ ప్రయోగించిన పదాల వెనుక నిగూఢమైన భావాలున్నాయి. అవి ప్రతీకలు కావచ్చు, దేశదేశాలకు చెందిన వ్యక్తుల, పోరాట వీరుల, సంఘర్షణ సందర్భాలు కావచ్చు. ఆలంకారికంగా ఒక ప్రత్యామ్నాయ అనియతికి కూడా శ్రీశ్రీ మార్గం వేశాడు. ఇలాంటివెన్నో శ్రీశ్రీ రచనల్లో లోతుగా చూసేవాళ్ళకు కనిపిస్తాయి. కానీ, విచిత్రమేమిటంటే, సామాన్య పాఠకుడు కూడా ఆ శైలిలో, ఆ వస్తు ప్రతిపాదనలో మమేకమైపోతుంటాడు. ఆ రచనల్ని, ముఖ్యంగా శ్రీశ్రీ కవిత్వాన్ని చదివిన వాళ్ళపై ఆ ప్రభావం ఏదొక రూపంలో వెంటాడుతుంది. తమ కులం, మతం, ప్రాంతం, లింగం వంటివన్నీ విస్మరించి శ్రీశ్రీ కవిత్వాన్ని ఆస్వాదించడంతో పాటు అవసరమైతే తామూ ఒక కవిత రాయాలనే ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు కూడా! అలా అందరూ సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ, సృజనకారులుగా తయారవ్వాలనేదే శ్రీశ్రీ ప్రధాన ఆకాంక్ష! అలాంటి ఆకాంక్షను అందరిలో కలిగించాలనే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారన్నట్లుగా ఐనాల సైదులు, శ్రీనివాసు గద్దపాటి తమ సంపాదకత్వంలో ‘‘ స్వేచ్ఛ కోసం'' ‘‘ పేరుతో ఖమ్మం కవులు రాసిన కవితల్ని శ్రీశ్రీ స్మారక సంకలనంగా తీసుకొచ్చారు. దీనిలో సుమారు 72 కవితలు ఉన్నాయి.
సవాలుగా మారిన కులం:
శ్రీశ్రీ శత జయంతి సందర్భంగానే రాసినా, కేవలం స్మృతి కవితల్నే తీసుకోలేదు. సమకాలీన సమస్యల్ని వర్ణించిన కవితలు ఇందులో ఉన్నాయి. భారతీయ సమాజంలోఇష్టమున్నా లేకపోయినా ప్రతివ్యక్తినీ అనివార్యంగా ఏదో ఒక కులానికి చెందిన వ్యక్తిగానే ముద్రవేస్తుంటారు. ఇక్కడ కులానికున్న ప్రభావం అలాంటిది. ప్రేమను కూడా కలుషితంగా చూపించే కుట్రలో భాగమైన విషాధకర సంఘటన కంచెకచర్ల కోటేశుది. అది దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ లో ఒక దళితుణ్ణి సజీవ దహనం చేసిన సంఘటన. మళ్ళీ అలాంటి విషాధం ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ఖైర్లాంజీలో జరిగింది. ఒక దళిత కుటుంబాన్ని ఊచకోత కోసేసిన సంఘటన అది. అంటే కుల వివక్ష భారతదేశవ్యాప్తంగా చాపకింద నీరులా రకరకాల రూపాల్లో విస్తరిల్లింది. దీన్ని గద్దపాటి శ్రీనివాసు " కంచికచర్ల టు ఖైర్లాంజి ' కవితలో ‘‘" "కాల, స్థల, ప్రదేశాల్లో మార్పే కానీ.../ కానీ... / అదే జీవితం/ అదే వర్ణ దురహంకార మంటల్లో/ మాడి మసైపోయిన జీవితం'' ‘‘ ( పుట: 8) అని ఆవేదన చెందటం కనిపిస్తుంది. ‘‘""భూత, భవిష్యత్వర్తమానాల్లో కూడా/ అదే జీవితం'' ‘‘ కొనసాగుతుందనే కవి ఆందోళన కుల నిర్మూలనకున్న మార్గాల్ని వేగతరం చేయమని సవాలు విసురుతుంది.
కుల, మత ముసుగుల సంకెళ్ళు:
అది ఏ కులమైనా కులం వల్ల వివక్ష కొనసాగుతూ, మానసిక, భౌతిక వ్యధలకు గురవుతున్నవాళ్ళెంతో మంది ఉన్నారు. ఒకప్పటి ఆధిపత్య లేదా ప్రాబల్యకుల స్వభావం నేడు మరికొన్ని కులాల్లో కనిపిస్తుంది. దానికి రకరకాల కారణాలున్నాయి. మన దేశంలో 1935 నాటికే డా.అంబేద్కర్‌ గుర్తించిన కులాల్ని చూసినా, ఆ కులాలన్నీ ప్రాంతాలవారీగా గౌరవమర్యాదల్లో తేడాలు ఉంటాయి.
మతం మారడం వల్ల కూడా ఇలాంటి ప్రయోజనాలు అప్పుడప్పుడూ కొన్ని కులాలకు కలుగుతున్నాయి. వీటి వల్ల రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక రాయితీలిచ్చి, ఆ కుల ప్రజల్ని కూడా ప్రధాన జీవన స్రవంతికి తీసుకొని రావాలనే సదాశయంతో పెట్టిన నియమ నిబంధనలు అమలులోకి వచ్చేసరికి వాటిని సరళీకరించాల్సింది పోయి, కఠినంగా, క్లిష్టంగా మార్చేస్తున్నారు. దీని వల్ల లక్ష్యం నెరవేరకపోగా అసలుకే ఎసరు వస్తుంది. ఈ స్థితిని కవిత్వీకరిస్తూ గరికిపాటి మణీందర్‌ "ధృవీకరణ పత్రం' పొందడానికి కొన్ని కులాల వాళ్ళు పడుతున్న కష్టాల్ని వర్ణిస్తూ నన్ను నేనుగా రుజువు పరుచుకోవడానికి/ ఎవరో అనామకుల/ ధృవీకరణ సంతకం ప్రామాణికమైనందుకు/ సిగ్గుతో చితికిపోతున్నాను'' ( పుట:10) అని అనేక మంది పడుతున్న ఇబ్బందులను, కోల్పోతున్న ఆత్మగౌరవాన్ని వివరిస్తున్నాడు.
ఇవన్నీ భరించలేని వాళ్ళు జార్జ్‌ ని జంగమయ్యగాను/ మరియమ్మను మంగమ్మ గాను/ మార్చలేక చదువుకు/ దూ... రం... గా.../ వెళ్ళిపోతున్న వైనాన్ని పేర్కొంటున్నాడు. ఈ సమస్య ప్రధానంగా దళితులే ఎదుర్కొంటున్నారు.
హిందువులుగా ఉంటే దళితులకు అంటరానితనం లేదా కులం వల్ల వచ్చే రకరకాల ఆత్మగౌరవ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని, అందువల్ల వారికి కొన్ని ప్రత్యేక రాయితీల్ని ఇస్తున్నారు. క్రైస్తవులు, ముస్లిములుగా మత మార్పిడి జరిగితే ఆ మత భావనల్ని బట్టి అందులో కులం పట్టింపులు ఉండకూడదు. అంటే హిందూ మతంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్య ఆ మతాల్లోకి మారిపోవడం వల్ల పరిష్కరింపబడాలి. కానీ, ఆచరణలో అలా జరగడం లేదు. అక్కడ కూడా కులాన్ని బట్టి, వారి ఆర్థిక స్థితిగతుల్ని అనుసరించి గౌరవమర్యాదలు లభిస్తున్నాయి. అలాంటప్పుడు మతమార్పిడి జరగాల్సిన అవసరమేముంది?అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
మతం మారిపోవడం వల్లనే కుల సమస్యలన్నీ తీరిపోతాయని అనుకొనే పరిస్థితులు నేడు అంతగా లేవు. కానీ, నిర్భంధ కుల వృత్తులు అక్కడ లేవు. తమ తెలివి తేటల్ని బట్టి "ఆ సమాజం'లో గౌరవంగా బతుకుతున్నవాళ్ళున్నారు. ఆ పరిస్థితి హిందూ మతంలో దానితో పోల్చదగినంతగా లేదు. పైగా నేడిలా మళ్ళీ అన్ని మతాలూ కులాన్నే ఆశ్రయిస్తాయని ఊహించని రెండు, మూడు ముందటి తరాలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా హిందూ మతం నుండి బయటకి వెళ్ళిపోయారు. ఇప్పడు విద్యావంతులవుతున్న దళితులు వాస్తవ పరిస్థితులు గమనిస్తున్నవాళ్ళు మతం మారిపోవడానికి ముందంజవేయడానికి అప్పుడున్నంత వేగంగా ముందంజ వేయట్లేదు. మరో వైపు ముందుతరాల వాళ్ళు పెట్టిన పేర్లను బట్టి వీళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వీళ్ళకి కూడా ఆ మత ముద్రలే వేస్తున్నారు. వీటిని వ్యతిరేకిస్తున్న తరానికి ప్రాతినిథ్యం వహించే కవితగా దీన్ని చెప్పుకోవచ్చు.
ఇలా కుల, మత కోణాల్లో వస్తున్న సమస్యల్ని వర్ణిస్తూ శీలం భీష్మారెడ్డి ఐటి యుగంలో కూడా ఆధునికులమనుకుంటూనే మనసు మాత్రం మూఢత్వంతో పయనించడాన్ని నిరసిస్తూ "జల అస్పృశ్యత' కవితను రాశాడు.
ఒకప్పుడు కొన్ని కులాలకే పరిమితమయిన, తప్పని సరి పరిస్థితిలో తినవలసి వచ్చిన ఆహారం కూడా అందకుండా పోవడానికి గల కారణాల్ని అన్వేషిస్తూ జి. మాణిక్యరావు "మా గూడెంలో మల్లెపువ్వు'లా గొడ్డుమాంసాన్ని వర్ణిస్తాడు. దళితేతరులు ఈ ఆహారం పట్ల వ్యవహరించే ద్వైదీభావాన్ని నిరసిస్తాడు. ‘‘రోగం వచ్చిందనో డాక్టరు తినమన్నాడనో/సలవసేతందనో దొంగసాకులు సూపి/సాటుమాటుగా తెచ్చుకొని తెగమెక్కడం లేదా/ పెమాన సాచ్చిగా/ గుండెమీద చెయ్యేసుకొని సెప్పండి సూద్దాం'' ‘‘(పుట: 27) అని సవాలు విసురుతున్నాడు కవి. అలా తిన్నందుక్కాదు కవి నిరసన. ‘‘పేరుకేమో మేము బొక్కేది మీరు/ అంటున్నానని కాదు గానీ/ గొడ్లను కోయడానికి/గూడేల్లో చావిడుల్లున్నట్లు/ఊళ్ళో కూడా ధైర్యంగా చావిళ్ళు కట్టుకోండి/మేం రొమ్ము తప్పెట్లు వాయిత్తా/ సంతోషంగా మద్దతిత్తాం'' ‘‘ (పుట: 27) అనడంలో మాదిగలు ఆత్మగౌరవాభివ్యక్తి ఉంది.
ఒకప్పుడు గొడ్డుమాంసం అంటేనే మాదిగలు వెంటనే స్ఫురించేవారు. నేడు అవి పరాయివాళ్ళు పెద్దవ్యాపారంగా మార్చుకున్నారు. గ్రామాల్లో అక్కడక్కడా చిన్న చిన్న దుఖాణాలు పెట్టుకున్నా, మాదిగల కంటే మాదిగేతరులే డాక్టరు చెప్పాడనో, రకరకాల కారణాలు చెప్పు ఆ మాంసాన్ని రహస్యంగా రప్పించుకొని తింటూనే, బహిరంగంగా మాత్రం మాదిగల్ని నిందించడంలో దళితేతరుల ద్వైదీభావ స్వభావమే కాకుండా, వాస్తవంగా జీవించలేని స్థితిని వెల్లడిస్తుంది. మరోవైపు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, అమాయకంగ?ా బతుకువెళ్ళదీసే కులాన్ని నిందిస్తు బతికేవాళ్ళ అసలు రంగునీ బయటపెడుతుందీ కవిత.
వేకువ బాబు అంటరాని దేవుళ్ళు'' గురించి దేవుళ్ళండీ దేవుళ్ళు/ మాఊళ్ళో దేవుళ్ళూ.../ఏ ఊళ్ళోనైనా దేవుళ్ళే...!'' (పుట: 110) అంటూ గ్రామంగా పెత్తందారీ కులాల వాళ్ళు తప్పనిసరిగా మొక్కించుకొనే వ్యవస్థను వ్యంగ్యంగా మనకళ్ళముందుంచుతున్నాడు. ఇలా కుల దృక్పథంతో రాసిన కొన్ని కవితలు ఉన్నాయి.
సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకత:
సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే, వస్తు సంస్కృతిని నిరసించే కొన్ని కవితలతో పాటు, భావజాలాన్ని నమ్మినట్లు నటిస్తూ, తమ కుటుంబాన్ని మాత్రం ఆ భావజాల దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడే వాళ్ళనీ ఈ సంకలనంలో కవులు తూర్పారబట్టారు. తాము చెప్పేదానిపట్ల చిత్తశుద్దిలేని డొల్లతనాన్ని ఎండగట్టవలసిందేనన్నారు.
శ్రమైక జీవన సౌందర్యం:
కుటుంబసంబంధాలే నిజమైన మానవీయ సంబంధాల్ని పటిష్టపరిచే ప్రాధమిక సామాజిక నియంత్రణ సాధనాలుగా భావించిన కవితలు కూడా ఉన్నాయి. ఐనాల సైదులు అమ్మనవ్వాలనుంది'' గొప్ప అనుభూతినిచ్చే వాస్తవ వ్యక్తీకరణ. ప్రపంచంలో మాతృత్వాన్ని ఎన్ని రకాలుగా వర్ణించినా ఇంకా మరేదో మిగిలే ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన సుఖ సంతోషాలలో పాలు పంచుకోలేక జీవితమంతా త్యాగాలతోనే నిండిపోయిన తల్లుల్ల్ని నిరంతరం స్మరించుకోవడం జరుగుతుంటుంది. అది ఆ వ్యక్తిలో ప్రవహించే మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. కొన్ని వర్గాల ప్రజలకు అక్షరం కొన్ని తరాల వరకూ గగన కుసుమమే అయ్యింది. తాను గానీ, తన ముందు వాళ్ళుగానీ పొందలేని అక్షరభాగ్యాన్ని తన కొడుకులో చూసుకుంటున్న తల్లి ఫీలింగ్స్‌ ని వర్ణిస్తూ ముత్యాలూ.../ నీ కొడుకు అన్నింటా ఫస్టేనన్న/ పంతులు గారి పలుకులిని/ కడుపార నీళ్ళు తాగిన/ పంటకాలవయ్యేది'' ( పుట: 136) అన్నాడు. ఈ కన్నీళ్ళు ఆనందభాష్పాలు. వీటిని పంటకాల్వతో ఉపమించడం ఔచిత్యమైన పోలిక! ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేసిన ఆత్మీయ శ్రమ సంబంధాల్ని కవితాత్మకంగా పొద్దంతా/ కలుపుకొచ్చిన పొలంల/కొడవలై/మాపుటాళ్ళకు/కమ్మోరి కొట్టంల/ రోకటి పోటయ్యేది/బీడుల్ని సాగుచేసిన నాయన/బొక్కెనయితే/దానికి తాడైంది'' అని గుర్తుచేసుకుంటాడు. తల్లిదండ్రుల శ్రమని మర్చిపోని కొడుకు చేయాల్సిన కర్తవ్యం తాను విజయవంతంగా నిర్వర్తిస్తూ అందరి చేతా ప్రశంసించబడుతున్నా, ఇంకా ఏదో అసంతృప్తి వెంటాడుతున్న కవి అమ్మకి ""అమ్మ నవ్వాలనుంది'' అంటాడు.
ఈ కవితా సంకలనంలో మరో కొన్ని విశేషాల్ని ముచ్చటించుకోవాలి. జీహాదీ పేరుతో జరుగుతున్న దాడుల్ని ఒక కరడుకట్టిన హిందువు వాదించినట్లున్న కవిత ఒకటి దీనిలో కనిపిస్తుంది. సమైక్యవాదాన్ని ఆకాంక్షించే దిశగా కూడా కవితలున్నాయి. అయితే అది సమానత్వాన్ని కోరుకొనే సమైక్యత. వర్ణ, వర్గ, లింగ, ప్రాంత వివక్షలు లేని సమైక్యతగా ఉండాలనే ఆశయంతో కూడినది కావడం విశేషం. శ్రీశ్రీ స్మృతి కవితలు కూడా కొన్ని ఉన్నాయి.
శ్రీశ్రీ స్మృతి కవితల నివాళి:
శ్రీశ్రీ ని ఈ యువకవులు రకరకాల కోణాల్లో దర్శించుకున్నారు. శ్రీశ్రీ తో పయనించాలని ప్రతిన పూనినవాళ్ళున్నారు. ""ఓ మహాకవి శ్రీశ్రీ/ అక్షరం చూస్తే మీ కవిత్వం గుర్తొస్తుంది/మీ కవిత్వంలో దాగిన జనం బతుకు గుర్తుకొస్తుంది/ జనానికి రణం ఎలా నేర్పాలో మాకు తెలుస్తుంది''(పుట: 57) అని బొగ్గారపు రాజా అభివర్ణించాడు. మరో కవి యుగంధర్‌ శ్రీ శ్రీ సాహిత్యంలో తీసుకొచ్చిన నియతిరాహిత్యాన్ని స్మరిస్తూ.. ఛందస్సుల చరబట్టి/ అలంకారాల నొదిలి పెట్టి/కఠిన పదాలపై కోతపెట్టి'' న యుగకర్తగా నూతన శకానికి నాందిపలికాడన్నాడు.
నియతి అతిక్రమణ కొన్నిసార్లు మంచికి దారితీస్తుంది. మరికొన్ని సార్లు అవ్యవస్థతకు కారణమవుతుంది. శ్రీశ్రీ ఛందో బందోబస్తుల్ని తెలిసి అతిక్రమించాడు. ఆ నియతి అతిక్రమణ వల్ల కవితాశైలిలో, వస్తు స్వీకరణలో నూతన మార్గాలేర్పడ్డాయి. ఈ విషయాన్ని చెప్తూ ఒక కవితలో చేసిన వ్యాకరణ నియతిరాహిత్యం అసహజంగా ఉంది. అది నిజంగా నియతిరాహిత్యమేనా ? అనే సందేహం కూడా కలుగుతుంది. వ్యాకరణమర్యాదలు తెలిసి, దాన్ని సహజంగా అతిక్రమించడం వ్యాకరణ నియతిరాహిత్యం అవుతుంది. తెలియకుండా చేసేది ప్రయోగం అని అసలే అనిపించుకోదు. అది అజ్ఞానం అవుతుంది. కొత్తగా కవిత్వం గానీ, మరే ప్రక్రియలో గానీ రాసేటప్పుడు వీటిని గుర్తెరిగి రాస్తే మంచిది. సహజత్వంలోని సౌందర్యాన్ని ఆస్వాదించడంలోనే నిజమైన నిష్కల్మషత్వం మానవీయతను పరిమళింపజేస్తుంది. అది విద్యాసాగర్‌ కవితలో కనిపించి నిసర్గ సౌందర్యాన్ని మన కళ్ళముందుంచుతూ మంచి శిల్పబిగువుతో సాహిత్యంలో నిలిచిపోతుంది.
" ఈ జాతి మీదా, నీతి మీదా చేసిన సమతా మానవతా సంతకం శ్రీశ్రీ' గా సిహెచ్‌. ఆంజనేయులు, " తెలుగుతల్లి అమ్ముల పొదిలో అక్షర కణాన్ని రాల్చే అరుణాస్త్రం' గా బి.ఇందిర, శ్రీశ్రీ మనోబలం తెలుగు సాహిత్యానికే హలం వంటిదని కాలవ సుధాకర్‌ నివాళులర్పించారు. ఈ పుస్తకంలో శ్రీశ్రీ స్మృతిని ఒక మినీకవితలో ఎం.ప్రభాకర్‌ ప్రతిభావంతంగా వర్ణించాడు. సూర్యుడి నుదుట/ ఎర్రని బొట్టు పెట్టాలనుకోవడం/ సముద్రపు గొంతులో/ గుక్కెడు నీళ్ళునింపాలనుకోవడం/ఆకాశంలో అనంత నక్షత్రాలను / లెక్కించాలనుకోవడం/ మహా కవి శ్రీశ్రీ కవిత్వాన్ని / విశ్లేషించాలనుకోవడం/ఒక్కటే మిత్రమా!'' (పుట: 44) అని శ్రీశ్రీని అంచెనా వేయడం అసాధ్యమంటున్నాడు. ఇంచుమించు ప్రపంచగీతంగా కీర్తించదగిన లక్షణాలు ఉన్న కవిత వెంకట్రామయ్య రాశాడు. ప్రతి ప్రగతి శీల పోరాటంలోనూ తమనాయకుడిని ఈ కవితలో చూసుకొనే విశ్వజనీన భావనతో బహుశా అతను మరణించకపోవచ్చు'' అంటూ పోరాటయోధుణ్ణి, విప్లవవీరుణ్ణి కీర్తించాడు కవి. నిజాయితీతో పోరాడి నేలకొరిగిన వాడు ఎప్పటికీ చిరస్మరణీయుడే అవుతాడు. బహుశా అతను మరణించకపోవచ్చు/ రేపో మాపో వేల మెగా వాట్ల శక్తితో/ విర్చుక పడొచ్చు/ప్రజా ఊరేగింపు అగ్రభాగాన/ బ్యానర్ గా మారి/సింహ గర్జన చెయ్యొచ్చు/ బిగించిన పిడికిళ్ళలో/ మరింతశక్తిని అందించవచ్చు/ఉద్యమానికి ఊపిరిగా మారి/విజయకేతనం ఎగరవేయవచ్చు'' (పుట: 49)
ఇంకా చాలామంది శ్రీశ్రీని స్మరించుకొంటూ కవితలు రాశారు. తెలుగు తనానికి నూతన వెలుగులు అద్దినవాడిగా లింగాల వెంకన్న, నిన్ను మరువలేమంటూ గంధసిరి మల్లయ్య, శ్రామికుని స్వేదాన్నే వేదంగా భావించిన కవిగా యశ్‌ పాల్‌, నవసమాజ నిర్మాణం కోసం నాందిపలికిన కవిగా సస్య, కొండంత ధైర్యాన్నిచ్చిన కవిగా నీరుకొండ,శ్రీశ్రీని సూర్యుడితో పోలుస్తూ, పోరాటం ఒక నిరంతర స్రవంతిగా చొల్లేటి సునీత, శ్రీశ్రీ అనే రెండక్షరాలు ఆరని విప్లవజ్వాలలుగా అన్వేషి కొమరారం, కదం తొక్కే గుర్రంపై జోన్‌ ఆఫ్ ఆర్క్‌ శ్రీశ్రీ కవితగా సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు వంటి చాలామంది కవులు శ్రీశ్రీకి నివాళులు అర్పించిన కవితలు దీనిలో ఉన్నాయి. శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఖమ్మం ప్రజా రచయితల సమాఖ్య అర్పించిన ఘనమైన నివాళిగా దీన్ని భావించవచ్చు. ఇది ఖమ్మం జిల్లా నుండి వచ్చిన కవితా సంకలనం. కనుక, సహజంగానే అక్కడ ఉన్న గిరిజనుల గిరించి కూడా కొన్ని కవితలు ఉంటే బాగుండేది సీతారాం, జ్వలిత, పి.విద్యాసాగర్‌ వంటి సీనియర్ కవులు ఈ సంకలనంలో కనిపించి, యువతకు ప్రోత్సాహం ఇచ్చినట్లయ్యింది.
దీనిలో చాలా మంది కవులు మొదటి సారిగా కలం పట్టిన వాళ్ళున్నారనిపిస్తుంది. తమ భావాల్ని స్వేచ్ఛగా రాసుకొనే స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా, వాటిని యథాతథంగా ప్రచురించే విశాల దృక్పథం ప్రదర్శించిన సంపాదకులు అభినందనీయులు! ఇటువంటివి అన్ని జిల్లాల నుండీ రావాల్సి న అవసరం ఉంది.


( పుస్తకం వివరాలు: స్వేచ్ఛకోసం (కవితాసంకలనం), సంపాదకులు: ఐనాల సైదులు, శ్రీనివాసు గద్దపాటి . పుటల సంఖ్య: 140, పుస్తకం ఖరీదు: రు. 75/-లు. చిరునామా: ఐనాల సైదులు, కన్వీనర్‌, ప్రజా. ర.స, (కేజి) సిరిపురం, వైరా మండలం, ఖమ్మం జిల్లా- 507 165, మొబైల్‌ నెంబరు: 099487105)

(PDF file కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కామెంట్‌లు లేవు: