Friday, April 03, 2009

నేను నాన్న లేని అనాథనై పోయాను

భౌతికంగా దూరమైపోయిన మా నాన్న
మూడవరోజు నాటికే స్మృతి గా మిగిలిపోయాడు నాన్న

మూడవరోజు నాటికే స్మృతి గా మిగిలిపోయాడు నాన్న


స్వంత పొలంలోనే నాన్న భౌతిక కాయాన్ని భద్రం చేసుకోవడం తప్ప మేమేమి చేయగలం!


నేను డిగ్రీ చదివే రోజుల్లో కొబ్బరి దింపులు తీస్తున్న నాన్న ఫోటో

మార్చి 30 తెల్లవార గట్ల ఫోను మోగింది. తమ్ముడు ఫోనది. మా శ్రీమతి రిసీవ్ చేసుకుంది. అక్కడ మాట్లాడుతుండగానే లాండ్ ఫోన్ మోగింది. పెద్దన్నయ్య ఫోనది. “అర్జెంటుగా మిమ్మల్ని చూడాలని బాబాయి అంటున్నాడు. చాలా సీరియస్ గా ఉంది. వెంటనే బయలుదేరి రండి” అన్నాడు.
ఆ మాటలు విని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కింద పడి పోయాను. ఏదో అంటున్నాను. ఏమి చేయాలో తోచడం లేదు. నాదగ్గరే ఉండి ఇంటర్మీడియట్ చదువుకుంటున్న మా చిన్నన్నయ్యగారబ్బాయి మురళి “ నాన్న .. నాన్న ఏమైంది అంటూ వణికి పోతున్నాడు. “ నువ్వెళ్ళి అన్నయ్యను తీసుకొనిరారా” అని బండి తాళాలిచ్చాను.
పెద్దన్నయ్య గారి అబ్బాయి సుధీర్ కుమార్ ఈ యూనివర్సిటీలోనే ఇంటిగ్రేటెడ్ ఎమ్.ఏ చదువుతున్నాడు. నేనూ క్యాంపస్ లోనే ఉన్నా వాడు హాస్టల్ లో ఉంటానంటే సరే నన్నాను. అయినా, రెగ్యులర్ గా వస్తుంటాడు.
ఆగమేఘాల మీద సుధీర్ ని తీసుకొచ్చేసాడు మురళి.
వాళ్ళకేమని చెప్పాలి? వాళ్ళని పట్టుకొని ఏడ్చేశాను. దుఖాన్ని ఆపుకోవాలనుకున్నా రేపటి నుండి నేను “బాబా” అని ఎవరిని పిలవాలి?
వాళ్ళు “తాతయ్యా “ ఎవరిని పిలుస్తారు? తన్నుకొచ్చేసింది దుంఖం. ఇన్ని కబుర్లు చెప్పే మనిషిని నేను నా తండ్రికి మరణం తప్పలేదని తెలిసి నేను అచేతనుణ్ణైపోయాను. ఆ పరిస్థితిని ఎలా చెప్పాలి? రెక్కలుంటే బావుణ్ణనిపించింది. మాటలన్నీ మౌనంతో దుంఖిస్తున్నాయి. ఆలోచనలన్నీ నాన్న తీపిజ్నాపకాలతో గుండె కోత కోసేస్తున్నాయి. మళ్ళీఇక్కడ నాన్నపాదాలు తాకలేని స్థలంలా  ఆ ప్రాంతమంతా శూన్యంలా కనిపించింది. ఇప్పటి కిప్పుడు నాన్నని చూడాలి? ఎలా? నన్ను నేను తిట్టుకున్నాను. నన్ను నేనే కొట్టుకున్నాను. అమ్మా నాన్నకి దగ్గరగా ఉండే విధంగానే మా జిల్లా తూర్పుగోదావరిలోనే గవర్నమెంటు జూనియర్ లెక్చరర్ గా వచ్చినా, పెద్దన్నయ్య చేరమని చెప్పినా అక్కడికి వెళ్ళలేకపోయాను. జే,.ఎల్, ఉద్యోగం వచ్చిన మర్నాడే ఇంకా చేరాలో వద్దో అనే నిర్ణయం తీసుకోకుండానే రంగారెడ్డి లోనే వచ్చిన డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం నన్ను మా జిల్లా వెళ్ళకుండా ఆపేసింది. పోనీ ఏదోలా బదిలీలో వెళ్ళిపోయి కుటుంబానికి దగ్గరగా ఉందామనుకుంటుండగా సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగం. ఇక బదిలీ లేని ఉద్యోగంలో బందీ అయిపోయాను.
ఇప్పుడు అన్నయ్య, తమ్ముడు, చెల్లి వాళ్ళే నా కంటే బెటర్ అనిపిస్తుంది. కావాలనుకున్నప్పుడు కుటుంబంతో కష్టసుఖాలను కలిసి పంచుకుంటున్నారు. ఏ ఉద్యోగం లేకపోయినా పొలం చేసుకుంటూ నిత్యం అమ్మానాన్నలతో కలిసి జీవించి, చివరి గడియల్లో కూడా నోట్లో కాసిన్ని గెంజి పోయగలిగే అదృష్టం వాళ్ళకే కదా దక్కిందనిపిస్తుంది.


నాన్న చనిపోయే చివరి క్షణాల వరకూ దగ్గరున్న చిన్నన్నయ్య సత్యనారాయణ, వదిన భారతి. డిసెంబరు,2008 పదవ తేదీన తీసుకున్న ఫోటో.

నాకు ఆ భాగ్యమేది? నాలో రూపాయలు చేరి ఆత్మీయతల్ని కాటేశాయా? నాలో అధికార కాంక్ష చేరి అనుబంధాల్ని దూరం చేసేసిందా? “బాబా” నీ అంతిమ గడియల్లో చదివిన ప్రసంగి వాక్యాలే నిజమా?
10 డిసెంబరు 2008 నే నాన్నని చివరి సారిగా చూశాను.

నాన్నతో కలిసి దిగిన చివరి ఫోటో.ఇదే నాన్నతో దిగే చివరి ఫోటో అని ఊహించలేకపోయాను.కంటికి ఆపరేషన్ చేయించుకున్నాడు.అప్పుడు నాన్న చాలా చలాకీగా ఉన్నారు.
*** **** ***
అంతకు ముందు కొంచెం ఆరోగ్యం బాగోలేదంటే హైదరాబాదు తీసుకొచ్చి అన్ని పరీక్షలూ చేయించాను. 1-9-2007 న మా యూనివర్సిటీ క్యాంపస్ మెడికల్ సెంటర్ లో, తర్వాత కేర్ లో 29-5-2007 న , ఫోకస్ డయాగ్నస్టిక్స్ లో 3-9-2007 న , ప్రైమ్ క్లినిక్, న్యూరాలజీ స్పెషలిస్ట్ కి 3-9-2007 న చూపించాను. పక్షవాతం వచ్చే అవకాశం గాని ఉందేమోనని భయంతో మళ్ళీ 6-3-2007 న నిమ్స్ లోనూ చూపించాను. వయసు ప్రభావం వల్ల అలా నీరసం అన్నారు. కానీ, కొంచెం నరాల గురించి అనుమానం వ్యక్తం చేసారు. అందుకనే నరాల ప్రత్యేక వైద్యులను కలిసాను. అది బి.పి. వల్ల అలా ఆయాసానికి గురవుతున్నారని చెప్పారు. ఆస్తమా లేదు. గుండె జబ్బుల్లేవు. అన్నీ నార్మల్! వయసుతో పాటు కొన్ని వస్తుంటాయి. అయినా నేటికీ మీ నాన్నగారికి షుగర్ రాలేనందుకు సంతోషించాలన్నారు.

*** **** ****
నాన్న చిన్నప్పటి నుండీ చాలా కష్ట జీవి. తాను చేయగలిగిన అన్ని పనులను చేసే వాడు. పొలం దున్నేవాడు, లంకలు కొట్టేవాడు. నీరు తోడేవాడు. అరకలు దున్నేవాడు. వరి కోతలు కోసేవాడు. దింపులు తీసేవాడు.. అంటే కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు కోయడం. తాటాకు కొట్టేవాడు. కల్లు గీసే వాడు. వల నేయగలిగేవాడు. ఆ వల వేసి చేపలు పట్టే వాడు. కొబ్బరి చెట్లు చనిపోతుంటే దానికి కారణం పురుగుపట్టడమైతే, మొవ్వులో పట్టిన ఆ పురుగుని చెట్టు చనిపోకుండా తొలగించడంలో గొప్పనైపుణ్యాన్ని ప్రదర్శించేవాడని ఇప్పటికీ మా ప్రాంతంలో మా నాన్న గురించి గొప్పగా చెపుతుంటారు. ఆ రోజుల్లో వంద తాటాకులు కొడితే ఒక రూపాయి ఇచ్చేవారు. మా నాన్న పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నానికి సుమారు మూడు వేల తాటాకు కొట్టేవాడని మా ప్రాంతం రాజులు ( వాళ్ళకే ఎక్కువగా కొబ్బరితోటలు ఉంటాయి) చెప్తారు. నాన్నను నేను చివరి సారిగా చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ మాటల్లో అవే వినిపించాయి. నేను కూడా ప్రత్యక్షంగా నాన్నని ఇలా కష్టపడేటప్పుడు చూసే వాణ్ణి. నా కిప్పటికీ మరుపు రాని నాన్నతో  ఉన్న బాల్యస్మ్ిెతి లేత ముంజకాయల్ని చెట్టు మీదే కొట్టి పై నుండి కిందికి వేసే వాడు. అలాగే లేత బొండాలు కూడా కొట్టి కిందికి వేసేవాడు. అవి ఏ మాత్రం పాడయ్యేవి కాదు.
మా తాత కూడా ఇదే వృత్తి చేసేవాడు. మా తాతకి మా నాన్న ఒక్కడే కొడుకు. కూతుళ్ళు మాత్రం నలుగురు. మా తాత ఆయన నేర్చుకున్న వృత్తినే మా నాన్నకీ నేర్పాడు. నాన్న చదువుకోలేదు. మా తాత మాత్రం అక్షరాలు చదవగలిగే వరకూ చదువుకున్నాడు. అప్పుడప్పుడూ కావమ్మ, బాలనాగమ్మ కథలను, బొమ్మల రామాయణాన్ని, బొమ్మల భారత, భాగవతాలని చదివి చెప్పేవాడు. కానీ, మా నాన్న చదువుకోలేదు. మమ్మల్ని మాత్రం చదివించాడు. మేము నలుగురు అన్నదమ్ములం. ఒక చెల్లి. పెద్దన్నయ్య ఆర్టీసీలో కండక్టరు, చిన్నన్నయ్య చదువుకోలేదు. తర్వాత నేను. సెంట్రల్ యూనివర్సిటీలోనే చదివి ఇక్కడే అసిస్టెంటు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. నా భార్య కూడా గవర్నమెంటు లెక్చరర్ గానే పనిచేస్తుంది. నా తర్వాత తమ్ముడు. వాడు కూడా సెంట్రల్ యూనివర్సిటీలోనే డాక్టరేట్ చేశాడు. ప్రస్తుతం తెలుగు పండిట్ గా చేస్తున్నాడు. నా తర్వాత చెల్లి పి.జి. వరకూ చదివింది. ఆమె కూడా తెలుగు పండిట్ గానే చేస్తుంది. వాళ్ళ భర్త కూడా టీచర్. మా తమ్ముడి భార్య కూడా టీచర్. ఇంతమంది గవర్నమెంటు ఉద్యోగాల్లో ఉండడాన్ని చూడగలిగాడు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అందరికీ పిల్లలున్నారు నాకు తప్ప!
సెంటు భూమి కూడా మా తాత నుండి వారసత్వంగా లభించకపోయినా, నాన్న మంచి ఇల్లు కట్టాడు. పొలం కొన్నాడు. మమ్మల్ని చదివించాడు.
మేమింత అభివృద్దిలోకి రావడానికి నిరక్షరాసులైనప్పటికీ మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారో అనిపిస్తుంటుంది. మా తల్లిదండ్రులను కేంద్రంగా చేసుకొని నేను కొన్ని కవితలను రాశాను. వాటిలో కొన్నింటిని దళితతాత్త్వికుడు కవితా సంపుటిలో ప్రచురించాను.
వాటితో పాటు నాన్నస్పర్శ పేరుతో రాసిన కవిత వార్త దిన పత్రికలో ప్రచురితమైంది. ఇది తర్వాత నాయిన కవితా సంకలనంలో పునర్ముద్రణ పొందింది. వాటిలో ఏముందో నాన్నకు తెలియదు. చదివి వివరించినా ఒక మహర్షిలా నవ్వేవాడు. అందుకే అప్పుడెప్పుడో రాసిన మా వూరునవ్వింది కవిత తప్ప ఏదీ చదివి వినిపించలేదు అమ్మకి గానీ నాన్నకి గానీ! అదంతా నా తృప్తి కోసం రాసుకున్నానా? వాళ్ళని ఇలా వస్తువుగా చేసుకొనీ వాడుకున్నానా?
నాకు తెలియట్లేదు. నాన్న కొబ్బరి దింపులు తీస్తుంటే తీసిన ఫోటోని నాకవితా సంపుటికి ముఖచిత్రంగా వేశాను. అక్కడ కూడా నాన్న నాకు తెలియకుండానే సాయం చేశాడేమో. ఇంటర్వ్యూలో ఆ ముఖచిత్రం గురించి ఆడిగారు. ”మా నాన్న” అని గర్వంగా చెప్పుకున్నాను. అప్పటికే నాకు ఉద్యోగం ఉంది. యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఫర్లేదనే ధీమా ఉందేమో నాకు తెలియకుండానే! ముఖ చిత్రంలో ఉన్నది మా నాన్న ఫోటోనే అని చెప్పాను. “ ఇప్పుడున్నారా?” అన్నారు.
“ఉన్నారు” అని ఎంతో గర్వంగా, ఆనందంగా చెప్పాను.

ఇప్పుడేమని చెప్పాలి? ఆ ఫోటో ఎవరిదని ఎవరైనా అడిగినప్పుడు ఎలా ఫీలవ్వాలి?

తాను చనిపోయే ముందురోజు నన్ను అడిగాడట. “పిల్లోడు ఫోను చేశాడా? ఈ మధ్య రాడా? “
ఆదివారం అమ్మతో కలిసి చర్చికి వెళ్ళాడు. ఈ మధ్యనే మా వూరులో నేను కొన్న కొబ్బరి తోటలోకెళ్ళాడట. అక్కడ కాసేపు తిరిగాడట. అక్కడున్న పిచ్చి మొక్కల్ని పీకేసాడట. ఇంకా ఏమి చేశాడో… బహుశా ఆ తోటలోనే నన్ను చూసుకొనుంటాడు. అలా నన్ను చూడాలనుకున్న ఆశను తీర్చుకొనుంటాడు. “బాబా” నా కళ్ళు మసక బారిపోతున్నాయి. ఇది రాస్తుంటే మసక మసకగా కనిపిస్తుంది. నీకు కళ్ళజోడు వేయిస్తే చిన్నపిల్లాడిలా మురిసిపోయావే! నాకేంటి బాబా నా అక్షరాలు మసకబారిపోతున్నాయి, వాక్యాలు కనిపించడం లేదు. నాకే చిన్నబాధ వచ్చినా అల్లాడిపోయేవాడివే! ఇప్పుడు ఎవరి ఒడిలో పడుకొని చెప్పాలి? నా లాగే నీకూ ఆ తోటలో అనిపించిందేమో! నాకిప్పుడు ఆ తోటలోనే ఉండాలనుంది. నువ్వుతిరిగిన స్థలాన్ని కౌగిలించుకోవాలనుంది. ఇప్పుడు ఇంటి దగ్గర నీ జ్నాపకాల పందిరిలో నువ్వు పంచిన గొంతులెన్ని రోదిస్తున్నాయో తెలుసా బాబా! నువ్వు పంచిన రూపాలెన్ని తిరుగుతున్నాయో తెలుసా బాబా! బాబా… అల్లారు ముద్దుగా ఎత్తుకోవడానికో పసిపాపనివ్వలేకపోయినందుకు క్షమించు బాబా! నా కొడుకు కారేసుకొస్తాడు. కారులో ఊరంతా తిరిగేస్తా” నన్నే వాడివట. నీ శవాన్ని చూడడానికే అది నాకుపయోగపడింది తప్ప, నిన్ను బతికుండగా కారులో కూర్చోపెట్టితిప్పలేకపోయినందుకు క్షమించు బాబా! దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. నాకు తెలిసిన ప్రత్యక్ష దైవానివి నువ్వే బాబా! నాకు తెలిసో తెలియకో ఏమైనా తప్పులు గానీ పొరపాట్లను గానీ చేసుంటే క్షమించు బాబా!
ఇప్పుడు ఇంటి వెళ్ళాలంటే భయంగా ఉంది.
నేను వెళ్ళి పోతున్నందుకు కుమిలి కుమిలి పోయే పసిపిల్లాడయ్యే తండ్రి ఉండడనే ఊహే భయంకరంగా ఉంది. తండ్రి లేదని చెప్పేవాళ్ళ గొంతులిన్నప్పుడల్లా వచ్చో, ఫోన్ చేసో నీ గొంతు ఎలాగోలా వినేవాణ్ణి! ఇప్పుడెలా బాబా? నన్నూ అనాథను చేసేశావు కదా బాబా!18 comments:

పరిమళం said...

మీ ఆవేదన మీ టపాలో స్పష్టంగా అగుపిస్తోంది .నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను .

మద్దిరాల said...

సార్ క్షమించండి మీ భాధ నేను అర్ధం చేసుకోగలను. ఈ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు.కానీ రాక తప్పదు . అన్ని తెలిసిన మీరే ఇలా ఉంటే ఎలా చెప్పండి. ఒక్క సారి అలోచించండి. మీరు గుండె ధైర్యంతో అందరికి నచ్చచెప్పాలి కానీ మీరు ఇలా ఉంటే ఇక అమ్మగారు,తమ్ముళ్ళు ,అన్నయ్యలను ఎవరు ఓదార్చుతారు ...కొంచం గుండె నిబ్బరంతో ఉండండి సార్ ..

మద్దిరాల said...

సార్ క్షమించండి మీ భాధ నేను అర్ధం చేసుకోగలను. ఈ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు.కానీ రాక తప్పదు . అన్ని తెలిసిన మీరే ఇలా ఉంటే ఎలా చెప్పండి. ఒక్క సారి అలోచించండి. మీరు గుండె ధైర్యంతో అందరికి నచ్చచెప్పాలి కానీ మీరు ఇలా ఉంటే ఇక అమ్మగారు,తమ్ముళ్ళు ,అన్నయ్యలను ఎవరు ఓదార్చుతారు ...కొంచం గుండె నిబ్బరంతో ఉండండి సార్ ..

మద్దిరాల said...

సార్ క్షమించండి మీ భాధ నేను అర్ధం చేసుకోగలను. ఈ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు.కానీ రాక తప్పదు . అన్ని తెలిసిన మీరే ఇలా ఉంటే ఎలా చెప్పండి. ఒక్క సారి అలోచించండి. మీరు గుండె ధైర్యంతో అందరికి నచ్చచెప్పాలి కానీ మీరు ఇలా ఉంటే ఇక అమ్మగారు,తమ్ముళ్ళు ,అన్నయ్యలను ఎవరు ఓదార్చుతారు ...కొంచం గుండె నిబ్బరంతో ఉండండి సార్ ..

Anonymous said...

prati jeeviki maranam tappadu. ayinaa dukkamuu tappadu. mee naanna gaari aatmaku saanthi kalagaalani korukuntunnaanu.
ramu

Anonymous said...

ramaswamy:
గురువు గారు ! సిద్ధార్థ మెయిల్ చూస్తే, ఈ బాధాకరమైన విషయం తెలిసింది. శ్రీ లంకయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...ఆ భగవంతుణ్ణి ప్ర్రార్థిస్తున్నాను ....మేకల రామస్వామి

Anonymous said...

namasthay sir me nanna garu swargasthulu aenanduku na nenu chala chala
vicharisthunnaanu sir me nanna gari aathmaku shanthi chekuralani
manasu spoorthiga devunni prardisthunnanu

డా.ఆచార్య ఫణీంద్ర said...

దార్ల గారు!
కోట్లు కుమ్మరించినా పూడ్చలేని లోటు అది.
పితృ వియోగం ఎంత దుర్భరమో ఎరిగిన వాణ్ణి.
మీ టపా చదువుతుంటే కళ్ళనుండి నీళ్ళు టప టపా రాలిపోయాయి.
మీ నాన్న గారికి పుణ్య లోకాలలో మహారాజ్యాభిషేకం జరగాలని ఆకాంక్షిస్తున్నాను.
మీకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ...
మీ ఆత్మీయ మిత్రుడు
ఫణీంద్ర

బొల్లోజు బాబా said...

my deepest condolances to you sir.

i hope time would heal the things. but the feelings of desertation always haunts. no doubt. i too had the same feelings when my father passed away.

may his soul rest in peace.

i strongly feel poetry is a good cushion many times.

ఆ మహానుభావుని మట్టికి సమర్పించుకొంటున్న కొన్ని అక్షరసుమాలు. మీకు ఊరటనిస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ కవిత.......

మృత మన్ను

ఎన్నో భావాల్నిపలికించిన ఈ నేత్రాలు అభావమైన దృశ్యం.
గాలిని పదాలుగా, నవ్వులుగా, ఆశలుగా, ప్రేమలుగా
మార్చిన ఈ స్వరతంత్రులు నిర్జీవమైన వేళ.........
ఇక ఈ చెవులు తీతువుపిట్ట సుదూరగానం వినలేవు.
వానజల్లుల శబ్ధాలను స్పర్శించలేవు.
ఈ వీధిగాయకుని అస్థిపంజరమిక మట్టిపొరల క్రింద పడి ఉంటుంది.
తన నీడల్లోకే నా నేస్తం కనుమరుగయ్యాడు.

ప్రజలందరూ వెలుగు ప్రపంచంలోకి ప్రవహిస్తుండగా
ఈ ఖాళీ రాత్రి లోంచి నీ జ్జాపకాలు ఉదయిస్తాయి
ఆ నీడల మద్య తచ్చాడుతూ నేను ..........
హృదయంపై భోరున ఒకటే కుంభవృష్ఠి .

వయసుపెరగడమంటే మనం ప్రేమించేవాళ్లను
ఒక్కొక్కళ్లనూ కోల్పోవటం కాదూ.......
బాధపడుతూ కూర్చుంటే జీవితం ఆగిపోదట
సాగిపోతూనే ఉంటుందట - ఎవరో అంటున్నారు

బాధంటే లేకపోవటమే. లేకపోవటమే బాధ.
శూన్యంలో జ్వలించే అంతులేని నిట్టూర్పే బాధంటే
జ్జాపకాలు అస్ఫష్టం కానంతవరకూ
బాధ ఓ సర్పపరిష్వంగమే!
భావానికీ రూపానికీ మద్య పరచుకొనేదే వేదన
కలకూ వాస్తవానికీ దూరం చెరిగే వరకూ
వేదన ఓ దృతరాష్ట్రకౌగిలే!

నాకు తెలుసు ప్రతి క్రియా నిర్ధేశితమేనని
నాకు తెలుసు ఈ బాట ముగింపేమిటో
నాకు తెలుసు నేను క్షతగాత్రుల బృందంలో ఒకరినని
కాలం సముద్రంలా అన్నింటినీ తనలో కలిపేసుకోగలదని
అయినా జీవితమంటే సాయంకాలపు వ్యాహ్యాళి కాదుగా!

భవదీయుడు బొల్లోజు బాబా

శ్రీనివాస్ పప్పు said...

దార్ల గారూ,
మొదటగా మీ తండ్రిగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నా.ఇకపోతే బాధపడకండి ఎందుకంటే ఆయన ఏమీ కష్టపడకుండా అందరూ సుఖంగా ఉండడం చూసే వెళ్ళిపోయారు.అందువల్ల బహుశా ఆయనే మీ దంపతులకు పిల్లాడి రూపంలో జన్మించవచ్చు పై ఏటికి అని నా అంచనా.

kesav said...

sorry to see this news on your blog.i have no words to console you

kesav

Subba said...

Dear Dr. Darla Garu,

Mee Blog nenu regular ga visit chestuvuntanu. Ee roju edi chadivina taruvatha chaala badha anpinchindi.

మీ ఆవేదన మీ టపాలో స్పష్టంగా అగుపిస్తోంది .నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను .

I wish you a speedy recovery from the pain....
dr.subba@gmail.com

స్వాతి said...

తండ్రి పొతే ఉండే బాధని నేను సంవత్సరం క్రితమే అనుభవించా. ఇంకా అనుభవిస్తున్నా.మీ నాన్నగారికి 70సం., మా నాన్నగారికి 56.

స్వాతి said...

తండ్రి పొతే ఉండే బాధని నేను సంవత్సరం క్రితమే అనుభవించా. ఇంకా అనుభవిస్తున్నా.మీ నాన్నగారికి 70సం., మా నాన్నగారికి 56.

SIRAPANGI SANTHI SWAROOP said...

On 1 April, 2009, received sms message on my cell phone from Dr. Darla Venkateswara Rao, informing this sad news. As a result conveyed my condolence on the next day morning.

When he conveyed this saddest news, gone back to my previous days, how I felt when I lost my father on 17 November, 2002 and how me and my family members faced the subsequent days. And comparitively analysed the position of Dr. Darla.

Death is an inevitable thing to every living object, and we human beings are no expection in any sense. But, the peculiar qualities of our human nature is making us to grieve immensly over this unescapble natural cause. No words and actions can effectively console the persons involved in this tragic 'Maya'.

I express my heart rendering condolence to Dr. Darla Venkateswara Rao over this unexpected, though unescapble calamity. May Sri Darla Lankayya gari sole rest in peace. May all the family members, relatives, and friends of Sri Lankayya face this tradegy boldly.

At the same time sorry for conveying my condolence on this blog, a bit late. I was not looking into my blogs related section for the past few days, due busy activities.

చిలమకూరు విజయమోహన్ said...

నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను .

Vinay Chakravarthi.Gogineni said...

naanaagari aatmaku shaanti kalagaalani ....... devudini adugutunnanu

Vinay Chakravarthi.Gogineni said...

naanaagari aatmaku shaanti kalagaalani ....... devudini adugutunnanu