శనివారం (28-3-2009 న) హైదరాబాదు సాలార్ జంగ్ మ్యూజియమ్ లో తెలుగు పాశస్త్యంపై సాహితీ గోష్ఠి జరిగింది. కేంద్ర పభుత్వం తెలుగుకి ప్రాచీన హోదా ప్రకటించిన సందర్భంగా, విరోధి నామ సంవత్సర వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని సాలార్ జంగ్ మ్యూజియం వారు ఏర్పాటు చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల, కళాశాలల, సంస్థల నుండి కవులను, సాహితీ వేత్తలను సమావేశానికి ఆహ్వానించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో సుదీర్ఘ కాలం పాటు తెలుగు శాఖలో అధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారి అధ్యక్షతన రెండు విభాగాలుగా ఈ కార్యక్రమం జరిగింది. ఆయన అధ్యక్షతనే జరిగిన మొదటి సమావేశంలో సమాచార చట్టం కమీషనర్ ఆర్.దిలీప్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని తెలుగు భాషా పరిణామాన్ని వివరించారు. సామాన్యుడికి కూడా భాష అందుబాటులోకి రాగలిగినప్పుడే ఆ భాషకు నిజమైన సార్థకత అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలుగు భాష, సాహిత్య వికాసాలను సోదాహరణంగా వివరించి, పద్యం,గద్యం, ప్రాచీన, ఆధునిక భాషాసాహిత్యాలను ఆదరించుకోవలసిన ఆవశ్యకతను తెలిపారు.సాలార్ జంగ్ మ్యూజియమ్ డైరెక్టర్ డా//ఎ.నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ మ్యూజియమ్ గైడ్ ని తెలుగులో అనువదిస్తున్నామని, తెలుగు అనువాదం లో గల సమస్యలను చర్చించారు. సమావేశంలో NITHM, డైరెక్టర్ జనరల్ డా//ఎకెవిఎస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాజీ సభ్యులు డా.టి.వి. నారాయణ, Dr. VV Krishna Sastry, Former Director, Dept. of Archaeology & Museums, Govt of AP తదితరులు పాల్గొన్నారు. సమావేశాన్ని సాలార్ జంగ్ మ్యూజియమ్ ఉద్యోగి శ్రీ మల్లం వీరేందర్ చక్కని సమన్వయంతో నిర్వహించారు. అతిశయోక్తులకు, పొగడ్తలకు పోకుండా విషయంపైనే దృష్టి కేంద్రీకరించడం ఈ సమావేశం ప్రత్యేకతల్లో ఒకటి.
.
రెండవ సమావేశం గా జరిగిన ’తెలుగు పాశస్త్యంపై సాహితీ గోష్ఠి కి కూడా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారే అధ్యక్షత వహించారు. మొదట ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు ఆచార్యులు ననుమాస స్వామి వచన కవితతో సాహితీ గోష్ఠి ప్రారంభమైంది. ఎన్నికలను, ఉగాదినీ, తెలుగు ప్రాచీన హోదాని కలిపి ముప్పేటలా రాసిన “ ఓ విరోధీ నిన్నెప్పుడూ చూడలే! పేరుతో రాసిన వచన కవితను వినిపించారు.అంతర్జాతీయ సర్వేలు మాతృభాషలు నశించిపోతాయని చెప్పేవాటిని నమ్మొద్దనీ, జాతి బతికున్నంత కాలం మాతృభాష బతుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. ( పూర్తి కవితను త్వరలోనే అందిస్తాను)
తర్వాత సెంట్రల్ యూనివర్సిటి తెలుగు అధ్యాపకుడు, కవి డా//దార్ల వెంకటేశ్వరరావు “తెలుగు గుండెల్లో క్లాసికల్ గుబులు” వచన కవితను చదివారు. ప్రజల భాషగ తెలుగు భాష ఉండాలని, కృతకమైన గ్రాంథిక భాష కంటే, నేటి అవసరాలకు అనుగుణమైన తెలుగు విస్మరించవద్దని సూచించారు.( పూర్తి కవిత త్వరలోనే అందిస్తాను)
డా//ఆచార్య ఫణీంద్ర తెలుగు ప్రాశస్త్యాన్ని వివరిస్తూ చెప్పిన పద్యాలు ఆకట్టుకున్నాయి. వీరితో పాటు డా// ఆంజనేయ రాజు, డా. రాధశ్రీ ల పద్యాలు కూడా బాగున్నాయి.
కవిత చదువుతున్న డా//దార్ల వెంకటేశ్వరరావు వేదికపై సమాచార చట్టం కమీషనర్ ఆర్.దిలీప్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ మాజీ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సాలార్ జంగ్ మ్యూజియం ఉద్యోగి శ్రీ ఎం. వీరేందర్ తదితరులు
డా//దార్ల వెంకటేశ్వరరావు ని సన్మానిస్తున్న సమాచార చట్టం కమీషనర్ ఆర్.దిలీప్ రెడ్డి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, శ్రీ వీరేందర్ తదితరులు
తెలుగు భాషకు ఎక్కడైనా ఉపయోగించుకొనే అనుకూలమైన సాఫ్ట్ వేర్ ఆవశ్యకత కోసం ప్రయత్నించవలసిన అవసరాన్ని తన ప్రసంగంలో వివరిస్తున్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకుడు డా//పగడాల చంద్రశేఖర్
కవిత చదివిన తర్వాత Former Director, Dept. of Archaeology & Museums, Govt of AP, డా// వి.వి.కృష్ణశాస్త్రి తో ముచ్చటిస్తున్న డా// దార్ల వెంకటేశ్వరరావు
కవిత చదవడానికి ముందు ఆచార్య ననుమాస స్వామి తో ముచ్చటిస్తున్న దార్ల
సమావేశంలో మాట్లాడుతున్న డా//టి.వి. నారాయణ
కవిత చదువుతున్న డా//ఆచార్య ఫణీంద్ర
సమావేశానికి హాజరైన కొంతమంది ప్రేక్షకులు
2 కామెంట్‌లు:
దార్ల గారికి నమః
గోష్ఠిలో అంతా చాలా ఆనందంగా గడిచింది. చాలా రోజుల తరువాత మిమ్మల్ని, ఇంకా ఇతర కవి మిత్రులను కలిసినందుకు హృదయం ఉప్పొంగింది. సమావేశ సన్నివేశాలు స్మృతిపథం నుండి చెరిగిపోకుండా ఉండేలా చక్కని టపా అందించారు. మీ శ్రద్ధాసక్తులకు నా జోహార్లు. టపా నుండి నా ఫోటోలను సేవ్ చేసుకొన్నాను. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
- డా. ఆచార్య ఫణీంద్ర
డా//ఆచార్య ఫణీంద్ర గార్కి నమస్కారం,
నిజమే నండీ...
అంతకు ముందు కంటే మీబ్లాగు చదివిన తర్వాత మ్మిమ్మల్ని కలవడం నిజంగా ఒక కొత్త అనుభవమేదో కలిగింది. మీ కవితను బ్లాగులో పెట్టండి
ఉంటాను
మీ
దార్ల
కామెంట్‌ను పోస్ట్ చేయండి