Thursday, February 26, 2009

తెలంగాణాలో ఆంధ్రా వక్త ప్రసంగం – అస్తిత్త్వ చైతన్యం!

మొన్నా మధ్య అంటే 18, ఫిబ్రవరి 2009 న ఉస్మానియా యూనివర్సిటీ సీనియెర్ ప్రొఫెసర్ ముత్తయ్య గారు నాకు ఫోను చేశారు. ఆయన ప్రస్తుతం ఉస్మానియా కాలేజీ అనుబంధ సంస్థ నిజామ్ కళాశాలలో పనిచేస్తున్నారు. " బ్రదర్ మన విద్యార్థులు మహాత్మా జ్యోతీ బాపూలే గురించి ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. బాగా మాట్లాడగలిగే వక్తని ఎవరి నైనా పిలవమన్నారు. నేను మీ పేరు చెప్పాను. మీరేమంటారు?" అని అడిగారు.

ప్రొఫెసర్ ముత్తయ్య గారి పట్ల నాకు చాలా గౌరవం ఉంది. రాష్ట్రంలో మాదిగ హక్కుల దండోరా ఉద్యమం ఇంత విస్తృతం కావడం వెనుక ఆయన మేథోగతమైన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఆయన్ని మా మాదిగలు మాదిగ మేథావుల్లో ఒకరిగా భావిస్తుంటాం. అందువల్ల వెంటనే కాదనలేక పోయాను.

కానీ నేనెందుకు సార్ ! ఇంకా అక్కడే చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు. మేమిప్పుడిప్పుడే నాలుగు చిలక పలుకులు నేర్చుకుంటున్నవాళ్ళం. మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వినడానికి రావడం బాగుంటుందేమో.." అన్నాను. " ఎప్పుడూ మేమే మాట్లాడితే మా తర్వాత తరం ఎప్పుడు వస్తుంది. పైగా మొన్న బషీర్ బ్లాగులో మీరు మాట్లాడటం చూశాను. యువతలో ఉండే ఆవేశం కూడా ఇప్పుడు కావాలి. నేనూ వేదిక పై ఉంటాను. మీరు రావాలి." అన్నారు.

ఆ మీటింగ్ వివరాలు అడిగాను. చెప్పారు. ఆ విద్యార్థులకు ఒకసారి ఫోను ఇవ్వమని మీటింగ్ గురించి తెలుసుకొని, నా పాత్ర ఏమిటని ఆడిగాను. మహాత్మా జ్యోతీ బా పూలే గురించి మాట్లాడాలన్నారు. "అలాగే " అని చెప్పాను. తప్పకుండా రావాలన్నారు.

నిజానికి అలాంటి మీటింగ్ కి వెళ్ళాలంటే లిఖిత రూపంగా ముందుగా నాకు లేఖ పంపాలి. నేను అంగీకరించిన తర్వాత వాళ్ళు ఏదైనా వాహనం పంపి తీసికెళ్ళి, మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర దింపాలి. ఇవన్నీ ముందుగానే మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. ఇంత చిన్న వయసులో అటువంటి వాటి గురించి బెట్టు చేయడం అంత శ్రేయస్కరం కాదనిపించడం ఒక కారణమైతే, అవన్నీ వాళ్ళే చూసుకుంటారనే నమ్మకం మరొక వైపు ఉంది.

అప్పటికే రెండు నేషనల్ సెమినార్ పేపర్స్ రాయడంలో నేను బిజీగా ఉన్నాను. మరొక వైపు క్లాసులు. ఇంకోవైపు ఎలాగూ ఇంటి దగ్గర మన వ్యక్తగత పనులు ఉండనే ఉంటాయి. ఈ బిజీలు తప్పవులే అనుకున్నాను. అన్నింటి కంటే, యూనివర్సిటీలో సెలవు పెట్టాలి. ఇప్పటికే సిలబస్ కాలేదు. మాకు రోజూ క్లాసులు జరుగుతాయి. అన్నింటి కంటే మా విద్యార్థులతో గడపడానికే మేము ఎక్కువగా ఇష్టపడుతుంటాం. పాఠాలు వినడం వాళ్ళకీ, చెప్పడం మాకూ చాలా ఇష్టం. వర్షం వచ్చినా క్లాసులు జరుగుతునే ఉంటాయి. మా యూనివర్సిటిలో అలాంటి మంచి సంప్రదాయం నేటికీ కొనసాగడం సంతోషదాయకం. అందువల్ల క్లాసు మానేయాలంటే మా ప్రాణం పోయినట్లేఅనిపిస్తుంది. అయినా సరే ఒక సామాజిక చైతన్య మూర్తి గరించి మాట్లాడడానికి సెలవు పెట్టైనా వెళదామనుకున్నాను. ఫిబ్రవరి 20వ తేదీన ఉదయం పదకొండు గంటలకు మీటింగ్ అన్నారు. కాబట్టి ప్రసంగానికి కావలసిన సరంజామా అంతా సమకూర్చుకుంటున్నాను.

ఫిబ్రవరి, 19 తేదీన ప్రొఫెసర్ ముత్తయ్య గారు ఫోను చేశారు. గొంతులో అంత ఉత్సాహం కనిపించలేదు. “మన మీటింగ్ గురించి స్టూడెంట్స్ ఫోను చేశారా ? లేదా? అంటూ ఏదో సొమ్ము సమకూరలేదంటున్నారని అన్నారు.

నాకు ఆశ్చర్యం వేసింది. రెండు మూడు రోజులు మీటింగ్ పెట్టుకొని డబ్బులు సమకూరలేదనడం లో వాస్తవం ఉండదనిపించింది.

మీరేదో నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లున్నారు. నిజానికి మీ మాటకి విలువనివ్వాలనే నేనా మీటింగ్ కి రావడానికి అంగీకరించాను. అంతే తప్ప, ఇప్పటి నుండే మీటింగ్స్ లో పాల్గోవాలనే అత్యుత్సాహం లేదు, నాకింకా ఎంతో వయసు ఉంది, ఎన్నో అవకాశాలు వస్తాయని ముందే చెప్పాను కదా సార్. అసలు విషయం చెప్ప్డిండి అన్నాను. అయినా, నీళ్ళు నములుతున్నారు. నాకెందుకో అనుమానం వచ్చి తెలంగాణా ప్రాంతీయ సమస్య గానీ ఏమైనా అడ్డు వచ్చిందాని నవ్వుతూనే అడిగాను. అదే విషయం వాళ్ళలో ఒకరిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆయనది ఆంధ్రా ప్రాంతమట కదా అని ఒకరిద్దరు అడిగారట! మరి అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆయన్ని అడక్కముందే చెప్పవచ్చుకదయ్యా అన్నారట.

నాకు విషయం అర్థమైంది.

వాళ్ళ ఆలోచన సరైందేనని అనుకుంటున్నానండీ. నేను ఆంధ్రావాణ్ణే. మాత్రం తెలంగాణా ప్రాంతానికి చెందిన అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాను. అంతేకాకుండా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి వ్యతిరేకం లేకపోగా, దాన్ని బలంగా సమర్థిస్తున్న వాణ్ణి. అయినా, ప్రాంతానికి చెందిన విద్యార్థులు నిర్వహిస్తున్న సభల్లో మాలాంటి వాళ్ళం పాల్గొన్నా, కేవలం భావజాలాన్ని సమర్థించే వాళ్ళు గానే తప్ప, వాళ్ళు ప్రాంతీయులు గా మమ్మల్ని అంగీకరించలేరు.

అంతేకాకుండా, అస్తిత్త్వ ఉద్యమాల్లో ఉండే చైతన్యాన్ని కూడా అర్థం చేసుకోవలసి ఉంది. ఒకప్పుడు, దళితులు రాయలేనప్పుడు, వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడలేనప్పుడు దళితేతరులు పని చేశారు. దళితులే ముందుకొచ్చినప్పుడు దళితేతరులు గౌరవప్రదంగా తప్పుకున్నారు. అలాగే మాదిగలు గురించి మాదిగలే రాసుకోగలిగినా, మాట్లాడగలిగినప్పుడు మాదిగలకే అవకాశం ఇవ్వలని ఆశిస్తున్నాం. అలాగే, తెలంగాణా అస్తిత్త్వ ఉద్యమంలోనూ విద్యార్థులు ఇలాంటప్పుడు చైతన్యంతో తెలంగాణా వాళ్ళే మాట్లాడాలని కోరుకుంటున్నారని అర్థంచేసుకోవాలని అనిపిస్తుంది.

సంఘటనను నేను ఇలాగే అర్థం చేసుకుంటున్నాను. కాకపోతే, ఒక వ్యక్తిని పిలిచే ముందు అతని గురించి అన్నీ అలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. హడావిడి నిర్ణయాలు వాళ్ళ అపరిపక్వతను బయటపెడుతుంటాయి. ఇక పై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోమనండి. అలాగే వాళ్ళ సభ దిగ్విజయం జరగాలని కోరుకుంటున్నాని చెప్పండి. నా పట్ల మీకు గల ప్రేమాభిమానాలకు, మీకున్న సదభిప్రాయానికి కృతజ్ణతలు తెలుపుతున్నాను”” అని అన్నాను.

ఒక బాధాతప్తహృదయంతో, ఒక బయంకర సంఘటన నుండి రిలీఫ్ అయిన గొంతుతోమీరిలా ఆలోచిస్తారని అనుకోలేదు బ్రదర్...థాంక్యూ!” అంటూ ఆయన ఫోను పెట్టేశారు.

దీన్ని సహృదయతతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అస్తిత్త్వచైతన్యంగా గుర్తించాలనిపించింది.

3 comments:

oremuna said...

>> బషీర్ బ్లాగు
మనసంతా బ్గాగు అయినట్టుంది :)

ఇటువంటివి చాలా విన్నాను ఈ విశ్వవిద్యాలయంలో. ఒకసారి బ్లాగుల గురించి ఈ వివిలో చెపుదామనే ప్రపోజల్ వచ్చినా ఈ గొడవలకు బయపడి వెనకడుగేశాం మిత్రులందరం. అనవసరంగా కొరివితో తలగోక్కోడం ఎందుకని.

ఇప్పటికయినా వాళ్లు వాళ్ల స్ట్రాటజీ మార్చుకోని కొంచం స్లేహశీలురుగా పేరు తెచ్చుకుంటే బాగుంటుంది.

Sravya said...

so sad !

SIRAPANGI SANTHI SWAROOP said...

There is no wrong to develop identity conciousness, and lead movements. But in this case, it is so shocking to see the hard hearts of young stars, who should become responsible citizens, with broad mind, which is a mcuh pre requisite at this age.

Elders like Prof. Muttaiah should guide students to develop broad mind, along with identity conciousness. If not the regional identity movement may develop crisis and end in futile.