Important Contact Numbers of The University of Hyderabad link https://www.uohyd.ac.in/index.php/administration/contact

తెలంగాణా బాటలోనే కోస్తా మాదిగోళ్ళూను...!
మీలాగే మేమూ మాకు రావాల్సినయన్నీ మాకియ్యమని
మా సోదరల్తో పోరాడుతున్నోల్లమే నండి
బతుకు తెరువెత్తుక్కొంటూ కడుపులో కాసిన్న గెంజి కోసం వచ్చినోల్లమే నండి
మేమేమీ వోమనుడు లాంటోల్ల కాదులెండి
మీయధికారాన్ని గుంజుకోవడానికో
తెల్లోడోలే పెత్తనం సెలాయించడానికో
రియలెస్టేట్ యేపారం చేత్తూ
మీభూములన్నీలాక్కోడానికో వచ్చినోల్లం అసలే కాదండి
అందర్లా మీరూ మమ్మల్నీ అనుమానంతో సూసినా
అప్పుడప్పుడూ మీరే సెప్పుతుంటార్లే మీ సెత్రుత్వం మాతోకాదని!
మొన్నటిదాకా మనదంతా ఒకటే బాసంటే
అచ్చరాలా నిజమేనుకున్నామండి
మొన్నటి దాకా మిమ్మల్ని మాట్టాడించిప్పుడల్లా
మాకెందుకో నవ్వొచ్చేసేదండీ
ఆయ్ ... నిజ్జంగానండీ
రౌడీలు, దొంగలూ, బఫూన్లతోనే మీ బాసలో మాట్టాడిత్తున్నారని
నిజ్జంగా మాకప్పుడు తెలీదండీ... ఆయ్!
యీమద్దె మమ్మల్నీ అలాగే మాట్లాడిత్తుంటే
మాకూ తెలిసిందండి
మా బాసనేదో అబాసుపేల్జేత్తున్నారని
మా బాసతోనే మమ్మల్ని యేలనజ్జేత్తున్నారని
మా బాసతోనే మమ్మల్ని సంతలో అమ్మేత్తున్నారని !

***
మీకూ మాకూ సేలా యిసయాల్లో పోలికలున్నాయండి
నిజ్జానికి మనద్దిరిదీ 'ఉమ్మడి' తెచ్చిన గొడవేనండి
మనద్దరమిప్పుడు
' జాతీయని' బందంలోనే శిక్కుకుపోయామండి
రాజ్జెమైనా,రాజ్జాంగెమైనా,పెజల గోసినాల గందా
మాకులపెద్దోల్లే నయమేమో
కాత్త కల్లోసారో తాగేసి అటో యిటో తగువు తేల్చేత్తారండీ
యీల్లేంటండీ... మావూల్లో అమ్మోర్లా
అన్నీ సెప్పినా అర్ధం కానట్టు
పెద్ద పెద్ద కల్లేసుకొని మిడిగుడ్డుల్తో సూడ్డమే తప్ప
పెదాల్నిప్పట్లేదేంటండీ?
***
బాసాపెయత్తనం గానో, ఉమ్మడి సెడ్యూలు గానో
గారడీవోల్లు, యేయో విద్దెల్తో మాయల్నే సేత్తున్నారు సుమండీ!
యెవల్లోకో యెప్పుడో యిచ్చిన వరాలే మాకిప్పుడొరకత్తులవుతాయని
మేమెప్పుడూ అనుకోలేదండి
ఆయ్... ఆ కత్తులకోత నిజ్జంగా మాకిప్పుడిప్పుడే తెలుత్తుందండీ
మీకూ మాకూ అన్నేయం జరుతుందని
మాకూ ఇప్పుడిప్పుడే నిజ్జంగా తెలిసొత్తందండి
ఆయ్... యింకా సెప్పాలండీ మాదీ గోదారి జిల్లానే నండీ
గోదారోల్లంతా గోదాల్లా బొజ్జలు పెంచుకున్నోల్లే కాదండోయ్
మమ్మల్నందర్నీ చేరదీసి కిరస్తానీ వోల్లు
సదువూ సంస్కారం నేర్పారంటారే
ఆదలితులనే మమ్మల్నీ పిలుత్తుంటార్లెండి
సెప్పేదేముందండి
చెప్పులు కుట్టుకుంటూ యే రోడ్డు మూల్లోనో తప్ప
సదువుకుని సర్కారు కొలువులోవున్న
మామాదిగోల్లెక్కడున్నారో మాకొక్కడూ కనబడ్డండీ!
***
ఇసాలాంధ్ర లో ఇసాల భావాలెక్కడున్నాయని
మీరెతుకుతున్నట్లే
మాల మాదిగోల్లంతా యెక్కడొక్కటో
యిల్లల్లోనో పెల్లిల్లోనో సివరికి సొశానెంలోనైనా
యెక్కడైనా ఒక్కటై కనిపిత్తారేమోనని యెతుకుతున్నామండి.
మీక్కనిపించినట్టే
మాకూ నేతిబీరకాయలో నెయ్యేదొరుకేత్తందండి!
***

ఈ నేతిబీరకాయల్ని పంచేటోల్లంతా

మా మాల మాదిగల్నిక కలవ నియ్యమనుకుంటున్నారేమో

మా కుటుంబకలహాల్లో తప్ప

మా కష్ట కాలాల్లోమేమూ నూటైదమందిమేనని నిరూపించాల్సిందే!


--డా//దార్ల వెంకటేశ్వరరావు

1 comment:

కత్తి మహేష్ కుమార్ said...

మనసును హత్తుకుంటూనే కలిచివేస్తోంది.