Dr.Darla Venkateswara Rao
Assistant Professor,Dept. of Telugu
School of Humanities,
UNIVERSITY OF HYDERABAD
Gachibowli, Hyderabad. A.P.,India
13-2-2009 సాయంత్రం ఆరు గంటలు కాకుండానేహైదరాబాదు ప్రెస్ క్లబ్బులో కైతునకల దండెం (అనేక కులాల వాళ్ళు రాసిన మొట్టమొదటి మాదిగ కవిత్వ సంకలనం) ఆవిష్కరణ సభ ప్రారంభమైంది. నిజానికి అది ఒక సాహిత్య సదస్సులా జరిగింది. రాష్ట్ర నలు మూలల నుండీ కవులూ, రచయితలు, కళాకారులు, ఉద్యమ కారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రాఫిక్ లో ఇరుక్కు పోవడం వల్ల ఆరున్నరకు గానీ నేను వెళ్ళలేక పోయాను. అప్పటికే దండోరా ప్రచురణల సమన్వకర్త, కవితా సంకలనం సంపాదకుడు కృపాకర మాదిగ మాట్లాడుతున్నారు. నన్ను గమనించి వేదిక పైకి ఆహ్వానించారు. అప్పటికే వేదిక పై ఆచార్య ననుమాసస్వామి, డా//అద్దేపల్లి రామమోహన రావు, డా//కనకయ్య, వేముల ఎల్లయ్య, షాజహానా, కారంచేడు సంఘటనలో తన భర్తను పోగొట్టుకున్న బాధితురాలు, చెప్పులు కుట్టుకొనే మాదిగ వృత్తి కార్మికుడు ఈతకోటి తుక్కేశ్వరరావు లు వేదిక పై కూర్చున్నారు.
సభాధ్యక్షుడుగా వేముల ఎల్లయ్య గారు, సమీక్షకులుగా డా//కనకయ్య, నేను (డా//దార్ల వెంకటేశ్వరరావు) పాల్గొనగా, మిగతావాళ్ళు సందేశాన్నిచ్చే అతిధులు గాను, కారంచేడు సంఘటనలో తన భర్తను పోగొట్టుకున్న బాధితురాలు శ్రీమతి సిర్రాసులోచన., ఈతకోటి తుక్కేశ్వరరావులు గ్రంథావిష్కర్తలుగా పాల్గొన్నారు.
ఈతకోట తుక్కేశ్వరరావు అమలాపురం లో అనేక సంవత్సరాలుగా చెప్పులు కుట్టుకుంటూనే మాదిగ హక్కుల దండోరా కోసం కృషి చేస్తున్న వారు. వీరిద్దరి చేతా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
వారి అనుభవాలను మాదిగ కవులు బ్లాగులోపెట్టిన వీడియో ద్వారా వినవచ్చు.
పుస్తకాన్ని సమీక్షిస్తూ డా// కనకయ్య మంచి కవితలను ఎంపిక చేశారనీ, అయితే అనేక కవితల్లో మాదిగల ఆహార విషయాలే ముఖ్యంగా మాంసం, ఎండు తునకలు వంటి పదాలను పదేపదే చెప్పుకోవలసిన అవసరం లేదనీ, మరికొన్ని కొత్త ఆలోచనలతో కవిత్వం రాయాలని సూచించారు.
నేను తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మక మార్పుని తీసుకు రాబోతున్న కవిత్వసంకలనం కైతునకల దండెం అని అభివర్ణించాను. గతంలో మా మాదిగ సాహితీవేత్తలు ఆశించిన రీతిలో నేటికైనా మాదిగహక్కుల దండోరా వాళ్ళు సాహిత్యాన్ని కూడా ప్రచురించడం సంతోషించదగిన పరిణామమని చెప్పాను. కేవలం సామాజిక ఉద్యమాలే కాకుండా, సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు ఏజాతినైనా తాత్త్వికంగా నిలబెడతాయని, ఆ దిశగా ఈ పుస్తకం రావడం వల్ల మాదిగల సాంస్కృతిక అంశాలను వివరించి, మాదిగలను మరింత చైతన్యవంతంగా జీవించేటట్లు చేసే ఆలోచనకు ఇది అంకురార్పణ కాపోతుందని అన్నాను. దీనికి కైతునకల దండెం పేరుపెట్టడంలోనే మాదిగల సాంస్కృతిక చైతన్యాన్ని ముందుకు తీసుకురావాలనే ఆరాటం కూడా కనిపిస్తుందని వ్యాఖ్యానించాను.ఈ పుస్తకంలో కేవలం మాదిగల కవితలే కాకుండా , అనేక కులాల వారి కవితలు ఉండటం, సభలో కేవల మాదిగలే పాల్గొనేటట్లు, మాట్లాడేటట్లు కాకుండా అన్ని వర్గాల వారిని ఆహ్వానించడాన్ని మాదిగల సమైక్యతకు నిదర్శనంగానూ, తమ గురించి మాట్లేడే వారిని, రాసే వారిని, తమని ఆదరించేవారిని ఎప్పుడూ గౌరవించుకుంటామని చెప్పడానికి ఈ సభే నిదర్శనం అని వ్యాఖ్యనించాను. దీని వల్ల మాదిగలు అనైక్యతను కోరుకోవడం లేదనీ, సమైక్యతనే కోరుకుంటున్నారని, అయితే ఆ సమైక్యత ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలని కోరుకోవడాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మాదిగలు చేసేది దళితులను విడదీసే చర్యగా వక్రీకరిస్తున్నారని వివరించాను. మా సమస్యలు ముందు పెట్టడానికి ప్రయత్నించడమే తప్ప మాకే పీఠాలు దక్కాలనేమీ లేదనీ, దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కృపాకర్ మాదిగ, జూపాక సుభద్రలేనని , వాళ్ళు ఈ కవితలను సేకరించడానికీ, పుస్తకంగా తీసుకొనిరావడానికి పడిని శ్రమను కూడా మరిచి పోయి, వాళ్ళు వేదిక పైన కాకుండా, సభలో అందరితోనూ కూర్చున్నారని చూపించాను.
ఈ పుస్తకంలో మాదిగల చరిత్ర,, సంస్కృతి, మాదిగలకు జరుగుతున్న అన్యాయం, ఆ అన్యాయం నుండి వస్తున్న అనుభూతులను, ఆవేదనలను, న్యాయం కోసం పడుతున్న తపనను చూడవలసిఉంటుందన్నాను. మాదిగలు చేసిన ఉద్యమ ఫలితంగా వచ్చిన వర్గీకరణ ఫలాలను సుప్రీంకోర్టు కొన్ని సాంకేతిక కారణాలను చూపి రాజ్యాంగ రీత్యా వర్గీకరణ చెల్లదనడంతో మాదిగల జీవితాల్లో ప్రవేశించిన శూన్యాన్ని, నిస్సహాయతనూ, దిక్కుతోచని తనాన్నీ కూడా ఈ పుస్తకంలో కవిత్వమై పలకరించడాన్ని చూడవచ్చని వివరించాను. తెలుగు సాహిత్యంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాదిగల జీవితాన్నే ఆధారంగా చేసుకొని దళితులను వర్ణించారనీ, అయినా దళితుల్లో అంతర్భాగంగా నే మాదిగలను చూస్తున్నారని, అలా చూడ్డంలో చాలా నిర్లక్ష్యం కనిపిస్తుందని వివరించాను. సాహిత్యంలో దళిత సంస్కృతి అంతా మాదిగ జీవన విధానం చుట్టూనే అలముకున్నా, మాదిగల వృత్తి చిహ్నాలను, సంస్కృతిని వాడుకుంటూనే మాదిగల వేదనను పైకి రానివ్వడం లేదని పేర్కొన్నాను. ఇప్పుడిప్పుడే విశ్వవిద్యాలయ స్థాయిల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలను బట్టి చూస్తే, ఇక పై మాదిగసాహిత్యంలో అంతర్భాగమే దళిత సాహిత్యంగా పరిగణించడం సమంజసమని, ఆదిశగానే మాదిగ సాహిత్యం పేరుతోనే ముందుకు వస్తామని, ఈ కొత్త ప్రతిపాదనను సాహితీ మేధావులు ఆహ్వానించాలని కోరాను. ఈ పుస్తకంలో మాదిగల చరిత్ర, సాంస్కృతిక పరమైన అంశాలను ఆయా కవులు చెప్పేటప్పుడు తమ అనుభవాలను చిలకరిస్తున్నప్పుడు విడివిడిగా అవి స్వతంత్ర అస్తిత్వాన్నీకలిగి ఉంటాయనీ, అయితే అవన్నీ ఇలా పుస్తకరూపంలోకొచ్చినప్పుడు పునరుక్తిలా కనిపిస్తాయని అది మాదిగ కవుల దోషం కాదనీ స్పష్టం చేశాను. అంతే కాకుండ వక్రీకరణకు గురికాబడుతున్న చరిత్రను, సంస్కృతిని కాపాడుకొనే దిశగా ప్రయత్నిస్తున్న మాదిగలు బలవంతంగా తమపై రుద్దిన సాంస్కృతిక అంశాలను, మళ్ళీ ఇప్పుడు మంచివి కాదనడాన్ని తరస్కరించడంలో కనిపించే దిక్కారస్వరాన్ని గుర్తించాలని కోరాను. గొడ్డు మాంసం తినడం వెనుక గల చారిత్రక అంశాలను పరిశోధించవలసి ఉందన్నాను,
ఈ కవితాసంకలనానికి సంపాదకులు రాసిన ముందుమాట మాదిగ సాహిత్యానికి మ్యానిఫెష్టో వంటిదని, మాదిగ సాహిత్యం స్వతంత్ర అస్తిత్వాన్ని కోరుకోవడం వెనుక గల చారిత్రక అంశాలను సోదాహరణంగా వివరించడం జరిగిందని కొన్నింటిని చదివి వివరించాను. మాదిగ సాహిత్యాన్ని ఎవరైనా రాయవచ్చనీ, అయితే మాదిగల హృదయాన్ని ఆవిష్కరించేలా, జీవితం ప్రతిఫలించేలా ఉండాలని ముందుమాటలో ప్రకటించిన విషయాన్ని గుర్తించాలని చెప్పిన అంశాన్ని వివరించాను. మాదిగ సాహిత్య సాంస్కృతిక చైతన్యానికి ఈ కవితా సంకలనం రచయితల్లో పునరుజ్జీవనం తీసుకొస్తుందని ప్రకటించాను.
సభలో పాల్గొన్న షాజహానా కవితల్లో కనిపించే స్త్రీవాద దృక్పథాన్ని విశ్లేషించారు. ప్రాంతీయ కోణంతో కూడా కవితలు ఉంటే బాగుండేదని, అలాగే ముస్లిం రచయితలు కూడా మాదిగల గురించి రాసిన కవితలను తీసుకుంటే మరింత సమగ్రంగా ఉండేదని సూచించారు. తన జీవితంలో ఎదురైన వివిధ సంఘటనలను వివరించారు.
డా//అద్దేపల్లి రామమోహన రావు మాదిగ సాహిత్యాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. ఆచార్య ననుమాస స్వామి కవితలను, గేయ బాణీలతో ఉన్న కవితలను విశ్లేషించారు. సభలో మధ్యమధ్యలో కవులను పిలిపించి మాట్లాడించడం, కళాకారులను పిలిచి పాటలు పాడించడం, వీటితో పాటు మాదిగేతర సాహితీవేత్తలను మాట్లాడించి మాదిగ హక్కుల ఉద్యమాన్నిబలపరిచే వ్యూహంతో సభను జరిపారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన చెప్పులు కుట్టుకొని జీవించే ఈతకోటి తుక్కేశ్వరరావు మాట్లాడుతూ ఇలా తనతో ఒక పుస్తకాన్ని, అదీ హైదరాబాదులో ఆవిష్కరించడాన్ని జన్మలో మరిచిపోలేనని మాదిగ వాడిగా పుట్టినందుకు నా జన్మ ధన్యమైందని అశ్రునయనాలతో స్పందించారు. కారంచేడులో జరిగిన సంఘటన దళితులను, అందులోనూ మాదిగనే ఊచకోత కోసిన మారణకాండను, అప్పుడు జరిగిన సంఘటనల్లో ప్రాణం పోగొట్టుకున్న తన భర్తను తలచుకొని కన్నీటి పర్యంతమైయ్యారు శ్రీమతి సిర్రాసులోచన. ఈ రెండు స్పందనలూ అందరినీ కదలకుండా చేసేశాయి.
ఇలా ఒక చారిత్రక ఘట్టంగా కైతునకలదండెం కవితాసంకలనం ఆవిష్కరణ సభ జరిగింది. మరలా దిగంబర సాహిత్యం ఆవిష్కరణ సభలను గుర్తుతెచ్చేలా ఈ సభ జరిగిందని అక్కడికి వచ్చిన వారంతా అభిప్రాయపడ్డారు.
దీన్ని మన సాహిత్య చరిత్ర కారులు ఎంతవరకూ, ఎలాంటి ప్రాధాన్యతనిస్తూ గుర్తిస్తారో వేచి చూడాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి