"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

26 నవంబర్, 2008

ఇస్లాంనే ఈసడించుకునే ముసలం 'మేధావులు'?!

ఇస్లాంనే ఈసడించుకునే ముసలం 'మేధావులు'?!

(3 నవంబర్, 2008న ప్రచురితమైన 'నలుపు నెలవంక' వ్యాసానికి తీవ్ర ఖండన) ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎస్.మహబూబ్ బాషా 'వివిధ'లో 'నలుపు నెలవంక' పేరుతో ఒక వ్యాసాన్ని వెలువరించడం జరిగింది. సాహిత్య సృజనకు ఆస్కారమిచ్చే అంశాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ ఇస్లాం వాదులుగా లేదా ముస్లిం వాదులుగా తమను తాము అభివర్ణించుకునే కొంతమంది ముస్లిం సాహిత్యకారులు లేదా ఎస్.మహబూబ్ బాషా వంటి ప్రత్యేక వ్యక్తులు పనికట్టుకుని ఇస్లాం, ఇస్లామీయ ఆచరణలకు సంబంధించిన అంశాలనే ఎంచుకొని తమ అపరిపక్వ అధ్యయనంతో, మిడిమిడి జ్ఞానంతో తమ స్వీయ అభిప్రాయాలను ప్రాతిపదికగా చేసుకొని ఇస్లాంను, ఇస్లామీయ ఆచరణలను తప్పుడు రీతిలో వ్యాఖ్యానించే సాహసానికి ఒడిగడుతున్నారు.

ఇస్లాం పట్ల, ముస్లింల ఆచరణల పట్ల స్వయంగా ముస్లింలలోనూ, ముస్లిమేతరులలోనూ పలు అపోహలను సృష్టిస్తూ ఇస్లామీయ ఆదేశాల పట్ల లోతయిన అవగాహన లేని సామాన్య ముస్లింలలో దుష్ప్రభావాలను కలుగజేయడమనేది నేటి సరికొత్త దౌర్భాగ్యం. అసలు 'పరదా' వంటి ఇస్లాంకు సంబంధించిన ఉత్కృష్టమైన అంశం గురించి విమర్శించేందుకు ఎస్.మహబూబ్ బాషాకు ఉన్న ఇస్లామీయ అవగాహన ఏపాటిది? ఇటువంటి మిడిమిడి జ్ఞానంతో వక్రీకరణలకు పాల్పడే ముస్లింల వల్లే ఇస్లాం విషయంలో అపోహలు ప్రబలుతున్నాయి.

ఇక 'నలుపు నెలవంక' అనే మకుటం విషయానికొస్తే 'నలుపు' అనే పదం నల్లని రంగులో ఉండే బురఖాను సూచిస్తే 'నెలవంక' అనే పదం స్త్రీని సూచిస్తుంది. అంటే 'తన అందాలతో మెరిసిపోయే మహిళ నల్లని మబ్బుల చాటున దాగే నెలవంకలా నల్లని బురఖా చాటున మరుగున ఉండడం శోచనీయం' అనే భావాన్ని 'నలుపు నెలవంక' అనే పదబంధం వెల్లడిస్తోంది. అసలు ఈ మకుటమే ఆక్షేపణీయమైనది. అంటే అందమైన స్త్రీ తన అందాలను యదేచ్ఛగా ప్రదర్శించకుండా నల్లని బురఖాలో దాగి ఉంటే ఆమె సౌందర్యాన్ని వీక్షించే భాగ్యానికి నోచుకునేదెలా? అనే పరోక్ష భావం ఇక్కడ వ్యక్తమవుతోంది. అసలు తన భార్యను మాత్రమే కాకుండా పరస్త్రీల సౌందర్యాన్ని సైతం కనులారా వీక్షించాలనే కాంక్ష ఉన్న వ్యక్తే 'నలుపు నెలవంక' అనే పదబంధం ద్వారా తన ఆక్రోశాన్ని (పరస్త్రీ సౌందర్యాన్ని వీక్షించలేకపోతున్నానే... అనే ఆక్రోశం) వెల్లడిస్తాడు.

ఎస్.మహబూబ్ బాషా అనుకుంటున్నట్లుగా ఇస్లాంలోని బురఖా లేదా పరదా వ్యవస్థ నిజమైన ముస్లిం స్త్రీలకు ఒక సమస్య ఎంతమాత్రమూ కాదు. మహబూబ్ బాషా స్వయంగా నిజమైన ముస్లిం స్త్రీలను సంప్రదించి ఈ యదార్థం పట్ల అవగాహనను పొంది ఉంటే బాగుండేది. కానీ ఆ విధంగా జరగకపోవడం శోచనీయం. 'వెధవ ఘోషా' అనే కథ విషయానికొస్తే అసలు 'వెధవ' అనే పదమే ఎంతో ఆక్షేపణీయంగా ఉంది. ఇస్లాంలోని ఉత్కృష్టమైన పరదా వ్యవస్థ పట్ల ఎంతటి చిన్నచూపుతో, హేళనతో కూడుకున్న పదబంధమో గదా ఇది! ఈ కథలో వాస్తవికత లేకపోగా పూర్తి అసంబద్ధత ఉంది. పర పురుషుల చూపుల తాకిడి నుంచి, వ్యాఖ్యల బాణాల నుంచి రక్షణ పొందేందుకై బురఖాను ధరించవలసిందిగా దైవం ఆదేశించిన మేరకు విశ్వాసి అయిన ఒక ముస్లిం స్త్రీ సలక్షణంగా బురఖా ధరిస్తే, రైలెక్కాకయినా బురఖాను తీసివేయవలసిందిగా, లెట్రిన్ వద్ద కూడా పరదా ప్రదర్శనం చేయాలా? అని స్వయంగా ఆమె భర్త ప్రశ్నించడాన్ని పరిశీలిస్తే ఆ భర్త దిగజారుడుతనం వెల్లడవుతోంది.

నిజంగానే బురఖా ధరించడం వల్ల ఆరోగ్య సమస్యలే తలెత్తే పక్షంలో ఇన్ని శతాబ్దాలుగా బురఖాను ధరిస్తూ వస్తున్న ముస్లిం స్త్రీలు బురఖా ధరించడం వల్ల పలు వ్యాధులకు గురయినట్లుగా చరిత్రలో దృష్టాంతాలేమీ లేవేమిటి? ఆ విధంగా వారు వ్యాధిగ్రస్తులయినట్లుగా ఏ వైద్యుడూ చరిత్రలో ఇంతవరకూ నిర్ధారించలేదేమిటి? ముస్లింల చైతన్య ధారను చారిత్రకంగా పట్టుకోవాలని కంకణం కట్టుకున్న ఎస్.మహబూబ్ బాషా మరి ఈ కథను పరిచయం చేస్తూ చారిత్రక దృష్టాంతాలను ఆధారాలుగా పేర్కొనలేదేమిటి? ఆ బాధ్యత ఆయనకు లేదా? ఇక మళ్లీ 'వెధవ ఘోషా' కథ విషయానికొస్తే బురఖా వేసుకుంటే భర్త భార్యనీ, భార్య భర్తనీ గుర్తించలేనంతగా చీకటి ఏర్పడుతుందనే సూచన చేసి ఉండవచ్చని ఎస్.మహబూబ్ బాషా భావిస్తున్నారట.

వాస్తవానికి బురఖా వేసుకున్నంత మాత్రాన భార్య భర్తనీ, భర్త భార్యనీ గుర్తించలేని పరిస్థితుల్లో నేటి ముస్లిం భార్యాభర్తలు లేరనే వాస్తవాన్ని ఎస్.మహబూబ్ బాషా గుర్తెరగాలి. స్వయంగా ముస్లిం అయి ఉండీ ఈ వాస్తవం పట్ల ఆవగింజంత అవగాహన కూడా ఆయనకు లేకపోవడం విచిత్రం. సామాజికంగా 'ముస్లింలు'గా నమోదయి ఇస్లాం ధర్మం పట్ల లోతయిన అవగాహన, అధ్యయనం కొరవడి ఇస్లాంకు, ఇస్లామీయ విశ్వాసాలకు, మహోన్నతమైన ఆచరణలకు దూరమయిపోయి నామమాత్రపు ముస్లింలుగా మిగిలిపోయి, కేవలం అకడమిక్ డిగ్రీలతో ముస్లిం మేధావులుగా, ప్రొఫెసర్లుగా ఎస్.మహబూబ్ బాషా వంటి వ్యక్తులు చలామణీ అవడమే కాకుండా నిజమైన ముస్లింలను, విశ్వాసులను తమ కుత్సిత మేథస్సుతో ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరం.

అయితే ఇందుకు కేవలం ఎస్.మహబూబ్ బాషా మాత్రమే కాకుండా ఇస్లాం వంటి మహోత్కృష్ట ధర్మానికి, దాని బోధనలకు తిలోదకాలివ్వడమే కాకుండా ఇస్లామీయ స్ఫూర్తికి విరుద్ధంగా రచనలు చేస్తూ, పవిత్రమైన ఇస్లామీయ ఆచరణలనే హేళన చేస్తూ, వక్రీకరిస్తూ రచనలు సాగిస్తున్న ముస్లిం వాదులను సైతం నిందించక తప్పదు. వాస్తవానికి బురఖా పట్ల పూర్తిగా నకారాత్మక భావనతో, నిరసనతో కూడిన వైఖరినే ప్రాతిపదికగా చేసుకొని ఈ కథ రచించబడిందే తప్ప ఇందులో పరదా వ్యవస్థ మూలాల్లోకెళ్లి శోధించడం ఎక్కడుంది? బురఖా వల్ల ఘోరాలు జరిగిపోతాయనే వక్రీకరణలతో కూడిన ప్రలోభపూరిత వ్యాఖ్యానాలే తప్ప బురఖా ధారణం వల్ల ఒనగూడే ప్రయోజనాలకు సంబంధించిన పార్శ్వాలను ఈ కథ ఎంతమాత్రమూ స్పృశించలేదు.

మరి ఈ కథ పాక్షిక దృక్పధానికీ, డొల్లతనానికీ తార్కాణంగా నిలుస్తుందే తప్ప వాస్తవిక దృష్టిని ప్రతిబింబించదు. బురఖాను పాటించమని ఖుర్ఆన్ చెప్పలేదనే కఠోర వాస్తవాన్ని కథానాయకుడు తెలియజేస్తాడని పేర్కొన్నారు. 'వెధవ ఘోషా' అనే కథలోని కథానాయకుడు పలికిన మాటలనే ప్రాతిపదికగా తీసుకొని నిజంగానే ఖుర్ఆన్‌లో పరదాకు సంబంధించి, బురఖాకు సంబంధించి ఆదేశాలు లేవని నిర్ధారణకు రావడమే కాకుండా నేటి ముస్లిం సాహిత్యకారులకు ఆ విధంగా నిర్ధారణకు రావలసిందిగా సందేశమివ్వడం విచిత్రం. ఒకవేళ ఎస్.మహబూబ్ బాషాకు ఖుర్ఆన్‌ను స్వయంగా అధ్యయనం చేయడం రాకపోతే ఖుర్ఆన్ పట్ల సమగ్రమైన జ్ఞానాన్ని కలిగియున్న నిష్ణాతుల వద్ద నేర్చుకొని ఉండవలసింది. మహబూబ్ బాషా అపరిపక్వత పట్ల జాలి వేస్తుంది.

ఎంత ప్రొఫెసర్లయినప్పటికీ, ఎన్ని అకడమిక్ డిగ్రీలను ఆర్జించినప్పటికీ లోతయిన అధ్యయనం జరుపకుండానే సాహిత్య సృజనకు, విమర్శకు పూనుకునేందుకు సాహసించడం వల్ల ఇలాగే జరుగుతుంది. ఎస్.మహబూబ్ బాషా గారికి, ముస్లిం వాదులకు, బురఖా వ్యవస్థను తీవ్రంగా నిరసిస్తున్న ఆధునిక ముస్లిం రచయిత్రులకు, కవయిత్రులకు ఈ విషయంలో దిశా నిర్దేశం కావించేందుకై క్రింద కొన్ని ఖుర్ఆన్ వాక్యాలు, సమగ్రమైన అనువాదంతో సహా అందించడం జరుగుతోంది. ఇవాళ ఆచరిస్తున్న ఘోషా/బురఖాను పాటించమని ఖుర్ఆన్‌లో ఎక్కడా పేర్కొనబడలేదని మహబూబ్ బాషా సెలవిచ్చారు.

మరి క్రింద పేర్కొనబడిన ఖుర్ఆన్ వాక్యాల మాటేమిటి? ఖుర్ఆన్ వాక్యాలు: 'వ ఖర్‌న ఫీ బుయూతికున్న వలా తబర్రజ్‌న తబర్రుజల్ జాహిలియ్యతిల్ ఊలా' ('మీ ఇళ్లల్లో నిలిచి ఉండండి. పూర్వపు అజ్ఞానకాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి') (ఖుర్ఆన్, అహ్‌జాబ్ : 33) ఈ ఖుర్ఆన్ వాక్యం ద్వారా స్త్రీ కార్యక్షేత్రం ఇల్లేనని, ఆమె అందులోనే ఉండి ప్రశాంతంగా తన విధులను నిర్వర్తిస్తూ ఉండాలని, అవసరం ఏర్పడినప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని తెలుస్తుంది. అజ్ఞానకాలంలో స్త్రీలు తమ ముఖ సౌందర్యాన్నీ, శారీరక సౌందర్యాన్ని, వస్త్రాలను, ఆభరణాల వైభవాన్ని ప్రదర్శిస్తూ వయ్యారంగా నడుస్తూ తమను తాము అపరిచితుల ముందు, పర పురుషుల ముందు ప్రదర్శించేవారని, ఆ విధంగా విశ్వసించిన ముస్లిం స్త్రీలు వ్యవహరించరాదని పైన పేర్కొనబడిన ఖుర్ఆన్ వాక్యంలో సూచించబడింది.

ఈ ఖుర్ఆన్ వాక్యం ద్వారా స్త్రీలు తమ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ ఇళ్ల నుంచి బయటకు రావడాన్ని అల్లాహ్ వారించినట్లుగా బోధపడుతుంది. 'యా అయ్యుహన్నబియ్యు ఖుల్ లిఅజ్‌వాజిక వ బనాతిక వ నిసాఇల్ ముఅ్‌మినీన యుద్‌నీన అలైహిన్న మిన్ జలాబీబిహిన్న జాలిక అద్‌నా అఁయుఅ్‌రఫ్‌న ఫలా యుఅ్‌జైన వ కానల్లాహు గఫూరర్రహీమా' ('ప్రవక్తా! నీ భార్యలకూ, నీ కూతుళ్లకూ, విశ్వాసుల యొక్క స్త్రీలకూ తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోమని చెప్పు; వారు గుర్తించబడటానికీ, వేధింపబడకుండా ఉండేందుకూ ఇది ఎంతో సముచితమైన పద్ధతి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు') (ఖుర్ఆన్, అహ్‌జాబ్ : 59) ఈ ఖుర్ఆన్ వాక్యంలో 'యుద్‌నీన అలైహిన్న మిన్ జలాబీబిహిన్న' అని పేర్కొనబడింది. పెద్ద దుప్పటిని అరబీ భాషలో 'జిల్‌బాబ్' అని పిలుస్తారు.

'ఇద్‌నా' అంటే 'కప్పుకోవడం' అని అర్థం. కనుక ఈ ఖుర్ఆన్ వాక్యానికి స్పష్టమైన అర్థమేమిటంటే స్త్రీలు తమ దుప్పట్లను సరైయైన రీతిలో కప్పుకొని దానికి చెందిన ఒక భాగం లేదా వాటి కొంగును తమ ముఖాల మీద వేలాడదీసుకోవాలి. విశ్వాసులయిన స్త్రీలు పర పురుషులకు తమ ముఖాలను, శరీరాలను చూపించకూడదని ఆదేశించబడ్డారు. ఇంటి నుంచి అవసరార్థం బయటికి వెళ్లే సమయంలో విశ్వసించిన స్త్రీలు పెద్ద దుప్పటిని శరీరం నిండా కప్పుకొని దానికి చెందిన ఒక భాగాన్ని తమ ముఖాల మీద వేలాడదీసుకోవాలి. తద్వారా దుష్ట స్వభావం గల ఏ వ్యక్తీ వారిని వేధించే సాహసం చేయలేడు.

అలాగే ఆ స్త్రీలు ఉత్తమ స్త్రీలుగా గుర్తించబడతారు. మరి పైన పేర్కొనబడిన ఖుర్ఆన్ వాక్యాలు స్పష్టంగా పరదా వ్యవస్థను, బురఖాను ప్రతిపాదిస్తుంటే ఖుర్ఆన్‌లో ఎక్కడా బురఖా ధరించవలసిందిగా పేర్కొనబడలేదని మహబూబ్ బాషా పేర్కొనడం ఎంతటి దుస్సాహసం! పరదా వ్యవస్థ లేదా బురఖా విధానాన్ని ఛాందసులయిన ముస్లిం పురుషులు స్త్రీలపై బలవంతంగా రుద్దడం జరగలేదు. ఖుర్ఆన్‌లో స్పష్టంగా అందుకు సంబంధించిన ఆదేశాలు పేర్కొనబడి ఉన్న కారణంగానే ముస్లిం స్త్రీలు నిర్బంధపూర్వకంగా కాకుండా ఐచ్ఛికంగా బురఖా ధరించడం జరుగుతోంది.

మరి బురఖాను పాటించమని ఖురాను చెప్పలేదనే కఠోర వాస్తవాన్ని కథానాయకుడు వెల్లడించాడనడం ఎంతటి అవాస్తవమో కదా! ఖుర్ఆన్‌లో తత్సంబంధిత ఆదేశాలు ఉన్న విషయం మహబూబ్ బాషాకు తెలియకపోవడమే శోచనీయం. అమాయకులయిన ముస్లింలను ఖుర్ఆన్‌లో నిజంగానే ఉన్న దైవాదేశాలను లేనట్లుగా పేర్కొంటూ 'వెధవ ఘోషా' వంటి కథలు అల్లుతూ, వ్యాసాలు వ్రాస్తూ ఎస్.మహబూబ్ బాషా వంటి వారు మోసం చేస్తున్నారు, సామాన్య ముస్లిం ప్రజానీకాన్ని అయోమయానికి గురి చేస్తున్నారు. ఇస్లాం ధర్మం ఎన్నటికీ మార్పులూ చేర్పులకు, కాలానుగుణ పునర్వ్యాఖ్యానాలకు అతీతమైన ఘనీభవించిన ధర్మం. అది ఎన్నటికీ ఘనీభవించిన స్థితిలోనే ఉంటుంది.

ఎస్.మహబూబ్ బాషా వంటి సోకాల్డ్ మేధావులు ఆ ఘనీభవన స్థితిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. సామాన్య ముస్లింలకు ముస్లింవాదుల, ఇస్లాంవాదుల జార్గాన్ మాత్రమే కాకుండా ఎస్.మహబూబ్ బాషా జార్గాన్ సైతం అర్థం కావడం లేదు. 'చెరపకురా చెడేవు' అన్న చందంగా ఎస్.మహబూబ్ బాషా తన వ్యాసంలో ముస్లిం సమాజంలో మరొక వివాదానికి అవకాశమిచ్చి నిజమైన ముస్లింలను మనస్తాపానికి గురిచేయడం క్షమార్హం కాదు. నిజంగా ఎస్.మహబూబ్ బాషాకు చిత్తశుద్ధి ఉంటే, వాస్తవాల అధ్యయనం పట్ల అనురక్తి అంటే ఇస్లాం పట్ల, ఇస్లామీయ ఆచరణల పట్ల ఆయనకు గల అపోహలు, సందేహాల నివృత్తికై వైజ్ఞానిక చర్చలో పాల్గొనాలి.

ముస్లింవాదులకు గానీ, ఇస్లాం వాదులకు గానీ ఇస్లాం పట్ల సమగ్రమైన, లోతయిన అవగాహన లేదు. అందుకే ఎస్.మహబూబ్ బాషా 'వెధవ ఘోష'కు సమాధానమే ఈ వాస్తవిక ఘోష. బురఖా లేదా పరదా వ్యవస్థపట్ల మహబూబ్ బాషాకు అంతటి అసహ్యమే ఉన్నట్లయితే అతడు తన కుటుంబ సభ్యులను, బంధువులను పరదాకు దూరంగా నడిపించుకునే దౌర్భాగ్యానికి పాల్పడితే అది అతడి ఇష్టం. కానీ ముస్లిం సమాజపు మహిళలందరికీ పరదాను విడనాడవలసిందిగా సందేశమివ్వడం సరైంది కాదు.

గమనిక :
నవంబర్ 3, 2008 నాటి 'వివిధ'లో ప్రచురితమైన 'నలుపు నెలవంక' వ్యాసంలోని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని ముస్లిం పాఠకులు అనేకమంది తెలియజేశారు. వ్యాసం ప్రచురణ కారణంగా మనస్తాపం చెందిన వారందరినీ 'ఆంధ్రజ్యోతి' మరొకసారి క్షమాపణ కోరుతున్నది.
-ఎడిటర్

-అఫ్రోజ్ అహ్మద్
( ఆంధ్ర జ్యోతి సౌజన్యంతో ... )


Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

4 కామెంట్‌లు:

విరించి చెప్పారు...

ఇస్లాం గురించి చాలా రాసారు. హిందూ మతం లో ఉన్న కొన్ని మంచి విషయాల గురించి మీరేమన్నా వ్రాసారా అండి. ? ఈ పాటికే ఉంటే లంకె ఇవ్వ గలరు.

vrdarla చెప్పారు...

విరించి గార్కి,
అయ్యా! మీ కామెంట్ ఎవరికి చెందుతుందో నాకు సరిగా అర్ధం కాలేదు. ఎందుకంటే ఆ వ్యాసాన్ని రాసింది నేను కాదు. కానీ ఒక అకడమిషియన్ గా దాన్ని పునర్ముద్రించాను. అంతే. మీరు వ్యాసాన్ని లోతుగా చదివితే దానిలో సమకాలీన సాహిత్యంలో జరుగుతున్న, అదీ ముఖ్యంగా ముస్లిం వాదంలో వస్తున్న అనేక విషయాల చర్చ కనిపిస్తుంది. మరీ ముఖ్యమైంది బురఖా విషయం. ముస్లిం రచయితలలోనే బురఖా పట్ల భిన్న అభిప్రాయాలు ఉన్నాయని ఈ వ్యాసాన్ని బట్టే తెలుస్తుంది. కనుక ఇది విద్యార్ధులకు, విద్యవేత్తలకు మరింత అవగాహన కలగడానికి దోహదపడుతుందని భావించి ఇక్కడ ప్రచురించాను. అంతే తప్ప ఆ వ్యాసంలోని విషయాల పట్ల అనుకూలత గానీ, వ్యతిరేకత గానీ నాకేమీ లేదు. ఇక , హిందూ మతం గురించి మీరేమైనా రాశారా? అని అడిగిన ప్రశ్న మాత్రం చాలా విలువైంది.అది నన్నే అడిగితే దానికి నేను సమాధానం చెప్తాను. నన్ను కాక పోతే దానితో నాకు సంబంధం లేదని భావిస్తాను.
మీకు ఈ వివరణతో ఈ వ్యాసం మల్ళీ ఇక్కడ ఎందుకు ప్రచురించానో అవగాహన అయి ఉంటుందనుకుంటున్నును.
మీ
దార్ల

venkatoons చెప్పారు...

darla garu
sampradayalu konasaagutune untai.

చదువరి చెప్పారు...

మొత్తానికి ఆంధ్రజ్యోతి కాళ్ళబేరానికి వచ్చింది!