Tuesday, September 02, 2008

తెలుగు దళిత కథాపరిణామం


-డా//దార్ల వెంకటేశ్వరరావు
తెలుగులో దళిత సాహిత్యం కవిత్వం, కథ, నవల, నాటకం, పాట, విమర్శ తదితర ప్రక్రియలతో పరిపుష్టిగానే వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, దళిత సాహిత్యం ప్రక్రియాపరంగా కూడా ఎంతో వైవిధ్యాన్ని చాటుతోంది. ప్రజలతో, ప్రజల ఆకాంక్షలతో ప్రత్యక్ష సంబంధాల ప్రతిఫలనం కూడా దళితసాహిత్యంలో కనిపించే విశిష్టతల్లో ఒకటి. విప్లవ సాహిత్యనంతరం తమ సమస్యల కోసం ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాలు నడిపి, ఆ భావాలను సాహిత్యంగా సృజనీకరించే సాహిత్య దృక్పథం దళిత సాహిత్యంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి దళిత సాహిత్యం వర్తమాన సాహిత్యంలో ‘ఉద్యమ’ స్థాయిని పొందింది. చాలామంది ‘దళితులు’ చేసే ఉద్యమాలను దళిత ఉద్యమాలుగాను , దళితకవులు, కథకులు రాసే సాహిత్యాన్ని దళిత సాహిత్యవాదంగానూ పిలుస్తున్నారు.
సాహిత్య పరిభాషను వాడటంలో కొంతమంది ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో, మరికొంత మంది అంత జాగరూకతతోనూ వ్యవహరిస్తుంటారు. మార్కిస్టులు, అంతకుముందే సంప్రదాయవాదులు దళితసాహిత్యాన్ని ‘ఉద్యమం’ గా గుర్తించడానికి అంగీకరించలేకపోతున్నారు. అయితే, సాహిత్యంలో వాదం, ధోరణి, ఉద్యమం మొదలైన పారిభాషిక పదాలను వాడటంలో చాలా జాగ్రత్త అవసరం. ‘వాదం’ లో తాత్త్విక దృక్పథం కంటే, తమ ఆశలను, ఆశయాలను వినిపించడమే ప్రధానమవుతుంది. అందులో తాత్త్విక నేపథ్యం ఉన్నా లేకపోయినా పెద్దగా నష్టం లేదు. అది కొన్నిసార్లు కొన్ని తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తుంది. తార్కిక నిరూపణల తో ముడిపడి ఉంటుంది. కానీ, ఉద్యమంలో స్పష్టమైన ప్రణాళిక, లక్ష్యం, తాత్త్విక నేపథ్యం, దృక్పథం మొదలైవి ఉంటాయి. దళిత సాహిత్యానికి " దళిత పాంథర్స్" (1971) నుండే ఒక ప్రణాళిక ఉంది. కుల నిర్మూలన లక్ష్యం ఉంది. వర్ణాశ్రమ ధర్మాలపై నిర్మితమైన భారతీయ సమాజం, వివిధ మతాల ప్రభావాలు వంటి నుండి శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక క్షోభలను, అవమానాలను ఎదుర్కొన్న జాతులు ప్రధాన జీవన స్రవంతిలోకి రావాలనే నేపథ్యం ఉంది. డా//బి.ఆర్. అంబేద్కర్, జ్యోతి బాపూలే,పెరియార్ రామస్వామి నాయకర్ మొదలైన వారి భావజాలం అర్థం చేసుకుంటే గాని ఇవన్నీ అవగాహనలోకి రావు. ఆ దృక్పథంతో తెలుగు దళిత సాహిత్యాన్ని చూస్తే గాని తెలియదు. అలా చూడగలిగినపుడు " దళిత సాహిత్యం" వాదమో, ఉద్యమమో స్పష్టమవుతుంది.
బహూశా, నిర్వాహకుల దృష్టిలో ఈ తాత్త్విక దృక్కోణాన్ని అంతా సోదాహరణంగా ‘ తెలుగు దళిత కథలు’ ద్వారా నిరూపించమనే ఉద్దేశంతో ‘ వాదం’ అని తార్కిక నిరూపణతో ముడిపెట్టారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సదస్సులో ‘ ఆధునిక సాహిత్య దృక్పథాలను’ వినిపించేటట్లు లేదా పున: సమీక్షించుకొనేటట్లు ప్రణాళికను రూపొందించారు. దీనిలో భాగంగానే నేమో ‘ స్త్రీ వాదం’, ‘ ముస్లిం వాదం’ అంటూ పత్ర సమర్పణను నిర్దేశించారు. కనుక, ‘ దళిత వాదం’ అనే పారిభాషిక పదాన్ని ‘ దళిత సాహిత్య ఉద్యమం’ అనే విస్తృతార్థంలో అవగాహన చేసుకోవాలని కోరుతూ, ఆ అవగాహనతోనే ఈ పత్రాన్ని సమర్పిస్తున్నాను.
ముందుగా తెలుగు కథ ఎప్పుడు ప్రారంభమైందీ, అలాగే దళిత కథ ఎప్పుడు ప్రారంభమైందీ మొదలైన ప్రశ్నలకు సమాధానాని అన్వేషిస్తూ ఈ పత్రాన్నిముందుకి తీసుకొని వెళ్ళ వలసిన అవసరం ఉంది.అప్పుడే దళిత కథా పరిణామాని అవగాహన చేసుకోగలుగుతాం. సందర్భాన్ని బట్టి దాన్నీ వివరిస్తాను. నిజానికి స్వాతంత్ర్యానికి ముందూ, తరువాతా కూడా తెలుగులో"దళితుల" గురించి చాలామంది కథలు రాశారు. భార్గవీరావు గారు’ ఇంకానా ఇక పై చెల్లదు’( ) పేరుతో కొన్ని కథలను సంకలనంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత డా//ఆర్. చంద్రశేఖర్ రెడ్డి డా//కె.లక్ష్మీనారాయణల సంపాదకత్వంలో ‘దళిత కథలు’ (1996) పేరుతో విశాలాంధ్ర వారు ఒక కథా సంపుటిని ప్రచురించారు . దీనిలో తీసుకున్న కథలు దళిత కథలు కావని ఆ సంకలనం బయటికి వచ్చిన తర్వాత చాలా మంది విమర్శించారు. దానికి కారణం ఆ సంకలనం లో ‘ దళితుల’ గురించి రాసిన కథలు ఉన్నాయి గానీ, ‘దళితజాతుల’ గురించి కొన్ని కథలే ఉన్నాయి. దళిత రచయితల రచనలకంటే, దళితేతర రచయితల రచనలే ఉండటం ఈ విమర్శకు ఒక కారణం. ఇలాంటి విమర్శ వచ్చినా కానీ, కాలక్రమంలో దళితకథా పరిణామాన్ని తెలుసుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడున్నాయి. ఆపుస్తకాల తరువాత డా//కె. లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో దళిత కథల పేరుతో 8 సంపుటాలు వెలువడ్డాయి. వాటిలో దళితులు అనుభవించిన అనేక సమస్యలను గుర్తించే అవకాశం కలిగింది. వాటితో పాటు ఇంకా చాలా సంకలనాలు వచ్చాయి.ఇంకా రావలసినవి అనేకం ఉన్నాయి. చాలా కథలు పత్రికల్లో ప్రచురణ పొందాయి. నేటికీ కొన్ని పత్రికల్లో దళితకథలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. వీటితో పాటు ఆయా రచయితలు తాము ప్రచురించాలనుకుంటున్న కథా సంపుటాల్లోనూ కొన్ని కథలు ఉన్నాయి. ఈ కథలన్నింటినీ చూస్తే దళిత కథల్లో కింది పరిణామాలు స్పష్టమవుతాయి. కనుక, దళిత కథల్లో ‘దళితవాదానికి’ ప్రాతినిధ్యమనదగిన కొన్ని కథలను పరిశీలించడం ద్వారా తెలుగులో వచ్చిన ‘దళిత కథ’ స్వరూప స్వభావాలు , పరిణామం తెలిసే అవకాశం ఉంది. ఈ పరిధి లో నా పత్రాన్ని సమర్పిస్తున్నాను.
సంస్కరణోధ్యమ ప్రభావంతో గురజాడ ‘దిద్దుబాటు’ (1910) కథానిక ప్రారంభమయ్యింది. ఇది దళిత కథ కాదు. కానీ సంస్కరణోద్యమ ప్రభావంతోనే వెలువడిందని చెప్పవచ్చు. దళితుల సమస్యలు కూడా సానుభూతితో స్వీకరించిన సహృదయతను అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది. ఇంత చెప్పినా గురజాడ వారి దిద్దుబాటు కథానికలో దళితుల గురించేమీ లేదు. 1925 లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ‘ పుల్లంరాజు’ కథ రాశారు. ఆ తరువాత 1931 లో ‘సాగర సంగమం’, ఇలాంటి తవ్వాయి వస్తే, (1934 ) అనే కథలను కూడా ఆయనే రాశారు. వీటిలో ఆయన దళితుల మధ్య గల అనైక్యతనూ, దళితుల మతాంతరీకరణను చిత్రించారు. ఆ తరువాత దళితేతరులు రాసిన దళితకథల్లో దళితుల పట్ల సానుభూతి వ్యక్తమవుతుంది. అయినా గానీ జాతీయోద్యమం కోసం గాంధీ నడిపిన ‘హరిజనోధ్ధరణే ‘ వీటిలో ప్రధానంగా కనిపిస్తుంది. ‘మాల - మాదిగ’ మొదలైన షెడ్యూల్డు కులాల్లోని ఉప కులాలాను కలిపి ‘ హరిజనులు ‘ అనిపిలుస్తూ రాసిన కథలు అనేకం వచ్చాయి. ‘హరిజన ‘ సమస్య లోతులు తెలియకుండా రాసిన కథలు కూడా చాలానే వచ్చాయి. చలం రాసిన ‘హరిజన సమస్య’, ‘మాదిగమ్మాయి ‘ మొదలైన కథలన్నీ ఈ కోవలోనే చెప్పుకోవచ్చు. అడవి బాపిరాజు గారు రాసిన ‘నరసన్నపాపాయి ‘ (1954) కథ, దళితుల దేవాలయ ప్రవేశ నిషేధాన్ని నిరసిస్తూ, వాళ్ళు కూడా మనుషులేననీ, చదువుకున్న దళితేతరులు దళితులతోసంస్కరణ భావాలతో మెలిగే వారని స్పష్టం చేస్తుందీ కథ.దళితుల సమస్యలను ముఖ్యంగా అస్పృశ్యత, నీటి సమస్య, రాజకీయాధికారం, వృతి వల్ల వచ్చే అనారోగ్యం, వృత్తులు మారి చదువుకున్నా, కులపీడన మరో రూపంలో ప్రవేశించిన పరిస్థితులను వర్ణిస్తూ దళితేతర కథా రచయితల నుండి అనేక కథలు వచ్చాయి. వర్ణాంతర వివాహాలు, గ్రామాల్లో భూస్వామ్య పెత్తందారీ విధానాల వల్ల దళితులు పడుతున్న ఇబ్బందులను వర్ణించిన వారూ ఉన్నారు. ఈ దళిత కథా పరిణామాలను వివిధ వ్యాసాల్లో, గ్రంథాల్లో ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ఆచార్య ననుమాసస్వామి, నిఖిలేశ్వర్, బి.ఎస్.రాములు, గుడిపాటి తదితరులు వివరించే ప్రయత్నం చేశారు. వాటిలో 1934 నుండి 1968 వరకూ దళిత కథలకు ప్రాథమిక స్థాయిగా ఆ విమర్శకులు గుర్తించారు. ఈ కాలంలో దళిత సమస్యలను దళితేతరులు రాశారనీ నిఖిలేశ్వర్ ( తెలుగు కథ : దళితవాదం1996:63) అన్నారు. "1969 నుండి 1980 మధ్యలో మాల- మాదిగల మధ్య సమష్టి పోరాట స్థాయి లేదు. ఆ పోరాటాలు ముందుగా దళితుల్లో ఏర్పడాలని ఉద్బోధిస్తూ కథలు రాశారు. అప్పటికే నక్సల్బరీ - శ్రీకాకుళ పోరాటాలు వచ్చినా రచయితలు వాటిని పట్టించుకోలేదు" అని కూడా నిఖిలేశ్వర్ వ్యాఖ్యానించారు. 1990 నుండి 1995ల మధ్యలో దళితుల పై జరిగిన దాడుల వల్ల ప్రతిఘటన చైతన్యం వచ్చినా, అది ఆ కథల్లో ప్రతిఫలించలేదన్నారు. ఈ నేపథ్యంతో పరిశీలించినప్పుడు దళితులు, దళితేతరులు దళితకథలను రాశారనీ, అందులో భిన్న కోణాలు ప్రతిఫలించాయని తెలుస్తుంది. దీనిలో భాగంగానే దళిత సంస్కృతిని తెలిపే కథలు కూడా వచ్చాయి. ఎండ్లూరి సుధాకర్ గారి ‘ మల్లె మొగ్గల గొడుగు’ మాదిగ కథలు (1997)లో, నాగప్ప గారి సుందర్రాజు గారి (1968 - 2000) ‘ మాదిగోడు’ కథల (1997లో మాదిగ జీవితాల్లోని అనేక కోణాలు వర్ణితమయ్యాయి. ‘జాంబవంతుడూ - పిచ్చిమామ’, ‘ ఆరంజోతి’ కథలలో ఎండ్లూరి సుధాకర్ గారు మాదిగ జీవితాలకున్న పౌరాణిక వారసత్వాన్ని కొనియాడుతూనే అందులో ఉన్న కుట్రను పసిగట్టేటట్లు రాశారు. తెలుగులో వచ్చిన తొలి ‘దళిత ఆత్మకథలు’ గా వీటిని చెప్పుకోవచ్చు. నాగప్ప గారి సుందర్రాజు ‘ ‘ మాదిగోడు’ కథల ద్వారా మాదిగ సంస్కృతి, భాషలన్నింటినీ రాయలసీమ ప్రాంతం నుండి చూపించారు. కొలకలూరి ఇనాక్ గారు ‘ పొట్ట పేగులెబ్బింది గోడు’ కథలో మాదిగ సంస్కృతిని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. లోతుగా పరిశీలిస్తే ఇనాక్ గారు దళిత కథకు తాత్త్విక దృక్పథాన్ని సమకూర్చ గలిగారి నిరూపితమవుతుంది. ఆయన రాసిన ‘ తాకట్టు ‘, ‘ కులవృత్తి’ మొదలైన కథలలో దళిత తాత్త్విక దృక్పథం వ్యక్తమౌతుంది. ‘ గొడ్ల దొంగ’ కథలో మాదిగల పై జరిపే అగ్రవర్ణ భూస్వాముల దురాగతాలు వర్ణితమయ్యాయి. 1969 లో కొలకలూరి ఇనాక్ గారు రాసిన ‘ ఊరబావి’ కథలో వ్యవస్థ కోసం వ్యక్తి చేసిన సాహసం వెల్లడవుతుంది. అగ్రవర్ణ చాణక్యనీతిని దళిత స్త్రీ తిప్పికొట్టిన వైనం కనిపిస్తుంది. దీన్ని దళిత జీవితాన్ని స్పృశిస్తూ రాసిన మొట్ట మొదటి దళిత కథగా ననుమాసస్వామి, బి.ఎస్.రాములు మొదలైన కథా విమర్శకులు భావిస్తున్నారు.కొలకలూరి ఇనాక్ గారు ప్రజాసాహితి మాస పత్రికలో రాసిన ‘ కులవృతి’ (2006) కథ కొంత వివాదాస్పదమైంది. ఆ పత్రికలోనే రచయిత కథకు సంబంధించిన స్పందనను కూడా ప్రకటించారు. అన్ని వృత్తులు గౌరవింపబడుతున్నా మాదిగ కులవృత్తి సమజ గౌరవానికి నోచుకోవడం లేదనే ఆవేదన ఈ కథలో ప్రధానంగా కనిపిస్తుంది. స్వామి ‘ తల్లిమాట’ (1990), సింగమనేని నారాయణ ‘ మకరముఖం’ (1995) మొదలైన కథల్లో దళితులు తమ కులాన్ని చెప్పుకోవడానికి వెనుకాడుతున్నారని వివరించారు.
ఎస్సీ వర్గీకరణ నేపథ్యంతో కూడా కొన్ని దళిత కథలు వచ్చాయి. పైడి తెరేష్ బాబు రాసిన ‘ అనుబంధ ప్రశ్న’ (1996) కథ అగ్రవర్ణాల వారు దళితుల్ని విడగొట్టేందుకే వర్గీకరణ సమస్యను పైకి తెచ్చారని వివరిస్తుంది. ఈ నేపథ్యం తోనే మరి కొంతమంది కూడా కథలు రాశారు. జూపాక సుభద్ర, గోగు శ్యామలల సంపాదకత్వంలో ‘ నల్ల రేగటి సాల్లు’ కథలు (2006) వెలువడ్డాయి. దానిలో మాదిగ ఉపకుల స్త్రీల జీవితాల్లోని కొత్త కోణాలు చిత్రితమయ్యాయి. జూపాక సుభద్ర, గోగు శ్యామల మొదలైన రచయిత్రులు తెలంగాణ భాష లో చక్కని నుడికారంతో కథలు రాస్తున్నారు. దళిత కథల్లో కనిపించే మరొక ధోరణి దళితులు క్రైస్తవులుగా, మంస్లింలుగా మారటాన్ని వివరించారు. స్వాతంత్ర్యానికి పూర్వం హిందూ మతంలో దళితుల పై ఉన్న నిర్బంధాల కారణంగా దళితులు ఇతర మతాల్లోకి వెళ్ళారని వర్ణించారు. స్వాతంత్ర్యానంతరం కూడా ఈ ధోరణీతో కొన్ని కథలు వచ్చాయి. కొలకలూరి ఇనాక్, ప్రసాదరావు తదితరుల కథల్లో ఇలాంటి ఇతివృత్తం కనిపిస్తుంది. అయితే, క్రైస్తవ మతంలోకి వెళ్లిన తర్వాత దళితుల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయాలను ధారాగోపి ‘ గుడిసె ఏసోపు’ కథలలో వర్ణించారు. క్రైస్తవులలో కొంతమంది దళితులను దోచుకుతింటున్న వైనాన్నిఈ కథల్లో వర్ణించ గలిగారు. చిలుకూరి దేవ పుత్ర ‘ బంది ‘ కథలో క్రైస్తవ మతం, దళితులలో క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించే వారి పట్ల వ్యవహరించే తీరుతెన్నుల్ని వివరించారు. బోయ జంగయ్య గారి ‘పనిష్మింట్’ కథలో అగ్రకుల ఎం.ఎల్.ఏ., గిరిజన స్త్రీ శీలాన్ని దోచుకోవడం, తదనంతరం జరిగే కోర్టు వ్యవహారాలు, దళితులకున్న భూమిని కోల్పోవడం మొదలైన అంశాల్ని వర్ణించారు. ప్రజా ప్రతి నిధులు దళితుల పట్ల వ్యవహరించే తీరుని ఈ కథ కళ్ళకు కట్టినట్లుగా చూపుతుంది. ఈయనే రాసిన ‘ బంచరాయి’ ‘ ఇంకానా ఇక పై సాగదు’ కథలలో భూమి సమస్య, సమ్మె ప్రభావం మొదలైన దళిత సమస్యలను వర్ణించారు.
దళిత కథలను మరింత లోతుగా పరిశీలించినపుడు దళిత స్త్రీ వాదానికి సంబంధించిన అంశాలను గోగు శ్యామల, జూపాక సుభద్ర, జె. గౌరి, కొలకలూరి స్వరూపారాణి మొదలైనవారు తమ కథల్లో చూపే ప్రయత్నం చేశారు. ‘ దళిత స్త్రీ’ అని పేరు పెట్టి రాయక పోయినా, ఉద్యోగినిగా స్త్రీ ఎదుర్కొనే మానసిక హింస వెనుక కులాధిపత్య భావజాలం ఉందని తెలిపే కథలను ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి ‘ నీకూ నాకూ నడుమ’, ‘ వెండి కిరీటం’ కథా సంపుటాల్లో చూడవచ్చు. ఇంచుమించు ఇదే నేపథ్యంతో డా.వి. చంద్రశేఖరరావు గారు ‘ నలుపు ‘ అనే కథ రాశారు. సదానంద శారద రాసిన ‘ ఉప్పునీళ్ళు’, స్వామి రాసిన ‘హెచ్. సరస్వతి ‘ కథలు విద్యాలయాల్లో దళిత బాలికలు, స్త్రీలకు జరిగే అవమానాలను వర్ణిస్తాయి. దళిత సౌందర్యాన్ని దళిత స్త్రీకోణంలో ‘ నలుపు’ కథను కాలువ మల్లయ్య గారు రాశారు. ఇలా దళితులు అస్పృశ్యత వల్ల మానసికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా కోల్పోతున్న జీవితాలను చాలా వరకూ ఆయా రచయితలు ఆయా కథల్లో చూపించగలిగారు.
దళిత కథల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుందని పైన పేర్కొన్న కొన్ని కథలను చూసినా తెలుస్తుంది. అయితే స్వామి, సింగమనేని నారాయణ మొదలైన వారు దళితుల గురించి కథలు రాసినా, దళితులు తమ కులాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారనే ఆలోచన కలిగిస్తాయి. కానీ,దళితుల ఆ మానసిక కోణాలను మరింతగా పట్టుకోవలసిన అవసరం ఉంది. సామాజిక పరిస్థితులను మరింతగా చిత్రించవలసి ఉంది. దళిత జీవిత లోతులు మరింతగా తెలిస్తే అలాంటి వాటిని సరిగ్గా రాయగలిగి ఉండేవారెమో! లేకపోతే దళితులలోని ఆ కోణాన్ని కూడ చెప్పాలనే ఆలోచంతో కూడా అలాంటి దృష్టిని ప్రదర్శించి ఉండవచ్చు. కొలకలూరి ఇనాక్, ఎండ్లూరి సుధాకర్, బోయ జంగయ్య, అల్లం రాజయ్య గారలు తాత్త్విక, సాంస్కృతిక, ఆర్థిక కోణాలను వారి కథలో చూపడంలో నిజమైన దళిత జీవితం కనిపిస్తుంది. దళితులు రాసిన కథల్లో సమస్యను చెప్పడంతోపాటు, ఆ సమస్య వెనుకున్న అనేక కారణాలను చెప్తూనే, వాటిని అధిగమించే తత్వం బాగా వ్యక్తమవుతుంది. అయినా, దళితులు కూడా ‘ మాల - మాదిగల ‘ మధ్య ఉండే సమస్యలకు అగ్రవర్ణాల వారే కారణమని అనడంలో కొంత వాస్తవం ఉన్నా, అదే పరిపూర్ణ సత్యం అనుకోవడానికి వీల్లేదు. దళితులు కథలు రాయని లేదా ఆ పరిస్థితుల్లో ఏదొక దృష్టితో దళితుల గురించి కూడా దళితేతరులు కథలు రాసారని, అది ఒక సామాజిక,సాహిత్య పరిణామాన్ని అర్థం చేసుకోవడాని దోహదపడుతుందని ఆ కథలను కూడా స్వాగతించవలసిందే.ప్రస్తుతం సాంస్కృతిక కోణాల నుండి కూడా కథలను చిత్రించవలసిన అవసరం ఉంది. దళితులు ఎదుర్కొంటున్న ప్రాంతీయ సమస్యలను చిత్రించాలి.ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్న ఈ తరుణంలో దళితుల మనోభావాలను కథలుగా వర్ణించవలసి ఉంది. ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల గానీ, రాకపోవడం వల్ల గానీ, దళితులకు కలిగే ప్రత్యేక ప్రయోజనాలేమిటో వివరించే కథలు రావలసిన అవసరం ఉంది.అలాగే దళితుల్లో రిజర్వేషన్లు పొందిన, పొందని వర్గాల మధ్య సంఘర్షణను, గ్రామీణ, పట్టణ, చదువుకున్న తరం , చదువు కోసం ఎదురు చూసే తరాల మధ్య అంతరాలనూ వర్ణించవలసి ఉంది.మొత్తం మీద దళిత కథ జీవిత వాస్తవాల ను కథనీకరించే దిశగానే వెళ్తుందని భావించవచ్చు.
( నా ఈ వ్యాసాన్ని ప్రాణహిత http://www.pranahita.org/2008/08/telugu_dalita_katha_parinamam/ మాసపత్రిక ఆగష్టు 2008 లో ప్రచురించింది. )

No comments: