"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

30 మే, 2008

భౌతిక దాడులను ఖండిద్దాం!ఆత్మగౌరవ పోరాటాలకు విలువనిద్దాం!!

ప్రియమైన బ్లాగు మిత్రులారా!
ఆంధ్రజ్యోతిలో వచ్చిన "బాడుగనేతలు" కథనం కొన్ని చారిత్రక అవసరాల దృష్ట్యా నాబ్లాగులో భద్రపరిచాను. దాన్ని చూసి మన బ్లాగర్లు కూడా కొంతమంది ప్రజాస్వామిక పద్ధతుల్లో తమ వ్యాఖ్యలు చేశారు. అన్నింటినీ కాక పోయినా, నా దృష్టి కొచ్చిన కొంతమంది మన బ్లాగర్ల వ్యాఖ్యలు వారి బ్లాగుల సౌజన్యంతోనే నాబ్లాగులో పెడుతున్నాను. వాటిని పెట్టేముందు, ఆ కథనం పట్ల నా అభిప్రాయాలను కూడా వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తున్నాను.
1.కోట్లాది ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ప్రాస కోసమో, ప్రాపకం కోసమో ... మరో దాని కోసమో వెంపర్లాడే శీర్షకలను పెట్టేటప్పుడు పాత్రికేయులు జాగ్రత వహించాలి. " బలహీన వర్గాలు, షెడ్యూలు కులాలు, తెగల ఆత్మ గౌరవ ఉద్యమాలు... కొందరు రాజకీయ ఊసరవెల్లుల నాయకత్వంలోకి వెళ్ళాయి.... కులాల ఆత్మ గౌరవ పోరాటాన్ని అధికార పీఠానికి బలిచేశారు... " ఇలాంటి వ్యాఖ్యలు ఆ న్యూస్ ఐటమ్‌ లో చాలానే ఉన్నాయి. ఇలాంటివి నిజానికి ఇవి కేవలం ఎస్.సి., తదితర బడుగు బలహీన కులాల్లోనే జరగడం లేదు. రాజకీయాలు, కొన్ని సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇంచి మించి అన్ని వర్గాలు, కులాలు ఇలాంటి వాటిని అనుసరిస్తూనే ఉంటాయి. కాకపోతే వాటిని కొందరు బహిరంగం గాను, మరికొందరు రహస్యం గానూ అమలు చేస్తుంటారు. ఆ మధ్య కేంధ్ర స్థాయిలో ఒక రాజకీయ ఉన్నత పదవిని నిలబెట్టుకోవడం కోసం ముడుపుల వ్యవహారం జరిగిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఒక పార్టీలో ఉండి మరో పార్టీ మెప్పుకోసం ఎలాంటి ప్రకటనలు వస్తున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. మరి వాటి్నేమనాలి? ఇంకా ఇలాంటి వెన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడిప్పుడే సామాజికంగా అభివృద్దిలోకి వస్తున్న వర్గాలను సామూహికంగా కించపరిచే వ్యాఖ్యలతో కూడిన న్యూస్ ఐటం రాయడాన్ని ముందుగా ఖండిస్తున్నాను.
2. ప్రత్యక్షంగా మందకృష్ణ మాదిగ ఆ దాడిలో పాల్గొనక పోయినా, ఆంధ్రజ్యోతి ప్రచురించిన బాడుగనేతల కథనాన్ని చదివి మాదిగ రిజర్వేషన్‌ పోరాటసమితి కార్యకర్తలు లేదా ఆ పేరుతో, లేదా అదే అదనుగా మరొకరు గానీ, ఆంధ్రజ్యోతి కార్యాలయం పై భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదు. ప్రజాస్వామిక పద్ధతుల్లో తమ నిరసనను తెలిపితే, ఆ వార్తాకథనం పై మరింత చర్చ జరిగేది. ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి చేయడం విచారకరం!
3. ఆ వార్తా కథనం అనంతరం, అంటే మర్నాడు ఒక టి.వి. న్యూస్ చానల్ లో ప్రత్యక్షంగా సుమారు రెండు గంటలు పాటు మందకృష్ణ మాదిగను ఆ సంఘటన పట్ల కనీసం విచారాన్ని వ్యక్తం చేయమని ఒత్తిడి చేశారు. అనేక మంది చేత ఫోనులు చేయించి ఒత్తిడి చేయించారు. ఆనాడు మందకృష్ణ మాదిగ అనుభవించిన మానసిక హింసను గురించి ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమనిపిస్తుంది. అంతే కాదు, ఆ రోజు ఆంధ్రజ్యోతి ప్రచురించిన బాడుగనేతల కథనం గురించి గానీ, దానిలోని వాస్తవాలు అవాస్తవాల గురించి గానీ చర్చించకపోవడం వల్ల, ఆ చర్చకూడా ఏక పక్షంగానే కొనసాగిందని నా అభిప్రాయం. అయినా, ఆనాటి విజేత మందకృష్ణ మాదిగే!
4. ''బాడుగనేతల'' కథనం అనంతరం కొంతమంది దళితనేతలు (?) కూడా ఆ పత్రికలోవచ్చిన వార్తను ఖండించకపోగా, దాడి గురించి మాత్రమే మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి.(బహుశా, మిగతా విషయాలు మాట్లాడినా వాటిని ప్రచురించారో లేదో వాళ్ళకే తెలియాలి.) ఇది ఒక విధంగా దళిత నేతలుగా చెప్పుకొనే వారికి గల దళిత తాత్త్వికతను ప్రశ్నార్థకం చేయడం, లేదా మాదిగ రిజర్వేషన్‌ పోరాటం పట్ల గల వ్యతిరే్కతను మరింతగా వ్యక్తం చేయడమని నా అభిప్రాయం.
5. దాడి గురించి మాట్లాడిన వారు అత్యధికులు పాత్రికేయులే. వారే ఆ వార్తాంశం పట్ల కూడా మాట్లాడితే మరింత ప్రజాస్వామికంగా ఉంటుంది కదా! అప్పుడు వారి ఉద్యోగాలు ఉంటాయా?! అందుకేనేమో.. ఆ దాడిని మందకృష్ణ మాదిగ, అది పాత్రికేయులపై దాడి కాదనీ, యాజమాన్యం పై దాడి అనీ ఆవేదన చెందాడనుకోవాలా?
ఏది ఏమైనా భౌతిక దాడులను ఖండిద్దాం!
అంతకంటే ముందు ఆత్మగౌరవ పోరాటాలకు విలువనిద్దాం!!
-డా//దార్ల వెంకటేశ్వరరావు
30-5-2008

4 కామెంట్‌లు:

Chaks చెప్పారు...

దార్లగారు: ఈ టపా మీద నా అభిప్రాయాలు.
విమర్శలకి ఎవరూ అతీతులుకారు. మొన్నామధ్య నెహ్రూకి, భారత చివరి వైస్రాయ్ అనుకుంటా(సరిగా గుర్తులేదు), ఆయన భార్యకి సంబంధం ఉందని ఆవిడ కూతురు తన పుస్తకంలో రాసింది.పుకార్లకి, విమర్శలకి ఎవరూ అతీతులు కారు. విమర్శకి సవినయంగా సమాధానమిచ్చేవాడే లీడర్, మంద బలంతో బౌతికదాడికి పాల్పడేవాడు రౌడీ.
1)నిజమే, ఇలాంటివి అన్ని కుల సంఘాలలోనూ జరుతున్నాయి. మీఉద్దేశం వాళ్ళను ఎవరూ వేలెత్తిచూపలేదుకాబట్టి వీరినికూడా ఎవరూ వేలెత్తిచూపకూడదనా? ఒకవేళ మందక్రిష్ణ లేదా మరొకలీడర్ జ్యోతిలో రాసినట్టే అవకాశవాది అయితే ఈ న్యూస్ ఐటమ్ ని ఎలా రాస్తే బాగుండేదంటారు?
2) ప్రత్యక్షంగా దాడిచేయకపోవడమంటే ఒక దుడ్డుకర్ర తీసుకుని బాదకపోవడమేనా? కార్యకర్తలని రెచ్చగొట్టడం, క్షమాపణ చెప్పేవరకూ ఇలాంటి దాడులే జరుగుతాయనడం వగైరాలనేమంటారు? ఈ దాడిలో ఎవరైనా మరణించివుంటే దళిత ఉద్యమానికెంత మచ్చోతెలుసా
3,4) నిన్న, ఈరోజు జ్యోతి పేపర్ లో మందక్రిష్ణని ఖండిస్తూ, విమర్శిస్తూ జ్యోతిని ఇంకా సపోర్ట్చేస్తున్న మిగతా ఎమ్.ఆర్.పి.ఎస్ నాయకులను గురించి మీ అభిప్రాయం?
మీరన్నట్టు భౌతికదాడులు ఖండిద్దాం. జాతి ఆత్మగౌరవ పోరాటాలను గుర్తిద్దాం. జాతి ఆత్మగౌరవం ముందు వ్యక్తి ఆత్మగౌరవం ముఖ్యంకాదని గుర్తిద్దాం. బలహీనమైన,స్వీయ నియంత్రణ లేని నాయకుల్ని ఖండిద్దాం.

krishna rao jallipalli చెప్పారు...

ANDHRA JYOTHI ఫై MRPS దాడి ని కృష్ణ మాదిగ ఖండిస్తే బాగుండును. అల జరగక పోగా మరిన్ని దాడులు తప్పవు అని అన్నాడు. దీని ఫై మీ స్పందన?

vrdarla చెప్పారు...

మిత్రమా! నా అభిప్రాయాలపై చర్చ జరగడం కంటే, ఆంధ్రజ్యోతిలో ఆ వార్త గురించి జరిగితే బాగుంటుంది. అలాగే నా అభిప్రాయాలపై మీ వ్యాఖ్యలపై కూడా నా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తాను.ఇంకా మనవాళ్ళేమైనా స్పంది్స్తారేమో చూద్దాం.

Bolloju Baba చెప్పారు...

చక్స్ గారికి
వేలెత్తి చూపటం వేరు, కారెక్టర్ అస్సాసినేషన్ చేయబూనటం వేరు. తేడాని గమనించండి.
కారెక్టర్ అస్సాసినేషన్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి స్పందన ఒక్కొక్క విధంగా ఉంటుంది.

మీరు ఉదహరించిన ఉదంతంలో నెహ్రూకి ఎడ్వినా మౌంట్ బాటన్ కి కల సంబంధం గురించి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకంలో లో అనేక సుచన ప్రాయ సంగతులుంటాయి. వీలైతే చదవండి.

బొల్లోజు బాబా