Friday, September 21, 2007

బేతవోలు వారి " వ్యాస పీఠిక "
విశేషపాండిత్యం గల ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు పట్టిందల్లా బంగారంలా చూపగల పరసువేది లాంటి వారు.ఆయన చెప్పేది ఏదైనా స్వారస్యంతో నిండి ఉంటుంది.లోకానుభవం, సమకాలీన సాహిత్య స్వరూప స్వభావాలు, భాష , వ్యాకరణ, ఛందో అలంకరాది విషయాల్లో ఆయనకు గల అధికారం అలాంటిది. అన్నింటికీ మించి ఆయన గొప్ప కవీ, సహృదయ విమర్శకులు. ఆయన ఇటీవల ' వ్యాస పీఠిక' పేరుతో ఒక గ్రంథాన్ని ప్రచురించారు. దీనిలో పది పరిశోధన వ్యాసాలున్నాయి. భరతుడు చెప్పిన అభినయాలలో చిత్రాభినయం గురించి ఈ గ్రంథంలో చేసిన వివేచన కళావిమర్శకులను ఆలోచింపచేసేటట్లు గా కొనసాగింది. అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు రథం మీద వస్తూ లేడిని తరుముకొచ్చే దృశ్యం, స్వప్నవాసవదత్తం లో స్వప్న దృశ్యం వంటి వాటిని నాటకంలో ప్రాంతీయ ముద్రతో అభినయించే వీలుందని ఆ దిశగా కృషి చేసే వారికి కొత్త మార్గాన్ని సూచించారు. అలాగే వేమన ఛందో, అలంకారాలలో దాగి ఉన్న కళారహస్యాలను వివరించిన వ్యాసం వేమనను పండితుల దగ్గరకు మరింతగా చేరువ చేస్తుంది. ఈ వ్యాస సంపుటిలో పండిత పామర జనరంజకంగా ఆస్వాదించ గల వ్యాసాలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా పేర్కొన దగినది 'మృచ్ఛకటికమ్‌ సామాజికత' అనే వ్యాసం. దీనిలో సాహిత్య పునర్మూల్యాంకనం చేసే పద్దతిని మరింత సరళీకృతం చేశారు. ఈనాటకంలో శర్విలకుడు, చారుదత్తుడి ఇంటికి కన్నం వేసిన సందర్భంలో యజ్ఞోపవీతం మీద ఒక చలోక్తి విసురుతాడు. కన్నం కొలుచుకోవడానికి దాన్ని ఉపయోగించు కోవచ్చనేదా చలోక్తి. దీన్ని ఆసరగా చేసుకొని రచయిత అయిన శూద్రకుడు ద్విజుడు కాదనే వాదనలు జరిగాయి. కానీ, దొంగతనం ఆరోపణతో చారుదత్తుడు శిక్ష అనుభవించటానికి వెళ్ళే సందర్భంలో తన ఏకైక పుత్రుడు రోహసేనుణ్ణి వీడ్కొలుపుతూ యజ్ఞోపవీతం గురించి ఉన్నతీకరించే చెప్పాడు. " ఏమి ఆస్తి ఇవ్వగలను అని ఆలోచించి తన భుజాన ఉన్న జందెం తీసి అతడికి వేస్తాడు. దీనికి ఒక ముత్యం ఉండక పోవచ్చు. ఒక బంగారు పోగు ఉండక పోవచ్చు. కానీ బ్రాహ్మణులకు ఇదే గొప్ప విభూషణం దేవ పితృకార్యాల నిర్వహణకు అతిప్రధానం " అని కీర్తించటాన్ని బట్టి మరోలా కూడా ఊహించే వీలుందని చెప్తూనే, అక్కర్ మాషీలకు కావ్య గౌరవం కలిగించిన శూద్రకుడికి జోహార్లన్నారు రామబ్రహ్మంగారు.
మరొకటి, సహృదయవిమర్శ ఎలా చేసే అవకాశం ఉందో తెలిపేది మల్లెమాల రామాయణం పై రాసిన వ్యాసం. ఒక లేఖలా, ఒక సంభాషణలా సాగిపోతుందిది.
దీన్ని పది కాలాల పాటు నిలిచే రచనగా భావించి , భక్తి శ్రద్దలతో పారాయణం చేసి, మొహమాటమేమీలేకుండా తన బుద్దికి తోచినవన్నీ చెప్పిన వ్యాసం గా రామబ్రహ్మంగారే చెప్పుకున్నారు. ఆయన చెప్పుకోక పోయినా ఇంచు మించు ప్రతివ్యాసం మనసు పెట్టి రాసిందే! కాకపోతే దీనితో పాటు మామిడేల కృష్ణమూరి గారు సంస్కృ తంలో రాసిన శ్రీమద్వాల్మీకి మానసమ్‌కావ్యానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు రాసిన పీఠికలను రెండు సిద్ధాంత గ్రంథాలనవచ్చు. ఆవ్యాస స్వరూప, స్వభావాదులు అలాగే ఉన్నాయి. రెండూ చదివిన తరువాత పాఠకులు కచ్చితంగా మూల రచనలతో పాటు వాల్మీకి రామాయణాన్ని కూడా చదవాలనుకుంటారు. మల్లెమాల రామాయణంలో ఉక్తి వక్రతనూ సోదాహరణంగా వివరించారు. దీన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి మాటల్లోనే వింటే బాగుంటుందేమో!
" యుద్దకాండలో రావణాసురుడు రామ శిరస్సునూ ధనుర్భాణాలనూ సృ ష్టించి సీత ముందు ప్రదర్శింప జేస్తాడు విద్వజ్జిహుడి సహకారంతో. సరే కాసేపటికి అవ్వి మాయమైపోతాయి. అక్కడ మీ పద్యం -
'అసురనేత యట్టు లరిగీన వెంటనే
మాయదారి శిరము మాయమయ్యె
నంత ధనువు నమ్ము నాదారినేపట్టె
శింశుపమ్ము మనము చివురు దొడిగె' చివరి పాదంలో మీ ఉక్తి వక్రతకు లాల్ సలామ్‌చివురు తొడిగింది గదా,అందుకని. మాయదారి శిరము అనడంలో ఉంది మిగతా సొగసంతా. మాయదారి అనేది ఒక వైపున తెలుగు నుడికారం, మరొక వైపున అది మాయా కల్పితం.కనక మాయదారి శిరము. అంతేనా! మాయ - దారి అనే రెండింటిలో మొదటి మాయ - మాయమయ్యింది.ఇంక ' దారి' మిగిలింది.శింశుపం చిగురు తొడగదూ! చెట్టు చిగురిస్తే ఏమయ్యింది. దాని మనస్సు చిగురించింది అనడంలో ఉంది గడుసుదనమంతా." నిజానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఇలా వివరించడంలో కూడా గడుసుతనమే కనిపిస్తుంది.
వీటితో పాటు మృచ్ఛకటికమ్‌పైనే మరో వ్యాసం కూడా పేర్కొన దగినది. మృత్తికాశకటకం జీవన వాస్తవికతకు, సువర్ణశకటికం స్వాప్నికతకూ ప్రతీకలుగా నిరూపించారు. '' వసంతసేన బంగారపు బండిలో జీవయాత్ర సాగిస్తున్నా, ఆమె అంతరంగం కుల వధూ గౌరవం కోసం పరితపిస్తూనే ఉంది. దాన్ని ఆమెకు బంగారపు బండి సమకూర్చి పెట్టలేకపోయింది. అది వదులుకున్నాక మాత్రమే ఆమెకు ఆ గౌరవం దక్కింది." అని సమన్వయించారు.
ఈ వ్యాససంపుటిలో రామబ్రహ్మంగారి జీవితానుభవం, లోకానుభవం, సాహిత్య శాస్త్ర పాండిత్యం ముప్పేటలా కనిపిస్తూ, పాఠకులకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. సంస్కృత, తెలుగు భాషాసాహిత్యాలలో ప్రాచీన, ఆధునిక స్థితిగతులను పునర్మూల్యాంకనంతో అర్థం చేసుకోవడానికి కూడా ఈ వ్యాసాలు ఎంతగానో ఉపకరిస్తాయి. పూర్వ కవులను కావ్యాలను గౌరవిస్తూనే, ఆధునికంగా జరగ వలసిన కృషికి ప్రేరణగానూ ఈ వ్యాసాలు నిలుస్తాయి.
( వ్యాసపీఠిక (వ్యాస సంపుటి), రచయిత : ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, పుటలు : 182. పుస్తకం ఖరీదు: రూ.30/- ప్రతులకు విశాలాంధ్ర, నవయుగ బుక్ హౌసెస్ అన్ని శాఖలు, మరియు www.avkf.org వెబ్ సైట్ ద్వారా కూడా పొందవచ్చు.)
- డా.దార్ల వెంకటేశ్వరరావు
( దట్స్ తెలుగు సౌజన్యం తో ....)

No comments: