Thursday, August 23, 2007

యుద్ధ మెప్పుడూ దుఃఖోపశమనానికే!దుఃఖమెప్పుడూ ఒంటరిది కాదు.
దుఃఖించని మనిషే ఈ ప్రపంచంలో కనిపించడు. కానీ, బెల్లంకొండ రవికాంత్‌ 'ఒంటరి దుఃఖం' పేరుతో ఓ కవితా సంపుటిని ప్రకటించాడు.
మరి ఈ పేరు పెట్టడంలో గల ఆంతర్యమేమిటి?
దీనిలో ఉన్న 37 కవితాఖండికల్లో దేన్ని స్పర్శించినా ఈ ప్రశ్నకు చక్కటి సమాధానం దొరుకుతుంది.
మనుషుల మధ్యే జీవిస్తూ మనిషి ఒంటరితనానికి గురి కావడమంటే ఏమిటి ?
అది ' ఒంటరి దుఃఖమే' అవుతుంది.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక, అధికారిక, యాంత్రిక సంబంధాలుగా మారిపోతున్నప్పుడు దుఃఖం కూడా ఒంటరిగానే భరించవలసి వస్తుంది. అందుకే ఈ కవితాసంపుటిలో ఒంటరిగా కనిపించే దుఃఖం అనేకమందిది! బతకడం ఒక పోరాటమైనప్పుడు ఉన్న ఊరు వదిలి పోవలసివచ్చినప్పుడు కనిపించేది ఒంటరి దుఃఖంలో కార్చే అనేక మంది అశ్రువులే!
"అతడి సాంగత్యపు ఎక్కిళ్ల మధ్య డాలర్ల వాన బతుకును శాసిస్తుంటే
సహచరుడి శ్వాస ఆమెకెప్పుడూ అందని ద్రాక్షే...!!!'' అనటంలో గానీ
" ఎన్నెన్నో వీడ్కోళ్లు, ఎన్నెన్నో కన్నీళ్లు
చేత్తో తుడిచేసుకోలేని కోట్ల కొద్ది అనుభూతులు
అతడి కొరకు జీవిస్తూ నిరీక్షిస్తున్న గుర్తుగా

ఆమె చెక్కిళ్లపై తడి ఆరని కన్నీటి చారలు'' చూపడంలోనూ అనేకమంది ఎడబాటు వలన కలిగిన దుఃఖాన్ని వర్ణిస్తున్నాడు కవి.
" ఎగిరిపోయిన యంత్ర పక్షి నుండి
రాలిపడిన కన్నీటి చుక్కలు
దట్టంగా అలుముకున్న మేఘాలై
నీ అనుభూతుల తాకిడికి
అప్పుడప్పుడూ ఇక్కడ వర్షిస్తూనే ఉన్నా''మని
డాలర్‌ వంతెనపై మిణుకుమిణుకుమంటూ కలవరపడుతున్న ఒంటరి దీపం ఎప్పుడు ఏమవుతుందోనంటున్నాడు. ప్రపంచం సమాచారం రూపంలో దగ్గరికొచ్చిన, ఆత్మీయతలు కొరవడిన వైనాన్ని గుర్తించమంటూ "అనుబంధాలన్నీ ఇంగ్లీషులో నవ్వుకుంటున్నాయ్‌'' అంటున్నాడు కవి. ప్రపంచీకరణ తెచ్చిన మానవసంబంధాలను ఆవిష్కరించడంలో కవి కృతకృత్యుడయ్యాడు.
కవికి సామాజిక స్పృహ ఉంది. కనుకనే సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలకు అక్షరమై ప్రతిస్పందించాడు. అమ్మ ఒడిలో ఆడుకోవలసిన బాల్యం "అవసరం కొద్దీ అన్యాయమై మొలకెత్తుతూ'' కరిగిపోతున్న బాల్యం గురించీ "గది నిండా కబుర్ల సీతాకోక చిలుకలెగరేసి', 'కలల మేఘాల్ని రాలుస్తూ' కదిలిపోయిన 'పాప' నేహ కోసం " ఇల్లంతా ఎండిపోయిన చెరువులా ఉంద''ని దుఃఖించడంలో ఎంతో ఆర్ద్రత ఉంది.
బలవంతపు చావులను కూడా, అతి సహజమైన ఆత్మహత్యలుగా చిత్రించగలిగే మేధావులను పేర్కొంటూనే, అటువంటివారిని నిరసిస్తూ " ఇక్కడ లేనితనం ఒకరికొకరిని ఏమీ కానీయనితనాన్ని'' వెల్లడిస్తూనే, వెండి వెలుగుల తెలుగు పుష్పం... ప్రత్యూష లాంటివారి మరణం గురించీ స్పందిస్తాడు కవి.
కవితాసంపుటికి పెట్టిన పేరు ' ఒంటరి దుఃఖం'తో రాసింది మాత్రం స్పష్టంగా దళిత కవిత. డా॥ బి. ఆర్‌. అంబేడ్కర్‌ని దళితులు, తమ చైతన్యానికి గొప్ప ప్రతీకగా భావిస్తారు. అందుకని దళితులను ప్రసన్నం చేసుకొని అధికారంలోకి రావాలనుకొనే అనేక వర్ణాలవారికి అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతుల వేడుకలు గొప్ప మార్గాలను చూపిస్తుంటాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దళితుల్లో కలిసిపోయే కొంతమంది అధికారిక కుతంత్రాన్ని పసిగట్టిన కవి -
"నా తాత చూపుడు వేలు
ఇన్నాళ్లకు నిన్నిలా నా వాడల్లోకి రప్పించిందా...?
సహపంక్తి భోజనాలతో నీ చిత్తరువు
పత్రికల్లో పతాక శీర్షికల్లో అందంగానే వుంది
కుడి పక్కనే ... ఒదిగి ఒదిగి విస్తర్లో కూర్చున్న అన్నం
తరతరాల కాలం పీల్చి పిప్పి చేసిన నా కులంలా
నా అమ్మ అలీసమ్మ కన్నీళ్లలా
కారంచేడు డ్రైనేజీల్లో ప్రవహించిన
నా అన్నల రక్తంలా''
ఉందనడంలో తరతరాల నుండీ దళితులను వంచిస్తున్న, హింసిస్తున్న, మోసగిస్తున్న చారిత్రక సామాజిక స్థితిగతులను వర్ణిస్తున్నాడీ కవి.
'చిత్తరువు'లా అని ప్రయోగించడంలో గొప్ప వ్యంగ్యం ఉంది. పత్రికల్లో ఫొటో కోసం పడే ఆరాటం. దాన్ని ఫొటో అనకుండా చిత్తరువు అనడంలో అగ్రవర్ణ చిత్తాన్ని (మనసుని) కూడా గ్రహించమంటున్నాడు కవి. ఇలాంటి పదాలను ఎన్నుకోవడంలోనే కవి ప్రతిభ వెల్లడవుతుంటుంది. ఇలాంటి సందర్భాలు చాలా కవితల్లో కనిపిస్తాయి. సమాజంలో ఒంటరిగా మిగిలిపోతున్న దళితుడి దుఃఖాన్ని ప్రధానంగా చెప్పాలనుకొని బహుశా ఈ కవితకి ' ఒంటరి దుఃఖం' అని పేరు పెట్టినా మానవ సంబంధాలకు దూరమై దుఃఖించే అనేక మంది గురించి వర్ణించిన కవితలన్నింటిలోనూ ఇది కనిపిస్తుంది. ఆ విధంగా 'దళిత ' శబ్దానికి ఉన్న విశాలత్వాన్ని వాదుకున్నాడు కవి.
కవిత్వం నిండా బాల్యం, స్త్రీ ఆవేదన, స్త్రీపురుషుల ఎడబాటు, నిత్యం యంత్రాలతో గడుపుతున్నంత సమయం, మనుషులతో గడపలేని క్షణాలను , దేశభక్తిని, దేశభక్తి పేరుతో జరిగే వంచనని (అసందర్భ పోరాట దృశ్యం) రాజ్యహింసని, వైయక్తిక అనుభూతులను కవిత్వం చేయడంలో రవికాంత్‌ చాలా పరిణతి సాధించాడు.
అయితే కవితా సంపుటి నిండా జ్ఞాపకం, కలలు, మేఘం వంటి పదాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఉంటాయి. కానీ పునరుక్తి అవుతున్నా ఎద్దగా చిరాకనిపించదు. నిత్యం పాఠాలుగా చెప్పుకునే కొన్ని పౌరాణిక పాత్రల పట్లా, పాఠశాలల్లో వర్ణించే 'ప్రతిజ్ఞ'లోని అంశాలు ఆచరణలోకి రాకపోయినా, దానికి వ్యతిరేకంగా జరగడం పట్లా కవికి ఆవేదన ఉంది. ఇలాంటి వాటి గురించి సంఘర్షించుకోవాలనే ఆరాటం ఉంది. అవసరమైతే పోరాటానికీ మద్దతు పలుకుతాడు. ఆ పోరాటంలో మరణించినా ఆ మరణానికి సార్ధకత ఉందంటాడు.
"పోరాటమే సంస్కృతి గా మారుతున్న చోట
చిట్టి చేతులు కూడా
ఆయుధాలనే దిద్దుకుంటాయి
ఇప్పుడు నూతన వసంతం
రక్త రాగాలాపన చేస్తుంటే
అమ్మలందరూ ఎ.కె. 47లనే
ప్రసవించవలసి ఉంది''
అని ప్రకటించిన రవికాంత్‌ని, మరింత దళిత చైతన్యంతో ముందుకు రావాలని శిఖామణి ఆహ్వానించినా, ఒక స్పష్టమైన దృక్పథంతో ముందుకు వెళ్తున్నాడీ కవి అని తెలుస్తుంది. తన దృక్పథంలో దళితుల అనుభవాలు కూడా ఒకటిగా చేసుకుంటాడేమో గానీ దళిత దృక్పథమే చాలదంటున్నట్లున్నాడు కవి.
అతని దృక్పథమేదైనా, ఎవరూ ఒంటరితనంలో కుమిలిపోకూడదనేదే కవి ఆశయం!
( ఒంటరి దుఃఖం (కవితా సంకలనం); కవి : బెల్లంకొండ రవికాంత్‌; వెల: రూ. 50/-; ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్‌ అన్ని బ్రాంచులు)
- డా॥ దార్ల వెంకటేశ్వరరావు

(దట్స్ తెలుగు సౌజన్యం తో ....)


No comments: