Wednesday, August 22, 2007

ప్రయోగాల పల్లకిలో 'నానీలలో సినారె'తెలుగు కవిత్వం వస్తు, రూప వైవిధ్యంతో బాగానే ముందుకి వెళుతున్నదని ' ఆధునిక కవిత్వాన్ని' చదువుతున్న వారికి అనిపిస్తుంది. తెలుగు సాహిత్యానికి చెందినవని చెప్పుకోగలిగే రూప ప్రక్రియల్లో 'నానీలు' కూడా ఒకటి. యువ సాహితీవేత్తలను ఇవి బాగా ఆకర్షిస్తున్నాయి. చాలామంది ' నానీ 'లకు లక్షణాలు చెపుతున్నా, అందులో చాలా మంది రాస్తున్నవారికి ఎన్‌ గోపిగారు చెప్పిన నియమాలు తెలియవనీ, కవిత్వం రాయటానికీ, సులువుగా కవి అనిపించుకోవడానికి చాలా మంది ఉవ్విళ్లూరుతున్నారనే విమర్శ కూడా వచ్చింది. 'నానీల'కు గోపిగారు చెప్పిన నియమాలను పాటించనివారు చాలా మంది ఉన్నారు. జపాన్‌ నుండి దిగుమతి చేసుకున్న హైకూలకు కూడా ఇదే పరిస్థితి.హైకూ ప్రయోగంలో తెలుగు భాషకున్న పరిస్థితులూ వేరనేవాళ్ళూ ఉన్నారు. మరొక విషయాన్నీ సందర్భంగ గమనించాలేమో! కవిత్వంలో లక్షణాలు ఉండవచ్చు గానీ, లక్షణాల కోసమే కవిత్వం రాయరు. అది ఆధునిక కవిత్వంలో మరీనూ! ఏదిఏమైనా , 'ఛందోబందోబస్తులను ఛట్‌ ఫట్‌'మనిపించి, చమక్కులను , చమత్కారాలను , రసగుళికలను మెరిపించే కవిత్వాన్ని సంక్షిప్తంగానే ' నానీ 'ల్లో పండించి'ఆహా' అనిపించేటట్లు రాయగలిగే ప్రయత్నం మాత్రం ' ' నానీ 'లలలో కనిపిస్తుంది. నావీ, నీవీ కలిసి బహవచనం 'లు' చేరి, ఒక వ్యక్తిరాసినా, వ్యక్తుల సమూహ భావనగా మారగలిగే అవకాశం ' నానీ 'లకు ఉంది. అది డా॥ ద్వానా శాస్త్రి¬గారు ఇటీవల రాసిన '' నానీ 'లలో సినారె'లో బాగా కనిపస్తుంది. 75 సంవత్సరాలు నిండిన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, పద్మభూషణ్‌ డా॥ సి. నారాయణ రెడ్డిగారి జన్మదినోత్సవం సందర్భంగా డా॥ ద్వానాశాస్త్రిగారు 75 ' నానీ 'ల శతకంగా దీన్ని తీసుకొచ్చారు. 'శతకం' అంటే నూరు. అయినా నూటా ఎనిమిది పద్యాలు ఉండటం తెలుగు శతకంలో సంప్రదాయంగా కొనసాగుతుంది. 'శతకాలు'గా పేరు పొందిన కొన్ని పద్య శతకాలలో వందల కొద్ది పద్యాలు కూడా ఉంటున్నాయి. "ఒకే వ్యక్తిపై శతకాలు వచ్చాయి. కానీ ' నానీ 'లు రాలేదు. ఈ దిశగా చేసిన ఈ ప్రయోగం ... ' నానీ ' ప్రక్రియకి మరింత ధైర్యాన్ని తీసుకువస్తుందని నా నమ్మకం'' అని కవి స్పష్టంగానే చెప్పుకోవటం వల్ల 'నూరు సంఖ్య' మాత్రమే శతకాలను నిర్ణయించటానికి ప్రామాణికంగా తీసుకోవటం సరిపోదనే ఆలోచన కనిపిస్తుంది.
'' నానీ 'లలో సినారె' గ్రంధం గురించి కొన్ని పరిధులను కూడా కవిగారే ప్రకటించారు. "ఆయన నన్ను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనతో నా అనుభవాలూ, ఆయనపై నా అభిప్రాయాల వెల్లడించాలని ఎప్పటి నుంచో వుంది. ... ఇప్పుడు ఒక్క సినారెపనైనే ' నానీ 'లు రాయాలనిపించింది'' అని కవి చెప్పుకున్నారు.
ఇలాంటి ఆత్మీయమైన అనుబంధాలు కూడా మంచి రచనలను అందించేటట్లు చేస్తాయేమో! అందుకనే సంప్రదాయ కవులు కూడ ప్రముఖులపై పద్యాలు రాశారు. పంచరత్నాలు, నవరత్నాలు, నక్షత్ర మాలికలు, ఖండకావ్యాలు, శతకాలు... ఇలా రాశారు . 75 ' నానీ 'లను ఎవరూ, ఏ ఆధునిక కవీ ఒక శతకమని చెప్పలేదు. దీన్ని డా॥ ద్వానా శాస్త్రిగారు ఆధునిక కవితాప్రక్రియలో చెప్పి ,సంప్రదాయాన్నీ, ఆధునికతనూ ముడివేసే ప్రయత్నం చేశారు. ఆచార్య ఎన్‌ గోపిగారితో చర్చించే ఈ పని చేశారు. గోపీగారికే అంకితం ఇచ్చారు. ఇదో విశేషం!
ఈ శతకంలో డా.ద్వానా శాస్త్రి గారు , సినారెలో గమనించిన కొన్ని అనుభవాలతో చాలామంది పయనించగలుగుతారు. సినారే గురించి చెపుతూ కవి ఇలా ఒక నానీ రాశారు.
"పిల్లకవులను
వెన్ను తట్టారు
ప్రతిభకు
పట్టం కట్టారు'' డా॥ సి. నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని పొందినవారు. అయినా ఎవరైనా కొన్ని కవితలు రాసి, అదీ తొలిసారిగా రాసినవైనా సరే ఓ గ్రంథంగా ముద్రిస్తే, వాటిలోనూ స్వారస్యాన్ని చూడగలిగి, ఆ కవిని ప్రోత్సాహించే ఉదాత్త స్వభావం సినారె లో ఉంది.
సినారె ఏదైనా కమిటీల్లో ఉంటే మాత్రం 'ప్రతిభకే' పట్టం కడతారు.
మొదటిది ప్రోత్సహించేదీ, రెండవది గుర్తించేదీ. రెండింటినీ సినారె నిర్వహించే తీరు తెలియాలంటే 'సినారె'తో అంత అనుబంధం ఉండగలిగినవారికే సాధ్యం.దాన్ని డా.ద్వా.నా.శాస్త్రి గారు కవిత్వంతో పట్టుకోగలిగారు.
ఇక్కడ మరో విశేషం కూడా ఉంది.
మొదటి దానిలో సౌందర్య ఆరాధకుడు గా కనిపిస్తారు సినారె. వ్యక్తిలో, వస్తువులో, రెండింటిలో, అన్నింటిలో సౌందర్యాన్ని ఆస్వాదించగలిగిన కళాస్వాదకుడు.
రెండవ దానిలో సినారె విమర్శకుడగా, న్యాయమూర్తిగా నిర్ణాయకుడుగా కనిపిస్తారు. సినారెలో కనిపించే ఈ రెండు కోణాలను ' నానీ 'లో డా.ద్వా.నా.శాస్త్రి గారు వర్ణించగలిగారు.
మరొకచోట సినారె ను కవి ...
' ఈ తరం కవులతో
జాగింగ్‌
సినారె
తద్దర్మార్థకం గదా'' అని వర్ణించారు. 'తద్దర్మార్థకం' అని చెప్పడం ద్వారా నిత్యం కవిత్వం రాస్తుంటారనే వ్యంగ్యార్థం స్పురించేటట్లు చేయగలిగారు కవి.
ఈ శతకంలోనే మరోచోట
'చిన్న పత్రికలు
తలలెగరేస్తున్నాయి
సినారె
సిరాగాలతో' అన్నారు డా.ద్వా.నా.శాస్త్రి గారు. సినారెలో ఉన్న మరో గొప్పతనమిది. రాసింది కవిత్వమా? కాదా? అనేదే ప్రధానంగా చూస్తారు. దాన్ని ప్రచురించు కోవాడానికి ఇష్టపడి ఏ చిన్న పత్రిక వాళ్ళు ప్రచురించుకున్నా, అభ్యంతరాన్ని చెప్పరు. పైగా ఆ పత్రికలో ప్రచురించుకోవాడానికి మళ్ళీ మళ్ళీ కవితలు పంపిస్తుంటారు.బహుశా, కవిత్వం ప్రచురించే ప్రతి పత్రికలోనూ సినారె కవిత ఉంటుందాన్నా అభ్యంతరం ఉండదేమో!
సినారె ఒకచోట చెప్పుకున్నారు. కవిత్వం రాయకపోతే ఆ రోజు ఏ సీ గదిలో కూర్చున్నా చెమటపడుతుంది. పదాలివి కాదు గానీ , ఇంచుమించు భావమిదేననుకూటాను. ఆయన నిరంతరం కవిత్వం రాస్తారు.సినారె నిత్యం కవిత్వం రాస్తుంటారనడానికి, ఆయన కవిత్వంలో కనిపించే కొత్త కొత్త వస్తువుల స్పర్శే సాక్ష్యం. చిన్న పత్రిక అని కూడా చూడకుండా అన్ని పత్రికల్లో కనిపిస్తుంటాయి. కొంత మంది ఓ స్థాయికి వచ్చామని భావించారంటే, స్థానిక, చిన్న పత్రకలను , రేడియోలను, 'చిన్నస్థాయి'గా చూస్తారు. అక్కడ కూడా పాఠకులు ఉంటారు. అలా వాళ్లకి అందించటంలోనే కవిత్వాన్ని అందరికీ పంచే నిరాడంబరతను సినారెలో చూడవచ్చు. 'పోటీ పడటం' అనేది గొప్ప అబ్జర్వేషన్‌. ఆధునిక కవుల్తో పోటీ పడలేక కవిత్వాన్ని రాయటం లేదనే వాళ్లు సినారెని చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉందని చెప్పడానికి ద్వానావారి అభిప్రాయం చాలా ప్రోత్సాహాన్నిస్తుంది.
ప్రతిసంవత్సరం సినారె ఒక పుస్తకమైనా ప్రచురిస్తారు. ఆయన హృదయం కవిత్వం ఊరే చెలమ. ఆయన హృదయం కవిత్వం నిండిన బావి. దీన్ని వర్ణిస్తూ డా.ద్వా.నా.శాస్త్రి గారు
'ప్రతి సంవత్సరమూ
గుండెకు గండి
ఆ గాయానికి
మొక్కుదాం రండి' అని సినారె పట్ల భక్తిభావాన్ని ప్రదర్శిస్తారు. కవిత్వ ప్రేమికుల చేత భక్తి భావాన్ని ప్రదర్శింప చేస్తారు కవి.
సినారె వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని, అనుభవాన్ని ముప్పేటగా అందించిన '' నానీ 'లలో సినారె' 75 ' నానీ 'లతో ఒక శతకం అనే ప్రయోగం చేసిన డా॥ ద్వానా శాస్త్రిగారు ప్రయోగవాదుల్లో చేరడానికి మార్గం వేసుకున్నారు. నిజానికిది ప్రయోగాల పల్లకిలో ఊరేగుతున్న '' నానీ 'లలో సినారె. డా॥ ద్వానా శాస్త్రిగారే అన్నట్లు
'తెలంగాణ మట్టికి
మకుటం
తెలుగు వీధుల్లో
పూలశకటం'. సినారె కవిత్వాన్ని, సినిమా పాటలను , పరిశోధన, విమర్శ సాహిత్యాన్నీ, ఉపన్యాస కళనీ, సభారంజకత్వాన్ని, దాన్ని నిర్వహించేటప్పుడు గల కార్యదక్షతలోని ఆజ్ఞాపాలననీ, అన్నింటినీ మించి కవిత్వాన్ని నిత్యం శ్వాసించే గొప్ప కవీ సినారె అని మరోసారి గుర్తు చేసే రచన నానీ 'లలో సినారె.
వీటినన్నింటినీ డా॥ ద్వానా శాస్త్రిగారు ' నానీ 'లలో వర్ణించి సినారె 75 సంవత్సరాల పుట్టిన రోజుకి గొప్ప హారాన్ని అలంకరింప చేశారు . ' ఈ ' నానీ 'లు సినారె సాహితీ వైశిష్ట్యానికీ, మూర్తిమత్వానికీ చిహ్న పతాకలనీ, అన్నీ అందరికీ ఎల్లవేళలా నచ్చాలని వుంటే, ఇంత సాహిత్యం రాదు, ఇంత వైవిధ్యమూ ఉండదు. విపులాంచ పృథ్వీ అని డా॥ ద్వానాశాస్త్రిగారే తన కవిత్వంలో ఉండేదేమిటో, ఆదరించేది ఎవరో కూడా తెలిసే రాసిన ' నానీ 'లివి.
డా॥ ద్వానా శాస్త్రి గారు బేసిక్‌గా విమర్శకుడు.
అప్పుడప్పడు కవి.
రెండింటినీ '' నానీ 'లలో సినారె'శతకంలో చూడవచ్చు.
( ' నానీ 'లలో సినారె; కవిః డా॥ ద్వానాశాస్త్రి; వెల రూ. 30/-; ప్రతలుకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు)
-డా॥ దార్ల వెంకటేశ్వరరావు

( ఇది దట్స్ తెలుగు లో ఇంతకుముందు ప్రచురితమైంది. కొన్ని మార్పులు చేసి మళ్ళీ నా బ్లాగులో ప్రచురిస్తున్నాను.)

No comments: